అంతరిక్ష విభాగం
పార్లమెంటు ప్రశ్నోత్తరాలు: ఉపగ్రహ ప్రయోగ సౌకర్యాల విస్తరణ
నాడు పోస్టు చేయడమైనది:
12 FEB 2026 4:10PM by PIB Hyderabad
జూన్ 2020లో అంతరిక్ష రంగ సంస్కరణల తర్వాత, అంతరిక్ష విభాగం పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ న్యూస్పేస్ ఇండియా సంస్థ (ఎన్ఎస్ఐఎల్) పలు కీలక చర్యలు చేపట్టింది. ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత వాటాను పెంచే లక్ష్యంతో, దేశంలోని ప్రైవేట్ పరిశ్రమలను, స్టార్టప్‌లను అంతరిక్ష రంగం మొత్తం విస్తృతిలో భాగస్వాములను చేస్తోంది.
ముఖ్యమైన కార్యకలాపాలు:
-
ఇస్రో సాంకేతిక సహకారంతో హెచ్ఏఎల్- ఎల్ అండ్ టీ కన్సార్టియం ద్వారా 5 పీఎస్ఎల్వీ - ఎక్స్ఎల్ రాకెట్లను నిర్మించే బాధ్యతను ఎన్ఎస్ఐఎల్ చేపట్టింది.
-
ఇస్రో సాంకేతిక పర్యవేక్షణలో సూక్ష్మ భూ పరిశీలన (మైక్రో-ఎర్త్ అబ్జర్వేషన్) ఉపగ్రహాలను నిర్మించడానికి ఎన్ఎస్ఐఎల్ పలు భారతీయ పరిశ్రమలను, స్టార్టప్‌లను భాగస్వాములను చేసింది.
-
బహుళ అవసరాల కోసం గ్రౌండ్ స్టేషన్లు/గేట్‌వేలను 'టర్న్-కీ' పద్ధతిలో ఏర్పాటు చేసేందుకు ఎన్ఎస్ఐఎల్ పలు భారతీయ పరిశ్రమలకు బాధ్యతలు అప్పగించింది.
-
ఇస్రో లేదా అంతరిక్ష విభాగం అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వేతర సంస్థలకు, ప్రైవేట్ పరిశ్రమలకు బదిలీ చేసేందుకు ఎన్ఎస్ఐఎల్ ఇప్పటివరకు ఇస్రో, ఇన్ - స్పేస్ ద్వారా 100 ఒప్పందాలు కుదుర్చుకుంది.ఈ ప్రక్రియ ద్వారా పరిశ్రమలు ఆ సాంకేతికతను అందిపుచ్చుకుని, వాణిజ్య ఉత్పత్తులను తయారు చేయడం లేదా సేవలను అందించడం ద్వారా స్వదేశీ, అంతర్జాతీయ మార్కెట్లలో రాణించగలుగుతాయి. భారతీయ పరిశ్రమలకు బదిలీ చేసిన రెండు ప్రధాన సాంకేతికతల్లో ఐఎంఎస్-1 శాటిలైట్ బస్, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) ఉన్నాయి.
-
మత్స్యకారుల పడవలను పర్యవేక్షించడం, నియంత్రించడం భద్రత కల్పించడం కోసం 'పాన్ ఇండియా వెసెల్ కమ్యూనికేషన్అండ్ సపోర్ట్ సిస్టమ్'ను ఏర్పాటు చేసేలా ఎన్ఎస్ఐఎల్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, ఇస్రో అభివృద్ధి చేసిన 'మొబైల్ శాటిలైట్ సర్వీస్' (ఎంఎస్ఎస్) సాంకేతికతను భారతీయ పరిశ్రమలు అందిపుచ్చుకునేలా చేసి, ఉత్పత్తిని వేగవంతం చేసింది. దీని ద్వారా లక్ష సముద్ర చేపల వేట నౌకల్లో ఎస్-బ్యాండ్ టెర్మినల్స్‌ను అమర్చడం సాధ్యమవుతుంది.
-
వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ఎన్ఎస్ఐఎల్ డిమాండ్ ఆధారిత పద్ధతిలో వాణిజ్య కమ్యూనికేషన్ శాటిలైట్ మిషన్లను కూడా చేపట్టింది. ఇప్పటివరకు, భారతీయ వినియోగదారుల డైరెక్ట్-టు-హోమ్ (డీటీహెచ్), బ్రాడ్‌బ్యాండ్ అవసరాల కోసం వరుసగా జీశాట్- ఎన్1, జీశాట్- ఎన్2 అనే రెండు వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఎన్ఎస్ఐఎల్ ప్రయోగించింది. ప్రస్తుతం జీశాట్- ఎన్3 ఉపగ్రహాన్ని సిద్ధం చేసే పనిలో ఉంది. ఈ మిషన్ల వల్ల పెద్ద సంఖ్యలో యూజర్ టెర్మినల్స్ అవసరం ఏర్పడుతుంది. వీటిని భారతీయ పరిశ్రమల ద్వారానే ఏర్పాటు చేస్తారు.
-
ఇస్రో లేదా తన రాకెట్ల (పీఎస్ఎల్వీ,ఎస్ఎస్ఎల్వీ, ఎల్వీఎం 3) ద్వారా అంతర్జాతీయ వినియోగదారులకు ప్రయోగ సేవలు అందించడానికి ఎన్ఎస్ఐఎల్ చేస్తున్న కృషి, ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత వాటాను మరింత పెంచుతుంది.
ఎన్ఎస్ఐఎల్ చేపట్టిన ఈ చర్యలు భారత అంతరిక్ష పరిశ్రమ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఉద్దేశించినవి. దీనివల్ల స్వదేశీ, అంతర్జాతీయ మార్కెట్లలో భారత పరిశ్రమలు కీలక పాత్ర పోషించడమే కాకుండా, భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ స్థిరమైన రీతిలో వృద్ధి చెందుతుంది.
ప్రపంచ ఉపగ్రహ ప్రయోగ మార్కెట్‌లో భారత వాటాను విస్తరించడానికి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్ స్పేస్) కూడా ఒక వ్యూహాన్ని రూపొందించింది. దీని ప్రకారం, 2033 నాటికి మొత్తం 44 బిలియన్ అమెరికన్ డాలర్ల భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో, కేవలం ప్రయోగాల విభాగం నుంచే 3.5 బిలియన్ అమెరికన్ డాలర్ల వాటాను సాధించాలని అంచనా వేస్తున్నారు.
సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానం ద్వారా ఈ వివరాలు వెల్లడించారు.
***
(రిలీజ్ ఐడి: 2227211)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11