ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
కంప్యూటింగ్ సౌలభ్యం నుంచి ఆవిష్కరణ సామర్థ్యం దిశగా పరివర్తనను చాటిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026 సదస్సు
· ‘ఏఐ సన్నద్ధత: కంప్యూటింగ్ నుంచి కార్యదక్షత దిశగా...’ శీర్షికన సదస్సు... అందుబాటులో ఉన్న జీపీయూలను భారీగా, మార్కెట్ సన్నద్ధంగా నిలపడంపై ప్రధానంగా చర్చలు
· కంప్యూటింగ్ సదపాయంతోపాటు మార్పును అందిపుచ్చుకోవడమూ కీలకమే... అప్పుడే చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో వేగంగా ఏఐ వినియోగం: ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ స్టార్టప్ హబ్ సీఈవో డాక్టర్ పనీర్ సెల్వం
· ఏఐలో పోటీతత్వాన్ని పెంపొందించేలా.. తెలివైన పెట్టుబడులూ, అందుబాటులో ఉండే ప్రయోగాత్మక వాతావరణమూ, బలమైన పరిశోధన - అభివృద్ధి వ్యవస్థల దిశగా పిలుపునిచ్చిన నిపుణులు
నాడు పోస్టు చేయడమైనది:
20 FEB 2026 5:02PM by PIB Hyderabad
జనరేటివ్ ఏఐ ప్రస్తుతం ప్రయోగాత్మక దశ నుంచి భారీ స్థాయి ఉత్పాదక విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026లో ‘ఏఐ సన్నద్ధత: కంప్యూటింగ్ నుంచి కార్యదక్షత దిశగా’ అనే అంశం ఇతివృత్తంగా నిర్వహించిన సదస్సు ఒక కీలకమైన అంశంపై దృష్టి సారించింది. జీపీయూల లభ్యతను వాస్తవిక ఆవిష్కరణ సామర్థ్యంగా ఎలా మార్చాలన్న అంశంపై ఇందులో ప్రధానంగా చర్చ సాగింది. చాలావరకూ పెద్దగా దృష్టి సారించకపోయినా, ఇదొక నిర్ణయాత్మక ప్రశ్న. కేవలం గరిష్ట కంప్యూటింగ్ ప్రదర్శన వెంటే పరుగులు తీయకుండా... అవస్థాపన వ్యవస్థను రూపొందించుకోవడం, సాఫ్ట్‌వేర్ వాతావరణం, నిర్దిష్ట ఏఐ పనితీరుతోపాటు మార్కెట్ అవకాశాలకు అనుగుణంగా వ్యాపార వ్యూహాలను రూపొందించుకునే దిశగా స్పష్టమైన మార్పు ఈ చర్చలో కనిపించింది.
ఇండియా ఏఐ కంప్యూట్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్న దేశీయ అంకుర సంస్థలు, డెవలపర్ల ముందున్న సవాలు కేవలం హార్డ్‌వేర్ లభ్యత మాత్రమే కాదని వక్తలు పేర్కొన్నారు. ఏం నిర్మించాలి.. దానిని ఎలా ఆప్టిమైజ్ చేయాలి.. ఎప్పటికప్పుడు దాన్ని ఎలా విస్తరించాలన్నదే అసలైన సవాలని వారు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జీపీయూ ఎంపిక అనేది మెమరీ నిర్మాణం, అంతర్గత అనుసంధాన సామర్థ్యం, వ్యయ నియంత్రణ, విస్తరణ పద్ధతులపై ఆధారపడి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఏఐ సన్నద్ధత... కేవలం ప్రాసెసింగ్ శక్తికి సంబంధించింది మాత్రమే కాదనీ, సాంకేతిక నిర్ణయాధికారమూ సంస్థాగత మార్పులపై కూడా ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ స్టార్టప్ హబ్ సీఈవో డాక్టర్ ఎం. పన్నీర్ సెల్వం మాట్లాడుతూ.. మన దేశంలో ఏఐ వినియోగం పెరగాలంటే కేవలం కంప్యూటింగ్ శక్తి, సాంకేతిక సామర్థ్యం ఉంటే సరిపోదని.. మార్పునకు అనుగుణంగా వ్యవస్థలను సిద్ధం చేయడం కూడా అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పాత తరం వ్యాపార సంస్థలు ఈ సరికొత్త సాంకేతికతను స్వీకరించే క్రమంలో సవాళ్లను అధిగమించాలంటే ఈ మార్పు అనివార్యమని అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడుతూ గతంలో సాఫ్ట్‌వేర్ ముందుగా పెద్ద సంస్థల ద్వారా వినియోగంలోకి వచ్చి.. తర్వాతే సామాన్యుల వ్యక్తిగత వినియోగానికి వచ్చేదన్నారు. అయితే, ఇప్పుడు అందుకు భిన్నంగా అత్యంత ఆసక్తికరమైన మార్పు మనకు కనిపిస్తోందన్నారు. ఆ విధంగా అది శక్తిమంతమైనది. కంప్యూటింగ్ నుంచి కార్యాచరణ సమర్థత (కేపబిలిటీ) వరకు... కృత్రిమ మేధ దిశగా సంసిద్ధతపై చర్చల్లో మరో ‘సి’- మార్పులను అందిపుచ్చుకోవడం (చేంజ్ మేనేజ్మెంట్) కూడా భాగం కావాల్సిన అవసరం ఉందని పన్నీర్ సెల్వం అన్నారు. దాదాపుగా ఒక రిటైల్ శక్తిగా మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో.. వ్యాపార సంస్థలు, ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, అంకుర సంస్థలు ఈ అవకాశాన్ని గుర్తించాల్సిన ప్రాథమిక ఆవశ్యకత ఉందన్నారు. అయితే, దేశంలోని పాత తరం వ్యాపార సంస్థల విషయానికి వస్తే.. అక్కడ చిన్న, మధ్య తరహా సంస్థలు ఎక్కువగా యజమాని-ప్రొప్రైటర్ లేదా కుటుంబ నిర్వహణలో ఉంటాయి కాబట్టి, వాటికి ఎదురయ్యే సవాళ్లు విభిన్నమైనవిగా ఉంటాయని వివరించారు.
డేటాసెంటర్ జీపీయూ ఈఎంఈఏఐ – ఏపీఈజే విభాగం ఏఐ బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ తిమోతీ రాబ్సన్ మాట్లాడుతూ... ఒక సానుకూల వ్యవస్థ వికాసాన్ని వేగవంతం చేయడంలో తెలివైన పెట్టుబడులూ, సులభంగా అందుబాటులో ఉండే ప్రయోగాత్మక వాతావరణమూ అత్యంత ప్రధానమైనవని స్పష్టం చేశారు. ‘‘భారీ పెట్టుబడులకు ముందు.. సాంకేతికతను, మార్కెట్‌లోకి ప్రవేశ మార్గాన్ని సంస్థలు పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కీలకం. ప్రవేశానికి గల అవరోధాలను తగ్గించడం ద్వారా ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు మేం కట్టుబడి ఉన్నాం. దేవ్ క్లౌడ్ వంటి కార్యక్రమాల ద్వారా, ఉచిత కంప్యూట్ అవర్స్ ద్వారా.. డెవలపర్లు తమ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా పరీక్షలు చేసుకునేలా మేం వీలు కల్పిస్తున్నాం. తక్కువ వ్యయంతో కూడిన పరిష్కారాలను (టీసీవో) అందించడం ద్వారా.. అంకుర సంస్థల వృద్ధి చెందడానికి అవసరమైన సాధనాలనూ, ఆర్థిక సామర్థ్యాన్నీ ఏఎండీ అందిస్తోంది’’ అని ఆయన వివరించారు.
ఏఎండీ వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాలు, ప్రజా విధానాల విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ థామస్ జకారియా మాట్లాడుతూ.. కృత్రిమ మేధలో అంతర్జాతీయ నేతృత్వాన్ని నిర్ణయించడంలో పరిశోధనల విస్తృతి, ఆవిష్కరణ వ్యవస్థలు ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. ‘‘ఏఐ రంగంలో అగ్రగామిగా ఉన్న దేశాలను గమనిస్తే.. బలమైన పరిశోధన - అభివృద్ధి వ్యవస్థ, ఆవిష్కరణలు పునాదిగా ఉండడం వల్లే అవి ఆ స్థాయికి చేరుకున్నాయని నేను భావిస్తున్నాను. ప్రతి విషయాన్నీ ప్రశ్నిస్తూ.. అది సరైనదా, కాదా అని ధ్రువీకరించుకునే వ్యక్తులు అక్కడ ఉండడమే దీనికి కారణం. కొత్త ఆలోచనలను స్వీకరించి, వాటిని నూతన కంపెనీలుగా మార్చడానికి ఎప్పటికప్పుడు ఆవిష్కరణ ప్రయోగాలను (ఇన్నొవేషన్ ల్యాబ్స్) మొదలుపెడుతూ ఉండాలి. కొత్త ఆలోచనలు, అవకాశాలు ఉన్న వ్యక్తులే ఈ సరికొత్త సాంకేతికతలను ముందుకు నడుపుతున్నారు. అయినప్పటికీ అంతిమంగా సంస్థలు, ప్రభుత్వ రంగం అందిపుచ్చుకుంటే అవి పురోగమిస్తాయి’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘కేవలం కంప్యూటింగ్ శక్తి వల్ల మాత్రమే కాదు.. బలమైన పరిశోధన వ్యవస్థలు, అంకుర సంస్థల భాగస్వామ్యం, మార్కెటు స్పష్టత ద్వారా- మౌలిక సదుపాయాలను ఆవిష్కరణలుగా రూపుదిద్దగల సామర్థ్యమే కృత్రిమ మేధ రంగంలో అంతర్జాతీయ అగ్రస్థానానికి ప్రాతిపదిక’’ అన్న స్పష్టమైన సందేశాన్ని ఈ సదస్సు అందించింది. భారత్ తన సొంత కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచుకుంటూ, జాతీయ వేదికల ద్వారా దానిని అందరికీ అందుబాటులోకి తెస్తున్న తరుణమిది. వాస్తవిక కార్యాచరణతోపాటు, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సాధనాలుగా ఈ సామర్థ్యాలను ఎంత ప్రభావవంతంగా వినియోగించుకుంటామన్నదే తదుపరి దశకు మూలాధారం.
***
(రిలీజ్ ఐడి: 2232309)
సందర్శకుల సూచీ సంఖ్య : : 29