సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
సైన్స్ మ్యూజియంల జాతీయ మండలికి దక్కిన రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు-2025
‘హర్ ఘర్ మ్యూజియం’, ‘వేస్ట్ టు ఆర్ట్’ ప్రచురణకు దక్కిన చెరో పురస్కారం
प्रविष्टि तिथि:
17 DEC 2025 4:28PM by PIB Hyderabad
పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) నుంచి రెండు ప్రతిష్ఠాత్మక పీఆర్ఎస్ఐ జాతీయ పురస్కారాలు-2025ను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సైన్స్ మ్యూజియాల జాతీయ మండలి (ఎన్సీఎస్ఎమ్) అందుకుంది. కార్పొరేట్ క్యాంపెయిన్ విభాగంలో సామాజిక మాధ్యమాలను అత్యుత్తమ రీతిలో ఉపయోగించుకున్నందుకు హర్ ఘర్ మ్యూజియం కార్యక్రమానికి ఓ పురస్కారం, ప్రత్యేక/ప్రతిష్ఠాత్మక ప్రచురణ విభాగంలో ‘‘వేస్ట్ టు ఆర్ట్’’ ప్రచురణకు మరో పురస్కారం లభించింది.
ప్రత్యేక క్యాంపెయిన్ 4.0 స్వచ్ఛతా హీ సేవ పరిధిలో ‘వేస్ట్ టు ఆర్ట్’ డాక్యుమెంట్ల ప్రచురణను సైన్స్ మ్యూజియాల జాతీయ కౌన్సిల్ (ఎన్‌సీఎస్ఎం) ప్రారంభించింది. ఇది సృజనాత్మకత, సుస్థిరత, ప్రజా భాగస్వామ్యాల శక్తిమంతమైన సంగమంగా నిలిచింది. లోహ వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పారేసిన కంటెయినర్లతో సహా దాదాపుగా 1,250 కేజీల వ్యర్థాలను అర్థవంతమైన కళాకృతులుగా ఎలా రూపొందించారో ఈ ప్రచురణ వివరిస్తుంది. ఇవి పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ సూత్రాలను ప్రోత్సహించే అవగాహనా కార్యక్రమాలుగా కూడా పనిచేస్తాయి. ఎన్సీఎస్ఎంకు చెందిన సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ఎంపిక చేసిన కళాకృతులను ప్రదర్శిస్తూ.. విద్యార్థులు, సమూహాలకు నిర్వహించిన వర్క్ షాపులు, జాతీయ స్థాయి పోటీల గురించి వివరిస్తుంది. ఇది డిజిటల్ పరిధిని విస్తరించడంలోనూ, పర్యావరణ స్పృహనూ, పునర్వినియోగ సృజనాత్మకతనూ ప్రోత్సహించడంలో సాధించిన విజయాన్ని ప్రతిబింబిస్తుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత నుంచి స్ఫూర్తి పొంది, హర్ ఘర్ మ్యూజియం కార్యక్రమాన్ని సైన్స్ మ్యూజియాల జాతీయ కౌన్సిల్ ప్రారంభించింది. ప్రతి ఇల్లూ దేశ చరిత్రలో కొంత భాగాన్ని అంటే వారసత్వంగా లభించే వస్తువులు, కళాకృతులు, పురాతన వస్తువులు, ప్రత్యేకంగా సేకరించిన వస్తువులను పరిరక్షిస్తుందనే నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తమ దగ్గర ఉన్న వస్తువుల ఫొటోగ్రాఫులు, వీడియోలు, కథలను పంచుకోవాల్సిందిగా వ్యక్తులను, కుటుంబాలను ఈ జాతీయ స్థాయి కార్యక్రమం ప్రోత్సహిస్తుంది. తద్వారా ప్రతిరోజూ ఉపయోగించే సాంస్కృతిక, చారిత్రక, భావోద్వేగ విలువ ఉన్న వస్తువుల డిజిటల్ ఆర్కైవ్‌ను ఏర్పాటు చేస్తుంది. వ్యవస్థీకృత డాక్యుమెంటేషన్ ద్వారా చిత్రాలు, కథనాలు, సేకరణకర్తలతో ముచ్చటించడం ద్వారా ప్రజల చరిత్రలను జాతీయ సాంస్కృతిక కథనాలుగా మారుస్తుంది. ఇది ఆసక్తిని, అన్వేషణను ప్రోత్సహిస్తుంది. పరిరక్షణ ప్రాముఖ్యం గురించి అవగాహన పెంచుతుంది. డిజిటల్ కార్యక్రమాల ద్వారా ఈ ప్రచారం చూపించిన ప్రభావాన్ని, దేశవ్యాప్తంగా ఉన్న సేకరణకర్తలనూ, సమాజాలనూ, సంస్కృతి పట్ల ఆసక్తి ఉన్నవారినీ ఏకం చేయడంలో సాధించిన విజయాన్ని ఈ పురస్కారం గుర్తిస్తుంది. ఈ కార్యక్రమం సోషల్ మీడియా ద్వారా ఇప్పటి వరకు 1 మిలియన్ మంది వీక్షకుల సంఖ్యను నమోదు చేసింది. వివిధ వేదికల ద్వారా 10 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. అలాగే విస్తృత ప్రజా భాగస్వామ్యాన్ని, డిజిటల్ ప్రచార ప్రభావాన్ని ప్రతిబింబిస్తూ.. 150కి పైగా ఎంట్రీలను ఎంపిక చేసింది.
ఈ పురస్కారాలను 2025 డిసెంబర్ 13 నుంచి 15 వరకు ఉత్తరాఖండ్ నుంచి డెహ్రాడూన్‌లో పీఆర్ఎస్ఐ నిర్వహించిన 47వ ఆల్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్‌లో ప్రదానం చేశారు. ‘‘ఎంపవరింగ్ గ్రోత్, ప్రిసర్వింగ్ రూట్స్- ది పీఆర్ విజన్ ఫర్ 2047’’ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశం నలుమూలలకు చెందిన సీనియర్ విధాన రూపకర్తలు, సమాచార నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, విద్యావేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డైరెక్టర్ (ప్రధాన కార్యాలయం) శ్రీ రాజిబ్ నాథ్, ఎన్‌సీఎస్ఎం పీఆర్‌వో శ్రీ సత్యజిత్ ఎన్. సింగ్ ఎన్‌సీఎస్ఎం తరఫున ఈ పురస్కారాలను స్వీకరించారు.
***
(रिलीज़ आईडी: 2206089)
आगंतुक पटल : 3