యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఒలింపిక్ ఉద్యమానికి సహకారం అందించే విషయంలో ఆకట్టుకున్న భారత్ వ్యూహం, ప్రణాళిక, దార్శనికత: మాకిస్ అసిమాకోపౌలోస్, డైరెక్టర్, అంతర్జాతీయ ఒలింపిక్ అకాడమీ
క్రీడా విద్యను బలోపేతం చేసేందుకు సహకార కార్యక్రమాలను రూపొందించే లక్ష్యంతో క్రీడా మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన అంతర్జాతీయ ఒలింపిక్ అకాడమీకి చెందిన ఇద్దరు సభ్యుల ప్రతినిధి బృందం
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రీడా వ్యవస్థ: హరి రంజన్ రావు, కార్యదర్శి, కేంద్ర క్రీడా శాఖ
దేశంలో ఒలింపిక్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లగల నిపుణులను తయారు చేయడం చాలా కీలకం: హరి రంజన్ రావు, కార్యదర్శి, కేంద్ర క్రీడా శాఖ
प्रविष्टि तिथि:
30 JAN 2026 5:53PM by PIB Hyderabad
ఢిల్లీలోని భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఏఐ- స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రధాన కార్యాలయంలో క్రీడా శాఖ కార్యదర్శి శ్రీ హరి రంజన్ రావు నేతృత్వంలోని క్రీడా మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో అంతర్జాతీయ ఒలింపిక్ అకాడమీ (ఐఓఏ) డైరెక్టర్ శ్రీ మాకిస్ అసిమాకోపౌలోస్, శ్రీ ఎంఎస్ అలెగ్జాండ్రా కరైస్కోలతో కూడిన ఇద్దరు సభ్యుల ప్రతినిధి బృందం సమావేశమైంది.
ఈ సమావేశంలో అసిమాకోపౌలోస్ మాట్లాడుతూ.. “ఒలింపిక్ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించడానికి క్రీడా మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ప్రణాళిక, వ్యూహం, దార్శనికతను ఆకట్టుకుంది” అని అన్నారు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రీడా కార్యక్రమాలన్నింటినీ చూసిన తర్వాత దేశంలో ఒలింపిక్ విద్యను బలోపేతం చేసే విషయంలో మద్దతునిచ్చేందుకు ఐఓఏ ఆసక్తిగా ఉందని ఆయన తెలిపారు.
"భారత్‌లోని యువతకు ఒలింపిక్ విలువలను అర్థం చేసుకునేందుకు వీలుగా క్రీడా వ్యవస్థలోని వ్యక్తులకు ఒలింపిజం, ఒలింపిక్ క్రీడల విలువలపై శిక్షణ ఇవ్వడానికి మేం మా నిపుణతను అందించాలనుకుంటున్నాం” అని ఆయన వ్యాఖ్యానించారు.
భారతీయ కోచ్‌లు, క్రీడా శాస్త్ర నిపుణులు, పీఈ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాల ద్వారా దేశంలో క్రీడా విద్యను బలోపేతం చేసేందుకు భారత ఒలింపిక్ అసోసియేషన్, కొత్తగా పునరుద్ధరించిన జాతీయ ఒలింపిక్ అకాడమీ, క్రీడా మంత్రిత్వ శాఖకు ఐఓఏతో భాగస్వామ్యం ఏర్పాటు చేయటం గురించి చర్చించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది.
1961లో ఏర్పాటైన ఐఓఏ గ్రీస్‌లోని ప్రాచీన ఒలింపియా కేంద్రంగా పనిచేస్తుంది. ఒలింపిక్ విద్య, అధ్యయనాలను ప్రోత్సహించే ప్రపంచంలోని ఏకైక సంస్థ ఇది. భారత్‌లో ఇటీవల పునరుద్ధరించిన జాతీయ ఒలింపిక్ అకాడమీతో సహా వివిధ దేశాలలో జాతీయ అకాడమీలతో ఇది అనుసంధానమై ఉంది.
సమావేశం గురించి ఎంఎస్ అలెగ్జాండ్రా మాట్లాడుతూ.. “మా మధ్య చాలా ఫలప్రదమైన చర్చ జరిగింది. క్రీడా శాఖ కార్యదర్శి చేసిన ప్రెజెంటేషన్ ద్వారా కామన్వెల్త్ క్రీడల నిర్వహణ, 2036 ఒలింపిక్స్ వేలం కోసం భారత్ వేస్తోన్న ఖచ్చితమైన అడుగులను మేం తెలుసుకున్నాం. చాలా కాలం తర్వాత భారత్‌లో జాతీయ ఒలింపిక్ అకాడమీని పునరుద్ధరించటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒలింపిక్ విలువలను ప్రోత్సహించేందుకు స్పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా, ఐఓఏలతో కలిసి పని చేస్తామని ఆశిస్తున్నాం” అని వ్యాఖ్యానించారు.
సమావేశం అందించిన ఫలితాలను వివరించిన హరి రంజన్ రావు.. “మా మొదటి సమావేశం చాలా విజయవంతమైంది. ఐఓఏకు ఉన్న సుదీర్ఘ అనుభవాన్ని ఉపయోగించుకొని మన క్రీడా విద్యను మరింత బలోపేతం చేయడానికి ఈ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేం భావిస్తున్నాం. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో క్రీడా వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది కాబట్టి ఒలింపిక్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లగల నిపుణులను తయారు చేయడం ఇప్పుడు చాలా కీలకం” అని పేర్కొన్నారు.
భారత్‌కు సరిపోయే ప్రపంచ స్థాయి పాఠ్యాంశాలను రూపొందించడం, ప్రముఖ విద్యా సంస్థలలో నైపుణ్యాభివృద్ధిని విస్తరించడం, నిర్వాహకుల కోసం ధ్రువపత్రాలతో కూడిన కోర్సులను ప్రారంభించడం, అంతర్జాతీయ నిపుణులతో మాస్టర్ తరగతులను నిర్వహించడం, సంయుక్త పరిశోధన, డిజిటల్ భాగస్వామ్యాల ద్వారా దేశంలో ఒలింపిక్ విద్యకు ఐఓఏ మద్దతు ఇస్తుందని శ్రీ హరి రంజన్ రావు తెలిపారు.
ప్రపంచంలోని జాతీయ ఒలింపిక్ అకాడమీల కోసం దేశంలో ఒక సదస్సును నిర్వహించనున్నట్లు భారత్ ప్రతిపాదించింది. ఒలింపిక్ విద్య, వారసత్వ విజ్ఞాన మార్పిడి కోసం హెలెనిక్ ఒలింపిక్ కమిటీతో (హెచ్ఓసీ) సహకారంపై చర్చలు జరుగుతున్నాయి.
***
(रिलीज़ आईडी: 2221042)
आगंतुक पटल : 4