జౌళి మంత్రిత్వ శాఖ
పర్యావరణహిత వస్త్రాలు, సహజ రంగులు
నాడు పోస్టు చేయడమైనది:
03 FEB 2026 1:40PM by PIB Hyderabad
పర్యావరణహిత, జీవ ఆధారిత వస్త్రాలకు ప్రపంచ దేశాల్లో డిమాండు అంతకంతకూ పెరుగుతోంది. వీటికి ఎగుమతి అవకాశాలూ ఎక్కువే. సేంద్రియ, నవతరపు, పర్యావరణ హితమైన పోగులు (ఇకో-ఫ్రెండ్లీ ఫైబర్స్), వస్త్రాల ఉత్పత్తితో పాటు వాటి ఎగుమతికి కూడా సాయపడేందుకు, ఆయా ఉత్పాదనల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యల్ని చేపడుతోంది:
భారత్‌లో ‘తాజా పోకడల దుస్తుల సరఫరా వ్యవస్థలో ప్రమాదకర రసాయనాల తొలగింపు కార్యక్రమం’ పేరిట ఒక పైలట్ ప్రాజెక్టును జౌళి మంత్రిత్వ శాఖ ఎనిమిది క్లస్టర్లతో పాటు నాలుగు ఫ్యాషన్ హౌసుల్లో కూడా అమలు చేస్తోంది. ఈ ప్రయోగాత్మక పథకం నవ తరం, పర్యావరణ హిత, సేంద్రియ పోగుల ఉత్పాదనకీ, ప్రాసెసింగుకీ మార్గాన్ని సుగమం చేయడంతో పాటు వినియోగదారులలో చైతన్యాన్ని కూడా పెంచుతూ, మన్నికైన వస్త్రాలకు గిరాకీనీ కల్పిస్తోంది.
ఒక ఎన్విరాన్‌మెంటల్, సోషల్, గవర్నెన్స్ సంబంధిత ‘ఈఎస్‌జీ టాస్క్ ఫోర్సు’ను కూడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఇది సుస్థిర ఉత్పత్తి, ధ్రువీకరణ, ఎగుమతుల వంటి అంశాలపై చర్చోపచర్చలకు ఓ వేదికగా ఉంటుంది. పరిశ్రమ ప్రధాన కార్యక్రమాలెన్నింటికో ఈ టాస్క్ ఫోర్స్ మార్గాన్ని సుగమం చేసింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా దేశీయ ఉత్పత్తిపైనా, నాణ్యత ధ్రువీకరణపైనా, ఇతరత్రా విషయాలపైనా శ్రద్ధ తీసుకుంటారు. ఇందుకోసం సర్క్యులర్ సంవాద్, క్లస్టర్ ఎక్స్‌చేంజ్ మెకానిజమ్ వంటి వేదికల సహాయాన్ని తీసుకుంటున్నారు.
వ్యవసాయ పరిశోధన విషయాల భారతీయ మండలి (ఐసీఏఆర్-సీఐసీఆర్), ఉత్తర భారత వస్త్ర పరిశోధన సంఘం (ఎన్ఐటీఆర్ఏ) వంటి పలు సంస్థల ద్వారా అనేక సహకారపూర్వక కార్యక్రమాల్ని కూడా ప్రభుత్వం చేపట్టింది. వీటిలో.. సేంద్రియ ఉత్పత్తి పద్ధతుల్ని అభివృద్ధి చేయడం, బయో-ఫైబర్స్ సహా నాణ్యమైన ముడి పదార్థాల సరఫరాను పెంపొందించడం, వాణిజ్య సరళి సాగును దృష్టిలో పెట్టుకొని సహజ రంగులతో కూడిన పత్తి విత్తన రకాల్ని విడుదల చేయడంతో పాటు సేంద్రియ సహజ రంగుల కాటన్ ఉత్పత్తిని మరింతగా పెంచడం వంటి కార్యక్రమాలు భాగంగా ఉన్నాయి.
వస్త్ర రంగం కోసం సహజ రంగుల, అద్దకం రంగుల ఉత్పత్తినీ, ఉపయోగాన్నీ ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాల్ని అమలుచేస్తోంది:
సహజ రంగులు లేదా వెజిటబుల్ డైస్ ఉపయోగాన్ని ప్రోత్సహించడానికీ, అద్దకం సంస్థల్ని ఏర్పాటు చేయడానికీ ‘జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం’లో భాగంగా ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ కార్యక్రమంలో.. ‘మెగా క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం’, ‘అవసరాల ఆధారంగా చేపట్టే ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు’ అని రెండు విభాగాలు ఉన్నాయి.
సహజ రంగులకు సంబంధించిన 3 పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులకు పరిశోధన, అభివృద్ధి పథకంలో భాగంగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
పర్యావరణానికి ఎంతమాత్రం హాని చేయని, లోటుపాట్లు ఉండని చేనేత మగ్గాలపై తయారు చేసిన అధిక నాణ్యతతో కూడిన ఉత్సాదనలకు బ్రాండు స్థాయిని కల్పించాలనే ఉద్దేశంతో ఇండియా హ్యాండ్‌లూమ్ బ్రాండ్ (ఐహెచ్‌బీ) కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఐహెచ్‌బీలో భాగంగా, ఉత్పాదనలను జౌళి శాఖలోని చట్టబద్ధ సంస్థ అయిన టెక్స్‌టైల్స్ కమిటీ నమోదు చేస్తుంది. ఈ ఉత్పాదనల్లో సహజ రంగులతో తీర్చిదిద్దిన ఉత్పాదనలు కూడా ఉంటాయి.
భారత్ టెక్స్-2025లో ఆర్గానిక్ ఫైబర్స్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. వీటిలో పత్తి, జిల్లేడుల వంటివి ఉన్నాయి. వీటితో పాటే సహజ రంగులను కూడా ప్రదర్శించారు. వాటి ఉపయోగాన్ని నలుగురూ అర్థం చేసుకొనేటట్లు చూడటంతో పాటు వాటి ఉపయోగాన్ని ప్రోత్సహించడం ఈ ప్రదర్శన నిర్వహణ లోని ప్రధానోద్దేశాలు.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై), మిషన్ ఆర్గానిక్ వేల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్ ఈస్ట్రన్ రీజియన్ (ఎంఓవీసీడీఎన్ఈఆర్) వంటి కార్యక్రమాలను వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా ఉత్పత్తికీ, ప్రాసెసింగుకీ, ధ్రువీకరణకీ, మార్కెటింగు సహా క్లస్టర్ ఆధారిత విధానాలతో ఆర్గానిక్ సాగును ప్రోత్సహిస్తున్నారు.
జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీ పబిత్ర మార్గరిటా లోక్‌సభలో ఈ రోజు ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2222579)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9