ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026: ఏఐకి ఉన్న పరివర్తనాత్మక సామర్థ్యం, భారత నాయకత్వ పాత్రను ప్రధానంగా పేర్కొన్న పారిశ్రామిక దిగ్గజాలు
టెలికమ్యూనికేషన్స్, ఆరోగ్య సంరక్షణ, విద్య, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో ఏఐ పోషించే విస్తృత పాత్రను ప్రముఖంగా ప్రస్తావించిన సునీల్ భారతి మిట్టల్, శంతను నారాయణ్
ఏఐ విస్తరణ, ప్రజాస్వామిక పద్ధతిలో రక్షణ కవచాలపై దృష్టి సారించిన నందన్ నిలేకని, డారియో అమోడెయ్
'మానవ కేంద్రిత ఏఐ’ భవిష్యత్తును విశ్లేషించిన అడ్వాన్స్‌డ్ మెషీన్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లెకున్
నాడు పోస్టు చేయడమైనది:
19 FEB 2026 6:47PM by PIB Hyderabad
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో భాగంగా పరిశ్రమలు, పరిపాలన, ఆరోగ్యం, సమాచార ప్రామాణికత, అంతర్జాతీయ ప్రమాణాలపై ఏఐ చూపే పరివర్తనాత్మక ప్రభావం గురించి పలువురు సాంకేతిక దిగ్గజాలు, పారిశ్రామిక నాయకులు విస్తృతంగా చర్చించారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఏఐ ఇంపాక్ట్ సదస్సను ప్రారంభించారు.
ఇండియా ఏఐ సదస్సులో భాగంగా భారతీ ఎయిర్‌టెల్ వ్యవస్థాపక చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, అడోబ్ చైర్మన్ - సీఈఓ శంతను నారాయణ్ మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. టెలికమ్యూనికేషన్స్, వ్యక్తిగతీకరించిన వైద్యం, విద్య, డిజిటల్ మౌలిక సదుపాయాల వంటి వివిధ రంగాలలో విస్తరిస్తున్న ఏఐ పాత్రపై ఈ చర్చ ప్రధానంగా దృష్టి సారించింది. సంస్థల నిర్వహణలో ఏ విధంగా ఏఐ కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం గురించి సునీల్ భారతి మిట్టల్ మాట్లాడుతూ.. "మా కంపెనీ పరంగా చూస్తే మేం కార్యకలాపాలను నిర్వహించే విధానం, కస్టమర్లకు సేవలు అందించడం, నెట్‌వర్క్‌లను నిర్మించడం, వాటిని నిర్వహించడంలో ఏఐ ఇప్పుడు ఒక విడదీయరాని భాగం అయిపోయింది" అని అన్నారు.
సమాచారాన్ని అందరికీ చేరువ చేయడంలో ఏఐకి ఉన్న శక్తిని శంతను నారాయణ్ ప్రముఖంగా చెప్పారు. సమాచార గోప్యత విషయంలో ప్రపంచ ప్రమాణాలను రూపొందించడంలో భారతదేశానికి ఉన్న అసాధారణ అవకాశాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. "కేవలం ఈ ఏఐ మోడల్స్ వల్ల కలిగే ప్రయోజనాల విషయంలోనే కాకుండా డేటా, గోప్యత, భద్రత, నమ్మకం వంటి అంశాలపై ప్రపంచం ఆలోచించే తీరును నిర్దేశించడంలో భారత్ నాయకత్వ పాత్ర పోషించగలదు” అని వ్యాఖ్యానించారు.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు- చైర్మన్ నందన్ నిలేకని, ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ మధ్య ఒక విస్తృతమైన చర్చ జరిగింది. కృత్రిమ మేధ వేగంగా వృద్ధి చెందుతుండటం, ఒక దేశ జనాభా అంతటికి ఏఐని చేరవేయడంలో ఎదురయ్యే సవాళ్లు.. ఆవిష్కరణలు- ప్రజాస్వామ్య పద్ధతిలో రక్షణ కవచాలకు మధ్య సమతుల్యతను పాటిస్తూ సమ్మిళిత వృద్ధిని సాధించడంపై వీరు చర్చించారు.
సాంకేతిక పురోగతి, సామాజిక ప్రభావానికి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి డారియో అమోడెయ్ మాట్లాడుతూ.. "సాంకేతికతకు ఉన్న ప్రాథమిక సామర్థ్యాలు, ఆ సామర్థ్యాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి పట్టే సమయానికి మధ్య ఒక ద్వంద్వ స్వభావం ఉంటుంది. గ్లోబల్ సౌత్‌లో ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలు ప్రపంచంలోని మరే ఇతర ప్రాంతం కంటే ఎక్కువగా ఉండొచ్చు. మనం ఏఐ భద్రత, ప్రజాస్వామ్య పద్ధతిలో నియంత్రిచటం, ఆర్థిక సమ్మిళితత్వం వంటి అంశాలను సరిగ్గా అమలు చేయటాన్ని ఇది మరింత ముఖ్యమైన అంశంగా చేస్తోంది" అని పేర్కొన్నారు.
ఈ సంభాషణలో గ్లోబల్ సౌత్ దేశాలకు ఏఐ వల్ల కలిగే ప్రమాదాలు, అవకాశాల గురించి కూడా చర్చించారు. ఇందులో ప్రధానంగా ఆర్థిక మార్పు లేదా ఉపాధి కోల్పోయే ముప్పు, భద్రత, ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండాలంటే ఏఐ వల్ల కలిగే నిజమైన ప్రయోజనాలను నిరూపించాల్సిన అవసరం గురించి చర్చించారు.
అడ్వాన్స్‌డ్ మెషీన్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ యాన్ లెకున్‌తో ఒక విస్తృత స్థాయి చర్చ జరిగింది. ఇండియా టుడే మేనేజింగ్ ఎడిటర్ శ్రీమతి మేరియా షకీల్ తో జరిగిన ఈ సంభాషణలో కృత్రిమ మేధ పరిణామం, సహజ మేధస్సు- ఏఐ వ్యవస్థల మధ్య ఉన్న వ్యత్యాసం, సాంకేతిక పురోగతి సుదీర్ఘ గమనం గురించి లెకున్ అభిప్రాయాలను పంచుకున్నారు.
‘ఏఐ మానవ మేధస్సును మించిపోయే దిశగా పయనిస్తోందా?’ అనే ప్రశ్నతో ఈ సంభాషణ ప్రారంభమైంది. ఈ చర్చను లెకున్ ఒక కొత్త కోణంలోకి తీసుకెళ్లారు. ఏఐ అనేది మానవ మేధస్సును భర్తీ చేయడం కంటే దానిని అనేక రెట్లు పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉండటమే ప్రస్తుతానికి అత్యంత కీలకమైన, అర్థవంతమైన మార్పు అని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచ ఏఐ ఆవిష్కరణలలో భారత్ పాత్రను లెకున్ ప్రస్తావిస్తూ… "దీర్ఘకాలికంగా చూస్తే అనుకూలమైన జనాభా పరిస్థితులు ఉన్న భారత్, ఆఫ్రికా వంటి దేశాల నుంచే కొత్త ఆవిష్కరణలు వస్తాయి. మానవాళిలో యువతే అత్యంత సృజనాత్మకమైన భాగం” అని వ్యాఖ్యానించారు. ఏఐ యుగంలో విద్య మరింత కీలకమైన అంశంగా మారుతుందని ఆయన ఉద్ఘాటించారు. ఏఐకి ఉన్న పరివర్తనాత్మక సామర్థ్యాన్ని ఆయన వివరిస్తూ.. "కొందరు ఆర్థికవేత్తలు దీనిని 'కొత్త విద్యుత్' అని పిలుస్తారు. కానీ నేను దీనిని 'కొత్త ప్రింటింగ్ ప్రెస్'గా భావిస్తాను. ఇది విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం, మానవ మేధస్సును పెంపొందించడం గురించి చెబుతుంది” అని అన్నారు.
భారీ జనాభా, అనుకూలమైన జనాభా పరిస్థితులు, మార్పును తీసుకురాగల అపారమైన సామర్థ్యం ఉన్న భారత్.. అంతర్జాతీయ ప్రమాణాలను నిర్దేశించడం, సమ్మిళిత- మానవ కేంద్రిత ఏఐ ఆవిష్కరణలను నడిపించడంలో ఒక విశిష్టమైన స్థానంలో ఉన్నట్లు పారిశ్రామిక దిగ్గజాలు పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2230502)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5