కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా నమూనా లాజిస్టిక్స్ బలోపేతానికి భారత తపాలా విభాగం, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖల మధ్య అవగాహన ఒప్పందం
प्रविष्टि तिथि:
07 JAN 2026 7:10PM by PIB Hyderabad
పురుగుల మందులు, విత్తనాలు, ఎరువుల నమూనాలను దేశవ్యాప్తంగా ఉన్న నిర్దేశిత ప్రయోగశాలలకు చేరవేసేందుకు పటిష్టమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయటానికి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ (డీఏ అండ్ ఎఫ్‌డబ్ల్యూ), తపాలా విభాగం (డీఓపీ) మధ్య ఇవాళ అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.
కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా, కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ సమక్షంలో ఈ ఎంఓయూపై సంతకాలు అయ్యాయి.
ప్రధానమంత్రి "వికసిత్ భారత్" దార్శనికతకు అనుగుణంగా, ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైన లాజిస్టిక్స్, సరఫరా వ్యవస్థల్లో ఒకటిగా భారత తపాలా విభాగం అవతరించిందని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి కొనియాడారు. దేశవ్యాప్తంగా ఉన్న 1.60 లక్షలకు పైగా పోస్టాఫీసుల్లో దాదాపు 1.40 లక్షల పోస్టాఫీసులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండటం వల్ల ప్రతి పౌరుడిని అనుసంధానించటంలో ఇండియా పోస్టు కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ లక్షలాది పోస్టులను తపాలా విభాగం గమ్యస్థానాలకు చేర్చుతుందన్నారు. ముఖ్యంగా పండగ సీజన్లలో రోజుకు దాదాపు 6 లక్షల పార్సిళ్లను డెలివరీ చేయటం ద్వారా ఆ శాఖ విస్తృతిని, నిర్వహణ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోందని చెప్పారు.
రీసెర్చ్ అండ్ ఇండస్ట్రియల్ స్టాఫ్ పెర్ఫార్మెన్స్ సెంటర్ (సీఆర్ఐఎస్పీ) అభివృద్ధి చేస్తున్న దేశవ్యాప్త ఆన్‌లైన్ పురుగుమందులు, విత్తనాలు, ఎరువుల నాణ్యత నిర్వహణ వ్యవస్థలో ఈ భాగస్వామ్యం ఒక భాగం. నాణ్యత నియంత్రణను బలపరచటం, పారదర్శకతను పెంచటం, సాంకేతికత వినియోగంతో వ్యవసాయ నమూనాలను సమయానుకూలంగా పరీక్షించటం ఈ వ్యవస్థ లక్ష్యాలు.
ఈ ఎంఓయూ ద్వారా పురుగుమందులు, విత్తనాలు, ఎరువుల ఇనస్పెక్టరు సేకరించిన నమూనాలను సురక్షితంగా, గుర్తించగలిగేలా, నిర్ణీత సమయంలో చేరవేసేందుకు సమగ్ర లాజిస్టిక్స్ సహకారాన్ని తపాలా శాఖ అందిస్తుంది. సుదూర, గ్రామీణ ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా విస్తరించిన వ్యవస్థ, చివరి ప్రాంతానికి కూడా చేరుకోగల సదుపాయాన్ని వినియోగించుకుని, ఈ నమూనాల రవాణాను అత్యంత నమ్మకంగా, సమర్థవంతంగా ఇండియా పోస్టు నిర్వహిస్తుంది.
ఈ సేవల్లో భాగంగా నమూనాల సేకరణకు ప్రత్యేక కేంద్రాలు, కొన్ని శాంపిల్స్ కోసం స్పెషల్ ప్యాకేజింగ్, గోప్యతకు క్యూఆర్ కోడ్ అడ్రస్ వినియోగం, డిజిటల్ ట్రాకింగ్ సౌకర్యాలను కల్పిస్తారు. అవసరమైన చోట ఉష్ణోగ్రతను కూడా డిజిటల్ విధానంలో పర్యవేక్షిస్తారు.
నకిలీ, నాసిరకం పురుగుమందులు, విత్తనాలు, ఎరువుల వల్ల రైతులకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతుందని, వాళ్లు మనోవేదనకు గురవుతున్నారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పాదకాలను వేగంగా, విశ్వసనీయ రీతిలో పరీక్షించటం వల్ల రైతుల భద్రత విషయంలో ఈ ఎంఓయూ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. నమూనాలను ప్రయోగశాలలకు తరలించటంలో జాప్యాన్ని తగ్గించటం ద్వారా నిఘా వ్యవస్థ బలపడి, మార్కెట్లో నకిలీ ఉత్పత్తుల చలామణిని అరికట్టటానికి సహాయపడుతుందని తెలిపారు.
మెరుగైన లాజిస్టిక్స్, డిజిటల్ ట్రాకింగ్ విధానాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, గతంలో నమూనాలు ప్రయోగశాలలకు చేరేందుకు 10 నుంచి 15 రోజుల సమయం పట్టేదని, ఇకపై 48 నుంచి 72 గంటల్లోనే చేరతాయని చెప్పారు. దీనివల్ల సకాలంలో పరీక్షలు నిర్వహించి, తగిన చర్యలు తీసుకోవటానికి వీలవుతుందన్నారు. తాము పొందుతున్న వ్యవసాయ ఉత్పాదకాల నాణ్యతపై రైతుల్లో నమ్మకం పెరుగుతుంది.
ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయటం, జాతీయ కార్యక్రమాల అమలుకు ఇండియా పోస్టు లాజిస్టిక్స్ సామర్థ్యాలను వినియోగించటంపై ప్రభుత్వాసక్తిని ఈ భాగస్వామ్యం ప్రతిబింబిస్తుంది. దీని ద్వారా పర్యవేక్షణ మెరుగుపడి, వ్యవసాయ రంగంలో నాణ్యత పెరగటంతో పాటు నకిలీ వ్యవసాయ ఉత్పాదకతల వల్ల రైతులకు కలిగే నష్టాలను అరికట్టవచ్చు.
***
(रिलीज़ आईडी: 2212558)
आगंतुक पटल : 7