ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’లో కృత్రిమ మేధ ఆరోగ్య సంరక్షణపై రైల్‌టెల్ ఆధ్వర్యాన బృంద గోష్ఠులు విజయవంతం
సురక్షిత.. ఆచరణాత్మక.. పునరుత్థాన డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషణ సహా ఏఐ ఆధారిత ప్రజారోగ్య సేవలకు మేం తోడ్పడగలం: రైల్‌టెల్ సీఎండీ శ్రీ సంజయ్ కుమార్
· కృత్రిమ మేధ ద్వారా సార్వజనీన.. సౌలభ్య ప్రజారోగ్యంపై నిబద్ధతను పునరుద్ఘాటించిన రైల్‌టెల్
నాడు పోస్టు చేయడమైనది:
16 FEB 2026 9:11PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’లో భాగంగా ఈ రోజు కృత్రిమ మేధ ఆధారిత ఆరోగ్య సంరక్షణ పై రెండు కీలక బృంద గోష్ఠి కార్యక్రమాలను రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ నవరత్న సంస్థలలో ఒకటైన ‘రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ విజయవంతంగా నిర్వహించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు, సాంకేతిక అగ్రగాములు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, పరిశోధకులు, ఆవిష్కర్తలను ఒకే వేదికపైకి తెస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, ‘ఇండియాఏఐ మిషన్’ ఈ భారీ సదస్సును నిర్వహిస్తున్నాయి.
ఇందులో భాగంగా ప్రజారోగ్య వ్యవస్థల బలోపేతం, ఆరోగ్య సంరక్షణ లభ్యత మెరుగుదల సహా సమగ్ర-సార్వజనీన సేవల ప్రదానంలో ఏఐ వినియోగంపై రెండు బృంద గోష్ఠులను రైల్‌టెల్ విజయవంతంగా నిర్వహించింది. ఈ మేరకు “పబ్లిక్ హెల్త్ పవర్డ్ బై ఏఐ: రైల్‌టెల్ కొలాబరేటివ్ మోడల్ ఫర్ ఏఐ-ఎనేబుల్డ్ ఇన్‌క్లూజివ్ హెల్త్‌కేర్ ఫర్ భారత్ అండ్ బియాండ్”, “ఏఐ ఫర్ ఇన్‌క్లూజివ్, యాక్సెస్‌బుల్, అండ్ యూనివర్సల్ హెల్త్‌కేర్” ఇతివృత్తాలపై ఆసక్తికర చర్చలు సాగాయి.
“పబ్లిక్ హెల్త్ పవర్డ్ బై ఏఐ” అంశంపై బృంద గోష్ఠిలో చర్చించిన సభ్యులు ప్రధానంగా ప్రభుత్వ సంస్థలు, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, పరిశోధన సంస్థలు, సాంకేతిక భాగస్వాములతో కూడిన సహకార నమూనాల ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు. వ్యాధుల వ్యాప్తిపై పర్యవేక్షణ బలోపేతం, ముందస్తు గుర్తింపును ప్రోత్సహించడం, వైద్యపరంగా నిర్ణయాత్మక మద్దతు సహా జనాభా స్థాయి ఆరోగ్య నిర్వహణ మెరుగుదల తదితర అంశాల్లో ఏఐ సామర్థ్యాన్ని వారు చర్చించారు. అంతేకాకుండా సమదృష్టి సంబంధిత ఉత్ప్రేరకంగా ‘ఏఐ’ని రూపొందించి అమలు చేయడం ద్వారా ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రస్తుత అసమానతల తొలగింపు, అంతరాల తగ్గింపు సాధ్యం కాగలదని వారు విశదం చేశారు.
ఇక “ఏఐ ఫర్ ఇన్‌క్లూజివ్, యాక్సెస్‌బుల్, అండ్ యూనివర్సల్ హెల్త్‌కేర్” అంశంపై నిర్వహించిన రెండో బృంద గోష్ఠిలో- ఆరోగ్య సంరక్షణ సేవలు పరిమితంగా ఉండే ప్రాంతాలతో పాటు మారుమూల జనాభాకు వాటిని మరింత చేరువ చేసేందుకు ఏఐ ఆధారిత పరిష్కారాల రూపకల్పనపై నిపుణులు దృష్టి సారించారు. ఇందులో ప్రత్యేకించి, రోగి-కేంద్రక ప్రభుత్వ విధానాల అవసరాన్ని వారు స్పష్టం చేశారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆవిష్కరణలు కేవలం లాభదాయకత మాత్రమే పరిమితం కారాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మారుమూల ప్రాంతాలలో పరిమిత హై-బ్యాండ్‌విడ్త్ మౌలిక సదుపాయాలు, క్షేత్రస్థాయి వాస్తవాలతో సమన్వయం ద్వారా వాస్తవిక విస్తరణ అంచనాల ఆవశ్యకత, ఏఐ ప్రభావ అంచనాలో కొలబద్దలుగా అర్థవంతమైన ఫలితాధారిత సూచీల స్వీకరణ ప్రాధాన్యం వంటి కీలక సమస్యలపైనా వారు చర్చించారు. అలాగే, ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకోవడంలో గందరగోళం నివారణకు, సార్వత్రిక-సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవల ప్రదానంలో ఏఐ వాస్తవిక మద్దతుకు భరోసా ఇచ్చేలా ఆరోగ్య సంరక్షణపై అవగాహనను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ప్రతినిధులు, విద్యా-ఆరోగ్య సంరక్షణ సంస్థల, పరిశ్రమల నుంచి విశిష్ట నిపుణులు, సమన్వయకర్తలు ప్యానెలిస్టులు ఈ గోష్ఠులలో పాల్గొన్నారు. ‘ఏఐ’ సామర్థ్యాన్ని వాస్తవిక ఆచరణాత్మక వ్యూహాలుగా మలచడంలో వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు, ఆలోచనలు దోహదం చేస్తాయి.
ఈ రెండు గోష్ఠుల నిర్వహణపై రైల్‌టెల్ సీఎండీ శ్రీ సంజయ్ కుమార్ ప్రసంగిస్తూ- “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’లో ఈ కీలక చర్చల నిర్వహణ బాధ్యతను మాకు అప్పగించడంపై మంత్రిత్వశాఖతోపాటు ఇండియాఏఐ మిషన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. మన దేశానికే కాకుండా అంతర్జాతీయంగానూ సార్వజనీన, సౌలభ్య ఆరోగ్య సంరక్షణ సేవలకు ఏఐ ఏ విధంగా సారథ్యం వహించగలదో చర్చించేందుకు ఈ సదస్సు ఒక విలువైన వేదికను సమకూర్చింది. జాతీయ డిజిటల్ కార్యక్రమాలకు మద్దతివ్వడంలో నిబద్ధతగల ప్రభుత్వ రంగ సంస్థగా, ఏఐ ఆధారిత ప్రజారోగ్య సేవలకు ఊతమిచ్చే సురక్షిత, ఆచరణాత్మక, పునరుత్థాన డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో తననుతాను కీలక దోహదకారిగా రైల్‌టెల్ పరిగణిస్తుంది” అని ప్రకటించారు.
భారత్ డిజిటల్ రూపాంతరీకరణకు మద్దతు సహా సురక్షిత, ఆచరణాత్మక ‘ఐసీటీ మౌలిక సదుపాయాల ద్వారా భావితరం ప్రజా సేవా ప్రదానానికి తోడ్పడటంలో తన నిబద్ధతను ఈ రెండు గోష్ఠుల నిర్వహణలో రైల్‌టెల్ భాగస్వామ్యం, నిర్వహణ సామర్థ్యం పునరుద్ఘాటించాయి. దేశవ్యాప్తంగా ‘ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్, మిషన్-క్రిటికల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్’ల అమలులో విస్తృత అనుభవం ఈ సంస్థ సొంతం. అలాగే ఆరోగ్య సంరక్షణ, పరిపాలన-పౌర సేవలు సహా వివిధ రంగాలలో సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలకు దోహదం చేయడంలోనూ కీలక పాత్రధారిగా రైల్‌టెల్ కొనసాగుతోంది.
రైల్‌టెల్ గురించి సంక్షిప్తంగా...
దేశంలో నవరత్న ప్రభుత్వ రంగ సంస్థలలోనే కాకుండా అతిపెద్ద తటస్థ టెలికాం మౌలిక సదుపాయ ప్రదాతలలో రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా ఒకటి. విశ్వసనీయ ఎండ్-టు-ఎండ్ ఐటీ-ఐసీటీ సేవా ప్రదానం ఈ సంస్థ ప్రత్యేకత. ఇది రైలు మార్గాల వెంబడి 63,000 రూట్ కిలోమీటర్ల మేర విస్తరించిన విస్తృత ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్. ఇందులో 21,000 కిలోమీటర్ల నగరవ్యాప్త సౌలభ్య నెట్‌వర్క్, 11000కుపైగా ‘పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్’ (పీఓపీ), దేశవ్యాప్తంగా 1,100 టెలికాం టవర్లు ఈ సంస్థకు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత సార్వత్రిక వైఫై నెట్‌వర్కులలో ఒకటిగానూ రూపొందింది. ఈ మేరకు దేశంలోని 6,115 రైల్వే స్టేషన్లలో సేవలందించడమేగాక ఈ బలమైన మౌలిక సదుపాయాలకు సెంట్రల్ నెట్‌వర్క్ ఆపరేషన్ సెంటర్ (సీఎన్‌ఓసీ) సహా నాలుగు ప్రాంతీయ-ఆధారిత నెట్‌వర్క్ ఆపరేషన్ సెంటర్లు (ఎన్‌ఓసీ) మద్దతిస్తున్నాయి.
టెలికాం లైసెన్సులు, (ఐపీ-1, ఎన్‌ఎల్‌డి, ఐఎస్‌పీ) ఇన్-హౌస్ టైర్-3 డేటా సెంటర్ సేవలు, స్వీయ భద్రత ఆపరేషన్ సెంటర్ సహా ఎలక్ట్రానిక్స్—మాచార సాంకేతిక మంత్రిత్వశాఖ జాబితాలోని క్లౌడ్ సేవలు కూడా అందించగల ఒక ప్రత్యేక ప్రభుత్వ రంగ సంస్థగా రైల్‌టెల్ విశేష ప్రాధాన్యం పొందింది. కంపెనీ విస్తృత శ్రేణి సేవలలో ‘ఎంపీఎల్‌ఎస్, వీపీఎన్, లీజు లైన్లు, టవర్ కో-లొకేషన్, డేటా సెంటర్ సేవలు, క్లౌడ్ సేవలు, భద్రత నిర్వహణ సెంటర్ సేవలు, హెచ్‌డీ వీడియో కాన్ఫరెన్సింగ్, ఆధార్ సంబంధిత ప్రామాణీకరణ వ్యవస్థలు, ఇ-టెండరింగ్, రైల్‌వైర్ బ్రాండ్ కింద రిటైల్ బ్రాడ్‌బ్యాండ్, ఐటీ-ఐసీటీ ప్రాజెక్టులు, రైల్వే సిగ్నలింగ్ ప్రాజెక్టులు సహా మరెన్నో ఈ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుండటం విశేషం.
***
(రిలీజ్ ఐడి: 2229060)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5