పార్లమెంటరీ వ్యవహారాలు
జవహర్ నవోదయ విద్యాలయాలకు నిర్వహించిన ‘26వ జాతీయ యువజన పార్లమెంటు పోటీ 2024-2025’
పురస్కారాలను ప్రదానం చేసిన శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్
ప్రజాస్వామిక విలువలు, పార్లమెంటరీ నైతిక సూత్రాలతో పాటు
జాతీయ సద్భావనను అవలంబించాల్సిందిగా యువతకు విజ్ఞప్తి చేసిన కేంద్ర మంత్రి
పర్యావరణ సంరక్షణ కోసం పాటుపడతామంటూ ‘‘జీవిత ప్రతిజ్ఞ’’ చేయించిన శ్రీ మేఘ్‌వాల్
జవహర్ నవోదయ విద్యాలయాలకు నిర్వహించిన ‘26వ జాతీయ యువజన పార్లమెంటు పోటీ 2024-2025’ లో
ప్రథమ పురస్కారాన్ని గెలిచిన రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్-IIకు చెందిన ‘‘సూరత్‌గఢ్ పీఎమ్ శ్రీ స్కూల్ జవహర్ నవోదయ విద్యాలయ’’
प्रविष्टि तिथि:
15 JAN 2026 8:00PM by PIB Hyderabad
జవహర్ నవోదయ విద్యాలయాలకు ఉద్దేశించిన ‘26వ జాతీయ యువజన పార్లమెంటు పోటీ 2024-2025’ పురస్కారాల ప్రదానోత్సవాన్ని 2026 జనవరి 15న న్యూఢిల్లీలోని రఫీ మార్గ్‌లో కల ఇండియా కాన్స్టిట్యూషన్ క్లబ్- మావలంకర్ సభా భవనంలో నిర్వహించారు.
కార్యక్రమానికి పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రీ, చట్ట- న్యాయ శాఖ సహాయ మంత్రీ (స్వతంత్ర) శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్ అధ్యక్షత వహించారు. పోటీలో ఉత్తమ ప్రదర్శనను కనబరిచి గెలిచిన జవహర్ నవోదయ విద్యాలయాల జట్లకు ఆయన బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో మంత్రి మాట్లాడారు. విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులకు ఉన్న ప్రాముఖ్యాన్ని ఆయన స్పష్టం చేస్తూ, పెద్ద పెద్ద కలలు కనాల్సిందిగా విద్యార్థులను ప్రోత్సహించారు. నిద్రించే వేళ వచ్చే కలలే కలలు కావనీ, నిద్ర పోనివ్వనివే సిసలైన కలలు అనీ భాష్యం చెప్పిన డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ మాటలను మంత్రి గుర్తుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా , పర్యావరణాన్ని సంరక్షిస్తామంటూ ‘‘జీవిత ప్రతిజ్ఞ’’ పాఠాన్ని కార్యక్రమంలో పాలుపంచుకున్న అందరి చేతా మంత్రి చదివింప చేశారు.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ సత్య ప్రకాశ్ స్వాగతోపన్యాసాన్ని ఇస్తూ, ఆశ, నవకల్పనలతో పాటు మార్పునకు విద్యార్థులు పతాకధారులుగా నిలవాలనీ, 2047 కల్లా వికసిత్ భారత్ ఆశయాన్ని సాధించాలన్న ప్రధానమంత్రి దృష్టికోణాన్ని సాకారం చేయడానికి చురుకైన తోడ్పాటును అందించాలనీ వారికి పిలుపునిచ్చారు.
జవహర్ నవోదయ విద్యాలయాలకు నిర్వహించిన ‘26వ జాతీయ యువజన పార్లమెంటు పోటీ 2024-2025’ లో అగ్ర స్థానంలో నిలిచిన రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్-IIకు చెందిన ‘‘సూరత్‌గఢ్ పీఎమ్ శ్రీ స్కూల్ జవహర్ నవోదయ విద్యాలయ’’ విద్యార్థులు ‘యువజన పార్లమెంటు’ను పునః ప్రదర్శించారు. ఇది కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఎంతో ఆకట్టుకుంది.
యువజన పార్లమెంటు సమావేశాల్ని అభినందించదగ్గ రీతిలో ఆవిష్కరించినందుకు విజేత జట్టును నవోదయ విద్యాలయ సమితి (ప్రధానకేంద్రం) సంయుక్త కమిషనరు డాక్టర్ సమీర్ పాండే ప్రశంసించారు. పార్లమెంటరీ సంప్రదాయాల్ని ప్రభావవంతమైన విధంగా, గౌరవాన్వితమైందిగా చాటిచెప్పారంటూ విద్యార్థుల్ని ఆయన మెచ్చుకున్నారు. ప్రజాస్వామిక విలువల్ని తెలియజెప్పడంతో పాటు, వాటిని అనుసరించేందుకు జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులకు ఓ అమూల్య వేదికను అందించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు ఆయన కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
జవహర్ నవోదయ విద్యాలయాల్లో యువజన పార్లమెంటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ప్రయత్నాలు ప్రశంసనీయమని న్యాయ విభాగం కార్యదర్శి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శి (అదనపు బాధ్యత) శ్రీ నీరజ్ వర్మ అన్నారు. యువతీయువకులలో ప్రజాస్వామిక విలువలను పెంచి పోషించడానికి యువజన పార్లమెంటు కార్యక్రమం ఒక ముఖ్య వేదికగా నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటును గురించి విద్యార్థులకు మరింత సులభంగా అవగాహనను ఏర్పరిచే కార్యక్రమాల్ని రూపొందించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు ఆయన అభినందనలు తెలియజేశారు.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ గత 29 సంవత్సరాలుగా జవహర్ నవోదయ విద్యాలయాలకు యువజన పార్లమెంటు పోటీల్ని నిర్వహిస్తోంది. జవహర్ నవోదయ విద్యాలయాల కోసం జాతీయ యువజన పార్లమెంట్ పోటీని నిర్వహించడంలో భాగంగా, 26వ పోటీని 2024-25లో నిర్వహించారు. ఈ పోటీలో దేశంలోని నవోదయ విద్యాలయ సమితికి చెందిన 8 ప్రాంతాల పరిధిలోని 88 విద్యాలయాలు పాల్గొన్నాయి.
యువజన పార్లమెంటు పథకం జవహర్ నవోదయ విద్యాలయాల యువతకు ఒక వేదికను అందిస్తోంది. ఇది వారికి తమ వాక్పటుత్వాన్నీ, సమీక్షాత్మక ఆలోచనాశక్తినీ, నాయకత్వ కౌశలాన్నీ ప్రదర్శించేందుకు అవకాశాన్ని అందిస్తుంది.
దీనికి అదనంగా, ఈ పథకం విద్యార్థులకు పార్లమెంట్ పనితీరు, చర్చలు, వాదోపవాదాల మెలకువలపై అవగాహనను కలిగిస్తుంది. వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, అభిప్రాయాలను ప్రభావవంతంగా వెల్లడించే కళ, నేర్పులకు మెరుగులు పెట్టుకోవడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం జవహర్ నవోదయ విద్యాలయాలకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన, వాగ్ధాటిని కలిగివున్న విద్యార్థులకు జాతీయ, ప్రపంచ స్థాయిల్లోని ప్రాధాన్య అంశాలపై ఎంతో ఉత్సాహంతో చర్చలో పాలుపంచుకొనేటట్లు ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
కార్యక్రమంలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నందుకు రాజస్థాన్ (జైపూర్ ప్రాంతం) లోని శ్రీగంగానగర్-IIకు చెందిన ‘‘సూరత్‌గఢ్ పీఎమ్ శ్రీ స్కూల్ జవహర్ నవోదయ విద్యాలయ’’కు రనింగ్ షీల్డుతో పాటు ట్రోఫీని అందించారు. దీనికి అదనంగా, ఈ కింద పేర్కొన్న 7 ప్రాంతాల వారీ విజేతలుగా నిలిచిన విద్యాలయాలకు కూడా పురస్కారాలను మంత్రి ప్రదానం చేశారు:
|
వరుస సంఖ్య
|
విద్యాలయ పేరు
|
ప్రాంతం
|
|
1.
|
పీఎమ్ శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, వల్సాడ్, గుజరాత్
|
పుణే
|
|
2.
|
పీఎమ్ శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, అంబేద్కర్ నగర్, ఉత్తరప్రదేశ్
|
లఖ్‌నవూ
|
|
3.
|
పీఎమ్ శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, సిమ్లా, హిమాచల్ ప్రదేశ్
|
చండీగఢ్
|
|
4.
|
పీఎమ్ శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, బీర్భూమ్, పశ్చిమ బెంగాల్
|
పాట్నా
|
|
5.
|
పీఎమ్ శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, గోల్ఘాట్, అస్సామ్
|
షిల్లాంగ్
|
|
6.
|
పీఎమ్ శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, మెదక్, తెలంగాణ
|
హైదరాబాద్
|
|
7.
|
పీఎమ్ శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, మహాసముంద్, ఛత్తీస్‌గఢ్
|
భోపాల్
|
(रिलीज़ आईडी: 2215478)
आगंतुक पटल : 2