భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం
azadi ka amrit mahotsav

అధికారిక సాంకేతిక బృందం (ఈటీజీ)కి చెందిన సాంకేతిక సలహా బృందం (టీఏజీ) సమావేశం... దేశంలో రోబోటిక్స్ రంగ వ్యూహాత్మక ప్రణాళికపై చర్చ

నాడు పోస్టు చేయడమైనది: 03 FEB 2026 9:30PM by PIB Hyderabad

అధికారిక సాంకేతిక బృందం (ఈటీజీ) ద్వారా ఏర్పాటైన సాంకేతిక సలహా బృందం (టీఏజీ).. భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ అధ్యక్షతన 2026 ఫిబ్రవరి 3న తన మూడో సమావేశాన్ని నిర్వహించింది. దేశంలో రోబోటిక్స్ రంగానికి సంబంధించి మౌలిక వసతులు, సాధించిన విజయాలు, ఎదురవుతున్న సవాళ్లు, వ్యూహాత్మక ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించారు.

దేశంలోని రోబోటిక్స్ రంగ ప్రస్తుత స్థితిగతులను చర్చించడంతోపాటు దేశీయంగా ఉన్న రోబోటిక్స్ మౌలిక వసతులపై విశ్లేషించడం కోసం.. టీఏజీ సభ్యులు, ఈటీజీ సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రముఖ విద్యావేత్తలతోపాటు సంబంధిత కంపెనీలు, అంకుర సంస్థలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి.

ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయంలో సైంటిస్ట్ ‘జి’/సలహాదారు డాక్టర్ ప్రీతి బన్సల్ స్వాగతోపన్యాసం చేశారు. 2025 ఫిబ్రవరిలో అధునాతన తయారీ రంగంపై నిర్వహించిన రెండో టీఏజీ సమావేశాన్ని ఆమె ప్రస్తావించారు. మూడో టీఏజీ సమావేశపు ప్రధాన ఎజెండా అయిన అధునాతన రోబోటిక్ సాంకేతికతలపై దృష్టి కేంద్రీకరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.

ప్రొఫెసర్ సూద్ తన కీలకోపన్యాసంలో.. స్వదేశీ పరిజ్ఞానంతో రోబోటిక్స్ రంగంలో భారత్‌ను ఆత్మనిర్భరగా నిలపాలన్న దార్శనికతను వివరించారు. రోబోటిక్స్ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను ప్రస్తావిస్తూ.. మానవ శ్రమను భర్తీ చేయడం కన్నా, మానవ సామర్థ్యాన్ని పెంపొందించడంపై వ్యూహాత్మకంగా దృష్టి సారించాలని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, రంగాల వారీగా ప్రాధాన్యాలను వివరించారు. ఆరోగ్య రక్షణ రంగంలో కొలాబరేటివ్ రోబోట్స్, ఫిజికల్ ఏఐ, రక్షణ - అంతర్గత భద్రత కోసం మానవ రహిత, ద్వంద్వ వినియోగ ప్లాట్ ఫాంల వంటి అంశాల ఆవశ్యకతను వివరించారు.

వివిధ మంత్రిత్వ శాఖలు, భాగస్వాములతో సమగ్ర సంప్రదింపుల ద్వారా రూపొందించిన జాతీయ రోబోటిక్స్ వ్యూహరచన ముసాయిదాను కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్ వివరించారు. ఇండియా ఏఐ మిషన్, ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఎలక్ట్రానిక్ విడిభాగాల మౌలిక వసతుల వంటి ప్రస్తుత వ్యవస్థలు.. భవిష్యత్తులో చేపట్టబోయే ప్రత్యేక రోబోటిక్స్ మిషన్‌కు మూల స్తంభాలుగా నిలుస్తాయని, వీటిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని ఆయన వివరించారు. సాఫ్ట్‌వేర్ పరంగా అత్యున్నత స్వీయ నిర్ణయాధికారం సాధించడం వ్యూహాత్మక ఆవశ్యకత అని డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ కామత్ అన్నారు. ముఖ్యంగా కీలకమైన డిజైన్, సిమ్యులేషన్ పరికరాల రూపకల్పన దేశీయంగా జరగాలన్నారు. డీబీటీ మాజీ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ డిమాండ్ ఆధారిత విధానం గురించి మాట్లాడారు. రోబోటిక్ ఉత్పత్తుల తయారీకి ముందే, రంగాల వారీగా వాటి అవసరాలకు తగిన ప్రాధాన్యతా విశ్లేషణ జరగాలని సూచించారు. అప్పుడే అవి ఆయా రంగాల అవసరాలకు అనుగుణంగా ఉంటాయన్నారు. ఎన్ఎస్సీఎస్ సైనిక సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి (విశ్రాంత) మాట్లాడుతూ.. దేశ రక్షణ వ్యవస్థలో రోబోటిక్స్‌ను అనుసంధానించడమన్నది ఇకపై ఎంతమాత్రమూ ఐచ్ఛికం కాదని, ఆధునిక యుద్ధతంత్రంలో అదొక ఒక వ్యూహాత్మక ఆవశ్యకత అని స్పష్టం చేశారు.

ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయ సీటీవో శ్రీ రోహిత్ గుప్త ప్రసంగిస్తూ.. జాతీయ, అంతర్జాతీయ రోబోటిక్స్ ముఖచిత్రాన్ని క్లుప్తంగా వివరించారు. తద్వారా అనంతర చర్చలకు అవసరమైన ప్రాథమిక భూమికను సిద్ధం చేశారు.

రోబోటిక్స్ రంగానికి సంబంధించిన కీలక అంశాలను వివరిస్తూ, ప్రముఖ నిపుణులు ఈ సమావేశంలో వివరణాత్మక ప్రజెంటేషన్లను అందించారు:

  • ఆర్ట్‌పార్క్ (ఐఐఎస్సీ- బెంగళూరు) సీఈఓ శ్రీ రఘు ధర్మరాజు మాట్లాడుతూ.. కృత్రిమ మేధ, రోబోటిక్స్ సాంకేతికతలను ప్రయోగశాల పరిశోధనల స్థాయి నుంచి మార్కెట్ అవసరాలకు తగిన మార్గాలుగా మార్చే దిశగా ఆర్ట్‌పార్క్ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.
  • నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్‌డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ మద్దతుతో నడుస్తున్న ఐ-హబ్ ఫౌండేషన్ ఫర్ కోబోటిక్స్ లక్ష్యాలను ఐఐటీ ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ సుబీర్ కుమార్ సాహా, శ్రీ అశుతోష్ దత్ శర్మ వివరించారు. పరిశోధన - అభివృద్ధివ్యవస్థాపకత, నైపుణ్యాభివృద్ధి ద్వారా విద్యాసంస్థల పరిశోధనలకూ, పారిశ్రామిక అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు.
  • స్పర్శ జ్ఞానం, హాప్టిక్స్ అంశాలపై ఐఐటీ- మద్రాస్ ప్రొఫెసర్ ఎం. మణివన్నన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. భౌతిక రూపం కలిగిన కృత్రిమ మేధకు ఇవి పునాది వంటివని ఆయన పేర్కొన్నారు. దేశీయ పరిశోధన – అభివృద్ధి సామర్థ్యాలను చాటాల్సిన, అలాగే నేషనల్ టాక్టైల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమం ఆవశ్యకత ఉందని ఆయన స్పష్టం చేశారు.
  • జనరల్ అటానమీ సహ వ్యవస్థాపకుడు శ్రీ ఫరీద్ అహసాన్ మాట్లాడుతూ.. దేశీయంగా తయారుచేసిన మానవ రూప, నాలుగు కాళ్ల రోబోలను ఉపయోగించి ‘భౌతిక రూపం కలిగిన ఏఐ’ ఆధారిత ఆటోమేషన్‌పై చర్చించారు. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐపథకండేటా ప్లాట్‌ఫాంలు, రోబోల వినియోగంపై దృష్టి సారించే గ్రాండ్ ఛాలెంజ్ వంటి జాతీయ ప్రోత్సాహకాలు ఆవశ్యకమని స్పష్టం చేశారు.
  • వేర్‌హౌస్, రిటైల్ ఆటోమేషన్‌లో భౌతిక ఏఐని భారీ స్థాయిలో ఎలా వినియోగించవచ్చో గ్రే ఆరెంజ్ సీఈవో శ్రీ ఆకాష్ గుప్త వివరించారు. దేశీయంగా కీలక విడిభాగాల రూపకల్పననైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి, దేశీయంగా ప్రమాణాలను మెరుగుపరచాల్సిన ప్రాధాన్యం, భౌతిక రూప ఏఐ కోసం డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలతోపాటు.. ప్రభుత్వాల మధ్య (జీ2జీధ్రువీకరణల ఆవశ్యకతను ఆయన వివరించారు.

అలాగే, చర్చలు, భాగస్వాముల అభిప్రాయాల ఆధారంగా వెలువడిన ప్రధాన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:

  • దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికిదిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, అలాగే నాణ్యతవ్యయంసాంకేతిక సామర్థ్యాల మధ్య సమతౌల్యాన్ని పాటిస్తూ క్రమబద్ధ ప్రభుత్వ సేకరణను ప్రోత్సహించడానికి.. ఒక పటిష్టమైన విధానం, ప్రోత్సాహక వ్యవస్థ అత్యావశ్యకం.
  • హార్డ్‌వేర్, విడిభాగాల వ్యవస్థలో.. ముఖ్యంగా యాక్చుయేటర్లుసెన్సార్లుట్రాన్స్‌డ్యూసర్లుచిప్‌సెట్‌లుప్రిసిషన్ గేర్లు, డిజైన్ - సిమ్యులేషన్ పరికరాల తయారీలో భారీ అంతరాలు ఉన్నాయని గుర్తించారు. ఇది వ్యూహాత్మక బలహీనతగా మారే అవకాశం ఉందన్న విషయమై చర్చించారు.
  • పరీక్షా కేంద్రాలుధ్రువీకరణ, ప్రామాణీకరణ వ్యవస్థల బలోపేతంతోపాటు.. అత్యంత కీలకమైన విడిభాగాలను దశలవారీగా దేశీయీకరించే విధానాన్ని అవలంబించడం ఆవశ్యకం.
  • జాతీయ స్థాయిలో ఉమ్మడి డేటా, ఒక కేంద్రీకృత అనుసంధాన మౌలిక వసతుల వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఇది రక్షణవైద్యం, వ్యవసాయ రంగాల్లో రోబోటిక్స్ వినియోగాన్ని పెంచడానికి, నాణ్యమైన, వివిధ అంశాల వారీగా డేటాను అందుబాటులోకి తీసుకురావడానికి, అలాగే దేశీయంగా సాఫ్ట్‌వేర్ టూల్స్ రూపకల్పన సహా సరఫరా వ్యవస్థలో సవాళ్లను అధిగమించడానికి తోడ్పడుతుంది. ఆవిష్కరణలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి, నైపుణ్యాభివృద్ధిని వేగవంతం చేయడానికి ఈ మౌలిక సదుపాయాలు కీలకం.
  • హాప్టిక్స్ (స్పర్శ జ్ఞాన సంబంధ సాంకేతికత)కు ప్రాధాన్యమివ్వడం, అవసరాల ఆధారంగా వినియోగదారులను గుర్తించడం, అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములను సమీకృతం చేయడం వంటి అంశాలను ప్రతిపాదించారు. ఉత్పత్తి అభివృద్ధి, దాని వినియోగాన్ని క్రమ పద్ధతిలో నడిపించేందుకు.. వినియోగదారులే నిర్ణయించే కీలక పనితీరు సూచికలు అవసరమని పేర్కొన్నారు.
  • ఐడెక్స్ మోడల్ వంటి గ్రాండ్ ఛాలెంజిలను ప్రోత్సహించడం, రోబోటిక్స్ కోసం ప్రత్యేక నిధుల మార్గాలను రూపొందించేందుకు ఆర్డీఐ వంటి పథకాలను ఉపయోగించుకోవడం.. అలాగే వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ కొనుగోళ్ల కోసం అవసరమైన యంత్రాంగాలను ఏర్పాటు చేయడం.
  • మెకానిక్స్మెటీరియల్స్ సైన్స్హాప్టిక్స్కమ్యూనికేషన్ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటి బహుముఖ రంగాలలో నిర్దిష్ట లక్ష్యాలతో పరిశోధనలను ముమ్మరం చేయాల్సిన అవసరముంది. విద్యాసంస్థలుపరిశ్రమలు, ప్రభుత్వం మధ్య సమన్వయ లోపాన్ని అధిగమించడానికి.. ‘ఉత్పత్తి రూపకల్పన, భాగస్వామ్యం’ నమూనాను అనుసరించాలి. దీనితోపాటు ఎంఎస్ఎంఈ క్లస్టర్‌ల ఏర్పాటుమౌలిక వసతుల కల్పన, పరిశోధనలను వాస్తవ వినియోగంలోకి తీసుకురావడానికి అవసరమైన క్షేత్రస్థాయి, క్లినికల్ ధ్రువీకరణలను బలోపేతం చేయాలి.
  • దేశీయంగా తలెత్తే భద్రతాపరమైన ముప్పులను పరిష్కరించడానికి, ఎగుమతులకు ఆటంకంగా మారిన సుంకాలు కాని అవరోధాలను తొలగించడానికి ఒక ఏకీకృత నియంత్రణ వ్యవస్థ అవసరాన్ని గుర్తించారు. భారతీయ రోబోలు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు (ఐఎస్ఓ/సీఈ) అనుగుణంగా ఉండేలా చూసేందుకు గుర్తింపు పొందిన పరీక్ష ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలని, తద్వారా అమెరికా వంటి దేశాలకు ఎగుమతులను సులభతరం చేయాలని సిఫార్సు చేశారు.

ఈ చర్చల ఫలితాలను విశ్లేషిస్తూ.. రోబోటిక్స్ రంగం పాతకాలపు ఆటోమేషన్ స్థాయి నుంచి ఎంబడీడ్ ఇంటెలిజెన్స్ప్రకృతి ప్రేరిత వ్యవస్థలు, అస్తవ్యస్తమైన వాస్తవ పరిస్థితుల్లోనూ పనిచేయగల అడాప్టివ్ మిషన్ల దిశగా విప్లవాత్మక మార్పును సంతరించుకుందని డాక్టర్ పర్విందర్ మైనీ పేర్కొన్నారు. అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల కోసం నిర్దిష్ట లక్ష్యాలతో కూడిన గ్రాంట్ల అమలు, నిబంధనలను కఠినతరం చేయడం, ఏకీకృత ప్రమాణాలు - ధ్రువీకరణ వ్యవస్థలను అభివృద్ధి చేయడం అత్యంత ప్రధానమైనదని డాక్టర్ మైనీ స్పష్టం చేశారు. చివరగా, రోబోటిక్స్ ప్రధాన సాంకేతిక వ్యవస్థను దేశీయీకరించడమే లక్ష్యంగా.. జాతీయ రోబోటిక్స్ ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. మిషన్ మోడ్ లేదా కన్సార్టియం ఆధారిత పద్ధతిలో ముందుకు సాగాలనే విషయంలో విస్తృతమైన అంగీకారం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ కార్యక్రమాలతో దీనిని ఎలా సమన్వయం చేయాలో ఇంకా వివరంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రొఫెసర్ సూద్ ముగింపు ఉపన్యాసం చేశారు. భారతదేశ దీర్ఘకాలిక పారిశ్రామిక వృద్ధికీ, శక్తిమంతమైన ఉత్పత్తుల దేశంగా ఎదగాలన్న మన ఆశయానికీ... రోబోటిక్స్ రంగంలో ఒక నిర్మాణాత్మక, వ్యూహాత్మక విధానం కీలక చోదక శక్తిగా నిలుస్తుందని స్పష్టం చేశారు. రోబోటిక్స్ అనేది జాతీయ మిషన్ల సామర్థ్యాన్ని అనేక రెట్లు పెంచే శక్తి అని ఆయన వ్యాఖ్యానించారు. అది దేశ పారిశ్రామిక, రక్షణ రంగాల వృద్ధికి ప్రధాన చోదక శక్తి అని, అత్యధిక విలువ గల తయారీ రంగానికి ఇది వెన్నెముకగా నిలుస్తుందని స్పష్టం చేశారు. చివరగా, ఫిజికల్ ఏఐ/ రోబోటిక్స్ రంగంలో వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించడానికి తోడ్పడేలా.. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా తమ నిర్దిష్ట సిఫార్సులను తెలియజేయాలని ఆయన కోరారు.  

 

***


(రిలీజ్ ఐడి: 2223133) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Kannada