ప్రధాన మంత్రి కార్యాలయం
అనువాదం: గుజరాత్‌లో జరిగిన 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్'లో ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
11 JAN 2026 2:29PM by PIB Hyderabad
జై సోమనాథ్.
జై సోమనాథ్.
ప్రజాదరణ కలిగిన గౌరవ గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, ఉత్సాహవంతుడైన యువ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వి గారు.. గుజరాత్ ప్రభుత్వ మంత్రులు జితుభాయ్ వాఘాని, అర్జున్‌భాయ్ మోద్వాడియా, డాక్టర్ ప్రద్యుమ్న వాజా, కౌశిక్ భాయ్ వేకారియా.. పార్లమెంటు సభ్యుడు రాజేష్‌భాయ్, ఇతర విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా.. ఈ రోజు దేశ నలుమూలలకు చెందిన లక్షలాది మంది ప్రజలు మనతో అనుసంధానమై ఉన్నారు.. వారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ‘సోమనాథుడికి విజయం కలుగుగాక’!!
మిత్రులారా,
ఈ క్షణం అసాధారణమైనది.. ఈ వాతావరణం అసాధారణమైనది.. ఈ వేడుక అసాధారణమైనది. ఒకవైపు దేవాది దేవుడైన మహాదేవుడు.. మరోవైపు సముద్రపు అనంతమైన కెరటాలు ఉన్నాయి. సూర్యకిరణాలు, పవిత్ర మంత్రాల ప్రతిధ్వని, భక్తి ప్రవాహం, ఈ దైవిక వాతావరణంలో సోమనాథుని భక్తులందరూ ఉండటం ఈ సందర్భాన్ని దైవికమైనదిగా, అద్భుతమైనదిగా మార్చింది. సోమనాథ్ ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడిగా నాకు ఈ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో చురుకుగా సేవ చేసే అవకాశం లభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. దయచేసి వెనుక నుంచి వస్తున్న శబ్దాన్ని ఆపండి.
72 గంటల పాటు నిరంతర ఓంకార నాదం, 72 గంటల పాటు నిరంతరాయంగా మంత్రోచ్ఛారణలు జరిగాయి. నిన్న సాయంత్రం వేద గురుకులాలకు చెందిన వెయ్యి మంది విద్యార్థులతో కలిసి వెయ్యి డ్రోన్‌లు సోమనాథ్ వెయ్యేళ్ల చరిత్రను ప్రదర్శించడాన్ని నేను స్వయంగా వీక్షించాను. ఈ రోజు మంత్రాలు, స్తోత్రాలతో మనోహరమైన 108 గుర్రాల వీరోచిత ఊరేగింపులు ఆలయానికి చేరుకున్నాయి. ఇందులో ప్రతిదీ మంత్రముగ్ధులను చేసింది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేం.. కాలం మాత్రమే దీనిని భద్రపరచగలదు. ఈ వేడుక గర్వం, గౌరవం, వైభవం, జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది వైభవోపేతమైన వారసత్వాన్ని, ఆధ్యాత్మిక సారాన్ని, అనుభవంలోని ఆనందాన్ని, సామూహిక అనుబంధాన్ని, అన్నింటికీ మించి ఆ మహాదేవుని ఆశీస్సులను కలిగి ఉంది. రండి.. నాతో కలిసి అనండి.. నమః పార్వతీ పతయే... హర హర మహాదేవ్!
మిత్రులారా,
నేను ఈ రోజు మీతో మాట్లాడుతున్నప్పుడు నా మనస్సు పదేపదే అడుగుతోంది.. సరిగ్గా వెయ్యి సంవత్సరాల క్రితం మీరు కూర్చున్న ఇదే ప్రదేశంలో వాతావరణం ఎలా ఉండి ఉంటుంది? ఈ రోజు ఇక్కడ ఉన్నవారు, మీ పూర్వీకులు, మన పూర్వీకులు ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. విశ్వాసం కోసం, భక్తి కోసం, మహాదేవుని కోసం వారు సర్వస్వాన్ని త్యాగం చేశారు. వెయ్యి సంవత్సరాల క్రితం ఆ దురాక్రమణదారులు విజయం సాధించినట్లు భావించారు. కానీ వెయ్యి సంవత్సరాల తర్వాత ఈ రోజు సోమనాథ్ ఆలయంపై ఎగురుతున్న పతాకం భారతదేశానికి ఉన్న నిజమైన బలాన్ని, శక్తిని మొత్తం సృష్టికి చాటిచెబుతోంది. ఈ ప్రభాస్ పటాన్ పవిత్ర భూమిలోని ప్రతి మట్టి రేణువు పరాక్రమానికి, ధైర్యానికి, వీరత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. సోమనాథుని ఈ రూపం కోసం లెక్కలేనంత మంది శివ భక్తులు, లెక్కలేనంత మంది సాంస్కృతిక ఆరాధకులు, లెక్కలేనంత మంది సంప్రదాయ వాహకులు ప్రాణాలను అర్పించారు. ఈ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా సోమనాథుని రక్షణ కోసం, ఆలయ పునర్నిర్మాణం కోసం జీవితాలను అంకితం చేసి ఆ మహాదేవునికి సర్వస్వాన్ని సమర్పించిన ప్రతి వీరుడికి, వీర మహిళకు ముందుగా భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను.
సోదరీసోదరులారా,
ఈ ప్రభాస్ పటాన్ క్షేత్రం కేవలం శివుని నివాసం మాత్రమే కాదు.. దీని పవిత్రత శ్రీకృష్ణ పరమాత్మతో కూడా ముడిపడి ఉంది. మహాభారత కాలంలో పాండవులు కూడా ఈ పవిత్ర స్థలంలోనే తపస్సు చేశారు. అందుకే భారత్‌కు ఉన్న లెక్కలేనన్ని దృక్కోణాలకు నమస్కరించే ఒక గొప్ప అవకాశం ఈ సందర్భం. సోమనాథ్ స్వాభిమానం వెయ్యేళ్ల ప్రయాణాన్ని మనం స్మరించుకుంటున్న తరుణంలోనే 1951లో ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తికావడం యాదృచ్ఛికమే అయినా, సంతోషాన్ని కలిగించేదే. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ అనేది కేవలం వెయ్యేళ్ల క్రితం జరిగిన విధ్వంసాన్ని గుర్తుచేసుకోవడం మాత్రమే కాదు… ఇది వెయ్యి సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణానికి సంబంధించిన వేడుక. ఇది భారతదేశ ఉనికి, ఆత్మగౌరవానికి సంబంధించిన పండుగ కూడా. ఎందుకంటే ప్రతి అడుగులోనూ, ప్రతి కీలక ఘట్టంలో సోమనాథ్‌కు, భారత్‌కు మధ్య మనం అద్భుతమైన సరిపోలికలను చూడొచ్చు. సోమనాథ్‌ను ధ్వంసం చేయడానికి ఎలాగైతే పదేపదే ప్రయత్నాలు, కుట్రలు జరిగాయో అదే విధంగా విదేశీ ఆక్రమణదారులు శతాబ్దాల తరబడి భారతదేశాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ సోమనాథ్ నశించలేదు.. భారతదేశం కూడా అంతరించిపోలేదు. ఎందుకంటే భారత్, దేశంలోని విశ్వాస కేంద్రాలు ఒకదానితో ఒకటి విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయి.
మిత్రులారా,
ఒక్కసారి ఆ చరిత్ర గురించి ఆలోచించండి. సరిగ్గా వెయ్యి సంవత్సరాల క్రితం 1026 సంవత్సరంలో మహ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ్ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశాడు. సోమనాథ్ ఉనికిని తుడిచిపెట్టేసినట్లు అతను భావించాడు. కానీ కొన్ని సంవత్సరాల లోపే సోమనాథ్ పునర్నిర్మాణమైంది. 12వ శతాబ్దంలో కుమారపాల రాజు ఆలయానికి అద్భుతమైన పునరుద్ధరణ పనులను చేపట్టారు. 13వ శతాబ్దం చివరలో అల్లావుద్దీన్ ఖిల్జీ మళ్లీ సోమనాథ్‌పై దాడి చేసే సాహసం చేశాడు. ఖిల్జీ సైన్యాలకు వ్యతిరేకంగా జలోర్ పాలకుడు వీరోచితంగా పోరాడారని చెబుతారు. వెంటనే 14వ శతాబ్దం ప్రారంభంలో జునాగఢ్ రాజు మరోసారి సోమనాథ్ పవిత్రతను పునరుద్ధరించారు. 14వ శతాబ్దం తర్వాతి కాలంలో ముజఫర్ ఖాన్ సోమనాథ్‌పై దాడి చేశాడు. కానీ ఆ దాడి కూడా విఫలమైంది.
15వ శతాబ్దంలో సుల్తాన్ అహ్మద్ షా.. ఆలయ పవిత్రతను దెబ్బతీయడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత అతని మనవడు సుల్తాన్ మహమూద్ బెగడ.. సోమనాథ్‌ను మసీదుగా మార్చడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ మహాదేవుని భక్తుల కృషితో ఆ ఆలయం మరోసారి సజీవంగా మారింది. 17-18 శతాబ్దాలలో ఔరంగజేబు యుగం వచ్చింది. అతను ఆలయ పవిత్రతను భంగపరిచి.. దానిని మసీదుగా మార్చడానికి మళ్ళీ ప్రయత్నించాడు. ఆ తర్వాత కూడా అహల్యాబాయి హోల్కర్.. కొత్త ఆలయాన్ని నిర్మించి సోమనాథ్‌ను మరోసారి సాక్షాత్కరించేలా చేశారు.
కాబట్టి సోమనాథ్ చరిత్ర... కేవలం విధ్వంసం, ఓటమికి సంబంధించినది కాదు.. అది విజయం, పునర్నిర్మాణానికి సంబంధించిన చరిత్ర. ఇది మన పూర్వీకుల పరాక్రమం, వారి త్యాగం, అంకితభావానికి సంబంధించిన చరిత్ర. దురాక్రమణదారులు వస్తూనే ఉన్నారు. మతపరమైన మతోన్మాదపు కొత్త తరాలు దాడులు చేస్తూనే ఉన్నాయి. కానీ ప్రతి కాలంలోనూ పదేపదే సోమనాథ్ పునఃప్రతిష్ఠ జరిగింది. శతాబ్దాల కాలం పాటు సాగిన ఇటువంటి పోరాటం, సుదీర్ఘమైన ప్రతిఘటన.. అంతటి గొప్ప సహనం, సృజనాత్మకత.. పునర్నిర్మాణంలో పట్టుదల.. అంతటి శక్తి, సంస్కృతిపై అచంచలమైన నమ్మకం, భక్తి.. ఇలాంటి ఉదాహరణలు ప్రపంచ చరిత్రలోనే అరుదు. చెప్పండి.. మన పూర్వీకుల పరాక్రమాన్ని మనం గుర్తుంచుకోవాలి కదా? వారి సాహసోపేతమైన పనుల నుంచి మనం స్ఫూర్తి పొందాలి కదా? ఏ పుత్రుడు, ఏ వారసుడు సొంత తాతముత్తాతల వీరత్వాన్ని మరిచిపోయినట్లు నటిస్తాడు?
సోదరీసోదరులారా,
గజనీ నుంచి ఔరంగజేబు వరకు లెక్కలేనంత మంది దురాక్రమణదారులు సోమనాథ్‌పై దాడి చేశారు. తమ కత్తులు శాశ్వతమైన సోమనాథుడిని జయించగలవని వారు నమ్మారు. కానీ 'సోమనాథ్' అనే పేరులోనే 'సోమ'.. అంటే అమరత్వాన్ని ప్రసాదించే అమృతం ఉందని ఆ మతోన్మాదులు గ్రహించలేకపోయారు. విషాన్ని సేవించినప్పటికీ అమరత్వంతో విరాజిల్లడం అనే తత్వాన్ని ఇది తెలియజేస్తోంది. దానిలో సదాశివ మహాదేవుని చైతన్య శక్తి నిబిడీకృతమై ఉంది. ఆయన శుభకరుడు మాత్రమే కాదు.. 'ప్రచండ తాండవః శివః'లో వ్యక్తమయ్యే శక్తికి మూలకారకుడు కూడా.
సోదరీసోదరులారా,
సోమనాథ్‌లో కొలువై ఉన్న మహాదేవుడిని 'మృత్యుంజయ' అంటే మృత్యువును జయించినవాడు, కాల స్వరూపుడు అని కూడా పిలుస్తారు. యతో జాయతే పాల్యతే యేన విశ్వం, తమిశం భజే లీయతే యత్ర విశ్వం! అంటే ఈ విశ్వం ఆయన నుంచి పుట్టింది.. ఆయన ద్వారానే పోషణ పొందుతోంది.. చివరికి ఆయనలోనే లీనమవుతుంది.
మనం ఇది నమ్ముతాం:
త్వమేకో జగత్ వ్యాపకో విశ్వరూప్!
అంటే శివుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు.
అందుకే మనం ప్రతి అణువులోనూ, ప్రతి శిలలోనూ శంకరుడిని చూస్తాం. అలాంటప్పుడు శంకరుని లెక్కలేనన్ని రూపాలను ఎవరైనా ఎలా నాశనం చేయగలరు? జీవుడిలో కూడా శివుడిని చూసేవాళ్లం మనం! మా విశ్వాసాన్ని ఎవరైనా ఎలా కదిలించగలరు?
మిత్రులారా,
సోమనాథ్‌ను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో వచ్చిన మతోన్మాదులు నేడు చరిత్రలోని కొన్ని పేజీలకే పరిమితమైపోయారు అనేది కాలం చెబుతోంది. అయినప్పటికీ సోమనాథ్ ఆలయం నేటికీ అనంతమైన సముద్ర తీరాన సమున్నతంగా నిలబడి ఎత్తైన ధర్మ పతాకాన్ని గర్వంగా ఎగురవేస్తోంది. ‘చంద్రశేఖరమ్ ఆశ్రయే మమ కిమ్ కరిష్యతి వై యమః! అంటే- నేను చంద్రశేఖరుడైన శివుని ఆశ్రయంలో ఉన్నాను.. సాక్షాత్తు ఆ కాలమే నన్ను ఏమీ చేయలేదు’ అని సోమనాథ్ శిఖరం ప్రకటిస్తున్నట్లు అనిపిస్తుంది.
మిత్రులారా,
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కేవలం చారిత్రక వైభవాన్ని ఉత్సవంగా చేసుకోవటమే కాదు.. ఇది భవిష్యత్తు కోసం ఒక శాశ్వత ప్రయాణానికి జీవం పోసే మాధ్యమం కూడా. మన అస్తిత్వాన్ని, ఉనికిని బలోపేతం చేసుకోవడానికి మనం ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలి. మీరు గమనిస్తే.. ఏ దేశానికైనా కొన్ని వందల సంవత్సరాల పురాతన వారసత్వం ఉంటే దానిని ఆ దేశం తన గుర్తింపుగా ప్రపంచానికి చాటుకుంటుంది. కానీ భారత్ దగ్గర సోమనాథ్ వంటి వేల ఏళ్ల నాటి పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలు మన శక్తికి, పట్టుదలకు, సంప్రదాయానికి చిహ్నాలుగా నిలిచాయి. దురదృష్టవశాత్తు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బానిసత్వ మనస్తత్వం కలిగిన వారు ఈ వారసత్వం నుంచి తమను తాము దూరం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ చరిత్రను తుడిచిపెట్టడానికి దురుద్దేశపూరితమైన ప్రయత్నాలు జరిగాయి.
సోమనాథ్ రక్షణ కోసం దేశం ఎలాంటి త్యాగాలు చేసిందో మనకు తెలుసు. రావల్ కన్హద్‌దేవ్ వంటి పాలకుల కృషి, వీర్ హమీర్జీ గోహిల్ పరాక్రమం, వెగ్దా భీల్ శౌర్యం.. ఇలా ఎందరో వీరులు సోమనాథ్ ఆలయ చరిత్రతో ముడిపడి ఉన్నారు. అయినప్పటికీ విచారకరంగా వారికి తగిన గుర్తింపు ఎప్పుడూ లభించలేదు. బదులుగా కొంతమంది చరిత్రకారులు, రాజకీయ నాయకులు.. దండయాత్రల చరిత్రను మసిపూసి మారేడు కాయ చేయడానికి ప్రయత్నించారు. మతపరమైన మతోన్మాదాన్ని కేవలం దోపిడీగా చిత్రీకరిస్తూ పుస్తకాలు రాశారు. కానీ సోమనాథ్‌పై ఒక్కసారి మాత్రమే దాడి జరగలేదు.. పదేపదే దాడులు జరిగాయి. దాడులు కేవలం దోపిడీ కోసమే అయితే వెయ్యి సంవత్సరాల క్రితం జరిగిన మొదటి పెద్ద దోపిడీ తర్వాతే అవి ఆగిపోయేవి. కానీ అది నిజం కాదు. సోమనాథుని పవిత్ర విగ్రహాన్ని అపవిత్రం చేశారు. ఆలయ రూపురేఖలను పదేపదే మార్చారు. సోమనాథ్ కేవలం దోపిడీ కోసమే ధ్వంసం అయిందని మనకు బోధించారు. ద్వేషం, అణచివేత, ఉగ్రవాదంతో నిండిన క్రూరమైన చరిత్రను మన నుంచి దాచిపెట్టారు.
మిత్రులారా,
తన మతం పట్ల నిజమైన విశ్వాసం ఉన్న ఏ వ్యక్తి కూడా ఇటువంటి మతోన్మాదాన్ని సమర్థించరు. అయినప్పటికీ బుజ్జగింపు రాజకీయాలు చేసే వారు ఎల్లప్పుడూ ఇటువంటి మనస్తత్వానికి మోకరిల్లారు. భారతదేశం బానిసత్వ శృంఖలాల నుంచి విముక్తి పొందిన తర్వాత సోమనాథ్‌ను పునర్నిర్మించాలన్న ప్రతిజ్ఞ సర్దార్ పటేల్ చేసినప్పుడు కూడా ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. 1951లో రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ సమయంలో సౌరాష్ట్రకు చెందిన అత్యంత ప్రసిద్ధ పాలకుడైన మన జామ్ సాహెబ్ మహారాజా దిగ్విజయ్ సింగ్ గారు ముందుకొచ్చారు. భూసేకరణ నుంచి భద్రతా ఏర్పాట్ల వరకు ఆయన జాతీయ గౌరవాన్ని అన్నింటికంటే మిన్నగా భావించారు. ఆ కాలంలో జామ్ సాహెబ్.. సోమనాథ్ ఆలయం కోసం లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చారు. ట్రస్ట్ మొదటి అధ్యక్షుడిగా గొప్ప బాధ్యతను భుజానికెత్తుకున్నారు.
సోదరీసోదరులారా,
సోమనాథ్ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు విచారకరంగా నేటికీ మన దేశంలో చురుకుగా ఉన్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలు నేడు కత్తులకు బదులుగా ఇతర దుర్మార్గపు రూపాలను దాల్చుతున్నాయి. అందుకే మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. మనల్ని మనం మరింత బలోపేతం చేసుకోవాలి. మనం ఐక్యంగా ఉండాలి.. కలిసికట్టుగా నిలబడాలి. మనల్ని విభజించాలని చూసే ప్రతి శక్తిని ఓడించాలి.
మిత్రులారా,
మనం మన విశ్వాసంతో, మన మూలాలతో అనుసంధానమై ఉన్నప్పుడు.. మన వారసత్వాన్ని గర్వంతో, అప్రమత్తతతో కాపాడుకున్నప్పుడు మన నాగరికత పునాదులు మరింత బలోపేతం అవుతాయి. అందుకే ఈ వెయ్యి సంవత్సరాల ప్రయాణం రాబోయే వెయ్యి సంవత్సరాల కోసం మనల్ని సిద్ధం కావడానికి స్ఫూర్తినిస్తుంది.
మిత్రులారా,
రామమందిర ప్రాణప్రతిష్ఠ వంటి చారిత్రాత్మక సందర్భంలో.. రాబోయే వెయ్యి సంవత్సరాల కోసం భారత్ ముందు నేను ఒక ఉదాత్తమైన దార్శనికతను పెట్టాను. 'దైవం నుంచి దేశం వరకు' అనే దృక్పథంతో ముందుకు సాగడం గురించి నేను మాట్లాడాను. నేడు భారతదేశపు సాంస్కృతిక పునరుజ్జీవనం కోట్లాది మంది పౌరులలో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. నేడు ప్రతి భారతీయుడు అభివృద్ధి చెందిన భారతదేశంపై విశ్వాసం కలిగి ఉన్నాడు. నేడు 140 కోట్ల మంది భారతీయులు భవిష్యత్ లక్ష్యాల పట్ల దృఢ సంకల్పంతో ఉన్నారు. భారత్ తన వైభవాన్ని సరికొత్త శిఖరాలకు చేరుస్తుంది. పేదరికంపై మనం చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తాం. మనం అభివృద్ధిలో కొత్త మైలురాళ్లను అధిరోహిస్తాం. మొదట ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యం, తర్వాత ఆపై ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఈ మార్గం ఇప్పుడు సిద్ధంగా ఉంది. సోమనాథ్ ఆలయ శక్తి ఈ సంకల్పాలకు ఆశీస్సులను అందిస్తోంది.
మిత్రులారా,
నేటి భారతదేశం వారసత్వం నుంచి అభివృద్ధి వైపు స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. సోమనాథ్‌లో అభివృద్ధి, వారసత్వం రెండూ కలిసి సాకారమవుతున్నాయి. ఒకవైపు సోమనాథ్ ఆలయ సాంస్కృతిక విస్తరణ, సోమనాథ్ సంస్కృత విశ్వవిద్యాలయ స్థాపన, మాధవ్‌పూర్ మేళా చైతన్యం.. ఇవన్నీ మన వారసత్వాన్ని బలోపేతం చేస్తున్నాయి. గిర్ సింహాల సంరక్షణ ఈ ప్రాంతానికి ఉన్న సహజ ఆకర్షణను పెంపొందిస్తోంది. మరోవైపు ప్రభాస్ పటాన్‌లో అభివృద్ధికి సంబంధించిన కొత్త కోణాలు ఆవిష్కృతమవుతున్నాయి. కేశోద్ విమానాశ్రయ విస్తరణ వల్ల దేశవిదేశాల నుంచి వచ్చే యాత్రికులు నేరుగా సోమనాథ్‌కు చేరుకోగలుగుతారు. అహ్మదాబాద్-వెరావల్ వందే భారత్ రైలు ప్రారంభం కావడంతో యాత్రికులు, పర్యాటకుల ప్రయాణ సమయం తగ్గింది. ఈ ప్రాంతంలో తీర్థయాత్ర సర్క్యూట్ అభివృద్ధి కూడా కొనసాగుతోంది. ఈ విధంగా నేటి భారతదేశం కేవలం విశ్వాసాన్ని స్మరించుకోవడమే కాకుండా.. మౌలిక సదుపాయాలు, అనుసంధానత, సాంకేతికత ద్వారా భవిష్యత్తు కోసం దానిని శక్తిమంతం చేస్తోంది.
మిత్రులారా,
మన నాగరికత అందించే సందేశం ఎన్నడూ ఇతరులను ఓడించడం కాదు.. జీవితాన్ని సమతుల్యంగా ఉంచుకోవడం. మన సంప్రదాయంలో విశ్వాస మార్గం ద్వేషానికి దారితీయదు. మన బలం విధ్వంసం చేసే అహంకారాన్ని మనకు ఇవ్వదు. ‘సృజన మార్గం సుదీర్ఘమైనది కావచ్చు.. కానీ అది శాశ్వతమైనది, అమరమైనది’ అని సోమనాథ్ మనకు నేర్పింది. కత్తి మొనతో హృదయాలను ఎన్నటికీ గెలవలేం. ఇతరులను తుడిచిపెట్టి ముందుకు సాగాలని చూసే నాగరికతలు కాలక్రమంలో కలిసిపోతాయి. అందుకే భారతదేశం ఇతరులను ఓడించి గెలవాలని ప్రపంచానికి బోధించలేదు.. హృదయాలను గెలుచుకుని ఎలా జీవించాలో నేర్పింది. ఈ ఆలోచనే నేడు ప్రపంచానికి ఎంతో అవసరం. సోమనాథ్ వెయ్యేళ్ల గాథ మొత్తం మానవాళికి ఇదే పాఠాన్ని అందిస్తోంది.
కాబట్టి మనం అభివృద్ధి దిశగా ముందుకు సాగడానికి మన గతాన్ని, వారసత్వాన్ని విస్మరించకుండా మన లక్ష్యాలను మరువకుండా ఒకరికొకరు తోడుగా భుజం భుజం కలిపి, హృదయాలను మేళవించి అడుగులు వేద్దాం అనే సంకల్పం తీసుకుందాం. మన చైతన్యాన్ని కాపాడుకుంటూనే ఆధునికతను ఆహ్వానిద్దాం. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ వంటి పండుగల నుంచి స్ఫూర్తి పొంది పురోగతి మార్గంలో వేగంగా పయనిద్దాం. ప్రతి సవాలును అధిగమించి మన లక్ష్యాలను చేరుకుందాం. ఈ కార్యక్రమం ఈ రోజు ప్రారంభమవుతుంది. ఈ వెయ్యేళ్ల ప్రయాణాన్ని దేశవ్యాప్తంగా స్మరించుకోవాలి. మన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి. ఈ కొత్త 75 ఏళ్ల కీలక ఘట్టాన్ని ఉత్సవంలా జరుపుకోవాలి. ఈ వేడుకలను మే 2027 వరకు కొనసాగించాలి. ప్రతి ఒక్కరిని మేల్కొల్పుదాం. మేల్కొన్న దేశపు కలలను సాకారం చేసుకోవడానికి ముందుకు సాగనిద్దాం. ఈ ఆకాంక్షతో మరోసారి నా దేశప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
హర హర మహాదేవ్!
జై సోమనాథ్.
జై సోమనాథ్.
జై సోమనాథ్.
***
(रिलीज़ आईडी: 2213632)
आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam