ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
'సామాజిక సాధికారత కోసం సమ్మిళితత్వం' వర్కింగ్ గ్రూప్ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన ఇండియా ఏఐ, ఎలక్ట్రానిక్స్- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఐఐటీ హైదరాబాద్
సమ్మిళితమైన, మానవ కేంద్రిత బాధ్యతాయుతమైన ఏఐ వినియోగాన్ని ముందుకు తీసుకెళ్లటమే ఈ సమావేశం ఉద్దేశం
'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026'కు అవసరమైన సమాచారం, దిశానిర్దేశాన్ని అందించనున్న వర్కింగ్ గ్రూప్ చర్చలు
నాడు పోస్టు చేయడమైనది:
16 JAN 2026 6:16PM by PIB Hyderabad
ఐఐటీ హైదరాబాద్ సహకారంతో ఇండియా ఏఐ మిషన్, ఎలక్ట్రానిక్స్ - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మైటీ) మంత్రిత్వ శాఖ ఈ రోజు ఐఐటీహెచ్ ప్రాంగణంలో 'సామాజిక సాధికారత కోసం సమ్మిళితత్వం' అనే అంశంపై వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించాయి. సమ్మిళిత ఏఐ అభివృద్ధి, సామాజిక ఏఐ వినియోగం, ఏఐ- ఆధారిత అవకాశాలను సమానంగా అందించటంపై జాతీయ స్థాయి చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు సీనియర్ విధాన రూపకర్తలు, విద్యావేత్తలు, పరిశ్రమల నిపుణులు, పరిశోధకులను ఈ సమావేశం ఒకచోటకు చేర్చింది.
ఈ సమావేశం 2026 ఫిబ్రవరి 16-20 తేదీలలో ఢిల్లీలో జరగబోయే 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026'కు ఒక ముందస్తు కార్యక్రమంగా ఉంది. ఈ సదస్సులోని నేపథ్య అజెండాను రూపొందించడానికి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వరుస వర్కింగ్ గ్రూప్ సంప్రదింపులలో ప్రస్తుత సమావేశం ఒకటిగా ఉంది.
ఈ ప్రారంభ సెషన్‌లో వర్కింగ్ గ్రూప్‌కు సంబంధించిన భారతదేశ ఛైర్మన్, మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్.. స్విట్జర్లాండ్ ఫెడరల్ ఆఫీస్ (కమ్యూనికేషన్స్) డైరెక్టర్, రాయబారి థామస్ ష్నైడర్.. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీ.ఎస్. మూర్తి.. ఎలక్ట్రానిక్స్ - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఏఐ - ఈటీ విభాగం అదనపు డైరెక్టర్ డాక్టర్ నలిన్ కుమార్ శ్రీవాస్తవ.. తెలంగాణ ప్రభుత్వ ఈ-గవర్నెన్స్ జాయింట్ డైరెక్టర్ శ్రీ సీ.హెచ్. భరత్ రెడ్డి ప్రసంగించారు. భారత ఏఐ ప్రయాణంలో సమ్మిళితత్వం, విశ్వాసం, సామాజిక నేపథ్యాన్ని ప్రధానాంశాలుగా ఉంచటానికి ఉన్న ప్రాముఖ్యతను వక్తలు ప్రధానంగా చెప్పారు.
ప్రతినిధులను స్వాగతించిన ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీ.ఎస్. మూర్తి.. “భారతదేశం నిజంగా ఏఐ రంగంలో నాయకత్వం వహించాలని ఆకాంక్షిస్తే మనం సాహసోపేతమైన అడుగులు వేయాలి. ఇంజనీరింగ్, మెటీరియల్స్ సైన్స్, లిబరల్ ఆర్ట్స్, ఇతర రంగాలను ఏకం చేస్తూ ఏఐ అనేది బహుళ శాస్త్రాల కలయికగా ఉండాలి. బలమైన పునాదుల నుంచి వాస్తవ ప్రపంచ అనువర్తనాల వరకు బాధ్యతాయుత, ఆమోదయోగ్యమైన ఏఐ.. సవాళ్లను పరిష్కరిస్తూనే ప్రజల జీవితాలను మెరుగుపరచడంపైనే మన దృష్టి ఉండాలి” అని వ్యాఖ్యానించారు.
ఈ వర్కింగ్ గ్రూప్ నేపథ్యాన్ని ఎలక్ట్రానిక్స్ - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఏఐ- ఈటీ విభాగం అదనపు డైరెక్టర్ డాక్టర్ నలిన్ కుమార్ శ్రీవాస్తవ వివరించారు. “ఏఐలో సమ్మిళితత్వం, యాక్సెస్, బాధ్యత, సమానత్వం వంటి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి నిపుణులను ఈ సదస్సు ఒకచోట చేర్చింది. ఇది కేవలం సాంకేతికత గురించి మాత్రమే కాదు.. ప్రజలను కేంద్రంగా చేసుకొని సాగించే సామాజిక సాధికారతకు సంబంధించినది. ఏఐ అనేది కేవలం ఒక సాంకేతిక ఎంపిక మాత్రమే కాదు.. ఇది మన నైతిక బాధ్యత" అని పేర్కొన్నారు.
ప్లీనరీ సమావేశంలో మాట్లాడిన మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్.. “ఏఐ విషయంలో భారత్ చేస్తున్న పని ఏడు విభాగాలపై ఆధారపడి ఉంది. అందులో ఒకటి సామాజిక సాధికారతపై దృష్టి సారిస్తోంది. దీనిలో పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు చురుగ్గా పాల్గొంటున్నాయి. శాస్త్ర విజ్ఞానం, మెటీరియల్స్, ఆరోగ్య సంరక్షణ, ఆవిష్కరణలలో ఏఐ అనేది పురోగతిని కలిగిస్తున్నప్పటికీ అది అంతిమంగా విభిన్న సామాజిక, ఆర్థిక నేపథ్యాల నుంచి వచ్చిన ప్రజలకు సేవ చేయాలి. భారత్ ఇప్పటికే బలమైన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించింది. ఈ వ్యవస్థలకు ఏఐని ఉపయోగించటమే దీనికి తదుపరి అడుగు. ఏఐ అభివృద్ధి చెందుతున్న కొద్దీ అది అందరికీ ఉపయోగపడాలి.. డేటా, భాషలో ఉండే పక్షపాతాలను పరిష్కరించాలి. సాంకేతికత అసమానతలను పెంచకుండా సమాజంలోని అన్ని వర్గాలకు సహాయపడేలా చూడాలి" అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరణలపై చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ గురించి ఈ-గవర్నెన్స్ జాయింట్ డైరెక్టర్ శ్రీ సీ.హెచ్. భరత్ రెడ్డి మాట్లాడారు. “మా దృష్టి ఎల్లప్పుడూ వృద్ధిపైనే ఉంది. ఆ లక్ష్య సాధనకు కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడం అత్యంత కీలకం. నేను తెలంగాణ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఈ ప్రయత్నాలు ఒక బలమైన, భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉన్న ఆవిష్కరణల వ్యవస్థను తయారు చేయటంలో మా నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి. ఢిల్లీలో జరగబోయే 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు'లో ఈ అంశాలను ప్రత్యేక బ్రేక్-అవుట్ సెషన్ల ద్వారా ముందుకు తీసుకెళ్లనున్నాం. దీనివల్ల వివిధ భాగస్వాముల మధ్య లోతైన చర్చలు, సహకారానికి అవకాశం లభిస్తుంది" అని ఆయన అన్నారు.
స్విట్జర్లాండ్ ఫెడరల్ ఆఫీస్ ఫర్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్, రాయబారి థామస్ ష్నైడర్ కీలకోపాన్యాసం ఇచ్చారు. “రాబోయే తరాలకు కూడా మన గ్రహం నివాసయోగ్యంగా ఉండేలా ఏఐని సుస్థిరమైన రీతిలో ఉపయోగించాలి. ఆర్థిక సామాజిక అభివృద్ధితో సహా పురోగతి కోసం ఏఐని ఉపయోగించాలి. ప్రజలు నేడు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ఏఐ, డేటా అందిస్తోన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఈ పురోగతి కేవలం కొందరికే కాకుండా అందరికీ చెందాలి. ఇది మనిషి గౌరవాన్ని, ప్రాథమిక హక్కులను, స్వయంప్రతిపత్తిని గౌరవిస్తూ ఎవరూ వెనుకబడి పోకుండా చూసే విధంగా ఉండాలి. బాధ్యతాయుతంగా రూపొందించి అమలు చేసినప్పుడు ఏఐ ఒక శక్తిమంతమైన మంచి సాధనంగా మారుతుంది. కానీ పక్షపాతం, అసమానత, బహిష్కరణల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ఏఐ అనేది ఉమ్మడి ప్రయోజనాల కోసం పనిచేస్తుందని నిర్ధారించేందుకు సమ్మిళిత, బహుళ పక్ష, బహుళ భాగస్వామ్య సహకారం ఎంతో అవసరం. ఈ స్ఫూర్తితోనే ఏఐని కొందరికే పరిమితమైన ప్రత్యేక హక్కుగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే అవకాశంగా మార్చాలనే ఉమ్మడి నిబద్ధతను ‘ఏఐ ద్వారా సమ్మిళితత్వాన్ని పెంపొందించే కూటమి’ ప్రతిబింబిస్తోంది" అని వ్యాఖ్యానించారు.
'రీఇమాజిన్ భారత్ విత్ ఏఐ' అనే అంశంపై రిలయన్స్ జియో చీఫ్ డేటా సైంటిస్ట్ ప్రొఫెసర్ శైలేష్ కుమార్ సాంకేతిక కీలకోపన్యాసం ఇచ్చారు. జాతీయ అభివృద్ధిని వేగవంతం చేయడంలో ఆవిష్కరణలకు ఉన్న పాత్రను ఈ సెషన్ విశ్లేషించింది. దీని తర్వాత 'సమ్మిళిత ఏఐ అభివృద్ధిని ప్రోత్సహించడం' అనే అంశంపై మొదటి ప్యానెల్ చర్చ జరిగింది. ఇందులో ప్రొఫెసర్ సుమోహన చన్నప్పయ్య (ఐఐటీహెచ్), హనీవెల్‌కు చెందిన శ్రీ రోమీ శ్రీవాస్తవ, శ్రీ స్వరూప్ శాంతి మేడసాని (మ్యాథ్‌వర్క్స్), శ్రీ రమ్యా కన్నన్ బాబు (ఇంటెల్), ప్రొఫెసర్ చక్రవర్తి భగవతి (హైదరాబాద్ యూనివర్సిటీ) పాల్గొన్నారు. ప్రారంభ డేటా సేకరణ- డిజైన్ నుంచి అమలు, గవర్నెన్స్ వరకు ఏఐ పూర్తి జీవితచక్రం అంతటా సమ్మిళితత్వాన్ని నిక్షిప్తం చేసే తీరుపై నిపుణులు దృష్టి సారించారు. పరిశోధన, పరిశ్రమ అనుభవాల ఆధారంగా పక్షపాతాన్ని తగ్గించడానికి, యాక్సెస్‌ను విస్తరించడానికి, సామాజిక- ఆర్థిక సమ్మిళితత్వాన్ని పెంపొందించే ఏఐ వ్యవస్థలను తయారుచేయటంలో ఉన్న ఉమ్మడి బాధ్యతను నెరవేర్చడానికి అవసరమైన ఆచరణాత్మక వ్యూహాలను ప్యానల్‌లోని సభ్యులు చర్చించారు.
'ఏఐ సామాజిక స్వీకరణ: అవకాశాలు, సవాళ్లు' అనే రెండో ప్యానెల్ చర్చను శ్రీ రాజేష్ అగర్వాల్ ప్రారంభించారు. పరిశ్రమ ప్రతినిధులు, పరిశోధకులతో పాటు అవర్తన్ ల్యాబ్స్, ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్, 1వర్క్స్, శంఖ్ డీప్‌టెక్ వెంచర్ స్టూడియో, రీన్ఫౌండేషన్‌కు చెందిన పౌర సమాజ నిపుణులు ఇందులో పాల్గొన్నారు. ఆరోగ్య సంరక్షణ, ప్రజా సేవల వంటి కీలక రంగాల్లో ఏఐ స్వీకరణ వల్ల కలిగే పరివర్తనాత్మక అవకాశాలు, వాస్తవ ప్రపంచ సవాళ్లపై ఈ సెషన్ దృష్టి సారించింది. ఈ ప్యానల్.. ఏఐలోని విశ్వాసం, జవాబుదారీతనం, సంసిద్ధత వంటి అంశాలను లోతుగా అన్వేషించింది. వాస్తవ ప్రపంచంలోని అనుభవాలను పంచుకున్న ప్యానలిస్టులు.. డెవలపర్లు, ప్రజల మధ్య సహకారం అనేది ఏ విధంగా అర్థవంతమైన ప్రయోజనాలను అందిస్తుందో తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్టార్టప్ పిచ్ సెషన్లు, వివిధ విద్యా స్థాయిల విద్యార్థుల అభిప్రాయాలు, నిర్మాణాత్మక నెట్‌వర్కింగ్ చర్చలు చోటుచేసుకున్నాయి. ఇవి ఆవిష్కర్తలు, పరిశోధకులు, విధానకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించాయి. ఇవాల్టి కార్యక్రమం 'సామాజిక సాధికారత కోసం సమ్మిళితత్వం' వర్కింగ్ గ్రూప్‌కు సంబంధించిన క్లోజ్డ్-డోర్ హైబ్రిడ్ సమావేశంతో ముగిసింది. ఇది చర్చల్లో వెల్లడైన ముఖ్యాంశాలు, సిఫార్సులను క్రోడీకరించడంపై దృష్టి సారించింది.
ఐఐటీ హైదరాబాద్‌లో జరిగిన 'సామాజిక సాధికారత కోసం సమ్మిళితత్వం' వర్కింగ్ గ్రూప్ సమావేశంలోని చర్చలు 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026'లో జరిగే జాతీయ స్థాయి చర్చలకు తమ వంతు సహకారాన్ని అందిస్తాయి. ఇది 'వికసిత్ భారత్ 2047' దార్శనికతకు అనుగుణంగా ఇండియాఏఐ మిషన్ కింద సమ్మిళిత, బాధ్యతాయుతమైన మానవ కేంద్రిత ఏఐ వ్యవస్థలను నిర్మించడంలో భారత ప్రభుత్వ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2215586)
సందర్శకుల సూచీ సంఖ్య : : 20