లోక్‌సభ సచివాలయం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో 28వ ‘సీఎస్‌పీఓసీ’ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఈ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ పార్లమెంటరీ నేతలకు భారత్‌ ఆతిథ్యం

పార్లమెంటరీ ప్రజాస్వామ్య బలోపేతం దిశగా న్యూఢిల్లీలో 28వ ‘సీఎస్‌పీఓ’సీ ప్రారంభం

28వ ‘సీఎస్‌పీఓసీ’లో కామన్వెల్త్ పార్లమెంటరీ చర్చలకు కూడలిగా మారిన న్యూఢిల్లీ

‘సీఎస్‌పీఓసీ’కి ఆతిథ్యం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై నిబద్ధతను పునరుద్ఘాటిన భారత్‌

కామన్వెల్త్ దేశాల సభాపతులతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్న లోక్‌సభ స్పీకర్

నాడు పోస్టు చేయడమైనది: 14 JAN 2026 10:15PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో పార్లమెంటు భవన ప్రాంగణంలోని చారిత్రక సంవిధాన సదన్ సెంట్రల్ హాల్‌లో కామన్వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల 28వ సదస్సును (సీఎస్‌పీఓసీ) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం 10.30 గంటలకు ప్రారంభిస్తారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, దౌత్యానికి భారత్‌ ఇస్తున్న  అత్యున్నత ప్రాధాన్యాన్ని ఈ కార్యక్రమం అంతర్జాతీయ స్థాయిలో చాటిచెబుతుంది.

ప్రారంభ సమావేశంలో గౌరవనీయ ప్రధానమంత్రి కీలక ప్రసంగం చేస్తారు. అనంతరం కామన్వెల్త్,  స్వయంప్రతిపత్తి గల చట్టసభల స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారులతో సంభాషిస్తారు.

ఈ నెల 16 వరకూ న్యూఢిల్లీలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ‘సీఎస్‌పీఓసీ’ సచివాలయ సమన్వయంతో భారత పార్లమెంటు ఆతిథ్యమిస్తోంది. తద్వారా ఒక అంతర్జాతీయ కీలక పార్లమెంటరీ కార్యకలాపాలకు భారత్‌ కూడలిగా నిలుస్తోంది. కామన్వెల్త్‌లోని 53 జాతీయ చట్టసభల  స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారులను ఈ సదస్సు ఒకే చోటకు చేరుస్తుంది. ప్రజాస్వామ్య పాలన, రాజ్యాంగ సంస్థల బలోపేతంలో శాసనసభల పరిణామశీల పాత్రపై చర్చలకు ఇదొక ఉన్నత స్థాయి వేదికగా ఉపయోగపడుతుంది.

ఈ నెల 14న న్యూఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలోగల సంగీతి కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ‘సీఎస్‌పీఓసీ’ స్థాయీ సంఘం సమావేశానికి 28వ ‘సీఎస్‌పీఓసీ’ చైర్‌పర్సన్‌ హోదాలో గౌరవనీయ లోక్‌సభ స్పీకర్ అధ్యక్షత వహించారు. దీనికిముందు వివిధ దేశాల ప్రతినిధులు ఎర్రకోటను సందర్శించారు. ఈ సందర్భంగా ‘లైట్‌ అండ్‌ సౌండ్‌’ ప్రదర్శన నిర్వహించారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య ప్రస్థానానికి ప్రతీక అయిన ఈ స్మారక చిహ్నంలో ఈ ప్రదర్శన భారత సుసంపన్న నాగరికత, శాశ్వత వారసత్వాలను సందర్శక ప్రముఖుల అనుభవంలోకి తెచ్చింది.

ఈ సదస్సులో భాగంగా 15, 16 తేదీల్లో నిర్వహించే కార్యక్రమాలు ఆధునిక చట్టసభల సంబంధిత సమకాలీన అంశాలపై దృష్టి సారిస్తాయి. పార్లమెంటరీ కార్యకలాపాల్లో కృత్రిమ మేధ బాధ్యతాయుత వినియోగం, పార్లమెంటరీ విధానాలు, సార్వత్రిక చర్చలపై సామాజిక మాధ్యమాల ప్రభావంపై ఈ సందర్భంగా చర్చ సాగుతుంది. అలాగే పార్లమెంటుపై ప్రజల అవగాహన, ఓటింగ్‌ సహా పౌర భాగస్వామ్యం పెంచే వినూత్న విధానాలు, ఎంపీలు-పార్లమెంటరీ అధికారుల భద్రత, ఆరోగ్యం, శ్రేయస్సు వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వస్తాయి.

బలమైన ప్రజాస్వామ్య సంస్థల నిర్వహణలో స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల పాత్రపై ప్రత్యేక సర్వసభ్య   సమావేశాన్ని ఉద్దేశించి గౌరవనీయ లోక్‌సభ స్పీకర్ ప్రసంగిస్తారు. అంతేకాకుండా సర్వసభ్య, ప్రత్యేక సర్వసభ్య, ముగింపు సర్వసభ్య సమావేశాలకూ అధ్యక్షత వహిస్తారు.

భారత పార్లమెంట్ ఇంతకుముందు 1971, 1986, 2010 సంవత్సరాల్లోనూ ‘సీఎస్‌పీఓసీ’ సమావేశాలను నిర్వహించింది. ఈ సంప్రదాయానికి కొనసాగింపుగా ప్రస్తుత 28వ ‘సీఎస్‌పీఓసీ’కి కూడా ఆతిథ్యమిస్తోంది. కామన్వెల్త్ పార్లమెంటరీ సంప్రదాయంతో భారత్‌ నిరంతర సంబంధాలను, ప్రజాస్వామ్యబద్ధ చట్టసభల మధ్య సంభాషణ, సహకారం, సంస్థాగత పునరుత్థాన సామర్థ్య వికాసం తదితరాల్లోనూ తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.

ఈ సదస్సు నేపథ్యంలో కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ శ్రీ ఫ్రాన్సిస్ స్కార్పలెగ్గియా; శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ డాక్టర్ శ్రీ జగత్ విక్రమరత్నె; సీషెల్స్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ శ్రీమతి అజరెల్ ఎర్నెస్టా; మాల్దీవ్స్‌ పీపుల్స్ మజ్లిస్ స్పీకర్ శ్రీ అబ్దుల్ రహీం అబ్దుల్లా; కెన్యా జాతీయ అసెంబ్లీ స్పీకర్  శ్రీ మసికా వెటాంగులా; గ్రెనడా సెనేట్ అధ్యక్షురాలు డాక్టర్ డెస్సిమా విలియమ్స్; దక్షిణాఫ్రికా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ప్రావిన్సెస్ డిప్యూటీ చైర్‌పర్సన్ శ్రీ పూబాలన్ గోవేందర్; దక్షిణాఫ్రికా నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ శ్రీ అన్నేలీ లాట్రియెట్ తదితరులతో లోక్‌సభ స్పీకర్‌ శ్రీ ఓం బిర్లా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.

కాగా, సదస్సు అజెండా, ఇతర విధివిధానాలపై ‘సీఎస్‌పీఓసీ’ స్థాయీ సంఘం ఇవాళ సమావేశమై చర్చించింది.

కామన్వెల్త్ కూటమిలో ప్రజాస్వామ్య విలువలు, సంస్థాగత సమగ్రత, ప్రభావశీల పార్లమెంటరీ పర్యవేక్షణపై సమష్టి నిబద్ధతను ప్రస్తుత 28వ ‘సీఎస్‌పీఓసీ’ బలోపేతం చేస్తుందని, ప్రపంచ పార్లమెంటరీ సంబంధాలకు విశ్వసనీయ, బాధ్యతాయుత సమన్వయకర్తగా భారత్‌ ప్రధాన పాత్రను చాటిచెబుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2214985) సందర్శకుల సూచీ సంఖ్య : : 39
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी