అంతరిక్ష విభాగం
పార్లమెంట్ ప్రశ్నోత్తరాలు: ఇస్రో కీలక అంతరిక్ష ప్రయోగాలు
प्रविष्टि तिथि:
17 DEC 2025 4:45PM by PIB Hyderabad
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గత ఐదేళ్ల కాలంలో (డిసెంబర్ 2020 నుంచి డిసెంబర్ 2025 వరకు) మొత్తం 22 ఉపగ్రహాలను ప్రయోగించింది. వీటిలో 7 భూ పరిశీలన ఉపగ్రహాలు, 4 కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, 2 నావిగేషన్ ఉపగ్రహాలు, 3 అంతరిక్ష విజ్ఞాన ఉపగ్రహాలు, 6 సాంకేతిక ప్రదర్శన (టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్) మిషన్లు ఉన్నాయి. ఈ ప్రయోగాల వివరాలు అనుబంధం –1లో ఉన్నాయి.
చంద్రయాన్-3, ఆదిత్య-L1 ఉపగ్రహ ప్రాజెక్టుల్లో వ్యయ పరిమితి పెరగలేదు. కానీ, నిర్దేశిత గడువు విషయంలో చంద్రయాన్-3 కు 28 నెలలు, ఆదిత్య- ఎల్1 కు 46 నెలలు సమయం పెరిగింది. దీనికి ప్రధానంగా కింద కారణాలు ఉన్నాయి.
ఆదిత్య-ఎల్: ఈ ప్రాజెక్టులో ఆలస్యానికి కారణం ప్రాజెక్ట్ పరిధిలో మార్పులు జరగడం. కక్ష్యను ‘లో ఎర్త్ ఆర్బిట్‘ (ఎల్ఈఓ) నుంచి లాగ్రాంజియన్ పాయింట్ (ఎల్ఐ)కి మార్చడం వల్ల ఉపగ్రహ ఆకృతిలో మార్పులు చేయాల్సి వచ్చింది. పేలోడ్ అభివృద్ధికి కూడా ఎక్కువ సమయం పట్టింది. దీర్ఘకాల అవసర పరికరాల సేకరణకు మరికొంత సమయం పట్టింది.
చంద్రయాన్-3: చంద్రయాన్-2 వైఫల్య విశ్లేషణ కమిటీ సూచనలను అమలు చేయడానికి వ్యవస్థలను మళ్లీ ఆకృతీకరించాల్సి రావడం, కోవిడ్-19 మహమ్మారి ప్రభావం, కొత్తగా ప్రత్యేక పరీక్షలను నిర్వహించడం, కొత్త సెన్సార్‌ల అభివృద్ధి కారణంగా ఈ ప్రాజెక్టులో ఆలస్యం జరిగింది.
స్వదేశీ పరిజ్ఞానంతో వ్యోమగాములను భూమి దిగువ కక్ష్య కు పంపే సామర్థ్యాన్ని ప్రదర్శించడం గగన్‌యాన్ ప్రయోగం లక్ష్యం. భారత ప్రభుత్వం 2019 జనవరిలో ఈ మిషన్ ను అధికారికంగా ఆమోదించింది. ఒకే తరహా అమెరికాతో రెండు మానవ రహిత మిషన్లు, ఒక మానవ సహిత మిషన్‌ను చేపట్టాలని ఆదేశించింది. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.9,023 కోట్ల బడ్జెట్ ఆమోదం లభించింది. మానవ సహిత మిషన్ ప్రయోగానికి మే 2022ను లక్ష్యంగా నిర్ణయించారు.
అక్టోబర్ 2024లో, గగన్‌యాన్ ప్రాజెక్టు పరిధిని మూడు మిషన్ల నుంచి ఎనిమిది మిషన్లకు విస్తరించారు. ఇందులో అదనంగా ఒక మానవ రహిత మిషన్ తో పాటు భారతీయ అంతరిక్ష స్థేషన్ (బిఏఎస్) కోసం నాలుగు ముందస్తు (ప్రికర్సర్) మిషన్లు కూడా చేర్చారు. దీనితో పాటు మొత్తం సవరించిన బడ్జెట్ కేటాయింపును రూ. 20,193 కోట్లకు పెంచారు. సవరించిన ఆమోదం ప్రకారం ప్రస్తుతం కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మొదటి మానవసహిత మిషన్‌ను 2027–28 సంవత్సరంలో ప్రయోగించాలనే లక్ష్యంతో పని జరుగుతోంది.
గగన్‌యాన్ కార్యక్రమం కోసం, ప్రణాళికాబద్ధమైన మిషన్లను విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన వివిధ వ్యవస్థలను ఇస్రో అభివృద్ధి చేసి అమలు చేస్తోంది. మానవ అంతరిక్ష యాత్రకు అవసరమైన కఠినమైన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని హ్యూమన్-రేటెడ్ లాంచ్ వెహికల్ (హెచ్ఎల్వీఎం3) నిర్మాణాలు, సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్, క్రూ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్, పారాచూట్ ఆధారిత వేగనిరోధక వ్యవస్థలకు సంబంధించిన విస్తృత స్థాయి పరీక్షలు పూర్తయ్యాయి. అలాగే, అత్యంత కీలకమైన క్రూ ఎస్కేప్ సిస్టమ్ మోటర్లను కూడా అభివృద్ధి చేసి, వాటి స్థిరత్వ (స్టాటిక్) పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశారు. ఇదే సమయంలోస్వదేశీ పర్యావరణ నియంత్రణ, ప్రాణ రక్షణ వ్యవస్థల అభివృద్ధి కూడా పురోగతిలో ఉంది.
గగన్‌యాన్ కార్యక్రమం కోసం ఆర్బిటల్ మాడ్యూల్ తయారీ కేంద్రం, గగన్‌యాన్ నియంత్రణ కేంద్రం, వ్యోమగాముల శిక్షణా కేంద్రం వంటి కీలక మౌలిక సదుపాయాలు పూర్తయ్యాయి. రెండవ ప్రయోగ వేదికలో మార్పులు చేశారు. టీవీ-డీ1, ఐఏడీటీ-01 వంటి ప్రీకర్సర్ మిషన్లను విజయవంతంగా పూర్తిచేశారు. భూమిపై ట్రాకింగ్ నెట్‌వర్క్‌లు, టెరెస్ట్రియల్ లింకులు, ఐడీఆర్ఎస్ఎస్-1 ఫీడర్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. క్రూ మాడ్యూల్ రికవరీ ప్రణాళిక, మోహరించాల్సిన వనరులను ఖరారు చేశారు. తొలి మానవ రహిత మిషన్ (జీఐ)కోసం హెచ్ఎల్‌వీఎం3 అన్ని దశలు, సీఈఎస్ మోటార్లు సిద్ధమయ్యాయి. క్రూ, సర్వీస్ మాడ్యూల్ వ్యవస్థలు కూడా పూర్తయ్యాయి. పరికరాల కూర్పు, అనుసంధాన పనులు దాదాపు ముగిశాయి. తొలి మానవ సహిత మిషన్‌ను 2027-28లో ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుతం వినియోగంలో ఉన్న పీఎస్ఎల్‌వీ (పీఎస్ఎల్వీ), జీఎస్ఎల్‌వీ (జీఎస్ఎల్వీ), ఎల్‌వీఎం - 3 వాహక నౌకల ద్వారా భారతదేశం అంతరిక్ష ప్రయోగ వ్యవస్థల్లో స్వయం సమృద్ధి సాధించింది. ఈ సామర్థ్యంతో తక్కువ భూ కక్ష్య కు 10 టన్నుల వరకు, భూస్థిర బదిలీ కక్ష్యకు 4.2 టన్నుల వరకు ఉపగ్రహాలను ప్రయోగించగలుగుతోంది. ఈ వాహక నౌకలు భూ పరిశీలన, సమాచార, దిశానిర్దేశకత, అంతరిక్ష అన్వేషణ ఉపగ్రహాల కోసం స్వతంత్ర అంతరిక్ష ప్రవేశాన్ని కల్పించాయి. విస్తరిస్తున్న అంతరిక్ష రంగానికి అనుగుణంగా వాహక నౌక సామర్థ్యాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం తదుపరి తరం వాహక నౌకల (నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ - ఎన్జీఎల్వీ) అభివృద్ధిని ఆమోదించింది. ఈ ఎన్‌జీఎల్‌వీ ద్వారా తక్కువ భూ కక్ష్యకు గరిష్టంగా 30 టన్నుల పేలోడ్ సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది. తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ప్రవేశించే లక్ష్యం సాధించడానికి, పునర్వినియోగ వాహక నౌక సాంకేతికతలను కూడా ఇస్రో అభివృద్ధి చేస్తోంది. ఇందులో ఎన్‌జీఎల్‌వీ పాక్షిక పునర్వినియోగ రకం ఒకటి. ఇది తక్కువ భూ కక్ష్య కు 14 టన్నుల పేలోడ్ సామర్థ్యం అందిస్తుంది. మరొక ముఖ్య అభివృద్ధి, రెక్కలు కలిగిన అప్పర్ స్టేజ్ రూపకల్పన. ఇది కక్ష్య నుంచి భూమికి తిరిగి ప్రయాణించి, ఆటోమేటిక్ గా రన్‌వేపై దిగుతుంది. ఈ పరిజ్ఞానం ద్వారా అంతరిక్ష ప్రయోగాల వ్యయం గణనీయంగా తగ్గుతుంది.
మరింత శక్తివంతమైన, సమర్థవంతమైన ప్రొపల్షన్ వ్యవస్థల అభివృద్ధికి కూడా ఇస్రో శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఎల్‌వీఎం3 వాహనంలో చేర్చడానికి ఎక్కువ శక్తితో (2000 కేఎన్) ఎగిరే సెమీ-క్రయోజెనిక్ ఇంజిన్ రూపకల్పన చేపట్టింది. అంతేకాక, తరువాతి తరం లాంచ్ వెహికల్ కోసం పర్యావరణ అనుకూలమైన మిథేన్ ఆధారిత ప్రొపల్షన్ వ్యవస్థ అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టింది. ఇది ప్రతిపాదిత మానవ సహిత చంద్ర మిషన్ కోసం వాహక నౌక సాంకేతిక సన్నద్ధతను నిర్ధారిస్తుంది. వీటితో పాటు, డ్యూయల్-ఫ్యూయల్ స్క్రామ్‌జెట్ ఇంజిన్ కోసం ఎయిర్-బ్రీతింగ్ ప్రొపల్షన్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తున్నారు.
అంతరిక్ష విభాగానికి చెందిన కీలక మౌలిక సదుపాయాలు, పరిశోధన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం బడ్జెట్ కేటాయింపులు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. భారత ప్రభుత్వ స్పేస్ విజన్ 2047 ప్రకారం, 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్థేషన్ ఏర్పాటు, 2040 నాటికి భారతీయుడిని చంద్రునిపై దించడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. ఈ దిశగా ప్రభుత్వం ఐదు ముఖ్యమైన పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులను ఆమోదించింది. వీటిలో గగన్‌యాన్ ఫాలో-ఆన్ మిషన్, చంద్రయాన్ ఫాలో-ఆన్ మిషన్లు (చంద్రయాన్-4 లూనార్ సాంపుల్ రిటర్న్ మిషన్, చంద్రయాన్-5/లుపెక్స్ మిషన్), వీనస్ ఆర్బిటర్ మిషన్, తదుపరి తరం వాహక నౌకల అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయి. స్పేస్ విజన్ లక్ష్యాలను సాధించడానికి భూమిపై మౌలిక సదుపాయాల విస్తరణలో భాగంగా, మరో రెండు ప్రయోగ వేదికలను ప్రభుత్వం ఆమోదించింది. ఇందులో తమిళనాడులోని కులశేఖరపట్నం వద్ద ఒకటి, తదుపరి తరం వాహక నౌకల కోసం మూడవ ప్రయోగ వేదిక ఉన్నాయి.
***
(रिलीज़ आईडी: 2205626)
आगंतुक पटल : 20