ఉప రాష్ట్రపతి సచివాలయం
“సింగ్, డ్యాన్స్ అండ్ లీడ్: లీడర్‌షిప్ లెసెన్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ శ్రీల ప్రభుపాద” పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
నైతిక స్పష్టత, సేవా గుణం నాయకత్వానికి మూలమన్న ఉపరాష్ట్రపతి
కాలాతీత నాయకత్వ పాఠాలను అందించిన భారత నాగరికత జ్ఞానం: ఉపరాష్ట్రపతి
प्रविष्टि तिथि:
07 JAN 2026 6:34PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి ఎంక్లేవ్‌లో జరిగిన కార్యక్రమంలో రచయిత హిందోల్ సేన్ గుప్తా రాసిన “సింగ్, డ్యాన్స్ అండ్ లీడ్: లీడర్‌షిప్ లెసెన్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ శ్రీల ప్రభుపాద” పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన ఉపరాష్ట్రపతి.. భారతదేశాన్ని నాగరికత నాయకత్వ దేశంగా అభివర్ణించారు. విలువలు, సేవ, అంతర్గత క్రమశిక్షణతో నాయకత్వ సంప్రదాయాలకు మన దేశం ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఏ. సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద జీవితం ఈ సంప్రదాయానికి నిలువుటద్దమని.. లక్ష్యశుద్ధి, వినయం, నైతిక స్పష్టత గల నాయకత్వానికి గొప్ప నిదర్శనమని కొనియాడారు.
వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో స్వామి ప్రభుపాద ఆలోచనలు, బోధనలు సందర్భోచితంగా ఉంటాయని ఉపరాష్ట్రపతి అన్నారు. స్వామి ప్రభుపాద స్థాపించిన సంస్థలు తరతరాలుగా మానవాళికి సేవలందిస్తున్నాయని కొనియాడారు. చాలా మందికి ఆయన పేరు తెలియకపోయినా, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఆయన కృషి, దాని ప్రభావంతో లబ్ధి పొందటం, ఆయన నాయకత్వానికి అసలైన నిదర్శనమని ప్రశంసించారు.
వృద్ధాప్యంలో ఖండాంతరాలు దాటి స్వామి ప్రభుపాద సాగించిన అసాధారణ ప్రయాణాన్ని ఉపరాష్ట్రపతి స్మరించుకున్నారు. కేవలం మత తత్వమే కాక.. క్రమశిక్షణ, భక్తి, ఆనందంతో కూడిన జీవన విధానాన్ని ఆయన అనుసరించారని చెప్పారు. 1966లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం స్థాపన ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించటం.. అధికారంతో కాక, దృఢ సంకల్పం, సేవ, స్పష్టమైన దార్శనికత గల నాయకత్వానికి నిదర్శనమని కొనియాడారు.
ఆనందదాయకంగా, అందరినీ కలుపుకుపోయేదిగా, మానవీయ విలువలతో నాయకత్వం ఉంటుందన్న శక్తిమంతమైన ఆలోచనను సింగ్, డ్యాన్స్ అండ్ లీడ్ పుస్తకం తెలియజేస్తుందని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఆజ్ఞలతో కాక, స్ఫూర్తితో స్వామి ప్రభుపాద నాయకత్వాన్ని వహించారని.. భక్తి, నిరాడంబరతను వీడకుండా శాశ్వత సంస్థలను నెలకొల్పారని అన్నారు.
సంత్-కవి తిరువళ్లువర్ బోధనలను ప్రస్తావిస్తూ.. స్పష్టమైన ఆలోచన, ఉన్నతమైన అంతర్‌దృష్టితో నాయకత్వం ప్రారంభమవ్వాలని, అది క్రమంగా సామూహిక కార్యాచరణగా మారాలని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. చరిత్రను, తత్వశాస్త్రాన్ని, సమకాలీన నాయకత్వ ఆలోచనలను అనుసంధానిస్తూ.. స్వామి ప్రభుపాద జీవితాన్ని నైతిక, పరివర్తనాత్మక నాయకత్వానికి గొప్ప ఉదాహరణగా ఈ పుస్తకం ప్రభావవంతంగా వివరించిందని చెప్పారు.
ప్రజా జీవితంలో ఉన్నవారికి ఇలాంటి రచనలు ఎంతో అవసరమని.. విశ్వాసం, సంయమనం, సేవా దృక్పథంతో ప్రజాస్వామ్య సంస్థలు వృద్ధిలోకి వస్తాయని ఉపరాష్ట్రపతి తెలిపారు. కేవలం భౌతిక విజయాలకే పరిమితం కాకుండా, ఉన్నతమైన లక్ష్యం కోసం అన్వేషించేలా యువతకు ఈ పుస్తకం స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాయకత్వం అంటే ఇతరుల అభివృద్ధికి సహకరించటం, సమాజ శ్రేయస్సుకు కృషి చేయడమేనని ఈ పుస్తకం గుర్తు చేస్తుందని చెప్పారు.
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, అక్షయ పాత్ర ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్, ఇస్కాన్ బెంగళూరు అధ్యక్షుడు మధు పండిట్ దాస్, అక్షయ పాత్ర ఫౌండేషన్ వైస్ ఛైర్మన్, సహ వ్యవస్థాపకుడు, ఇస్కాన్ బెంగళూరు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంచలపతి దాస్‌లతో పాటు ఉన్నతాధికారులు, పండితులు, ఆహ్వానితులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
***
(रिलीज़ आईडी: 2212571)
आगंतुक पटल : 7