రైల్వే మంత్రిత్వ శాఖ
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో హ్యూమనాయిడ్ రోబో ‘ఏఎస్‌సీ అర్జున్’ ఏర్పాటు చేసిన భారతీయ రైల్వే
प्रविष्टि तिथि:
23 JAN 2026 8:37PM by PIB Hyderabad
ప్రయాణికుల భద్రత, రక్షణ, సేవల పంపిణీని మెరుగుపరిచే దిశగా కీలక ముందడుగు వేస్తూ భారతీయ రైల్వే విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో “ఏఎస్‌సీ అర్జున్” అనే హ్యూమనాయిడ్ రోబోట్ సేవలను ప్రారంభించింది.
ఈ విస్తరణ భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లోనే మొదటిది. ప్రజల సౌలభ్యం, భద్రత కోసం కొత్త, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించడంలో సంస్థ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది. హ్యూమనాయిడ్ రోబో ఈ స్టేషన్ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి ఆర్‌పీఎఫ్ సిబ్బందితో కలిసి పనిచేస్తుంది. ముఖ్యంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమాండెంట్ (ఆర్‌పీఎఫ్) శ్రీ ఏ.కే. దూబే సమక్షంలో ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఆర్‌పీఎఫ్) శ్రీ అలోక్ బోహ్రా, డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లలిత్ బోహ్రాలు ఈ రోబోను ఆవిష్కరించారు. భారత రైల్వేలు ఆవిష్కరణ-ఆధారిత పరిష్కారాలు, దేశీయ అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఈ కార్యక్రమం స్పష్టం చేసింది.
విశాఖపట్నంలో పూర్తిస్థాయి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏఎస్‌సీ అర్జున్ రోబోను రూపొందించారు. ఈ ప్రాజెక్టును ఫలవంతం చేయడానికి సంబంధిత నిపుణుల బృందం అంకితభావంతో సంవత్సరానికి పైగా నిరంతరం పనిచేసింది. రోజువారీ కార్యకలాపాల్లో అధునాతన వ్యవస్థలను సమీకృతం చేయడంలో పెరుగుతున్న భారతీయ రైల్వేల సామర్థ్యాలను ఇది ప్రదర్శించింది.
ఈ హ్యూమనాయిడ్ రోబో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్, ఏఐ- ఆధారిత క్రౌడ్ మానిటరింగ్ ద్వారా ఆర్‌పీఎఫ్ కంట్రోల్ రూమ్‌లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ చొరబాట్లను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో ఆటోమేటెడ్ పబ్లిక్ ప్రకటనలను చేయగలదు. ప్రయాణికులకు మార్గనిర్దేశం చేయడంలో, భద్రత, రక్షణ సంబంధిత విషయాలపై అవగాహనను మెరుగుపరచడంలోనూ ఇది సహాయపడుతుంది.
ముందే నిర్వచించిన మార్గాల్లో సెమీ-అటానమస్ నావిగేషన్, అడ్డంకులను నివారించడం ద్వారా ఏఎస్‌సీ అర్జున్ 24 గంటలూ ప్లాట్‌ఫారమ్‌లపై నిఘా ఉంచుతుంది. తక్కువ మంది సిబ్బందితోనే సమర్థమైన నిఘాకు మద్దతునిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో స్పందించడానికి వీలుగా ఈ రోబో అగ్ని, పొగ గుర్తింపు వ్యవస్థలనూ కలిగి ఉంది.
ప్రయాణికుల ఇంటరాక్షన్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ఏఎస్‌సీ అర్జున్ రోబో ప్రయాణికులకు నమస్కారం చేయడం, ఆర్‌పీఎఫ్ సిబ్బందికి సెల్యూట్ చేయడం వంటి స్నేహపూర్వక పనులనూ చేయగలదు. సమాచారం కోసం, సహాయం కోసం ఉపయోగించడానికి సులభమైన ఇంటర్‌ఫేస్‌నూ ఇది అందిస్తుంది.
దేశవ్యాప్తంగా సురక్షితమైన, మరింత భద్రత గల, ప్రయాణికులకు అనుకూలమైన రైల్వే వాతావరణాన్ని సృష్టించడానికి భారతీయ రైల్వేలు సాంకేతికత, స్వదేశీ ఆవిష్కరణలను ఉపయోగించుకోవడంపై దృష్టి సారిస్తూనే ఉన్నాయి.
(रिलीज़ आईडी: 2218092)
आगंतुक पटल : 6