ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో ఆరోగ్యం, విద్య రంగాలపై ఏఐ ఇంపాక్ట్ కేస్‌బుక్స్‌ ఆవిష్కరణ


ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్య వ్యవస్థల్లో సంస్థాగత స్థాయిలో కృత్రిమ మేధ సేవలను వినియోగించుకోవడమెలాగో తెలిపిన కేస్‌బుక్స్

ఏఐ ఇంపాక్ట్ కేస్‌బుక్స్‌లో నైతిక పరిపాలన, ఇంటరాపరబులిటీ, జవాబుదారీతనం, సహకారపూర్వక ఏఐ విస్తారిత అనుబంధ వ్యవస్థలకు ప్రాధాన్యాన్ని ఇచ్చిన కేస్‌బుక్స్

నాడు పోస్టు చేయడమైనది: 17 FEB 2026 8:27PM by PIB Hyderabad

ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్య వ్యవస్థల్లో కృత్రిమ మేధ సేవలను వినియోగించుకోవడమెలాగో తెలియజేసిన కేస్‌బుక్స్‌ను ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 సందర్భంగా ఆవిష్కరించారు. వీటిని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ , నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికత్వ శాఖతో పాటు ఇండియాఏఐ మిషన్‌ల మార్గదర్శకత్వంలో రూపొందించారు. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ వంటి భాగస్వామ్య సంస్థలు కూడా మద్దతును అందించాయి.

image.png


ప్రయోగాత్మక దశ కన్నా మిన్నగా వైద్యశాలలు, తరగతిగదులు, నైపుణ్యాలను నేర్పించే అనుబంధ విస్తారిత వ్యవస్థల్లో ఉపయోగించిన ఏఐ సేవలను గురించి ఇతివృత్త ప్రధానమైన కేస్‌బుక్స్‌లో వివరించారు. కొలవదగిన ఫలితాలు, స్కేలబుల్ మాడళ్లను (విశేషించి భారత్, అభివృద్ధి కోసం తపిస్తున్న దేశాల్లో) కళ్లకు కట్టే ఈ పుస్తకాలను సంస్థాగతంగా ఏఐని వాడడం కోసం ఆచరణీయ నమూనాల మాదిరిగా తీర్చిదిద్దారు. ఇవి నైతిక పరిపాలనకీ, ఇంటరాపరబులిటీకీ, పబ్లిక్-ప్రయివేట్ సహకారానికీ, సాక్ష్యాధారిత మూల్యాంకనానికీ పెద్ద పీట వేశాయి.
ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై)కి చెందిన జీ కేటగిరీ శాస్త్రవేత్త, ఏఐ అండ్ ఈటీ విభాగం సమూహ సమన్వయకర్త కవిత భాటియా మాట్లాడుతూ, ‘‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026ను దృష్టిలో పెట్టుకొని ఈ ఆరు గ్రంథాలను సంకలన పరచడంలో సహకారాన్ని అందించిన భాగస్వాములు అందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞత‌ల్ని తెలియజేస్తున్నాను. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ వాస్తవిక ప్రభావాన్ని వివరించిన కేస్‌బుక్‌ పట్ల ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఐసీఎంఆర్‌లు వహించిన మార్గదర్శకత్వంతో పాటు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరంతర ప్రాతిపదికన అందించిన సహకారాన్ని నేను గుర్తిస్తున్నాను. ఇది సాంకేతిక భాగస్వామిగా ఉంటూ ప్రపంచ స్థాయిలో ప్రమాణీకృత, సాక్ష్యాధారిత ఎంపిక ప్రక్రియకు దిశానిర్దేశం చేసింది’’ అన్నారు.
ఎంఈఐటీవై జాయింట్ డైరెక్టరు శిఖా దహియా మాట్లాడుతూ, ‘‘ఈ కేస్‌బుక్స్  ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అందించిన ముఖ్య పరిణామాల్లో ఒకటి. ఇవి ఆరోగ్యం, విద్య రంగాలలో కృత్రిమ మేధను వాస్తవిక జీవనంలో ఉపయోగించే సందర్భాలను గురించి వివరిస్తాయి. అంతేకాక ఇవి కొలవదగిన ప్రభావం ఆధారంగా శిఖరాగ్ర సదస్సు కేంద్రీకరించిన దృష్టికోణానికి అద్దం పడుతున్నాయి. ఈ ప్రచురణలు బలమైన రిఫరెన్స్ పాయింట్లుగా పనిచేస్తాయనీ, ఈ ముఖ్య రంగాల్లో విధానాల భావి గతిని నిర్ణయించడంలో తోడ్పడతాయనీ మేం ఆశిస్తున్నాం’’ అన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆగ్నేయ ఆసియా ప్రాంత ఆఫీసర్-ఇన్-చార్జి కేథరినా బోహ్‌మే మాట్లాడుతూ, ‘‘కృత్రిమ మేధపై జరిగే చర్చను ముందుకు తీసుకు పోయి, అభ్యాస పూర్వక ఆచరణ దశకు చేర్చడం ఈ గ్రంథ సంకలనాల ఉద్దేశం. ప్రపంచం అంతటా పెచ్చుపెరుగుతున్న ఆరోగ్య సమస్యల్నీ, శ్రమశక్తి సంబంధిత సవాళ్లనీ, సేవల అందజేతకు సంబంధించిన సమస్యల్నీ ఎదుర్కొనే ఒక సాధనంగా కృత్రిమ మేధ ఎదుగుతోంది. బలమైన కృత్రిమ మేధ సంబంధిత పాలన ప్రణాళికను రూపొందించి, వివిధ దేశాల్లో సాంకేతిక, నైతిక సామర్థ్యాన్ని పెంచి, సాక్ష్యాధారిత ఏఐని స్వీకరించడాన్ని ప్రోత్సహించడంలో దేశాలకూ, ప్రభుత్వాలకూ మద్దతివ్వడానికి డబ్ల్యూహెచ్ఓ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది’’ అన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2229680) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Kannada