గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
స్వయం సహాయక సంఘాల మహిళలకిచ్చే రుణాలు దేశం కోసం సురక్షితమైన పెట్టుబడి: శివరాజ్ సింగ్ చౌహాన్
వికసిత్ భారత్ దార్శనికతకు మహిళల నేతృత్వంలోని గ్రామీణ పరివర్తనతో గణనీయ తోడ్పాటు
హైదరాబాద్ వేదికగా ఆర్థిక అక్షరాస్యత-సమర్థత అంశంపై జాతీయ సదస్సు, 25వ కేంద్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
21 FEB 2026 6:39PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్‌లో జాతీయ ఆర్థిక అక్షరాస్యత-సమర్థత సదస్సును నిర్వహించారు. ఈ సమావేశంలో విధాన నిర్ణేతలు, నియంత్రణ సంస్థలు, ఆర్థిక సంస్థలు, రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లు (ఎస్ఆర్ఎల్ఎమ్‌లు), కమ్యూనిటీ నాయకులు పాల్గొన్నారు. సదస్సులో ఆర్థిక అవగాహనను బలోపేతం చేయడం, కుటుంబాల ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందించడం, గ్రామీణ భారత్ అంతటా సమ్మిళిత ఆర్థిక వృద్ధిని సాధించడం గురించి చర్చించారు.
ఈ సమావేశంలో ఆర్థిక అక్షరాస్యత, కుటుంబాల స్థాయిలో ఆర్థిక సామర్థ్యం, జీవనోపాధి-వ్యాపారాల కోసం రుణాల లభ్యతను మరింత విస్తరించడం వంటి అంశాలను చర్చించారు. నిరంతర ఆర్థిక అవగాహన, లోతైన ఆర్థిక సమ్మిళితత్వం, బలమైన సంస్థాగత కలయికల ప్రాముఖ్యాన్ని చర్చలు స్పష్టం చేశాయి. స్వయం సహాయక బృందాలు, వాటి సమాఖ్యల వంటి కమ్యూనిటీ ఆధారిత సంస్థలను... ఆర్థిక సేవలు, ఆర్థిక అవగాహన వ్యాప్తి కోసం విశ్వసనీయమైన, గణనీయ సామర్థ్యం గల వేదికలుగా గుర్తించారు.
25వ కేంద్ర స్థాయి సమన్వయ కమిటీ (సీఎల్‌సీసీ) సమావేశం ఈ రోజు హైదరాబాద్‌లో జరిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంతటా విధానపరమైన చర్చలను కొనసాగించడం, ఆయా వ్యవస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంలో కీలక ముందడుగును ఈ సమావేశం సూచిస్తుంది.
ఈ సమావేశానికి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి, సీసీఎల్‌సీ చైర్‌పర్సన్ శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, తెలంగాణ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీమతి డి. అనసూయ సీతక్క హాజరయ్యారు.
ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. వీరిలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ శైలేష్ కుమార్ సింగ్, అదనపు కార్యదర్శి శ్రీ టి. కె. అనిల్ కుమార్, సంయుక్త కార్యదర్శులు శ్రీమతి స్మృతి శరణ్, శ్రీమతి స్వాతి శర్మ ఉన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్. శ్రీధర్... ఆ శాఖ కమిషనర్, సెర్ప్ తెలంగాణ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి దివ్య దేవరాజన్ సహా తెలంగాణ ప్రభుత్వం నుంచి సీనియర్ అధికారులు, నాబార్డ్, ఆర్‌బిఐ, బ్యాంకులు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వివిధ రాష్ట్రాల స్వయం సహాయక సంఘాల ప్రతినిధులూ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జాతీయ సదస్సు నుంచి కీలక అంశాల ప్రస్తావనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి స్మృతి శరణ్ "డీఏఐ-ఎన్ఆర్ఎల్ఎమ్ వ్యూహాత్మక అంశాలు, భవిష్యత్ రోడ్ మ్యాప్" అనే అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చారు.
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నియంత్రణ సంస్థలు, బ్యాంక్ సఖిలు, బీసీ సఖిలు, ఆర్థిక అక్షరాస్యత కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు, బీమా సఖిలు సహా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌ల ప్రతినిధులను ఉద్దేశించి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రసంగించారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీని బలోపేతం చేయడం, ఔత్సాహిక వ్యక్తిగత మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతునిచ్చే విధానాన్ని అనుసరించాల్సిన ప్రాముఖ్యాన్ని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు అందించడం నష్టం కాదనీ... దేశానికి అత్యంత సురక్షితమైన పెట్టుబడుల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు. మహిళల నేతృత్వంలోని సంస్థల పరివర్తన సామర్థ్యాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ... వాటాదారులందరి సమష్టి మద్దతుతో, "దీదీలు" లఖ్‌పతి దీదీల నుంచి కోటీశ్వరులుగా పురోగమించగలరని అన్నారు. తద్వారా మహిళల నేతృత్వంలోని గ్రామీణ పరివర్తన వేగవంతమై, వికసిత్ భారత్ దార్శనికతకు గణనీయ తోడ్పాటు లభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
గ్రామీణ కుటుంబాలన్నింటికీ ఆర్థిక వనరుల లభ్యతను బలోపేతం చేయడం, వ్యాపారాలకు ఆర్థిక సహాయాన్ని విస్తరించడం, నష్టం నుంచి రక్షించే విధానాలను మెరుగుపరచడం వంటి అవసరాలను కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మూడు ప్రధాన జాతీయ స్థాయి కార్యక్రమాలను ప్రారంభించారు:
*• స్వయం సహాయక బృందాల సభ్యుల వ్యక్తిగత వ్యాపారాల కోసం బ్యాంక్ రుణాల వ్యవస్థ*
*• స్వయం సహాయక బృందాల సభ్యుల కోసం యూపీఐ ఆధారిత రుణ ఎంపికలు*
*• స్వయం సహాయక బృందాల సభ్యులకు ఆర్థిక అవగాహనను పెంపొందించే డిజిటల్ మాడ్యూల్స్*
రుణాల పంపిణీని సులభతరం చేయడం, డిజిటల్ ఫైనాన్స్ అమలును ప్రోత్సహించడం, గ్రామీణ మహిళల్లో ఆర్థిక సామర్థ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలను రూపొందించారు.
గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ శైలేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ... ఆర్థిక సమ్మిళితత్వం, వ్యాపార వృద్ధి, ఆర్థిక సామర్థ్యాలను కొనసాగించడంలో కమ్యూనిటీ సంస్థల కీలక పాత్రను స్పష్టం చేశారు.
భారత ఆర్థిక సమ్మిళితత్వ ప్రయాణం ఇప్పుడు వ్యాపార ఆధారిత సాధికారతగా పరిణామం చెందాలనీ... ఆర్థిక వనరుల లభ్యత నుంచి ఉత్పాదక క్రెడిట్, వ్యాపారాలకు ప్రోత్సాహం, సుస్థిరమైన ఆర్థిక సామర్థ్యం వైపు దృష్టిని మళ్లించాలని డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని పిలుపునిచ్చారు.
శ్రీమతి డి. అనసూయ సీతక్క మాట్లాడుతూ... తెలంగాణ దేశంలోనే అత్యంత తక్కువ వయస్సు గల రాష్ట్రమైనప్పటికీ, ఇది పాతకాలం నాటి రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఎస్ఆర్ఎల్‌ఎమ్)ను అనుసరిస్తోందన్నారు. మిషన్ ఆధారిత కార్యక్రమాలు తెలంగాణ మహిళలు తదుపరి దశ వ్యాపార ఏర్పాటుకు నాయకత్వం వహించడానికి వీలు కల్పిస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకింగ్ సంస్థలకు పురస్కారాలను అందించడం ద్వారా ఆర్థిక సంస్థల సహకారాన్నీ గుర్తించింది.
గ్రామీణ భారతం అంతటా సమ్మిళిత వృద్ధిని వేగవంతం చేయడానికి, ఆర్థిక ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, సమ్మిళిత వృద్ధిని వేగవంతం చేయడానికి వాటాదారుల ఉమ్మడి నిబద్ధత ప్రకటనతో సమావేశం ముగిసింది.
***
(రిలీజ్ ఐడి: 2231365)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6