ప్రధాన మంత్రి కార్యాలయం
ఇథియోపియా ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు చేపట్టిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
16 DEC 2025 11:50PM by PIB Hyderabad
అదిస్ అబాబాలోని జాతీయ ప్యాలెస్‌లో ఇథియోపియా ఫెడరల్ రిపబ్లిక్ డెమోక్రాటిక్ ప్రధాని డాక్టర్ అబియ్ అహ్మద్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భేటీ అయ్యారు. ప్యాలెస్‌కు చేరుకున్న ప్రధాన మంత్రి మోదీకీ ప్రధాని డాక్టర్ అబియ్ అహ్మద్ సంప్రదాయ పద్ధతిలో ఆత్మీయ స్వాగతం పలికారు.
పరిమిత, ప్రతినిధి స్థాయి విధానాల్లో జరిగిన చర్చల్లో వారు పాల్గొన్నారు. శతాబ్దాల నాటి నాగరికత పునాదులపై ఏర్పడి, ప్రజాసంబంధాలతో బలోపేతమైన ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు. వీటికి ప్రాధాన్యమిస్తూ.. భారత్-ఇథియోపియా సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచడానికి నాయకులిద్దరూ అంగీకరించారు. గ్లోబల్ సౌత్ భాగస్వాములుగా సమ్మిళిత ప్రపంచాన్ని నిర్మించడానికి రెండు దేశాల కృషిని కొనసాగించాలని నిర్ణయించారు. 2023లో జీ20కి అధ్యక్షత వహిస్తున్న సమయంలో ఆఫ్రికన్ యూనియన్‌కు ఈ కూటమిలో సభ్యత్వం ఇవ్వడం భారతదేశానికి దక్కిన గౌరవమని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో భారత్‌కు సంఘీభావం ప్రకటించడంతో పాటు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం సాగిస్తున్న పోరాటాన్ని బలోపేతం చేసిన ఇథియోపియాకు కృతజ్ఞతలు తెలియజేశారు.
వాణిజ్యం-పెట్టుబడులు, ఆవిష్కరణలు-సాంకేతికత, విద్య-సామర్థ్య నిర్మాణం, రక్షణ సహకారం సహా భారత్, ఇథియోపియా మధ్య ఉన్న బహుపాక్షిక సంబంధాల పురోగతిని నాయకులిద్దరూ సమీక్షించారు. ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, సంప్రదాయ వైద్యం, జన ఔషధీ కేంద్ర, ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయం, సహజ వ్యవసాయం, అగ్రి-టెక్ రంగాల్లో ఇథియోపియాతో సహకారాన్ని పెంపొందించుకోవడంలో భారత్‌కు ఉన్న ఆసక్తిని ప్రధానమంత్రి మోదీ తెలియజేశారు. రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత అభివృద్ధి భాగస్వామ్యం.. ప్రజా సంబంధాలను మరింత పెంపొందిస్తుందని వారు స్పష్టం చేశారు.
రెండు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని నాయకులిద్దరూ సమీక్షించారు. డిజిటల్ ప్రజా మౌలిక వసతులు, గనుల తవ్వకం, కీలకమైన ఖనిజాలు, స్వచ్ఛ ఇంధనం రంగాల్లో సహకారంపై వారు చర్చించారు. ఇథియోపియన్ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా తయారీ, ఫార్మాసూటికల్ రంగాల్లో నమ్మకమైన భాగస్వాములుగా భారతీయ సంస్థలు 5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఇవి స్థానికంగా 75,000కు పైగా ఉద్యోగాలను కల్పించాయని తెలియజేశారు.
గ్లోబల్ సౌత్ ఆందోళలను లేవనెత్తడంలో కలసి పని చేసేందుకు తమ నిబద్ధతను ప్రధానులిద్దరూ పునరుద్ఘాటించారు. ఐక్యరాజ్య సమితితో సహా బహుపాక్షిక వేదికల్లో సహకారంపై చర్చించారు. వాతావరణ మార్పులు, పునరుత్పాదక శక్తి, విపత్తు ముప్పు తగ్గింపు తదితర సమస్యలపై సహకారం గురించి చర్చించారు. ఈ అంశంలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబీసీఏ), విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ), అంతర్జాతీయ జీవ ఇంధన కూటమి (జీబీఏ), అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) లాంటి ప్రపంచ స్థాయి సంస్థలు చేస్తున్న కృషిని స్వాగతించారు. ఇథియోపియా అధ్యక్షతన బ్రిక్స్ భాగస్వాములుగా, ప్రతిపాదిత భారత్-ఆఫ్రికా ఫోరం సదస్సు కోసం కలసి పనిచేసేందుకు భారత్ ఎదురుచూస్తున్నట్లు ప్రధానమంత్రి మోదీ తెలియజేశారు.
చర్చల అనంతరం ఐక్యరాజ్య సమితి శాంతి నిర్వహణ కార్యకలాపాల శిక్షణ, సుంకాల అంశాల్లో పరస్పర పాలన పరమైన సహకారం, ఇథియోపియా విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి మూడు ఒప్పందాలను మార్చుకున్నారు.
ప్రధానమంత్రి మోదీ గౌరవార్థం ప్రధాని డాక్టర్ అబియ్ విందు ఏర్పాటు చేశారు. ప్రధాని అబియ్‌ను భారత్ సందర్శించాలని ప్రధానమంత్రి ఆహ్వానించారు. దానికి ఆయన అంగీకరించారు.
***
(रिलीज़ आईडी: 2205083)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam