అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

దేశంలో జాతీయ అంతరిక్ష మౌలిక సదుపాయాల బలోపేతం

నాడు పోస్టు చేయడమైనది: 04 FEB 2026 4:22PM by PIB Hyderabad

జాతీయ ప్రయోగ-అంతరిక్ష మౌలిక సదుపాయాల బలోపేతంపై 2025లో సాధించిన ప్రగతి:

·        స్వయంప్రతిపత్త డాకింగ్-అన్‌డాకింగ్‌ సహా ఉపగ్రహాల మధ్య విద్యుత్ బదిలీ ప్రక్రియలు ‘స్పేడెక్స్‌(SPADEX) మిషన్ ద్వారా విజయవంతమయ్యాయి. కక్ష్యలో సేవలందించే సామర్థ్యం, అంతరిక్ష కేంద్రాలపై డాకింగ్ కార్యకలాపాల దిశగా ఇదొక కీలక మలుపు. అంతేకాకుండా ‘స్పేడెక్స్‌’ ఉపగ్రహాలు విజయవంతంగా భూ పరిభ్రమణం చేయడాన్ని ఈ ప్రయోగం పరిపూర్ణం చేసింది. తద్వారా అంతరిక్షంలో డాకింగ్‌ సామర్థ్యాన్ని ప్రదర్శించిన నాలుగో దేశంగా భారత్‌ ఘనత సాధించింది.

·        పీఎస్‌ఎల్‌వీ-సి60, స్పేడెక్స్‌లో భాగమైన పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ (పీఓఈఎం-04) ఉపగ్రహం- ఇస్రో సహా అంతరిక్ష అంకుర సంస్థలు, విద్యాసంస్థలు రూపొందించిన బహుళ పేలోడ్‌లతో అంతరిక్షంలో ప్రవేశించి, కక్ష్యాంతర ప్రయోగాల ద్వారా ఆవిష్కరణలకు ఊతమిచ్చింది. ఈ మేరకు వెయ్యికి పైగా భూ ప్రదక్షిణలు పూర్తిచేసి, అత్యంత విజయవంతమైన ‘పీఓఈఎం’ మిషన్‌గా నిలిచింది. ఇందులో భాగంగా కక్ష్యలో ఒక రోబోటిక్ హస్తాన్ని, సూక్ష్మ గురుత్వాకర్షణలో విత్తనాలు మొలకెత్తడాన్ని కూడా చూపింది.

·        అలాగే 2025 జనవరిలో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15/ఎన్‌వీఎస్‌-02 మిషన్ శ్రీహరికోట నుంచి నిర్వహించిన 100వ ప్రయోగం కాగా, ఇది అద్భుత సామర్థ్యం ప్రదర్శిస్తూ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి అత్యంత కచ్చితత్వంతో ప్రవేశపెట్టింది.

·        ఇస్రో-నాసా సంయుక్తంగా నిర్వహించిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌16/’నిసార్‌’ ప్రయోగం మరో కొత్త రికార్డు సృష్టించింది. ఈ మేరకు భూ పరిశీలన రంగంలో అత్యంత భారీ పేలోడ్‌లలో ఒకటైన నాసా నిర్మిత 12 మీటర్ల వ్యాసంగల విప్పార్చుకునే యాంటెనాను భారతీయ ఉపగ్రహ వాహకంపై సంధానించి భారతీయ రాకెట్‌ ద్వారా ప్రయోగించడం ఇందులో విశేషం. తొఇ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ ‘ఎస్‌ఏఆర్‌’ ఉపగ్రహమైన ‘నిసార్‌’ నాసా సంస్థకు చెందిన ఎల్‌-బ్యాండ్ ‘ఎస్‌ఏఆర్‌’ పేలోడ్, ఇస్రో ఎస్‌-బ్యాండ్ ‘ఎస్‌ఏఆర్‌’ పేలోడ్‌తో కలిసి ఇప్పుడు పూర్తిస్థాయిలో పనిచేస్తోంది.

·        ఎల్‌వీఎం-ఎం5/సీఎంఎస్‌-03 మరో ప్రత్యేక కార్యక్రమం. దీనిద్వారా ఇస్రో భారత గడ్డపై నుంచి అత్యంత బరువైన ‘జీటీఓ’ ఉపగ్రహ ప్రయోగంతో మరో కీలక విజయం సాధించింది.

·        భారత గడ్డపై నుంచి ఇప్పటిదాకా ప్రయోగించిన వాటిలో అత్యంత బరువైన ఉపగ్రహంగా  ఎల్‌వీఎం-ఎం6/బ్లూబర్డ్ బ్లాక్-2 రికార్డు సృష్టించింది. ఇది ఎస్‌200 మోటార్ కోసం ఎలక్ట్రో-మెకానికల్ యాక్చుయేషన్‌ను, సి25 స్టేజ్ కోసం కాంపోజిట్ థ్రస్ట్ ఫ్రేమ్‌ను, 176 కిలోల దాకా పేలోడ్ పనితీరును మెరుగుపరిచే ఇతర మార్పుల సంబంధిత సామర్థ్యాన్ని చాటిచెప్పింది. ఘన ఇంధన మోటార్ల కోసం ‘ఈఎంఏ’ను ఉపయోగించే ఇతర లాంచర్లతో పోలిస్తే, ‘ఎస్‌200 ఈఎంఏ’ను నిస్సందేహంగా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అంతరిక్ష ఎలక్ట్రిక్ యాక్చుయేషన్ వ్యవస్థగా పేర్కొనవచ్చు.

·        భవిష్యత్తరం ప్రయోగ వాహనాలకు అవసరమైన కీలక ప్రయోగ మౌలిక సదుపాయాలలో భాగంగా శ్రీహరికోటలో మూడో ప్రయోగ వేదిక ఏర్పాటుపై ఈ విభాగం ప్రభుత్వం నుంచి ఆర్థిక పరమైన ఆమోదం పొందింది. మరోవైపు ‘స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్’ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) కోసం తమిళనాడులోని కులశేఖరపట్నంలో ప్రత్యేక ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండగా, ప్రయోగ వేదిక సౌకర్యాలు, సమీకృత భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

·        ఘన ఇంధన ఉత్పత్తి కోసం 10 టన్నుల సామర్థ్యం గల వర్టికల్‌ మిక్సర్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోనూ, ఘన మోటార్ల ఉత్పత్తి సామర్థ్యం పెంపు నిమిత్తం కేరళలోని అల్వాయేలోగల అమ్మోనియం పెర్క్లోరేట్ ప్లాంట్‌లో రెండో ప్రాసెస్ సదుపాయాన్ని ప్రారంభించారు. క్రయోజెనిక్ ఇంజిన్ సబ్‌-సిస్టమ్‌ల పరీక్ష, ఆమోదం దిశగా సామర్థ్యం పెంచడం కోసం ఒక క్రయోజెనిక్ టర్బోపంపు పరీక్ష కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. అలాగే, కర్ణాటకలోని తుమకూరులో అంతరిక్ష నౌకల ఇంధన ట్యాంకులు, పీఎస్‌ఎల్‌వీ ఎగువ దశ ట్యాంకుల తయారీకి ఉద్దేశించిన ప్రత్యేక సమ్మిళిత టైటానియం మిశ్రమ లోహ ట్యాంక్ ఉత్పత్తి కేంద్రాన్ని 2025లోనే  ప్రారంభించారు.

ఇస్ర్రో 300ఎంఎన్‌ థ్రస్ట్ రేటింగ్గల ‘హై థ్రస్ట్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ టు పవర్ స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టమ్’ రూపకల్పన, ఆమోద ప్రక్రియలను పూర్తి చేసిన నేపథ్యంలో దీన్ని  టెక్నాలజీ డెమోన్‌స్ట్రేషన్ శాటిలైట్‌లో ప్రదర్శించాలని భావిస్తున్నారు. ఇక ఇస్రో 2025 నవంబరులో ఎల్‌వీఎం3-ఎం5 మిషన్‌లో థ్రస్ట్ చాంబర్ ‘రీ-ఇగ్నిషన్‌’ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. భవిష్యత్‌ ఎల్‌వీఎం3 రాకెట్లలో క్రయోజెనిక్ దశ పునఃప్రారంభానికి ఇది మార్గం సుగమం చేస్తుంది కాబట్టి, ఇది మిషన్ సారళ్యానికి దోహదం చేస్తుంది. అంతేకాకుండా 2025 నవంబరులోనే ఇస్రో గ్రౌండ్ టెస్ట్ ద్వారా ఎలాంటి సహాయక స్టార్ట్-అప్ సిస్టమ్ లేకుండా గ్యాస్-జనరేటర్ సైకిల్ క్రయోజెనిక్ ఇంజిన్ బూట్-స్ట్రాప్ మోడ్ స్టార్టింగ్‌ను విజయవంతంగా నిర్వహించింది. మరోవైపు ఏ దశలోనైనా రికవరీకి వీలుగల రాకెట్ల ప్రయోగం ద్వారా  పునర్వినియోగ అంతరిక్ష రవాణా సాంకేతికతల అభివృద్ధికీ ఇస్రో కృషి చేస్తోంది. ఈ మేరకు వికాస్ ఇంజిన్ ‘థ్రాట్లింగ్‌’ సామర్థ్య నిర్ధారణకు గ్రౌండ్ టెస్టులు కూడా విజయవంతంగా పూర్తయ్యాయి.

చండీగఢ్‌లోని సెమీకండక్టర్ లాబొరేటరీతో సంయుక్తంగా 32-బిట్ స్వదేశీ ప్రాసెసర్ (విక్రమ్‌3201)కు ఇస్రో రూపకల్పన-తయారీని విజయవంతం చేసింది. ఇది అంతరిక్ష ప్రయోగార్హతగల తొలి దేశీయ 32-బిట్ ప్రాసెసర్. ఇంతకుముందు ఇస్రో తయారుచేసిన 16-బిట్ వెర్షన్, (విక్రమ్‌1601, ఇప్పటికే ఇస్రో ప్రయోగించే రాకెట్లలోని ఏవియానిక్స్ వ్యవస్థలలో భాగంగా ఉంది. ఇవే కాకుండా ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ‘కల్పన32’ పేరిట ‘స్పార్క్‌’ ఆర్కిటెక్చర్ ఆధారిత స్వదేశీ మైక్రోప్రాసెసర్‌ను తయారుచేశాయి. మైక్రోప్రాసెసర్ల రంగంలో దేశీయీకరణ దిశగా రూపొందే ప్రాసెసర్ల జాబితాలో ఆన్ బోర్డ్ కంట్రోలర్, పేలోడ్ కంట్రోలర్లు, డేటా అక్విజిషన్, బీమ్‌ఫార్మింగ్ యూనిట్ వంటివి కూడా ఉన్నాయి.

ఇస్రో తన స్పేస్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్స్ ప్రోగ్రామ్ ద్వారా విద్యారంగానికీ చేయూతనిస్తోంది. యువ ఆవిష్కర్తలకు తమ ఆలోచనలను భారత అంతరిక్ష కార్యక్రమానికి ఉపయోపడేవిగా రూపొందించేందుకు తోడ్పాటునిస్తూ వారిని ప్రోత్సహిస్తుంది.

ఇస్రో తన ‘ఎస్‌ఎస్‌ఎల్‌వీ’ సాంకేతిక పరిజ్ఞానాన్ని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్‌)కు బదిలీ చేసింది. అలాగే, లిథియం-అయాన్ బ్యాటరీ, ఇంటిగ్రేటెడ్ మాడ్యులర్ ఏవియానిక్స్ బస్, డిస్ట్రెస్ అలర్ట్ సిస్టమ్, వివిధ సెన్సర్ల వంటి సాంకేతికతలను ప్రైవేట్ పరిశ్రమలకు బదిలీ చేసింది. తద్వారా దేశ అంతరిక్ష వ్యవస్థలో మరింత ఉత్పాదకత, వృద్ధి సాధనను సుగమం చేస్తుంది.

పారిశ్రామిక రంగం ద్వారా ‘ఎస్‌ఎస్‌ఎల్‌వీ’ సాకారం దిశగా ఇస్రో కృషిలో అనేక దేశీయ పరిశ్రమలు భాగం పంచుకుంటున్నాయి. ఇందులో భాగంగా అనేక పరిశ్రమలు/అంకుర సంస్థలు సూక్ష్మ-భూ పరిశీలన ఉపగ్రహాలు, సంబంధిత గ్రౌండ్ సెగ్మెంట్ మౌలిక సదుపాయాల కల్పనలో సంయుక్తంగా పనిచేస్తున్నాయి. మత్స్యకారుల పడవలలో అమర్చే సుమారు 1 లక్ష 2-వే ఎంఎస్ఎస్‌ టెర్మినళ్లను 3 పరిశ్రమలు తయారు చేస్తున్నాయి. అలాగే, దేశంలో అంతరిక్ష వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో ఇస్రోలో రూపొందించిన సాంకేతికతలను ప్రైవేట్ పరిశ్రమలు, అంకుర సంస్థలకు బదిలీ చేస్తోంది. ఈ మేరకు ఇస్రో, ఇన్‌స్పేస్‌ ద్వారా మెస్సర్స్ న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఇప్పటిదాకా 100 సాంకేతిక బదిలీ ఒప్పందాలపై సంతకం చేసింది.

అంతరిక్ష పరిశోధన, అంతరిక్ష రంగంలో ముందంజ వేయదలచిన దేశాలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ రంగంలో సహకారాన్ని కొనసాగిస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ఇటీవలి అంశాలు ఇలా ఉన్నాయి:

·        అంతర్జాతీయ భాగస్వాములతో 10 సహకార పత్రాలపై 2025లో ఇస్రో సంతకం చేసింది: ఈ మేరకు... దక్షిణాఫ్రికాలో ‘నావిక్‌’ రిఫరెన్స్ స్టేషన్ ఏర్పాటు; అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారతీయ వ్యోమగామి యాత్ర; యూరోపియన్ అంతరిక్ష సంస్థతో మానవ అంతరిక్ష ప్రయోగ సహకారం కొనసాగింపు; ఆస్ట్రేలియాలో తాత్కాలిక గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు; మారిషస్‌లో గ్రౌండ్ స్టేషన్ నిరంతర కార్యకలాపాలు; జపాన్‌తో ఉమ్మడి చంద్ర మిషన్ దిశగా కృషి; రాబోయే వీనస్ ఆర్బిటర్ మిషన్‌లో స్వీడిష్ పరికరం అమర్చడం; సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్, రిపబ్లిక్ ఆఫ్ కొరియాల కొత్త అంతరిక్ష సంస్థలతో తాజా సహకార ఒప్పందాలు కుదుర్చుకోవడం.

·        ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించిన ‘నిసార్‌’ ఉపగ్రహాన్ని 2025 జూలైలో ఇస్రో రాకెట్‌ ద్వారా ప్రయోగించారు.

·        ఇటాలియన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెట్రోలాజికల్ రీసెర్చిలో ‘నావిక్‌’ టైమింగ్ రిసీవర్‌ను ఇస్రో ఏర్పాటు చేసింది.

·        ‘యూఎన్‌సీఓపీయూఓఎస్‌’ శాస్త్రీయ, సాంకేతిక ఉప కమిటీ కింద రెండు కార్యాచరణ బృందాల్లో భారత అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

అంతర్జాతీయ విపత్తు నిర్వహణ కార్యక్రమాలైన ‘ఇంటర్నేషనల్ చార్టర్ స్పేస్ అండ్ మేజర్ డిజాస్టర్స్’, ‘సెంటినెల్ ఆసియా’ వంటి వాటిలో ఇస్రో చురుగ్గా పాలు పంచుకోవడం వల్ల గడచిన మూడేళ్లలో భారత్‌ 2,260కిపైగా ఉపగ్రహ సమాచార సరంజామాను పొందగలిగింది. ఈ మూడేళ్ల వ్యవధిలో దేశాన్ని ప్రభావితం చేసిన ప్రధాన విపత్తుల నిర్వహణ దిశగా ఇన్‌పుట్‌లను రూపొందించింది.

ప్రపంచ విపత్తు నిర్వహణ కార్యక్రమాల కోసం ఇస్రో 725కుపైగా ‘ఐఆర్‌ఎస్‌’ ఉపగ్రహ సమాచార  సరంజామాను సరపరా చేసింది. ప్రపంచవ్యాప్త మానవతాంశాలపై ప్రతిస్పందనలో భారత్‌ నిబద్ధతను ఇది బలోపేతం చేసింది.

అంతర్జాతీయ చార్టర్ స్పేస్, మేజర్ డిజాస్టర్స్ సంబంధిత ప్రధాన పాత్రను ఇస్రో 2025లో 6 నెలలపాటు విజయవంతంగా నిర్వహించింది. ఈ మేరకు సమాచార విస్తరణ వేగం పెంచే చార్టర్ సంబంధిత 39 క్రియాశీల అంశాలను సమన్వయం చేసింది. అలాగే, నాలుగు కొత్త అధీకృత వినియోగదారు సంస్థలను దీనికి పరిధిలోకి తెచ్చింది. వర్ధమాన దేశాలకు అంతరిక్ష ఆధారిత సేవల  విస్తృతికి కృషి చేసింది. చార్టర్ కార్యక్రమాలు సజావుగా సాగేలా సమర్థంగా సమన్వయం చేసింది. దీంతో ‘జీహెచ్‌జీసీశాట్‌’ (గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాన్ని కొలిచే ఉపగ్రహం)ను కొత్త డేటా వనరుగా సిద్ధః చేసింది. మొత్తంమీద చార్టర్ పోర్టల్ పనితీరును గణనీయంగా మెరుగుపరిచింది.

‘సెంటినెల్ ఆసియా స్టీరింగ్ కమిటీ’కి ఇస్రో సహాధ్యక్షత సందర్భంగా- ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో విపత్తు నిర్వహణ కోసం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై వ్యూహాత్మక మార్గనిర్దేశం చేసింది. ఇక 2026లో (i) గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌పై అంతర్జాతీయ కమిటీ (ఐసీజీ)ని, (ii) బ్రిక్స్ అంతరిక్ష సంస్థల అధిపతుల సమావేశం (iii) అంతర్జాతీయ గ్రహ డేటా కూటమి వార్షిక సమావేశాలను ఇస్రో నిర్వహిస్తుంది.

కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూ విజ్ఞాన శాఖల (స్వతంత్ర బాధ్యత) సహా ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది-ప్రజా సమస్యలు-పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2223818) సందర్శకుల సూచీ సంఖ్య : : 18
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी