ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మంగళగిరిలో అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) రెండో స్నాతకోత్సవంలో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య- కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్
మెడికల్ కాలేజీల సంఖ్య 387 నుంచి 818కు, ఎయిమ్స్ సంఖ్య 7 నుంచి 22కు పెంచటంతో భారత ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో చారిత్రాత్మక వృద్ధి నమోదైందని పేర్కొన్న శ్రీమతి అనుప్రియ పటేల్
ఆధునిక వైద్యంతో పాటు సంప్రదాయ వైద్య పద్ధతులను మేళవించడం ద్వారా ఒక వినూత్నమైన సమగ్ర వైద్యారోగ్య నమూనాను ప్రపంచానికి పరిచయం చేస్తోన్న భారత్: శ్రీమతి అనుప్రియ పటేల్
ఇది వైద్య ఖర్చులను తగ్గించడమే కాకుండా మెరుగైన ఫలితాలను అందిస్తూ అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యం వైపు మనల్ని వేగంగా నడిపిస్తోంది: శ్రీమతి పటేల్
వ్యాధి నిర్ధారణ, చికిత్స, వైద్య సేవలను అందించడంలో ఒక శక్తిమంతమైన సాధనంగా మారుతున్న కృత్రిమ మేధ: శ్రీమతి అనుప్రియ పటేల్
ఇది వైద్యులకు సహాయక శక్తిగా నిలుస్తుందే తప్ప, వారి స్థానాన్ని భర్తీ చేయదు: శ్రీమతి అనుప్రియ పటేల్
49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, 5 మంది ఎండీ- ఎంఎస్ విద్యార్థులు, 4 మంది పోస్ట్-డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సు (పీడీసీసీ) విద్యార్థులకు పట్టాల ప్రదానం
నాడు పోస్టు చేయడమైనది:
17 FEB 2026 7:34PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ సమక్షంలో ఈ రోజు మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో (ఎయిమ్స్) జరిగిన రెండో స్నాతకోత్సవంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ మాట్లాడారు.
విద్యా, వృత్తిపరమైన ప్రయాణంలో ఒక ముఖ్యమైన ఘట్టానికి చేరుకున్న ఎంబీబీఎస్ విద్యార్థులకు శ్రీమతి అనుప్రియ పటేల్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భాన్ని ఒక నిర్ణయాత్మక ఘట్టంగా అభివర్ణించిన ఆమె.. ఇది కేవలం అధికారికంగా చదువు పూర్తి చేయటం మాత్రమేనని వైద్య వృత్తిలో నేర్చుకునే ప్రక్రియ జీవితాంతం కొనసాగాలని గుర్తుచేశారు. “వైద్యశాస్త్రం అనేది నిరంతరం అభివృద్ధి చెందే రంగం. ఈ స్నాతకోత్సవం నేర్చుకోవటానికి ముగింపు కాదు. నిరంతర ఎదుగుదల, నూతన ఆవిష్కరణలు, మానవత్వానికి సేవ చేసే సుదీర్ఘ జీవన ప్రయాణానికి ఇది ఒక ఆరంభం మాత్రమే” అని ఆమె పేర్కొన్నారు.
వైద్యుల సామాజిక బాధ్యతను గురించి మాట్లాడుతూ.. “మీరు ఈ పవిత్రమైన వృత్తిలోకి ప్రవేశిస్తున్నప్పుడు కేవలం మీ వ్యక్తిగత ఆశయాలను మాత్రమే కాకుండా కోట్లాది మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను కూడా మీతో పాటు తీసుకెళ్తున్నారు. సమాజం వైద్యులపై అపారమైన నమ్మకాన్ని పెడుతుంది. ఆ నమ్మకాన్ని సానుభూతి, కరుణ, నైతిక ప్రవర్తన, వృత్తిపరమైన నైపుణ్యంతో కాపాడాలి” అని వ్యాఖ్యానించారు.
వైద్యులు ఎక్కడ సేవలు అందిస్తున్నప్పటికీ తమ వృత్తిపరమైన నిర్ణయాలలో ఎల్లప్పుడూ రోగుల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ఎంబీబీస్ పట్టభద్రులకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా సమాజంలోని అణగారిన, వెనుకబడిన వర్గాల అవసరాల పట్ల అత్యంత సున్నితత్వంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె కోరారు.
భారత ఆరోగ్య రంగంలో చోటుచేసుకుంటున్న పరివర్తనను కేంద్ర మంత్రి ప్రధానంగా చెప్పారు. “భారత్ ఆరోగ్య ముఖచిత్రం సరికొత్తగా మారుతోంది. గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో 'సార్వత్రిక ఆరోగ్య రక్షణ' అనేది ఇక ఎంతమాత్రం సుదూర లక్ష్యం కాదు.. ఇది సాధ్యమయ్యే వాస్తవం. దేశంలో వైద్యం అనేది కేవలం కొందరికి మాత్రమే దక్కే సౌకర్యం అనే స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కుగా మారుతోంది” అని అన్నారు.
ఆరోగ్య రంగంపై 2014 నుంచి ప్రభుత్వ వ్యయం నిరంతరం పెరుగుతోందని.. తాజాగా కేంద్ర బడ్జెట్‌లో దీనిని 9 శాతం పెంచినట్లు శ్రీమతి అనుప్రియ పటేల్ పేర్కొన్నారు. జాతీయ ఆరోగ్య విధానం 2017 ప్రకారం ప్రజారోగ్య వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. దీని ఫలితంగా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలు బలోపేతం అయ్యాయని, ప్రజలు సొంత జేబుల నుంచి పెట్టే వైద్య ఖర్చులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయని తెలిపారు.
“ప్రభుత్వం సమగ్రమైన విధానాన్ని అవలంభిస్తోంది. ప్రజారోగ్యంపై పెట్టుబడులను పెంచడం, కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడం, మౌలిక సదుపాయాలు- మానవ వనరులను విస్తరించడం ద్వారా నాణ్యమైన వైద్యం ప్రతి ఒక్కరికి చేరేలా చర్యలు తీసుకుంటోంది” అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన, అమృత్ ఫార్మసీలు, జాతీయ డయాలసిస్ కార్యక్రమం వంటి ప్రతిష్ఠాత్మక పథకాలతో పాటు తక్కువ ఖర్చుతో వైద్యం అందించే ఇతర రోగుల కేంద్రిత పథకాలను ఆమె ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) గురించి ప్రస్తావిస్తూ.. “ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ఆరోగ్య రక్షణ పథకం దాదాపు 62 కోట్ల మంది లబ్ధిదారులకు ఏటా కుటుంబానికి రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్సను అందిస్తోంది. పేద, వెనుకబడిన వర్గాలకు వైద్యం అందకుండా చేస్తున్న ఆర్థిక అడ్డంకులను తొలగించడం ద్వారా ఇది ఒక నిశ్శబ్ద సామాజిక విప్లవాన్ని సృష్టిస్తోంది” అని ఆమె పేర్కొన్నారు. పీఎం-జేఏవై ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించడం, సకాలంలో చికిత్స అందించడం సాధ్యమవుతోందని.. ఇది మెరుగైన ఆరోగ్య ఫలితాలను అందించడమే కాకుండా కుటుంబాలు అప్పుల పాలు కాకుండా కాపాడుతోందని ఆమె చెప్పారు.
ఆరోగ్య మౌలిక సదుపాయాలు, వైద్య విద్య గురించి మాట్లాడుతూ.. “వైద్య విద్య, తృతీయ స్థాయి వైద్య సంరక్షణలో భారత్ అపూర్వమైన వృద్ధిని సాధించింది. మెడికల్ కాలేజీల సంఖ్య 2014లో 387 ఉండగా నేడు వాటి సంఖ్య 818కి పెరిగింది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లను పెంచడమే కాకుండా ఎయిమ్స్ సంస్థల సంఖ్యను 7 నుంచి 22కి పెంచడం ద్వారా అన్ని వర్గాల్లో నైపుణ్యం కలిగిన యువత డాక్టర్లు కావాలనే తమ కలలను సాకారం చేసుకునేలా చేశాం” అని తెలిపారు.
భారతదేశ ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థకు పునాదిగా నిలిచిన 1.80 లక్షలకు పైగా 'ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు' గ్రామ స్థాయిలో 12 రకాల అత్యవసర సేవలను అందిస్తున్నాయని ఆమె అన్నారు.
సమగ్ర ఆరోగ్య సంరక్షణలో భారత్ నాయకత్వాన్ని చాటిచెబుతూ.. “ఆధునిక వైద్యంతో పాటు సంప్రదాయ వైద్య పద్ధతులను మేళవించడం ద్వారా భారత్ ఒక వినూత్నమైన నమూనాను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇది వైద్య ఖర్చులను తగ్గించడమే కాకుండా ఫలితాలను మెరుగుపరుస్తోంది” అని శ్రీమతి పటేల్ పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌తో సహా అన్ని ఎయిమ్స్ సంస్థలలో ప్రత్యేక ఆయుష్ యూనిట్లు పనిచేస్తున్నాయని లేదా ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని ఆమె వెల్లడించారు.
వర్ధమాన సాంకేతికతల గురించి మాట్లాడుతూ.. వైద్య రంగంలో కృత్రిమ మేధకు ఉన్న ప్రాముఖ్యతను ఆమె వివరించారు. కృత్రిమ మేధపై భారత్ నిర్వహిస్తున్న గ్లోబల్ సౌత్ సదస్సును ఈ సందర్భంగా ప్రస్తావించారు. “వ్యాధుల విషయంలో నిఘా, నిర్ధారణ, చికిత్స అందించడంలో ఏఐ ఒక శక్తిమంతమైన సాధనంగా మారుతుంది. ఇది వైద్యులకు సహాయక శక్తిగా నిలుస్తుందే తప్ప వారి స్థానాన్ని భర్తీ చేయదు” అని ఆమె వ్యాఖ్యానించారు.
భారతదేశ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో ఏఐ ఆధారిత సాధనాలను విజయవంతంగా ఉపయోగించటాన్ని ఆమె ప్రధానంగా చెప్పారు. ఇందులో చేతితో పట్టుకోగలిగే ఎక్స్-రే పరికరాలు, దగ్గు ఆధారిత వ్యాధి నిర్ధారణా పరిష్కారాలు, వ్యాధిని ముందే గుర్తించే డాటా విశ్లేషణ (ప్రిడిక్టివ్ అనలిటిక్స్), జన్యు నిఘా, వ్యాధుల వ్యాప్తిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే నిజ సమయ పర్యవేక్షణ వంటివి ఉన్నాయని తెలిపారు.
“సాంకేతికతను ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకున్నప్పుడు అది వైద్య సేవలను భారీ స్థాయిలో విస్తరించడమే కాకుండా పనితీరును మెరుగుపరుస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని మన అనుభవం నిరూపిస్తోంది' అని ఆమె అన్నారు.
వైద్య వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను ప్రస్తావిస్తూ.. యువ వైద్యులు సొంత శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని శ్రీమతి అనుప్రియ పటేల్ కోరారు. నాణ్యమైన వైద్య సేవలు అందించాలంటే వైద్యులు స్వయంగా ఆరోగ్యంగా ఉండటం అత్యవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రసంగాన్ని ముగిస్తూ.. స్నాతకోత్సవ వేడుకను విజయవంతంగా నిర్వహించినందుకు మంగళగిరి ఎయిమ్స్ యాజమాన్యాన్ని ఆమె అభినందించారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల కోసం ఉదయాన్నే అందించే ప్రసవ పూర్వ సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఈ సంస్థను ప్రశంసించారు. పట్టభద్రులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అత్యున్నత నైతిక ప్రమాణాలను పాటిస్తూ నిరంతరం నేర్చుకుంటూ దేశ నిర్మాణంలో అర్థవంతమైన పాత్ర పోషించాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీ నారా లోకేష్ మాట్లాడుతూ.. మంగళగిరి ఎయిమ్స్ సాధించిన అద్భుతమైన ప్రగతిని వివరించారు. సామాన్య స్థాయి నుంచి నేడు 650 పడకల సూపర్ స్పెషాలిటీ సంస్థగా ఎదిగిన ఎయిమ్స్.. అవయవ మార్పిడి, రోబోటిక్ సర్జరీ, క్యాన్సర్ చికిత్స, గుండె సంబంధిత చికిత్సల వంటి అత్యాధునిక సేవలను అందిస్తోందని తెలిపారు. ఇప్పటివరకు 45 లక్షలకు పైగా డయాగ్నోస్టిక్ సేవలను అందించి కోట్లాది మందికి ఆశగా, ఆరోగ్ ప్రదాయినిగా నిలిచిందని కొనియాడారు. కేవలం మౌలిక సదుపాయాల పెరుగుదల మాత్రమే నిజమైన వృద్ధి కాదని.. నమ్మకం, కరుణ, నైతిక విలువలు, నిరంతరం నేర్చుకోవటం అనేవి వైద్య వృత్తికి నాలుగు ప్రధాన స్తంభాలని ఆయన చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో వైద్యులు నిస్వార్థ సేవలను అందించారన్న ఆయన.. ఆరోగ్య సంరక్షణను సాంకేతికత, ఏఐ ఎంతగా అభివృద్ధి చేసినప్పటికీ రోగి పట్ల చూపే సానుభూతి, వినయం, మానవీయ స్పర్శ ఇచ్చే స్వస్థతను ఏదీ భర్తీ చేయలేదని స్పష్టం చేశారు. చిత్తశుద్ధితో సేవ చేయాలని, నైతిక విలువలను కాపాడాలని, వెనుకబడిన వర్గాలకు వైద్యం అందించాలని.. క్రమశిక్షణ, అంకితభావం, గౌరవంతో వైద్య వృత్తిని కొనసాగించాలని ఆయన పట్టభద్రులకు పిలుపునిచ్చారు.
ఈ స్నాతకోత్సవ వేడుకలో 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, 5 మంది ఎండీ- ఎంఎస్ విద్యార్థులు, నలుగురు పోస్ట్-డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సు (పీడీసీసీ) విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సంస్థ ఇటీవల సాధించిన విజయాలు, పురోగతికి సంబంధించిన సంక్షిప్త నివేదికను కూడా విడుదల చేశారు.
మంగళగిరి ఎయిమ్స్ ప్రెసిడెంట్ మేజర్ జనరల్ (డాక్టర్) తపన్ కుమార్ సాహా, కార్యనిర్వహక డైరెక్టర్ డాక్టర్ అహంతేమ్ శాంతా సింగ్.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2229569)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5