ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

విజయాల నుంచి బలమైన పునాది దిశగా: బాధ్యతాయుత భవిష్యత్తు వైపు కృత్రిమ మేధ అడుగులు వేస్తోందన్న ప్రపంచ సాంకేతిక రంగ సీఈఓలు


మనం సామర్థ్యాలను శరవేగంగా తీర్చిదిద్దుతున్న విధంగానే నమ్మకాన్నీ అంతే వేగంగా నిలబెట్టుకోగలుగుతామా అన్నదే సిసలైన ప్రశ్న : పాలో ఆల్టో నెట్‌వర్క్‌స్ సీఈఓ శ్రీ నికేశ్ అరోరా

భారత్ సేవల శక్తి కేంద్రం దశ నుంచి మేధాసంపత్తి శక్తి కేంద్రంగా మారాలి : హెచ్‌సీఎల్ టెక్ చైర్‌పర్సన్ రోశ్నీ నాడార్

ఉపకరణాల్లోనూ, భౌతిక వ్యవస్థల్లోనూ మేధ (ఇంటెలిజెన్స్)ను నేరుగా ఇమిడ్చేందుకు పెద్ద పీట వేయాలన్న ఎన్ఎక్స్‌పీ సెమీకండక్టర్స్ సీటీఓ శ్రీ లార్స్ రేగర్

కృత్రిమ మేధ నిర్వహణ కార్యకలాపాల్ని పెద్ద ఎత్తున ఆచరణలో పెట్టడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలన్న సర్వీస్‌నౌ ప్రెసిడెంటు, సీపీఓ, సీఓఓ శ్రీ అమిత్ జవేరీ

నాడు పోస్టు చేయడమైనది: 19 FEB 2026 9:33PM by PIB Hyderabad

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో భాగంగా కీలకోపన్యాసాలిచ్చిన వారిలో పాలో ఆల్టో నెట్‌వర్క్‌స్ సీఈఓ శ్రీ నికేశ్ అరోరా,  హెచ్‌సీఎల్ టెక్ చైర్‌పర్సన్ రోశ్నీ నాడార్, ఎన్ఎక్స్‌పీ సెమీకండక్టర్స్ సీటీఓ శ్రీ లార్స్ రేగర్, సర్వీస్‌నౌ ప్రెసిడెంటు, సీపీఓ, సీఓఓ శ్రీ అమిత్ జవేరీ ఉన్నారు. కృత్రిమ మేధ (ఏఐ) ఎలా ఒక నిర్ణయాత్మక దశలోకి అడుగు పెడుతోందో వారు ప్రస్తావించారు. కృత్రిమ మేధను అది శరవేగంగా విస్తరిస్తున్న క్రమంతో కాక, అది సంపాదించుకొనే నమ్మకం, అందించే భద్రత, పాలన, విస్తరణయోగ్య మౌలిక సదుపాయాల వంటి తక్షణావసరాల ద్వారా కూడా నిర్వచించవచ్చని వారు అన్నారు.

 

image.png

 

పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈఓ శ్రీ నికేశ్ అరోరా మాట్లాడుతూ, ఆధునిక చరిత్రలో అత్యంత వేగంగా చోటుచేసుకున్న సాంకేతిక పరివర్తన ఏఐ అని నిర్వచించారు. ప్రస్తుతం నవకల్పనల జోరు సంస్థలు చేస్తున్న సన్నాహాల కన్నా అధికంగా ఉందన్నారు.  ‘‘ ఏఐ సమాప్తం కాబోదు. దీని ఉనికిని రూపు మాపలేం’’ అని ఆయన అన్నారు. ‘‘మనం సామర్థ్యాల్ని ఎంత వేగంగా తీర్చిదిద్దుతున్నామో, అంతే వేగంగా నమ్మకాన్ని సాధించగలుగుతామా అన్నదే సిసలైన ప్రశ్న’’ అని ఆయన అన్నారు. స్వతంత్ర ప్రతిపత్తిని కలిగివుండే, ఏజెంటిక్ వ్యవస్థలు వృద్ధి చెందుతుండటాన్ని గురించి ఆయన చెబుతూ, ‘‘ఒకవేళ ఏఐ స్వతంత్రంగా పనిచేయగలిగిందంటే, మరి పాలన, జవాబుదారుతనం, భద్రతల మాటేమిటి? వాటిని తరువాతి దశలో ఆలోచించలేం. వాటిని మొదటి నుంచే  మూల ఆధారాలుగా మలచక తప్పదు’’ అని ఆయన అన్నారు.  

 

image.png

 

హెచ్‌సీఎల్ టెక్ చైర్‌పర్సన్ రోశ్నీ నాడార్ మాట్లాడుతూ, భారత్‌కే కాక ప్రపంచానికి కూడా ఒక నిర్మాణాత్మక ఆర్థిక మలుపుగా కృత్రిమ మేధ నిలిచిందని వర్ణించారు. జ్ఞానం తనంత తానే ప్రోగ్రామ్ చేయగలిగిందిగా మార్పు చెందుతోందన్న వాదనను ఆమె వినిపిస్తూ, ‘‘ఏఐ యుగంలో, విస్తృతి వల్లనే పైచేయిని సాధించడానికి కుదరదు. అది ప్లాట్‌ఫారాలు, మేధాసంపత్తి, నవకల్పనల యాజమాన్యంతోనే వీలుపడుతుంది’’ అన్నారు. వ్యూహాత్మక మార్పును గురించి ఆమె ప్రస్తావిస్తూ, ‘‘భారత్ సేవల శక్తి కేంద్రంగా మారే క్రమం నుంచి  మేధాసంపత్తి (ఐపీ)కి శక్తికేంద్రంగా తప్పక మారాలి. సేవలు ప్రయత్నాలతో విస్తరించగలుగుతాయి; అదే మేధాసంపత్తి విషయానికి వస్తే, ఎలాంటి పరిమితులూ లేకుండా వృద్ది చెందుతుంది’’ అని ఆమె అన్నారు.

 

image.png

 

ఎన్ఎక్స్‌పీ సెమీకండక్టర్స్ సీటీఓ శ్రీ లార్స్ రేగర్ ప్రసంగిస్తూ హార్డవేర్, ఎడ్జ్-కంప్యూటింగ్ దృష్టికోణాన్ని ప్రస్తావించారు. ఉపకరణాల్లోనూ, భౌతిక వ్యవస్థల్లోనూ నేరుగా ఇంటెలిజెన్సును చేర్చడానికి (ఎంబెడింగ్) ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఏఐ భవిష్యత్తు కేవలం పెద్ద డేటా సెంటర్లకే పరిమితం కాబోదు. అది క్రమంగా ముందుకు సాగిపోతుంటుంది.. వాహనాల లోపలా, కర్మాగారాల్లో, వైద్య చికిత్స పరికరాల్లో, ఇంకా మౌలిక సదుపాయాల లోపలికీ నెట్టుకుని పోతుంది’’ అని ఆయన అన్నారు. భద్రతకీ, సైబర్‌ సెక్యూరిటీకీ పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ పరికరం స్థాయిలో భరోసా ఏర్పడలేదంటే, అప్పుడు ఏఐని స్వీకరించే ప్రక్రియే ఆగిపోతుంది. విధులను నిర్వర్తించడంలో సురక్ష, భద్రత ఐచ్ఛిక లక్షణాలేం కావు, అవి తప్పక ఉండవలసినవి’’ అని ఆయన స్పష్టం చేశారు.  

 

image.png

 

సర్వీస్‌నౌ ప్రెసిడెంటు, సీపీఓ, సీఓఓ శ్రీ అమిత్ జవేరీ ఎంటర్‌ప్రైజ్‌లను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ, కృత్రిమ మేధని పెద్ద ఎత్తున ఉపయోగంలోకి తీసుకురావడం ముఖ్యమన్నారు. ప్రయోగ దశకీ, వాస్తవ ప్రపంచంలో సేవల వినియోగానికీ మధ్య ఉంటున్న అంతరాన్ని గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ‘‘అనేక సంస్థలు కృత్రిమ మేధ తాలూకు ప్రయోగాత్మక ప్రాజెక్టుల్ని నిర్వహిస్తున్నాయి.. అయితే దీనిని భారీ స్థాయిలో అమల్లోకి తీసుకు రావడానికి ప్లాట్‌ఫారంలోనే పాలన, విజిబులిటీ, నియంత్రణ.. వీటిని అంతర్భాగాలుగా చేయవలసి ఉంటుంది’’ అన్నారు. అదనపు సదుపాయాల పద్ధతికి బదులు ఏకీకరణ వైపు మొగ్గు చూపాలని ఆయన చెప్పారు. ‘‘భద్రత.. ఏఐకి భిన్నంగా ఏమీ ఉండజాలదు. దీనిని డిజైన్ మొదలు రంగంలో మోహరించడం వరకూ.. ఏఐ వ్యవస్థకు లోపలే అంతర్గతంగా ఇమిడ్చి తీరాలి’’ అని ఆయన అన్నారు.

నలుగురు ప్రముఖులూ కలిసి ఒక అంశాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అది ఏమిటంటే.. ఏఐ తదుపరి దశ ఒక్క మోడళ్ల ఆధునికీకరణ సామర్థ్యంతో కాక, ఆయా వ్యవస్థల లోపల సురక్షిత, సమర్థ, బాధ్యతాయుతంగా పనుల్ని పూర్తి చేసే వాటి సామర్థ్యంతో నిర్ణయమవుతుందనేదే. ఇదే ఆర్థిక వ్యవస్థకీ, సమాజానికీ శక్తిని ప్రసాదిస్తుంది. సైబర్‌సెక్యూరిటీ, మేధాసంపత్తి మొదలు ఎడ్జ్ ఇంటెలిజెన్స్, ఎంటర్‌ప్రైజ్ గవర్నెన్స్ వరకూ చూస్తే కీలకోపన్యాసాల్లో ఒక విషయాన్ని వక్తలు బలంగా చాటిచెప్పారు. అది.. విశ్వాసమే పునాదిగా ఏఐ భవిష్యత్తు రూపొందుతుందని, అలా అయినప్పుడు నవకల్పనలు సంస్థలను బలోపేతం చేయగలుగుతాయని, వినియోగదారుల ప్రయోజనాల్ని కాపాడగలుగుతాయని, ఆటుపోటులకు తట్టుకొని నిలవగల వాస్తవిక ప్రపంచంతో పోలివుండే ప్రభావాన్ని అందించగలుగుతాయని‘‘ వారు అన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2230665) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी