ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 వేదికగా

ఏఐ యుగంలో ఉపాధి భవిష్యత్తు దిశగా సాగిన చర్చ

సామూహిక ఉపాధి సామర్థ్యంతో ఏఐని అనుసంధానించడానికి జాతీయ నిబద్ధత అవసరమన్న

ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ వి అనంత నాగేశ్వరన్ భారత డేటా, భాషలు, సామాజిక అవసరాలతో ముడిపడిన

జాతీయ సామర్థ్యంగా ఏఐ మారాలని వక్తల పిలుపు ఏఐ- ఆధారిత ప్రభావం తీవ్రతరమవుతున్న క్రమంలో

నిరంతర నైపుణ్యాభివృద్ధి చాలా కీలకమన్న వక్తలు

నాడు పోస్టు చేయడమైనది: 16 FEB 2026 9:21PM by PIB Hyderabad

“ఏఐ యుగంలో ఉపాధి సామర్థ్య భవిష్యత్తు” అనే అంశంపై ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026

వేదికగా జరిగిన ఉన్నత స్థాయి చర్చలో కృత్రిమ మేధస్సు వివిధ రంగాల్లో ఉపాధి సామర్థ్యాన్ని

పునర్నిర్వచిస్తున్న తీరును, పరిమిత పరిధి గల నైపుణ్యాల నుంచి మానవ నియంత్రణలోని

సామర్థ్యాలకు పరివర్తనను, ఏఐ యుగంలో భారత్‌కు గల అవకాశాలు, బాధ్యతలను గురించి విధాన

నిర్ణేతలు, పారిశ్రామిక దిగ్గజాలు, విద్యావేత్తలు, ఆవిష్కర్తలు చర్చించారు.

ఈ సమావేశానికి ఏఐ4ఇండియా సహ వ్యవస్థాపకులు అలోక్ అగర్వాల్ సమన్వయకర్తగా

వ్యవహరించగా, ముఖ్య ఆర్థిక సలహాదారు వీడియో అనుసంధానం ద్వారా ప్రసంగించారు. ఏఐ4ఇండియా

సహ వ్యవస్థాపకులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత శశి శేఖర్ వెంపటి... ఏఎన్ఐ ఎడిటర్ స్మితా ప్రకాష్… ఇన్ఫోఎడ్జ్ సహ వ్యవస్థాపకులు సంజీవ్ భిక్‌చందాని... ఎడ్జ్‌వెర్వ్ సీఈవో సతీష్ సీతారామయ్య... సంపర్క్

ఫౌండేషన్ వ్యవస్థాపకులు, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాజీ సీఈవో వినీత్ నాయర్... స్టాన్‌ఫోర్డ్

యూనివర్సిటీ మెడికల్ స్కూల్ అనుబంధ ప్రొఫెసర్ అనురాగ్ మైరాల్‌ ఈ ప్యానెల్‌లో ఉన్నారు.

ఆటోమేషన్ వేగవంతం అవుతున్న క్రమంలో సంబంధితంగా ఉండే నైపుణ్యాలు, పాత్రలు, మనస్తత్వాలను

గురించి చర్చిస్తూ... యువత ఉపాధి పొందడం కోసం దృష్టి సారించాల్సిన అంశాలను ఈ చర్చ

పరిశీలించింది. పరిమిత పరిధి గల పని ఆధారిత నైపుణ్యం కంటే సృజనాత్మకత, సిస్టమ్స్ థింకింగ్,

అనుసరణీయత, జీవితాంతం నేర్చుకోవడాన్ని కొనసాగించడం వంటి వాటికి పెరుగుతున్న ప్రాముఖ్యాన్ని వక్తలు స్పష్టం చేశారు.

ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ వి. అనంత నాగేశ్వరన్ వీడియో అనుసంధానం ద్వారా మాట్లాడతూ...

దూరదృష్టి, సంస్థాగత క్రమశిక్షణ, నిరంతర అమలు ద్వారా భారత్ నిజమైన మానవ సమృద్ధిని ప్రదర్శించే

మొదటి అతిపెద్ద సమాజంగా మారగలదని పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు ఈ దృక్పథాన్ని బలోపేతం

చేయగలదు... బలహీనపరచనూగలదు అని పేర్కొన్న డాక్టర్ నాగేశ్వరన్... ఫలితం మాత్రం అనుకోకుండా

వచ్చేది కాదని స్పష్టం చేశారు. లక్ష్యం లేకుండా ముందుకు సాగడం ద్వారా పరివర్తన సాధ్యపడదన్న

ఆయన... అత్యవసరత, రాజకీయ సంకల్పం, బలమైన ప్రభుత్వ సామర్థ్యం కోసం పిలుపునిచ్చారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని సామూహిక ఉపాధి సామర్థ్యంతో అనుసంధానించడం స్పష్టమైన జాతీయ నిబద్ధత

అని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రయత్నం ప్రభుత్వానికి మించి విధాన నిర్ణేతలు, పారిశ్రామిక దిగ్గజాలు,

విద్యావేత్తలు, సమాజ భాగస్వామ్యం గల టీమ్ ఇండియా ప్రణాళికగా మారాలని అన్నారు.

భారత్ కోసం ఏఐని భారత డేటా, భాషలు, సామాజిక అవసరాలతో ముడిపడిన జాతీయ సామర్థ్యంగా

పరిగణించాలని శ్రీ శశి శేఖర్ వెంపటి పేర్కొన్నారు. ఏఐ విజయానికి నిజమైన కొలమానం... పౌరుల

దైనందిన జీవితాలపై దాని ప్రభావం, సమ్మిళిత వృద్ధికి దాని సహకారమేనని ఆయన స్పష్టం చేశారు.

దశాబ్దాలుగా సాంకేతికత ఉద్యోగాలపై ప్రభావం చూపుతూనే ఉందనీ, ప్రస్తుతం మార్పు వేగం తీవ్రమైందని

శ్రీమతి స్మితా ప్రకాష్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిలో విజయవంతంగా ముందుకు సాగడానికి నిరంతర

నైపుణ్యాభివృద్ధి అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఏఐ-ఆధారిత ప్రభావానికి ప్రతిస్పందనగా మీడియా

ఫార్మాట్లు, ఆదాయ నమూనాలు, మేధో సంపత్తి వ్యూహాలను అభివృద్ధి చేయాల్సిన తీరును ఆమెప్రధానంగా ప్రస్తావించారు.

మానవులు నిర్వహించే, నియమాలను పాటించే పారిశ్రామిక యుగం నాటి ఉప-నైపుణ్యాల నుంచి

 

నిర్మాణాత్మక ఆలోచన, ఊహాశక్తి వంటి ఉన్నత స్థాయి స్థూల మానవ సామర్థ్యాల దిశగా పని స్వభావం

 

పరివర్తన చెందుతోందని శ్రీ వినీత్ నాయర్ పేర్కొన్నారు. ప్రపంచ ఏఐ సాంకేతికతల వినియోగదారుగా మాత్రమే మారకుండా ఉండడం కోసం భారత్ విద్య, ఆవిష్కరణలు, డేటా యాజమాన్యాల విషయంలో

 

పునరాలోచన చేయాలని ఆయన హెచ్చరించారు.

 

ఉద్యోగాలపై ఏఐ ప్రభావం అనిశ్చితితో ముడిపడి ఉన్నప్పటికీ, అనుసరణీయత మాత్రమే ఆచరణీయ

 

విధానమని శ్రీ సంజీవ్ భిక్‌చందాని సూచించారు. ఉపాధిని పెంపొందించడానికి నిపుణులు, ముఖ్యంగా

 

యువత ఏఐ సాధనాలను గురించి ముందుగానే నేర్చుకుని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని

 

ఆయన ప్రోత్సహించారు.

 

ప్రొఫెసర్ అనురాగ్ మైరాల్ ఆరోగ్య సంరక్షణ గురించి మాట్లాడుతూ... ముఖ్యంగా కమ్యూనిటీ ఆధారిత

 

ఆరోగ్య సంరక్షణ సేవలను విస్తరించడంలో, కొత్త ఉద్యోగాలను ప్రారంభించడంలో నికర ఉద్యోగ సృష్టికర్తగా

 

ఏఐ సామర్థ్యాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.

 

ఉత్పాదకత, ఆవిష్కరణలను గణనీయంగా పెంపొందించే సామర్థ్యంగా ఏఐని సతీష్ సీతారామయ్య

అభివర్ణించారు. ఏఐ అనుసరణ పురోగమిస్తున్న కొద్దీ సంస్థలు డిజిటల్‌గా మరింత నైపుణ్యం

సాధిస్తాయనీ, విభిన్నమైనవి అయినప్పటికీ అర్థవంతమైనవిగా ఉండే ఉద్యోగ బాధ్యతలను సృష్టిస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఏఐ ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నప్పటికీ... జాతీయ ప్రాధాన్యాలు, ప్రజా సంక్షేమానికి

అనుగుణంగా సమ్మిళిత, ఆవిష్కరణ-ఆధారిత, బాధ్యతాయుతమైన ఏఐ వ్యవస్థను నిర్మించే అవకాశాన్నీ ఇది భారత్‌కు అందిస్తోందని చర్చలు స్పష్టం చేశాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2229056) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी