గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను బలోపేతం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా గిరిజన వైద్యులకు సామర్థ్య పెంపు కార్యక్రమాన్ని నిర్వహించనున్న గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ


ప్రాజెక్ట్ 'దృష్టి' కింద భారత గిరిజన ఆరోగ్య పర్యవేక్షణ కేంద్రం ఏర్పాటు కోసం భువనేశ్వర్‌లోని ఐసీఎంఆర్- ఆర్ఎంఆర్సీతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం.

తెలంగాణ లోని హైదరాబాద్ కన్హా శాంతివనం లో 2026 జనవరి 16,17 తేదీల్లో కార్యక్రమం

प्रविष्टि तिथि: 15 JAN 2026 5:58PM by PIB Hyderabad

గిరిజన సమూహాల సమ్మిళిత, సమాన, సాంస్కృతిక మూలాలతో కూడిన అభివృద్ధి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను ముందుకు తీసుకువెళ్తూ, గిరిజన ప్రాంతాలలో ఆరోగ్య సేవలను బలోపేతం చేసేందుకు గిరిజన వైద్యులకు దేశంలోనే మొట్టమొదటి జాతీయ స్థాయి సామర్థ్య పెంపు కార్యక్రమాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓటీఏ) నిర్వహిస్తోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఈ నెల 16, 17 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 

 

భారత ప్రజారోగ్య వ్యవస్థలో గిరిజన, స్వదేశీ వైద్యులను విశ్వసనీయ సమాజ స్థాయి భాగస్వాములుగా అధికారికంగా గుర్తించి, వారి సామర్థ్యాన్ని పెంచి, వ్యవస్థలో ఏకీకృతం చేయడానికి దేశంలోనే మొట్టమొదటి జాతీయ ప్రయత్నంగా ఈ కార్యక్రమం చేపట్టారు. 

 

ఈ కార్యక్రమానికి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జువాల్ ఓరాం, గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ దుర్గదాస్ ఉయికే, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి రంజనా చోప్రా హాజరుకానున్నారు. భాగస్వామ్య మంత్రిత్వ శాఖలు, సంస్థల ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు. సమగ్రత, సాంస్కృతిక సున్నితత్వం, ఆధారాల ప్రాతిపదికన గిరిజన ఆరోగ్య చర్యలను ముందుకు తీసుకెళ్లడంలో భారత ప్రభుత్వ అత్యున్నత స్థాయి నిబద్ధతకు ఈ కార్యక్రమం నిదర్శనం. 

 

ప్రాజెక్ట్ ‘దృష్టి‘ కింద భారత మొట్టమొదటి జాతీయ గిరిజన ఆరోగ్య పర్యవేక్షణ కేంద్రం (భారత్ ట్రైబల్ హెల్త్ అబ్జర్వేటరీ -బీ - టీహెచ్ఓ) ఏర్పాటు కోసం భువనేశ్వర్ లోని ఐసీఎంఆర్ ప్రాంతీయ ఆరోగ్య పరిశోధన కేంద్రం (ఆర్ఎంఆర్సీ) తో అవగాహన ఒప్పందం పై గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంతకాలు చేయడం ఈ కార్యక్రమంలో ప్రధానాంశం. ఈ చారిత్రక భాగస్వామ్యం ద్వారా గిరిజన జిల్లాల్లో గిరిజన వర్గాల వారీగా ఆరోగ్య పర్యవేక్షణ, అమలు ఆధారిత పరిశోధన, పరిశోధన ఆధారిత వ్యాధి నిర్మూలన కార్యక్రమాలు సంస్థాగత రూపం పొందుతాయి. గిరిజనులకు ప్రత్యేకమైన ఆరోగ్య సమాచారం, విశ్లేషణ, విధానపరమైన ఆధారాలలో దేశవ్యాప్తంగా చాలా కాలంగా ఎదుర్కొంటున్న లోటును ఇది పరిష్కరిస్తుంది.

గత కొన్నేళ్లుగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గిరిజన ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ ద్వారా వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తూనే, జాతీయ క్షయ, కుష్టు, మలేరియా నిర్మూలన వంటి కార్యక్రమాలతో సమన్వయం సాధించి మెరుగైన ఫలితాలను అందిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడంతో పాటు, ప్రధాన మంత్రి జన్ మన్, ధర్తీ ఆబా గిరిజన గ్రామ ఉత్కర్ష్ అభియాన్ వంటి ప్రాధాన్య పథకాల ద్వారా గిరిజన ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది. ఈ నిరంతర ప్రయత్నాల వల్ల గిరిజన ప్రాంతాల్లో, ముఖ్యంగా అత్యంత వెనుకబడిన గిరిజన తెగలు (పీవీటీజీ) నివసించే చోట్ల ఆరోగ్య అసమానతలను తొలగించడంలో మంత్రిత్వ శాఖ నేడు అగ్రగామిగా నిలిచింది.

 

భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), ఎయిమ్స్ (న్యూఢిల్లీ, జోధ్‌పూర్), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థల సాంకేతిక సహకారంతో ఈ సామర్ధ్య పెంపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భాగస్వామ్యాల ద్వారా గిరిజన వైద్యులతో జరిపే చర్చల్లో అంతర్జాతీయ అనుభవాలు, జాతీయ ఉత్తమ విధానాలు, శాస్త్రీయ పద్ధతులను జోడించే వీలు కలుగుతుంది.

 

ఐసీఎంఆర్- ఆర్ఎంఆర్సీతో అవగాహన ఒప్పందం వల్ల సురక్షితమైన డిజిటల్ గిరిజన ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఇందులో డాష్‌బోర్డులు, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) ఆధారిత విశ్లేషణలు, ఎప్పటికప్పుడు గిరిజన ఆరోగ్య నివేదికలను పొందే వీలుంటుంది. ఈ ఒప్పందం ద్వారా భారత గిరిజన కుటుంబాల ఆరోగ్య సర్వే (భారత్ ట్రైబల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే - బీటీఎఫ్హెచ్ఎస్) నిర్వహణతో పాటు, క్షయ వ్యాధి నిర్మూలన (ఎన్టీఈపీ), కీటక జనిత వ్యాధుల నియంత్రణ (ఎన్సీవీబీడీసీ) వంటి జాతీయ కార్యక్రమాలకు అనుగుణంగా ప్రత్యేక పరిశోధనలు జరుగుతాయి. అంతేకాకుండా, రాష్ట్ర జిల్లా స్థాయి ఆరోగ్య వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచుతూనే, గిరిజన వైద్యులకు వ్యాధుల గుర్తింపు ,రోగులను ఆసుపత్రులకు పంపడం వంటి అంశాలపై అవగాహన కల్పించే శిక్షణ ఇస్తారు.

 

మొత్తంగా చూస్తే, ఈ జాతీయ స్థాయి సామర్థ్య శిక్షణ, ఒప్పంద పత్రంపై సంతకం కార్యక్రమాలు గిరిజన అభివృద్ధిలో ఒక అసాధారణమైన ముందడుగుగా నిలుస్తాయి. సంప్రదాయ విజ్ఞానాన్ని కేవలం లిఖితపరచడాన్ని మించి, వ్యవస్థాధారిత సామర్థ్యాభివృద్ధి, నైతిక భద్రతా ప్రమాణాలు, సంస్థాగత అనుసంధానాలు, సమాచార ఆధారిత కార్యాచరణపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తోంది. దేశంలోని అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో శాశ్వత ఆరోగ్య ఫలితాలను అందించడమే లక్ష్యంగా, స్థానిక విజ్ఞాన వ్యవస్థలు, ఆధునిక ప్రజారోగ్య వ్యవస్థల మధ్య సమన్వయం పెంపొందించాలనే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిబద్ధతను ఇది తెలియచేస్తోంది.

 

****


(रिलीज़ आईडी: 2215129) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी