శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంటువ్యాధుల నుంచి వ్యక్తిగతీకరించిన వైద్యం దాకా భారత్‌ నేడు భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ దశలోకి ప్రవేశిస్తోంది: డాక్టర్ జితేంద్ర సింగ్


హైదరాబాద్‌లోని ‘డీబీటీ-సీడీఎఫ్‌డీ’లో ‘సమర్థ్‌’ నైపుణ్య కేంద్రం శంకుస్థాపన సహా ‘ఐడీఈఏ-ఎన్‌ఏ బీఆర్‌ఐసీ-సీడీఎఫ్‌డీ’ టెక్నాలజీ ఇంక్యుబేటర్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి

“అరుదైన... జన్యు వ్యాధుల ముందస్తు గుర్తింపుతోపాటు అందుబాటు వ్యయంతో వ్యక్తిగతీకరించిన వైద్యంపై భారత్‌ దృష్టి సారించాలి”

“దేశంలో అరుదైన వ్యాధుల చికిత్స సంబంధిత తొలి జాతీయ విధానాన్ని 2021లో ప్రవేశపెట్టింది మోదీ ప్రభుత్వమే”

“ప్రభుత్వ విధానంలో వినూత్న మార్పును సూచించడంతోపాటు దూరదృష్టి.. సార్వత్రిక శాస్త్రీయ వనరుల కల్పనను ఇది ప్రతిబింబిస్తుంది”

“ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా బయోటెక్నాలజీ సహా వ్యాధి నివారక ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది”

प्रविष्टि तिथि: 09 JAN 2026 5:13PM by PIB Hyderabad

అరుదైన, జన్యు వ్యాధుల ముందస్తు గుర్తింపుతోపాటు అందుబాటు వ్యయంతో వాటికి చికిత్స చేయడం ఆరోగ్య సంరక్షణ రంగంలో నేడు అతిపెద్ద సవాళ్లని కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూవిజ్ఞాన (స్వతంత్ర బాధ్యత), అంతరిక్ష, అణుశక్తి శాఖలు సహా పీఎంవో సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఓ కార్యక్రమం సందర్భంగా ప్రసంగిస్తూ- జన్యుశాస్త్రం, బయోటెక్నాలజీ, వ్యాధి నివారక ఆరోగ్య సంరక్షణ మార్గంలో సంక్లిష్ట ఆరోగ్య సమస్యల పరిష్కారానికి దేశం శాస్త్రీయంగా, ఆర్థికంగా సన్నద్ధమైందని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని డీబీటీ-బీఆర్‌ఐసీ సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)ని ఆయన ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ‘సమర్థ్‌’ జాతీయ నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి శంకుస్థాపన చేయడంతోపాటు ‘ఐడీఈఏ-ఎన్‌ఏ బీఆర్‌ఐసీ-సీడీఎఫ్‌డీ’ టెక్నాలజీ ఇంక్యుబేటర్‌ను మంత్రి ప్రారంభించారు.

మునుపటి దశాబ్దాల్లో అంటువ్యాధులతో పోరాడుతూ వచ్చిన దేశంగా పరిగణలోగల భారత్‌ ఇప్పుడు తదుపరి తరం ఆరోగ్య సంరక్షణ దశలోకి ప్రవేశించిందని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ అన్నారు. ఈ మేరకు మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్, జీనోమ్ సీక్వెన్సింగ్, వ్యక్తిగతీకరించిన వైద్యం ఆరోగ్య సంరక్షణకు ప్రపంచ కూడలిగా మారుతున్నదని చెప్పారు. ప్రయోగశాలల్లో పరిశోధనల విజయాలను వాస్తవ జీవన పరీక్షా ఫలితాలతో అనుసంధానించడంలో ‘సీడీపీఎఫ్‌డీ’ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో ప్రభుత్వ విధానాల దిశను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఎర్రకోట పైనుంచి ఆయన ప్రసంగాల్లో పలుమార్లు ప్రధానంగా ప్రకటించిన మేరకు బయోటెక్నాలజీ, ఆరోగ్య రంగాలకు మునుపెన్నడూ ఎరుగని రీతిలో ప్రాధాన్యం లభిస్తున్నదని మంత్రి తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో బయో-ఇ3 విధానాన్ని ఆయన ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, అంకుర సంస్థలు, యువ ఆవిష్కర్తలలో విస్తృత ఉత్సుకత ప్రేరేపించిందని వివరించారు.

దేశం నేడు పెద్ద ఎత్తున జీనోమ్ సీక్వెన్సింగ్ ఆధారిత పీడియాట్రిక్ జన్యు వ్యాధుల కార్యక్రమాలు సహా హీమోఫీలియా వంటి పలు అంశాల్లో ప్రగతిశీల కృషితో భారత్‌ వేగంగా పురోగమిస్తున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు విభిన్న చికిత్స విధానాలు అవసరం కావచ్చునని, ఈ నేపథ్యంలో ప్రస్తుతం సాగుతున్న కృషి వ్యక్తిగతీకరించిన వైద్య శకానికి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను సిద్ధం చేస్తున్నదని చెప్పారు.

అరుదైన వ్యాధుల అంశాన్ని ప్రస్తావిస్తూ- దేశంలో ఈ వ్యాధుల చికిత్స సంబంధిత తొలి జాతీయ విధానాన్ని 2021లో ప్రవేశపెట్టింది మోదీ ప్రభుత్వమేనని ఆయన తెలిపారు. ప్రభుత్వ విధానాల్లో వినూత్న మార్పును సూచించడంతోపాటు దూరదృష్టి, సార్వత్రిక శాస్త్రీయ వనరులను ఇది ప్రతిబింబిస్తుందని మంత్రి అన్నారు. వ్యాధుల గుర్తింపు మాత్రమే సరిపోదని, బాధితులకు పటిష్ఠ చికిత్సను కూడా అందుబాటులోకి తేవాల్సి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా సంప్రదాయ వైద్య విధానాల సంస్థాగతీకరణతోపాటు యోగాను వ్యాధి నివారక ఆరోగ్య ఉపకరణంగా ప్రపంచం గుర్తించడం వెనుక ప్రభుత్వ ప్రోత్సహిస్తున్న సమగ్ర ఆరోగ్య సంరక్షణ నమూనాను కూడా మంత్రి ప్రస్తావించారు. అలాగే జీవనశైలి, జీవక్రియ రుగ్మతల నిర్వహణ దిశగా ఆరోగ్య శ్రేయో విధానాలను ఆధునిక వైద్యంతో జోడించడం సానుకూల ఫలితాలిచ్చిందని ఆయన అన్నారు.

ఈ పర్యటన సందర్భంగా ‘సీడీఎఫ్‌డీ’లో సాగుతున్న పరిశోధన-ఆవిష్కరణ కార్యకలాపాలను డాక్టర్ జితేంద్ర సింగ్ సమీక్షించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కార్యక్రమాలతోపాటు ప్రజలకు అవగాహన కల్పన లక్ష్యంగా చేపట్టిన కృషి తదితరాలను ఆయన ప్రశంసించారు. బయోటెక్నాలజీపై విశ్వాసం, ఆసక్తిని పెంచడం కోసం పౌరులకు... ముఖ్యంగా యువతకు అర్థమయ్యే భాషలో శాస్త్రవిజ్ఞానాన్ని చేరువ చేయడం అత్యావశ్యకమని మంత్రి అన్నారు.

దేశంలో బయోటెక్ అంకుర సంస్థల సంఖ్య కొన్నేళ్లుగా అనేక రెట్లు పెరిగిందని, భారత్‌లో బయో-ఆర్థిక వ్యవస్థ వికాసానికి ఈ రంగం ఎంతగానో తోడ్పడుతుందన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. బయోటెక్నాలజీ పరిశోధన-ఆవిష్కరణ మండలి (బీఆర్‌ఐసీ) ఏర్పాటుతో సంస్థల మధ్య సమన్వయం బలోపేతమై, ఉన్నత-ప్రభావ పరిశోధనలతోపాటు పరిశ్రమ భాగస్వామ్యానికి దారితీసిందన్నారు.

టీకాలు, వ్యాధి నివారక ఆరోగ్య సంరక్షణ రంగం పరంగా భారత్‌ ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుతున్నదని మంత్రి స్పష్టం చేశారు. స్వదేశీ ఆవిష్కరణలు నేడు జాతీయంగా అమలు కావడంతోపాటు ప్రపంచ దేశాల మధ్య వాటి ఆదానప్రదానం కూడా సాగుతున్నదని తెలిపారు. ఆ మేరకు ప్రపంచ ఆరోగ్య భద్రతలో భారత్‌ పాత్ర మరింత బలోపేతం అవుతున్నదని పేర్కొన్నారు.

చివరగా- దేశ జనాభాలో దాదాపు 70 శాతం మంది 40 ఏళ్లలోపు వయస్కులేనని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ అన్నారు. అందువల్ల ముందస్తు రోగ నిర్ధారణ, వ్యాధి నివారక ఆరోగ్య రంగంపై నిశితంగా దృష్టి సారించడం జాతీయ స్థాయిలో అత్యావశ్యకమని ఆయన స్పష్టం చేశారు. ఈ దిశగా సీడీఎఫ్‌డీ పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇటువంటి సంస్థలు ఆరోగ్యకర, బలమైన, భవిష్యత్‌ సంసిద్ధ భారత్‌ రూపకల్పనలో అర్థవంతంగా దోహదం చేస్తున్నాయంటూ మంత్రి తన ప్రసంగం ముగించారు.

 

***


(रिलीज़ आईडी: 2213061) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी