బొగ్గు మంత్రిత్వ శాఖ
ధన్‌బాద్ ఐఐటి (ఐఎస్ఎం) లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్,
వర్చువల్ రియాలిటీ మైన్ సిమ్యులేటర్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి
ఆవిష్కరణ, సుస్థిరతపై ఐఐటీ (ఐఎస్ఎం) ధన్‌బాద్ విద్యార్థులతో ముచ్చటించిన కేంద్రమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
23 DEC 2025 9:33PM by PIB Hyderabad
జార్ఖండ్‌లో రెండు రోజుల పర్యటన సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ రోజు ఐఐటి (ఐఎస్ఎం) ధన్బాద్లో జాతీయ కీలక ఖనిజాల మిషన్ కింద ఏర్పాటు అయిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు. వర్చువల్ రియాలిటీ మైన్ సిమ్యులేటర్ (వీఆర్ఎంఎస్) ను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ముఖాముఖిలో ఐఐటి (ఐఎస్ఎం) ధన్‌బాద్ విద్యార్థులతో ఆయన తన ఆలోచనలను పంచుకున్నారు.
కేంద్ర మంత్రి ప్రారంభించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) కీలక ఖనిజాలలో పరిశోధన, పరిశ్రమ-స్థాయి పరిష్కారాల కోసం జాతీయ స్థాయి ఆధార కేంద్రంగా పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా కీలక ఖనిజాల అన్వేషణ, తవ్వకం, శుద్ధి, పునర్వినియోగం, పునఃఉపయోగ వ్యర్థాల నుంచి సంపద (వేస్ట్-టు-వెల్త్) వంటి అంశాలపై దృష్టి సారిస్తుంది. పరిశ్రమలోని ప్రముఖ సంస్థలతో పాటు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, సెంట్ పీటర్స్‌బర్గ్ విశ్వవిద్యాలయం వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యంతో కూడా పనిచేస్తుంది. అలాగే ఐఐటి గాంధీనగర్, ఐఐటి బీహెచ్‌యూ, సీపీఐ (యూకే) నుంచి మౌలిక వసతుల మద్దతు తీసుకుంటుంది.
ఐఐటి (ఐఎస్ఎం) ధన్‌బాద్ ఆధ్వర్యంలో, కోల్ ఇండియా, దాని అనుబంధ సంస్థలైన నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌ల సహకారంతో అభివృద్ధి చేసిన వర్చువల్ రియాలిటీ మైన్ సిమ్యులేటర్ (వీఆర్ఎంఎస్) దేశంలో బొగ్గు గనుల భద్రత, ఉత్పాదకత కోసం రూపొందించిన తొలి వీఆర్ ఆధారిత గని సిమ్యులేటర్. 360 డిగ్రీల ఇమ్మర్సివ్ వర్చువల్ రియాలిటీ థియేటర్‌తో కూడిన ఈ వీఆర్ఎంఎస్ వాస్తవ గని డేటాను ఉపయోగిస్తుంది. భారీ పరికరాల నిర్వహణ, కీలకమైన భద్రతా ప్రమాణాలతో 20 పైగా శిక్షణ మాడ్యూళ్లను అందిస్తుంది. ఆపరేటర్ల నుంచి సీనియర్ మేనేజర్ల వరకు అన్ని స్థాయిల ఉద్యోగులకు దృశ్య ఆధారిత అంచనా, నిర్ధారణను వీఆర్ఎంఎస్ అందిస్తుంది. ఇది శిక్షణ సమయాన్ని సగానికి తగ్గిస్తుందని, అదే సమయంలో మెరుగైన భద్రతా సంసిద్ధతను అందిస్తుందని అంచనా.
క్యాంపస్ జీవితం, సంస్కృతిలో ఎప్పటినుంచో ఒక భాగంగా విద్యార్థులు నిత్యం సమావేశమయ్యే సుప్రసిద్ధ, పురాతన ఆర్డీ చౌక్ వద్ద కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి స్నేహపూర్వక వాతావరణంలో ఐఐటీ (ఐఎస్ఎం) ధన్‌బాద్ విద్యార్థులు, యువ పరిశోధకులతో ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించారు.
తేనీటితో మొదలైన వారి సంభాషణ సుహృద్భావ వాతావరణంలో అర్థవంతమైన చర్చలు, ఆలోచనల స్వేచ్ఛా మార్పిడికి అనువైన వాతావరణాన్ని సృష్టించింది.
విద్యార్థులు తమ విద్యా ప్రయాణాలు, పరిశోధనల పట్ల ఆసక్తి, వృత్తి పరమైన ఆకాంక్షలను మంత్రితో పంచుకున్నారు. గనుల రంగంలో సాంకేతికత, ఆవిష్కరణల మారుతున్న పాత్ర, కీలక ఖనిజాలలో అవకాశాలు, సుస్థిరత, పరిశుభ్రమైన ఇంధనం, పరిశోధన ఆధారిత దేశీయ పరిష్కారాల అవసరం వంటి అంశాలు వారి చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి.
సంప్రదాయ పాత్రల పరిమితిని దాటి ఆలోచించాలని, తమని తాము జాతీయ అభివృద్ధికి తోడ్పడేవారుగానూ, గనులు, ఇంధన రంగాలలో సమస్యల పరిష్కార కర్తలుగానూ భావించుకోవాలని శ్రీ కిషన్ రెడ్డి విద్యార్థులను ప్రోత్సహించారు.
యువతతో నిరంతరం అనుసంధానం ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ, భారత వ్యూహాత్మక రంగాల భవిష్యత్తును ఆసక్తి, ఆత్మవిశ్వాసం, నూతన ఆవిష్కరణల పట్ల తపన కలిగిన యువతే తీర్చిదిద్దుతుందని కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారు. ఈ ఇష్టాగోష్టి సమావేశం సులభంగా చేరుకోవడం, సంభాషణ, విశ్వాసంపై ఆధారపడ్డ నాయకత్వ దృక్పథాన్ని ప్రతిబింబించింది, కొత్త తరం ఆశయాలతో ప్రభుత్వం నేరుగా మమేకమైనప్పుడే అర్థవంతమైన పురోగతి సాధ్యమవుతుందనే నమ్మకాన్ని మరింత దృఢం చేసింది.
అంతకుముందు, శ్రీ కిషన్ రెడ్డి తన ప్రసంగంలో విజ్ఞాన సృష్టి, పరిశోధన, ఆవిష్కరణల ద్వారా భారత గనుల రంగం భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఈ సంస్థ కీలక పాత్రను వివరించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్ఎం) కేవలం గనుల రంగ నిపుణులను తయారుచేసే ఒక ప్రధాన సంస్థ మాత్రమే కాదని, అది ఈ రంగానికి అవసరమైన ఆవిష్కరణలకు, నూతన సాంకేతిక దృక్పథానికి మూల స్తంభం వంటిదని ఆయన పేర్కొన్నారు.
గనుల రంగం ప్రస్తుతం ఒక చారిత్రక మలుపులో ఉందని, ఇక్కడ సాంకేతికత, కీలక ఖనిజాలు, సుస్థిరత, జాతీయ భద్రత కలిసి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని నడిపిస్తున్నాయని శ్రీ రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో, ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగం సమాచార సాంకేతికత, ఆవిష్కరణలు, పరిశోధన ఆధారిత వృద్ధి దిశగా బలమైన ప్రోత్సాహాన్ని పొందుతోందని ఆయన అన్నారు. పరిశోధన, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ, జాతీయ స్థాయిలో పరిశోధన, అభివృద్ధి పెట్టుబడులను భారత్ గణనీయంగా పెంచిందని, పేటెంట్ దరఖాస్తుల్లో ప్రపంచంలోనే ఆరో స్థానంలో నిలిచిందని, డీప్-టెక్, ఆవిష్కరణల వ్యవస్థలో వేగవంతమైన విస్తరణను చూస్తోందని ఆయన పేర్కొన్నారు. గనుల రంగంలో సమాచార సాంకేతికతను వినియోగించి నిరంతర పర్యవేక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించడానికి, పారదర్శకత, భద్రతను బలోపేతం చేయడానికి సహాయపడుతున్న కోల్ సేతు, కోయిలా శక్తి డ్యాష్‌బోర్డ్, ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సిస్టమ్స్ వంటి పథకాల ప్రాముఖ్యతను ఆయన ఈ సందర్భంగా వివరించారు.
***
(రిలీజ్ ఐడి: 2208009)
సందర్శకుల సూచీ సంఖ్య : : 45