బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు రంగాభివృద్దిపై సమీక్ష, భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనకు బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల చింతన్ శివిర్ నిర్వహణ
అమలు వేగం పెంచేందుకు చింతన్ శివిర్ ఫలితాలను అన్ని స్థాయిలకూ చేర్చాలన్న బొగ్గు శాఖ మంత్రి
प्रविष्टि तिथि:
06 JAN 2026 6:18PM by PIB Hyderabad
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి అధ్యక్షతన, కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే సహ-అధ్యక్షతన, 2026 జనవరి 5, 6వ తేదీల్లో గురుగ్రామ్ లోని మానెసర్ లో రెండు రోజుల పాటు చింతన్ శివిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ చింతన్ శివిర్‌లో బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్‌దత్, అదనపు కార్యదర్శులు శ్రీమతి రూపిందర్ బ్రార్, శ్రీ సనోజ్ కుమార్ ఝా, కోల్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్, అన్ని బొగ్గు, లిగ్నైట్ ప్రభుత్వ రంగ సంస్థల సీఎండీలతో పాటు బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బొగ్గు రంగంలోని అగ్రశ్రేణి నాయకత్వం.. సాధారణ పరిపాలనా పనులకు పరిమితం కాకుండా సంస్కరణలు, పనితీరు, సంస్థాగత మార్పులపై దృష్టి సారించి, ఫలితాలనిచ్చే చర్చల్లో పాల్గొనే అవకాశాన్ని ఈ వేదిక కల్పించింది.
బొగ్గు రంగంలో కొనసాగుతున్న సంస్కరణల పురోగతి సమీక్ష, భారతదేశ దీర్ఘకాలిక ఇంధన భద్రత, అభివృద్ధి ప్రాధాన్యతలకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందించటానికి వ్యూహాత్మక వేదికగా చింతన్ శివిర్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి కీలక ప్రసంగమిస్తూ, స్వచ్ఛ ఇంధన వనరుల వైపు భారత్ వేగంగా పయనిస్తున్నప్పటికీ, దేశ ఇంధన భద్రతలో బొగ్గు ఇప్పటికీ అత్యవసరమైన మూలాధారమన్నారు. బొగ్గు ద్వారా స్థిరంగా, నిరంతర విద్యుత్ పంపిణీ జరుగుతుందని, ఉక్కు, సిమెంట్ వంటి కీలక పరిశ్రమలకు ఇది ఎంతగానో సహకరిస్తుందని చెప్పారు. దేశ ఆర్థిక వృద్ధిని, జాతీయాభివృద్ధిని కొనసాగించటంలో బొగ్గు కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఆర్థిక సంవత్సరం 2024-25ను చరిత్రాత్మక ఘట్టంగా కేంద్రమంత్రి అభివర్ణించారు. ఈ సమయంలో 1,047 మిలియన్ టన్నులకు పైగా బొగ్గును ఉత్పత్తి చేసి, చరిత్రలోనే గరిష్ఠ రికార్డును సాధించిందని వెల్లడించారు. నిరంతర ఉత్పత్తి సామర్థ్య పెంపు, మెరుగైన పనితీరు, బొగ్గు సరఫరా వ్యవస్థలోని పటిష్టమైన సమన్వయానికి ఈ విజయం నిదర్శనమన్నారు.
బొగ్గు రంగానికి సంబంధించిన సంస్కరణలన్నీ ఒకే విధంగా, ప్రామాణీకరణ ప్రాతిపదికన జరగాలని శ్రీ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దీనివల్ల అన్ని బొగ్గు సంబంధిత పీఎస్‌యూల్లో ఒకే రకమైన విధానాలు, స్పష్టమైన ప్రమాణాలు, అంచనా వేయదగిన ఫలితాలు ఉంటాయన్నారు. మెరుగైన ప్రణాళిక, పర్యవేక్షణ ద్వారా యంత్రాల వినియోగం పెంచేందుకు, ఆస్తుల ఉత్పాదకతను మెరుగుపరచటానికి, నిర్వహణ లోపాలు తగ్గించేందుకు ఒక నిర్దిష్టమైన, కాలపరిమితితో ప్రణాళికను రూపొందించాలని కోరారు. భద్రత విషయంలో రాజీ పడకుండా కఠినమైన భద్రతా నిబంధనలు, పటిష్టమైన పర్యవేక్షణ, జవాబుదారీతనం అవసరమని మంత్రి స్పష్టం చేశారు. అసలు ప్రమాదాలే జరగకూడదన్న లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యాచరణ వృద్ధితో పాటు, బొగ్గు గనులున్న ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలపై దృష్టి సారిస్తూ సమాజ సంక్షేమ కార్యక్రమాలను విస్తరించాలని చెప్పారు. పర్యావరణం పట్ల బొగ్గు రంగానికున్న బాధ్యతను గుర్తుచేస్తూ.. క్రమబద్ధమైన అడవుల పెంపకం, పర్యావరణ పునరుద్ధరణ ప్రాముఖ్యతను కేంద్రమంత్రి వివరించారు. సమతుల్య, బాధ్యతాయుతమైన అభివృద్ధికి హామీ ఇస్తూ, మైనింగ్ ప్రక్రియల్లో పర్యావరణహిత పద్ధతులను అనుసరించాలని సూచించారు.
దేశీయ ఉత్పత్తిలో స్థిరమైన వృద్ధి, మెరుగైన రవాణా సౌకర్యాల వల్ల బొగ్గు దిగుమతులు, ముఖ్యంగా వివిధ అవసరాలకు చేసే దిగుమతులు గణనీయంగా తగ్గినట్లు వెల్లడించారు. ఫలితంగా, విదేశీ మారక ద్రవ్యం భారీగా ఆదా అయిందని తెలిపారు. దేశీయ అవసరాలకు భద్రత కల్పిస్తూనే, బొగ్గు ఎగుమతి దిశగా భారత్ ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. భారత ఉత్పత్తి సామర్థ్యం, నాణ్యతలో మెరుగుదల, సరఫరా వ్యవస్థ బలోపేతంపై పెరుగుతున్న నమ్మకానికి ఈ మార్పు ఒక నిదర్శనమని తెలిపారు.
కీలకమైన విధానపర, కార్యాచరణ ప్రాధాన్యతలను వివరిస్తూ, కొన్ని ముఖ్యమైన అంశాలను కేంద్రమంత్రి వెల్లడించారు. ఇంధన భద్రతను కాపాడటం, లాజిస్టిక్స్, సరఫరా వ్యవస్థ, సామర్థాన్ని బలపరచటం, బొగ్గు నాణ్యతను పెంచటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటం, ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా సామాజిక బాధ్యతను పటిష్టం చేయటం అత్యంత ఆవశ్యకమని తెలిపారు. చింతన్ శివర్ చర్చల ఫలితాలు అన్ని స్థాయిలకూ చేరటం ద్వారా పనుల అమలు సమన్వయంతో, వేగంగా జరుగుతుందని మంత్రి సూచించారు. బొగ్గు రంగ పీఎస్‌యూలు కేవలం చర్చలకు పరిమితం కాకుండా, ఫలితాలపై దృష్టి సారించాలని.. ఉత్పాదకత, భద్రత, సుస్థిరత, ఆవిష్కరణలు, సహజ భాగస్వామ్యం వంటి అంశాల్లో ఉన్నత ప్రమాణాలను పాటించాలని కోరారు. బొగ్గు రంగంలోని మార్పుల్లో తదుపరి దశ.. స్థిరమైన పనితీరు, కొలవదగిన ఫలితాల ఆధారంగా ఉండాలని చెప్పారు.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే ప్రసంగిస్తూ.. దీర్ఘకాలిక, ఫలితాల ఆధారిత పరిపాలన, సమష్టి దార్శనికతకు మంత్రిత్వ శాఖ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ చింతన్ శివిర్ ప్రతిబింబిస్తుందని తెలిపారు. భారత పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని విస్తరిస్తూ, పర్యావరణహిత లక్ష్యాల దిశగా పయనిస్తున్నప్పటికీ, ఇంధన స్థిరత్వం, విశ్వసనీయతను అందించటంలో బొగ్గు రంగం ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు, బొగ్గు నాణ్యతను మెరుగుపరించేందుకు వాషరీ సామర్థ్యాలను బలపరిచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని శ్రీ దూబే సూచించారు. ప్రతి గనికి బ్లాక్ పర్యవేక్షణ నిమిత్తం అధికారిని కేటాయించటం ద్వారా జవాబుదారీతనాన్ని పెంపొందించవచ్చని, తద్వారా సకాలంలో పనుల అమలు, క్రమశిక్షణ, నిర్దేశిత ప్రమాణాల అనుసరణ సాధ్యమవుతుందని చెప్పారు. ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను సహాయ మంత్రి వివరించారు. వేగవంతమైన యాంత్రీకరణ, అడ్డంకులు లేని రవాణా ద్వారా లాజిస్టిక్స్ సామర్థ్యం పెరుగుతుందని, నష్టాలు తగ్గుతాయని, బొగ్గు రంగంలోనూ పోటీతత్వం పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు లభ్యత మెరుగుపడిందని, బొగ్గు దిగుమతులు తగ్గటం ద్వారా విదేశీ మారక ద్రవ్యం గణనీయంగా తగ్గిందని, లాజిస్టిక్స్ సామర్థ్యం పెరగటం వంటి అంశాలను శ్రీ దూబే ప్రధానంగా ప్రస్తావించారు. అంతేకాక, స్వయం వినియోగ, కమర్షియల్ బొగ్గు గనుల నుంచి సహకారం పెరుగుతుందని తెలిపారు. కార్యకలాపాల సామర్థ్యం, భద్రతా ప్రమాణాలు, బొగ్గు కార్మికులకు అందించే సేవలను మెరుగుపరచటంలో డిజిటల్ వేదికలు, సాంకేతిక పరిష్కారాల పాత్రను స్పష్టం చేశారు. వేగం, స్థాయి, స్థిరత్వంపై బొగ్గు రంగ పీఎస్‌యూల సీఎండీలు, నాయకత్వ బృందాలు దృష్టి సారించాలని, తద్వారా సంస్కరణల మార్పులు క్షేత్రస్థాయిలో స్పష్టమైన ఫలితాలను అందిస్తాయని తెలిపారు.
బొగ్గు రంగంలో స్పష్టమైన విధానాలు, సంస్థాగత సంస్కరణలు, అనుకూలమైన వ్యవస్థలు ఉన్నత దశకు చేరుకున్నాయని బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్‌దత్ అన్నారు. అమలు, క్రమశిక్షణ, కొలవదగిన ఫలితాలపైనే మనం దృష్టి సారించాలని సూచించారు. అధికార వికేంద్రీకరణ, ఆమోద సరళీకరణ, సులభతర ప్రక్రియలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పనుల్లో ఆలస్యం, ఆశించిన స్థాయిలో పని జరగకపోవటం వంటి వాటికి తావుండదని తెలిపారు.
భవిష్యత్తులో వేగం, జవాబుదారీతనం కీలకమని కార్యదర్శి స్పష్టం చేశారు. నిర్దేశించిన లక్ష్యాలు, సమయపాలన, ఫలితాలకు ప్రతి సీఎండీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ బాధ్యత వహించాలన్నారు. కేవలం ఆలోచనల ద్వారా కాక, నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయటం, క్షేత్రస్థాయిలో ప్రభావం ఆధారంగా పనితీరును అంచనా వేయనున్నట్లు చెప్పారు. ఫలితాలే ప్రధానమనే ధోరణితో అన్వేషణ, గనుల నిర్వహణ, లాజిస్టిక్స్ సమన్వయం, ప్రాజెక్టుల అమలును ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. సాంకేతికతను అందిపుచ్చుకోవటం తప్పనిసరని శ్రీ దత్ తెలిపారు. డిజిటల్ వ్యవస్థలు, రియల్ టైమ్ మానిటరింగ్, ఏఐ ఆధారిత వేదికలు, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవటం బొగ్గు రంగంలోని అన్ని విభాగాల్లో ప్రామాణికంగా మారాలని చెప్పారు.
పర్యావరణ బాధ్యత, గనుల పునరుద్ధరణ, సుస్థిరత, సామాజిక జవాబుదారీతనం వంటివి అదనపు అంశాలు కాదని, అవి కార్యాచరణ నైపుణ్యంలో అంతర్భాగమని చెప్పారు. వీటిని ప్రణాళిక, అమలు దశల్లోనే తప్పనిసరిగా చేర్చాలని సూచించారు. చింతన్ శివిర్.. కేవలం సంస్కరణల చర్చా వేదికగా మాత్రమే మిగిలిపోకూడదని, సంస్కరణల ఆధారిత పనితీరును ప్రదర్శించే సంస్కృతికి నాంది కావాలని కాంక్షించారు. అమలు, కొలవదగిన ఫలితాలపై బలమైన దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ చింతన్ శివిర్ కార్యక్రమంలో బొగ్గు రంగానికి సంబంధించిన కీలకమైన కార్యాచరణ, వ్యూహాత్మక అంశాలపై వరుసగా చర్చలు నిర్వహించారు. కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ శ్రీ బి. సాయిరాం పర్యవేక్షణలో ప్రతిపాదిత సంస్కరణలు అనే అంశంపై సెషన్ జరిగింది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా బొగ్గు రంగాన్ని బలోపేతం చేయటం, పనితీరును మెరుగుపరచటం వంటి సంస్కరణల అజెండాపై ఈ సెషన్ దృష్టి సారించింది. సంస్కరణల ద్వారా స్థిరమైన పనితీరును అందించేలా వ్యవస్థలను ప్రాథమికంగా మార్చాలని ప్రసంగాల ద్వారా స్పష్టం చేశారు. వినియోగదారులకు అనుకూలమైన నిబంధనలతో ఈ ఒప్పందాలను మార్చటం, బొగ్గు నాణ్యత, సరఫరాలో స్థిరత్వం ఉండేలా స్పష్టమైన కేపీఐలను నిర్ణయించటం, పక్షపాతాన్ని తగ్గించేందుకు, స్కోరింగ్‌ను ప్రామాణీకరించేందుకు, లోపాలను గుర్తించేందుకు, వివాదాలు లేకుండా టెండర్ ప్రక్రియ ముగించేందుకు ఏఐని వినియోగించటం వంటి కీలక చర్యలు తీసుకున్నారు. బొగ్గు రంగంలో వ్యవస్థాగత మార్పులు, పాలనాపరమైన సంస్కరణలపై ఈ సమావేశం దృష్టి సారించింది. సమర్థవంతమైన పునరావాస ప్రక్రియ, వాటాదారుల నిర్వహణకు ప్రత్యేకంగా భూసేకరణ కేడర్ ఏర్పాటును ప్రతిపాదించారు. ఆమోద ప్రక్రియల్లో స్పష్టతకు, పనిని సులభతరం చేసేందుకు అధికారుల అధికారాలను నవీకరించటం, బదిలీ చేయటంపై చర్చించారు.
రిక్రూట్‌మెంట్ నిబందనలను క్రమబద్దీకరించటానికి, పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా మార్చేందుకు, నియమాక సమయాన్ని తగ్గించేందుకు ఏకీకృత నియామక మాన్యువల్‌ను తీసుకురానున్నారు. కనెక్ట్-ఆటోమేట్-ప్రొటెక్ట్ వ్యవస్థ ద్వారా డిజిటలైజేషన్, పరిశోధన, ఆర్ అండ్ డీ వ్యవస్థను బలోపేతం చేయటం, గనుల అన్వేషణ, ప్రణాళికలను ఆధునీకరించటం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. వ్యవస్థల సంస్కరణ, కార్యకలాపాల మార్పు, బొగ్గు రంగంలో మార్కెట్ ఆధారిత పనితీరును మెరుగుపరచటం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం. దీని ఆధారంగా కార్యకలాపాల్లో వ్యయ నియంత్రణ అనే అంశంపై జరిగిన మరో సెషన్‌లో బొగ్గు రంగ పీఎస్‌యూల్లో ఉత్పాదకతను పెంచటం, అమలు సామర్థ్యం మెరుగుపడటంపై చర్చించారు.
సీఎంపీడీఐ సీనియర్ నాయకత్వ పర్యవేక్షణలో బొగ్గు అన్వేషణను వేగవంతం చేయటంపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సెషన్‌లో అన్వేషణ కాలపరిమితిని తగ్గించేందుకు, భౌగోళిక సన్నద్దతకు అవసరమైన వ్యూహాలపై చర్చించారు. గనుల తవ్వకాలను సకాలంలో ప్రారంభించాలన్న అంశంపై బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రూపిందర్ బ్రార్, సీనియర్ సాంకేతిక అధికారుల సమక్షంలో జరిగిన కీలక సెషన్‌లో చట్టబద్ధమైన అనుమతులను వేగంగా పొందటం, అడ్డంకుల తొలగింపుపై ప్రధానంగా దృష్టి సారించారు.
బొగ్గు నాణ్యత మెరుగుదల, భూగర్భ గనుల తవ్వకం సహా వాణిజ్య గనులతో పోటీతత్వం వంటి కీలక అంశాలపై కోల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ సాంకేతిక నాయకత్వం సీఎండీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో తదుపరి సెషన్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొగ్గు శుద్ధి ప్రక్రియ, అధునాతన మైనింగ్ సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాలు సహా మారుతున్న మైనింగ్ పరిస్థితులకు అనుగుణంగా బొగ్గు రంగ పీఎస్‌యూల పోటీతత్వాన్ని పెంపొందించే వ్యూహాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో అడ్డంకులను అధిగమించి అవసరమైన ఆచరణాత్మక పరిష్కారాలను అందించటమే ప్రతి సెషన్ అనంతరం జరిగిన ముఖాముఖి చర్చల సారాంశం.
చింతన్ శివిర్ సందర్భంగా, రాంచీలో నూతనంగా నిర్మించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోల్ మేనేజ్‌మెంట్ (ఐఐసీఎం) ఎగ్జిక్యూటివ్ హాస్టల్‌ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రారంభించారు. బొగ్గు రంగంలోని సీనియర్ అధికారులకు, అధికారుల నివాస, శిక్షణా మౌలిక సదుపాయాలను మెరుపరిచే లక్ష్యంతో అత్యాధునిక సౌకర్యాలతో దీన్ని నిర్మించారు. బొగ్గు, గనుల రంగ వ్యవస్థలో సామర్థ్య పెంపుదల, నాయకత్వ వికాసం, జ్ఞానాధారిత సంస్థాగత నైపుణ్యాలను పెంపొందించటంలో ఐఐసీఎం పాత్రను ఈ సదుపాయం మరింత బలోపేతం చేస్తుంది.
చింతన్ శివిర్‌లోని చర్చలు.. బొగ్గు రంగ వ్యవస్థ అంతటా క్షేత్ర స్థాయిలో అమలు, క్రమశిక్షణతో నిర్వహణ, స్పష్టమైన ఫలితాల సాధన అవసరాన్ని స్పష్టం చేశాయి.
బొగ్గు రంగంలో వ్యూహాత్మక దిశానిర్దేశం, సంస్థాగత మద్దతు అందించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రతి స్థాయిలో జవాబుదారీతనాన్ని పెంపొందించాలని, నిర్ణీత పనులను తప్పనిసరిగా సకాలంలో పూర్తి చేయాలని చెప్పింది.
జనవరి 5వ తేదీన వాణిజ్య బొగ్గు మైనింగ్‌లో పోటీతత్వాన్ని పెంపొందించటంపై ప్రత్యేక ప్రజెంటేషన్, చర్చా కార్యక్రమం జరిగింది. కోల్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశంలో మైనింగ్ రంగంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పనితీరు ప్రమాణాల నిర్దారణ, ఉత్పాదకత పెంపుదల సహా వ్యూహాత్మక సన్నద్ధతపై విశ్లేషణలను పంచుకున్నారు.
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దేశం స్థిరంగా ముందుకు వెళ్తున్న తరుణంలో దేశీయ ఉత్పత్తి పెంపు, నిర్వహణలో పటిష్టత సహా పెరుగుతున్న పోటీతత్వంతో బొగ్గు రంగం కీలక ఘట్టానికి చేరుకుంది. స్పష్టమైన దిశానిర్దేశం, ఉమ్మడి బాధ్యత, పనితీరుతో జాతీయ ఇంధన భద్రతను పటిష్టం చేయటానికి స్వావలంబనను బలపరచటానికి బొగ్గు రంగం సిద్ధంగా ఉంది. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు, సుస్థిరమైన ఇంధన రంగంగా రూపాంతరం చెందుతూ భారతదేశ దీర్ఘకాలిక వృద్ధిలో బాధ్యతాయుతమైన భాగస్వామిగా ఈ రంగం సహకారం అందిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2212271)
आगंतुक पटल : 6