శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎస్సీ/ఎస్టీల సాధికారత, సామాజిక-ఆర్థిక పురోగతి కోసమే శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ (ఎస్టీఐ) కేంద్రాలు


పార్లమెంటులో పునరుద్ఘాటించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్

ఎస్సీ/ఎస్టీ జనాభా ప్రాతిపదికన ఎస్టీఐ కేంద్రాల విస్తరణ

ఈ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌ నుంచి 4,000 మందికి పైగా ఎస్సీ/ఎస్టీ లబ్ధిదారులకు ప్రయోజనం

అమరావతిలోని క్వాంటం సెంటర్, వైజాగ్‌లోని ఓషన్ ఇన్‌స్టిట్యూట్ బ్లాక్ ఆంధ్రప్రదేశ్‌లో శాస్త్ర సాంకేతిక రంగాలకు గల ప్రోత్సాహానికి నిదర్శనం

నాడు పోస్టు చేయడమైనది: 11 FEB 2026 5:50PM by PIB Hyderabad

శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ (ఎస్టీఐ) కేంద్రాలు ప్రత్యేకించి షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) సాధికారత, సామర్థ్య నిర్మాణం, సామాజిక-ఆర్థిక పురోగతికి కోసమేనని కేంద్ర శాస్త్ర-సాంకేతికత, ఎర్త్ సైన్సెస్, ఎంవోఎస్ పీఎంవో, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్రసింగ్ ఈ రోజు పార్లమెంటులో పునరుద్ఘాటించారు. ముఖ్యంగా ఈ కమ్యూనిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ కార్యక్రమం మిషన్ మోడ్‌లో పనిచేస్తోందని, నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న చోట్లలో కేంద్రాల నెట్‌వర్క్‌ను విస్తరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనీ ఆయన పేర్కొన్నారు.

బడ్జెట్ సెషన్‌ ప్రశ్నోత్తరాల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం పార్లమెంటు సభ్యులు జీ.ఎం. హరీష్ బాలయోగి మాట్లాడుతూ కొన్ని ఎస్టీఐ కేంద్రాలకు విడుదల చేసిన నిధులను తక్కువగా వినియోగించిన సందర్భాలపై వివరణ కోరారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లోని ఆయా సంస్థల నిధుల వినియోగ స్థాయి సాపేక్షంగా తక్కువగా ఉండడంపై సమగ్ర సమీక్ష చేపట్టారా అని ఆయన ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ జితేంద్రసింగ్ మాట్లాడుతూ... ఎస్టీఐ కేంద్రాల నిర్వహణలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటి ఎనిమిది కేంద్రాలు ఉన్నాయనీ, ఇవి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పద్నాలుగు నుంచి పదిహేను విద్యా, శాస్త్రీయ సంస్థలకు మద్దతునిస్తున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల నుంచి దాదాపు సమాన సంఖ్యలో మహిళలు, పురుషులు సహా 4,000లకు పైగా లబ్ధిదారులు ఇప్పటికే ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందారని ఆయన పంచుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో శాస్త్ర-సాంకేతిక రంగ మౌలిక సదుపాయాలకు ఇస్తున్న విస్తృత ప్రాధాన్యాన్నీ కేంద్ర మంత్రి ప్రస్తావించారు. దేశంలో మొట్టమొదటి క్వాంటం సెంటర్‌కు ఇటీవల అమరావతిలో శంకుస్థాపన జరిగిందనీ, విశాఖపట్నంలో నేషనల్ ఓషన్ ఇన్‌స్టిట్యూట్ బ్లాక్‌నూ ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాలు రాష్ట్రంలో, ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాల్లో ఆయా రంగాల్లో పెరిగిన వృద్ధి వేగాన్ని ప్రతిబింబిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.

2019లో ప్రారంభించిన ఎస్టీఐ కేంద్రాల కార్యక్రమం... జనాభాలో కనీసం 70 శాతం ఎస్సీ, ఎస్టీ వర్గాలు గల ప్రాంతాల్లో ఆవిష్కరణల వ్యవస్థలను బలోపేతం చేయడానికి రూపొందించినట్లు డాక్టర్ జితేంద్రసింగ్ వివరించారు. అర్హత నిబంధనలకు అనుగుణంగా ఉండి, తగినంత సంస్థాగత సామర్థ్యాన్ని కలిగి ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఈ కేంద్రాలను నిర్వహించడానికి ఈ పథకం అనుమతిస్తుందన్నారు. కాలానుగుణంగా ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నామనీ, మార్చి-ఏప్రిల్‌లో ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ తదుపరి ప్రకటనను జారీ చేస్తామని ఆయన తెలిపారు.

శ్రీ భాస్కర్ మురళీధర్ భాగరే, శ్రీ సీ.ఎం. రమేష్ వంటి సభ్యులు అడిగిన అనుబంధ ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానమిస్తూ... నిర్దేశించిన పారామితులను చేరుకోవడానికి లోబడి, వ్యవసాయ ఆవిష్కరణలు, అటవీ ఆధారిత జీవనోపాధి, అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోగల సాంకేతికతలు, గ్రామీణ ప్రాంతాల నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బలమైన అవకాశాలు గల ఆకాంక్షాత్మక, గిరిజనుల జనాభా అధికంగా గల, వెనుకబడిన ప్రాంతాలు పరిశీలనకు అర్హత కలిగి ఉంటాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తదుపరి విస్తరణలో అదనపు కేంద్రాలను పరిగణించేలా పార్లమెంటు సభ్యులు తమ నియోజకవర్గాల నుంచి ఆచరణీయ ప్రతిపాదనలను సులభతరం చేయాలని, ప్రోత్సహించాలనీ ఆయన సూచించారు.

శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా సమ్మిళిత వృద్ధిని సాధించడానికి కట్టుబడి ఉన్న రాష్ట్రాలు, సంస్థల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ తెలిపారు.

 

***


(రిలీజ్ ఐడి: 2227058) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी