రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
రెండు జాతీయ రహదారి ఆస్తుల కొనుగోలుపై నేషనల్ హైవేస్ ఇన్‌ఫ్రా ట్రస్ట్ ప్రతిపాదనకు ‘ఎన్‌హెచ్‌ఏఐ’ ఆమోదం
నాడు పోస్టు చేయడమైనది:
16 FEB 2026 5:25PM by PIB Hyderabad
మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 310.35 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న 2 జాతీయ రహదారి విభాగ ఆస్తుల నగదీకరణ దిశగా రూ.6,220.90 కోట్లతో ‘నేషనల్ హైవేస్ ఇన్‌ఫ్రా ట్రస్ట్’ (ఎన్‌హెచ్‌ఐటీ) ఇచ్చిన ప్రతిపాదనకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత ఆస్తులలో మహారాష్ట్రలోని ఎన్‌హెచ్-53 పరిధిలో 255.97 కిలోమీటర్ల పొడవైన అమరావతి-చిఖాలి-టార్సోడ్ విభాగం, ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌హెచ్-16లోని 54.38 కిలోమీటర్ల పొడవైన గుండుగొలను-చిన్న అవుటపల్లి విభాగం ఉన్నాయి.
ఈ సందర్భంగా ‘ఎన్‌హెచ్‌ఏఐ’ చైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ- “దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ను మరింత పటిష్ఠం చేసే దిశగా నగదు రూపేణా మూలధన సమీకరణలో ‘ఇన్‌విట్’ (InvIT) కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కొనుగోలుతో ‘ఎన్‌హెచ్‌ఐటీ’ ద్వారా నగదీకరణ చేసిన ఆస్తుల విలువ రూ.49,858 కోట్లు కాగలదు” అని వివరించారు.
‘ఎన్‌హెచ్‌ఏఐ’ ప్రాయోజిత ‘ఇన్విట్’గా ఉన్న ‘ఎన్‌హెచ్‌ఐటీ' ఇప్పటిదాకా సీపీపీఐబీ, ఓటీటీపీపీ, ఈపీఎఫ్‌ఓ, ఎన్‌హెచ్‌ఏఐ, ఎస్‌బీఐ గ్రూప్ వంటి విశిష్ట పెట్టుబడిదారుల ద్వారా 4 దశలలో మూలధనాన్ని సమీకరించింది. దీంతో 700 మందికి పైగా పెట్టుబడిదారులతో ‘ఎన్‌హెచ్‌ఐటీ’ యూనిట్ల ప్రస్తుత మార్కెట్ మూలధనీకరణ రూ.28,000 కోట్లుగా ఉంది. ఈ యూనిట్లు నేషనల్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్.. రెండింటిలోనూ నమోదయ్యాయి.
ఇప్పటికేగల ఆస్తుల విలువతోపాటు ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘ఎన్‌హెచ్‌ఏఐ’ చేస్తున్న కృషిలో ఆస్తుల నగదీకరణ ఒక వ్యూహాత్మక ఉపకరణంగా మారింది. టోల్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (టీఓటీ), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులు (ఇన్‌విట్) వంటి నమూనాల అనుసరణ ద్వారా నిధుల సమీకరణలో ‘ఎన్‌హెచ్‌ఏఐ’ విజయవంతమైంది. ఈ నిధులను కొత్త జాతీయ రహదారి ప్రాజెక్టులలో తిరిగి పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా జాతీయ రహదారుల ఆస్తుల ద్వారా ఆర్జించిన మొత్తం దాదాపు రూ.28,077 కోట్లుగా ఉంది.
ఈ విధానంతో ఆర్థిక స్థిరత్వానికి భరోసా లభించడమే కాకుండా ప్రైవేట్ రంగ సామర్థ్యం సహా అధునాతన సాంకేతికతలు కూడా సమకూరుతాయి. తద్వారా జాతీయ రహదారి ఆస్తుల నాణ్యత, మన్నిక ఇనుమడిస్తాయి.
***
(రిలీజ్ ఐడి: 2228937)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8