ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం ఏర్పాట్లు సదస్సు ద్వారా అర్థవంతమైన భాగస్వామ్యం కోసం దిశానిర్దేశం
నాడు పోస్టు చేయడమైనది:
11 FEB 2026 6:25PM by PIB Hyderabad
ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, పరిశ్రమల అధిపతులు, పరిశోధకులు, స్టార్టప్‌లు, విద్యార్థులు, పౌరులను ఏకం చేస్తూ . ఈ నెల 16-20 తేదీలలో న్యూఢిల్లీ లోని భారత్ మండపంలో 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్' నిర్వహించేందుకు భారత్ సిద్ధమైంది. కేవలం ఉన్నత స్థాయి చర్చలకే పరిమితం కాకుండా, ఆర్థిక వృద్ధికి, సామాజిక అభివృద్ధికి, ఏఐ సుస్థిర వినియోగానికి తోడ్పడే స్పష్టమైన ఫలితాలను అందించడంతో పాటు అందరికీ అందుబాటులో ఉండేలా, బాధ్యతాయుతమైన, ప్రభావవంతమైన ఏఐ భవిష్యత్తును రూపొందించడానికి ఈ సదస్సును ఒక కీలక ప్రపంచ వేదికగా భావిస్తున్నారు.
ప్రజలు, భూగోళం, ప్రగతి అనే మూడు ప్రధాన అంశాల ఆధారంగా ఈ సదస్సు జరుగుతుంది. ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సుస్థిరమైన, తక్కువ విద్యుత్ వినియోగించే ఏఐ పైన, అలాగే ఆర్థిక, సామాజిక అభివృద్ధి పైన చర్చలు సాగుతాయి. గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ ప్రతినిధుల ఉమ్మడి నేతృత్వంలోని ఏడు ప్రధాన అంశాల ఆధారిత (థీమాటిక్) అధ్యయన బృందాలు వాస్తవ ఫలితాల నివేదికలను సమర్పిస్తాయి. ఇందులో ఏఐ కామన్స్, నమ్మదగ్గ ఏఐ సాధనాలు, ఉమ్మడి కంప్యూట్ మౌలిక సదుపాయాలు, వివిధ రంగాలకు చెందిన ఏఐ వినియోగ విజయ గాథల వివరాలు ఉంటాయి.
వివిధ వృత్తులు, పరిశ్రమలపై ఏఐ ప్రభావం గురించి అవగాహన కల్పిస్తారు.మారుతున్న ఉద్యోగ మార్కెట్ లో అవసరమైన కొత్త నైపుణ్యాలు, పెట్టుబడిదారులు, భాగస్వాములతో స్టార్టప్‌లు అనుసంధానమయ్యే అవకాశాలు, రైతులకు, చిన్న వ్యాపారులకు, సేవా రంగాలకు ఏఐ అందించే సహకారం గురించి కూడా వివరిస్తారు.
ఐదు రోజుల పాటు 700 పైగా సెషన్లు నిర్వహించనున్నారు. వెబ్‌సైట్‌లోని ఎజెండాను పరిశీలించి, ఆసక్తి ఉన్న అంశాలను ఎంచుకుని, వాటిని క్యాలెండర్‌లో చేర్చుకోవడం ద్వారా ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సదస్సులో పాల్గొనే వారికి సూచించారు. ఏఐ భద్రత, నిర్వహణ, నైతికపరమైన వినియోగం, డేటా రక్షణతో పాటు వ్యూహాత్మక రంగాల కోసం స్వదేశీ ఫౌండేషన్ మోడల్స్ అభివృద్ధి సహా సార్వభౌమ ఏఐ పట్ల భారత్ నిబద్ధతపై ఈ సెషన్లలో చర్చిస్తారు.
సదస్సులో భాగంగా ఏఐ ప్రభావంపై ఏర్పాటు చేసే. ఎక్స్‌పో లో ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య, వాతావరణ చర్యలు, ఇంధన సామర్థ్యం, అందరికీ అందుబాటులో ఉండే సాంకేతికత వంటి రంగాలలో ఏఐ అన్వయాలను ప్రదర్శిస్తారు. నిజ జీవిత సమస్యలను ఏఐ ఎలా పరిష్కరిస్తుందో, సేవల నాణ్యతను ఎలా మెరుగుపరుస్తుందో పౌరులు అర్థం చేసుకోవడానికి ఈ ప్రదర్శనలు తోడ్పడతాయి.
విద్యార్థులు, నిపుణులలో ఏఐ పట్ల ప్రాథమిక అవగాహన పెంచడానికి రూపొందించిన "యువ ఏఐ ఫర్ ఆల్" వంటి ఉచిత, సులభంగా అందుబాటులో ఉండే జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ సదస్సు ప్రముఖంగా వివరిస్తుంది.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ను ఒక అభ్యాస, భాగస్వామ్య అవకాశంగా భావించాలని, ప్రశ్నలు సిద్ధం చేసుకోవడం, సెషన్లలో చురుగ్గా పాల్గొనడం ద్వారా ఉత్పాదకత, జీవనోపాధి, జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడానికి ఏఐని బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. ఏఐ ఆధారిత భవిష్యత్తును ఆత్మవిశ్వాసంతో, స్పష్టతతో ఎదుర్కోవడానికి అవసరమైన విజ్ఞానాన్ని, దిశానిర్దేశాన్ని పాల్గొనేవారికి అందించడమే ఈ సదస్సు లక్ష్యం.
సదస్సు లో పాల్గొనే వారు తమ పేర్లు నమోదు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ [www.impact.indiaai.gov.in] అందుబాటులో ఉంది. పాల్గొనదలచిన వారు ఈ ప్రక్రియను ముందే పూర్తి చేసుకోవాలని సూచించారు.
***
(రిలీజ్ ఐడి: 2226710)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5