వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ప్రతిష్ఠాత్మక ఫ్రాంజ్ ఎడెల్‌మన్ అవార్డు తుది పోటీదారుగా నిలిచిన 'ఆహార- ప్రజా పంపిణీ శాఖ (డీఎఫ్‌పీడీ)’
ఫ్రాంజ్ ఎడెల్‌మన్ అవార్డు- 2026 విషయంలో తుది పోటీలో ఉండే ఆరు సంస్థలను ప్రకటించిన ఇన్‌ఫార్మ్స్
प्रविष्टि तिथि:
23 JAN 2026 5:51PM by PIB Hyderabad
ప్రతిష్ఠాత్మకమైన 2026 ఫ్రాంజ్ ఎడెల్‌మన్ అవార్డుకు అంతిమ పోటీదారుగా(ఫైనలిస్టులు) ఎంపికైన ఆరు సంస్థల్లో భారత 'ఆహార - ప్రజా పంపిణీ శాఖ (డీఎఫ్‌పీడీ)’ ఒకటిగా నిలిచింది. రాష్ట్రాల వారీగా రవాణాను మెరుగుపరచటం ద్వారా భారత ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసే ఆపరేషన్స్ రీసెర్చ్ (ఓఆర్) ఆధారిత నిర్ణయాత్మక కార్యక్రమమైన 'అన్న చక్ర' విషయంలో ఈ గౌరవం దక్కింది. భారత్‌లోని ఐక్యరాజ్యసమితి డబ్ల్యూఎఫ్‌పీ(వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్), ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) - ఢిల్లీ భాగస్వామ్యంతో తయారుచేసిన ఈ కార్యక్రమం.. చూవీ, ఎన్‌విడియా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎక్కో షూ వంటి ఇతర అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సరసన డీఎఫ్‌పీడీ నిలిచేలా చేసింది.
అధునాతన అనలిటిక్స్‌ను ఉపయోగించి చేసే అత్యంత ప్రభావవంతమైన, విలువైన కార్యక్రమాలను 'ఫ్రాంజ్ ఎడెల్‌మన్ అవార్డు' గుర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆపరేషన్స్ రీసెర్చ్ రంగంలో దీనిని నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా తుది పోటీదారుల్లో ఒకటిగా నిలవడం ద్వారా 'అన్న చక్ర'.. ప్రభుత్వ సంస్కరణలు, ప్రజా వ్యవస్థలు, భారీ స్థాయి సరకు తరలింపును మెరుగుపరచటంలో అంతర్జాతీయ స్థాయిలో ఒక విశ్లేషణాత్మక ఆవిష్కరణ నమూనాగా నిలిచింది.
అన్న చక్రను డిసెంబర్ 2025లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార - ప్రజా పంపిణీ, నూతన - పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి, విద్యా సంస్థల బలమైన భాగస్వామ్యంతో దీనిని తయారు చేశారు. ఇది భారతదేశమంతటా ఆహార ధాన్యాల రవాణాను బలోపేతం చేయడానికి అధునాతన మెరుగుదల పద్ధతులను ఉపయోగిస్తుంది. జాతీయ స్థాయిలో దీనిని విస్తరించటం వల్ల ఈ కింది ఫలితాలు వచ్చాయి:
* ఏటా సుమారు రూ. 250 కోట్ల పొదుపు.
* ఉద్గారాలలో 35 శాతం తగ్గింపు. ఇది భారతదేశ వాతావరణ లక్ష్యాలకు మద్దతునిస్తుంది.
* 81 కోట్లకు పైగా పీడీఎస్ లబ్ధిదారులకు.. ముఖ్యంగా నిరుపేద జనాభాకు ప్రయోజనం చేకూర్చే విధంగా సామర్థ్య వృద్ధి.
ఫ్రాంజ్ ఎడెల్‌మన్ అవార్డు అంతిమ రౌండ్‌కు 'అన్న చక్ర' ఎంపికవటం.. భారీ స్థాయిలో అమలు చేయగల, డేటా-ఆధారిత నమూనాగా దీనికి ఉన్న ప్రపంచవ్యాప్త ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ఈ నెల ప్రారంభంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) అహ్మదాబాద్‌లో ‘సీడీఎస్‌ఏ ఓఆర్ఎస్‌ఐ ఎక్సలెన్స్ ఇన్ మేనేజ్‌మెంట్ సైన్స్ అండ్ అనలిటిక్స్ ప్రాక్టీస్ అవార్డు- 2026’ను కూడా అన్న చక్ర ప్రాజెక్ట్ అందుకుంది. ఈ కార్యక్రమానికి ఉన్న జాతీయ,అంతర్జాతీయ ప్రభావాన్ని ఇది మరింత బలపరుస్తోంది.
“ఈ వేదికలపై గుర్తింపు పొందడం మాకు దక్కిన గౌరవం” అని డీఎఫ్‌పీడీ కార్యదర్శి శ్రీ సంజీవ్ చోప్రా అన్నారు. "ప్రజా వ్యవస్థలను బలోపేతం చేసే విషయంలో శాస్త్రీయ పద్ధతులను అన్వయించటానికి ఉన్న శక్తికి 'అన్న చక్ర' నమూనా ఒక నిదర్శనం. ఈ కీలక ఘట్టాన్ని చేరుకోవడంలో డబ్ల్యుఎఫ్‌పీ ఇండియా, ఐఐటీ ఢిల్లీతో మా భాగస్వామ్యం కీలక పాత్ర పోషించింది" అని ఆయన అన్నారు.
2026 ఫ్రాంజ్ ఎడెల్‌మన్ అవార్డు విజేతను 2026 ఏప్రిల్ 12-14 మధ్య అమెరికాలోని మేరీల్యాండ్‌లో జరిగే 'ఇన్‌ఫార్మ్స్ అనలిటిక్స్ ప్లస్ సదస్సు'లో ప్రకటిస్తారు.
(रिलीज़ आईडी: 2218089)
आगंतुक पटल : 9