లోక్‌సభ సచివాలయం
చట్టసభల్లో గౌరవం, మర్యాద తగ్గడంపై లోక్‌సభ స్పీకర్ ఆవేదన
చట్టసభల పర్యవేక్షణ నిర్మాణాత్మక విమర్శల ద్వారా అర్థవంతంగా ఉండాలని స్పీకర్ ఉద్ఘాటన
పటిష్టమైన ప్రజాస్వామ్యానికి సాధికారత కలిగిన శాసనసభ్యులే పునాది: స్పీకర్
రాజ్యాంగంపై అవగాహన, ప్రక్రియలపై పరిజ్ఞానం శాసనసభ్యుల విశ్వసనీయతను పెంచుతాయి: స్పీకర్
బీహార్ ప్రజాస్వామ్య సంప్రదాయం భారత పార్లమెంటరీ వ్యవస్థకు
మేధోపరమైన పునాదిని అందించింది: లోక్‌సభ స్పీకర్
బీహార్ శాసనసభ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా
బీహార్ శాసనసభ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన లోక్‌సభ స్పీకర్
బీహార్ శాసనసభలో నెవా డిజిటల్ హౌస్‌ను ప్రారంభించిన లోక్‌సభ స్పీకర్
నాడు పోస్టు చేయడమైనది:
07 FEB 2026 8:09PM by PIB Hyderabad
చట్టసభల్లో గౌరవం, హుందాతనం తగ్గడంపై లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు. శాసన సంస్థల పవిత్రతను కాపాడాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తూ, సభ గౌరవ మర్యాదలను కాపాడటం ప్రతి ప్రజాప్రతినిధి ప్రాథమిక బాధ్యత అని శ్రీ బిర్లా అన్నారు. ప్రజాస్వామ్యానికి చట్ట సభలు కీలకమని, వాటి గౌరవాన్ని ఎల్లప్పుడూ నిలబెట్టాలని, కాపాడాలని ఆయన అన్నారు. లెజిస్లేటివ్ కార్యకలాపాలలో అంతరాయాలు, క్రమశిక్షణారాహిత్యం చోటుచేసుకోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని ఆయన అన్నారు. చర్చలు, హేతుబద్ధమైన వాదనలు, నిర్మాణాత్మక భాగస్వామ్యంపై సభ్యులు ఎక్కువ దృష్టి పెట్టాలని ఆయన కోరారు. విమర్శలు విధానపరంగా, వాస్తవాల ఆధారంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. క్రమశిక్షణ, నిర్మాణాత్మక విమర్శల ద్వారా సాగే అర్థవంతమైన సభా నిర్వహణ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయని స్పీకర్ అభిప్రాయపడ్డారు. బీహార్ శాసనసభ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పాట్నాలో ఈరోజు జరిగిన "సాధికారత కలిగిన శాసనసభ్యులు, బలమైన ప్రజాస్వామ్యం" అనే కార్యక్రమంలో ప్రారంభ ప్రసంగం చేస్తూ శ్రీ బిర్లా ఈ వ్యాఖ్యలు చేశారు.
బలమైన ప్రజాస్వామ్యానికి పునాది చట్టసభ సభ్యులేనని, ప్రజాస్వామ్య వ్యవస్థల ప్రభావం కేవలం రాజ్యాంగ నియమాల మీద మాత్రమే కాకుండా, ఎన్నికైన ప్రతినిధులు తమ బాధ్యతలను ఎంత సమర్థవంతంగా, నిబద్ధతతో నిర్వహిస్తారనే అంశంపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ఒక శాసనసభ్యుని అసలైన శక్తి ప్రజల నమ్మకం, విశ్వాసం నుంచి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలను సభలో లేవనెత్తడం, వారి ఆందోళనలను వినిపించడం, చట్టసభల ద్వారా వాటి పరిష్కారానికి కృషి చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో సభ్యులు కీలక పాత్ర పోషిస్తారని ఆయన వివరించారు. శాసనసభ్యుల సాధికారత అనేది ప్రజల అవసరాలను అర్థం చేసుకోవడం, అర్ధవంతంగా సభా కార్యకలాపాల్లో పాల్గొనడం, విధాన రూపకల్పనలో నిర్మాణాత్మక పాత్ర పోషించడంపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సాధికారతకు నైతిక ప్రవర్తన, బాధ్యత, జవాబుదారీతనం పునాదులని ఆయన వివరించారు. శాసనసభ్యులు ఉన్నతమైన విలువలను పాటించినప్పుడే వారు నిరంతరం ప్రజా ప్రయోజనాల కోసం పని చేయగలరని ఆయన పేర్కొన్నారు. సభ్యులు సాధికారత కలిగి, పూర్తి అవగాహనతో ప్రజల సమస్యల పట్ల స్పందనను కలిగి ఉన్నప్పుడు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల నమ్మకం, గౌరవం మరింత పెరుగుతాయని ఆయన ఉద్ఘాటించారు.
రాజ్యాంగంపై అవగాహన, సభా నియమాలపై పట్టు ఉన్న సభ్యులు పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపరచగలరని ఆయన పేర్కొన్నారు. ఒక సమర్థవంతమైన ప్రజాప్రతినిధి ప్రజల ఆశలకు, ప్రభుత్వ విధానాలకు మధ్య ఒక ముఖ్యమైన వారధిలా పనిచేస్తారని ఆయన అన్నారు. శాసనసభ్యులకు సభా నియమాలపై అవగాహన ఉంటేనే వారు తమ అభిప్రాయాలను క్రమబద్ధంగా, తార్కికంగా వినిపించగలరని ఆయన పేర్కొన్నారు. అలాగే, ప్రజా ప్రతినిధి ప్రజల ఆకాంక్షలకు, ప్రభుత్వ విధానాలకు మధ్య ఒక కీలకమైన వారధిలా పనిచేయాలని ఆయన ఉద్ఘాటించారు. చర్చలు, కమిటీ పనుల్లో అవగాహనతో పాల్గొనడం ద్వారా శాసనసభ్యులు పాలనలో నాణ్యతను పెంచుతారని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల నమ్మకం అత్యంత విలువైన ఆస్తి అని, సభ లోపల, వెలుపల నిబద్ధతతో కూడిన ప్రవర్తన ద్వారా దానిని కాపాడుకోవాలని ఆయన ఉద్ఘాటించారు.
గ్రామీణ, మారుమూల ప్రాంతాల సమస్యలపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అన్నారు. అలాగే, మహిళలు, యువత ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు, చట్టాలు ఉండాలని సూచించారు. దేశాభివృద్ధిలో వీరు కీలక భాగస్వాములని, వీరి సమస్యలను చట్టసభల ద్వారా పరిష్కరించినప్పుడే సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
బీహార్ శాసనసభలో నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ (ఎన్ఈవీఏ) డిజిటల్ హౌస్‌ను ప్రారంభించడం పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన పేర్కొన్నారు. డిజిటలైజేషన్ వల్ల రికార్డులను సులభంగా పొందవచ్చని, పరిశోధనా సామర్థ్యం పెరుగుతుందని, కాగితంపై ఆధారపడటం తగ్గుతుందని ఆయన వివరించారు. శాసనసభ పనుల్లో డిజిటల్ పరికరాలను సమర్థవంతంగా ఉపయోగించాలని ఆయన సభ్యులకు సూచించారు. అన్ని శాసనసభల ఉమ్మడి కృషితో, ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ‘ఒకే దేశం, ఒకే శాసన వేదిక’ త్వరలోనే నిజం కాబోతోందని ఆయన పేర్కొన్నారు.
భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో బీహార్‌కు ఉన్న చారిత్రక ప్రాముఖ్యతను ఆయన గుర్తు చేశారు. ప్రాచీన బీహార్‌లో అమలులో ఉన్న ఉమ్మడి చర్చలు, బహిరంగ వాదనలు, భాగస్వామ్య పాలన వంటి సంప్రదాయాలు నేటికీ ఎంతో సందర్భోచితంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ గడ్డపై పరిఢవిల్లిన ప్రజాస్వామ్య విలువలే నేటి భారత పార్లమెంటరీ వ్యవస్థకు బలమైన సైద్ధాంతిక, నైతిక పునాదిని అందించాయని ఆయన అన్నారు. బీహార్ నిరంతరం రాజకీయ ఆలోచనలకు, నాయకత్వానికి కేంద్రంగా ఉందని ఆయన పేర్కొన్నారు. దేశ రాజకీయ చర్చలను, ప్రజాస్వామ్య సంస్థలను రూపొందించడంలో ఆ రాష్ట్ర నాయకులు కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తుచేశారు. ఈ గొప్ప వారసత్వాన్ని కాపాడటం, దానిని నేటి పాలనకు ఉపయోగపడేలా చేయడం ప్రజాప్రతినిధులందరి సమష్టి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్, బీహార్ శాసనమండలి చైర్మన్ శ్రీ అవధేష్ నారాయణ్ సింగ్, బీహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హా, బీహార్ ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ విజయ్ కుమార్ చౌదరి తదితరులు సభను ఉద్దేశించి ప్రసంగించారు. బీహార్ శాసనసభ స్పీకర్ డాక్టర్ ప్రేమ్ కుమార్ అతిథులకు స్వాగతం పలికారు. బీహార్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ నరేంద్ర నారాయణ్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 2225166)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9