ఔషధాల విభాగం
మార్చి 2027 నాటికి జన ఔషధి కేంద్రాల సంఖ్యను 25,000లకు పెంచడం లక్ష్యం.
प्रविष्टि तिथि:
16 DEC 2025 3:38PM by PIB Hyderabad
నాణ్యమైన జనరిక్ ఔషధాలను అందరికీ సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పథకాన్ని ప్రారంభించారు. 30.11.2025 నాటికి, ఈ పథకం కింద దేశవ్యాప్తంగా మొత్తం 17,610 జన ఔషధి కేంద్రాలు (జేఏకేలు) ప్రారంభమయ్యాయి. 2014 సంవత్సరంలో వీటి సంఖ్య కేవలం 80 మాత్రమే. జన ఔషధి పథకాన్ని పౌరులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మార్చి 2027 నాటికి దేశవ్యాప్తంగా ప్రారంభించిన జేఏకేల సంఖ్యను 25,000లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ పథకం కింద సరసమైన ధరలకు లభించే నాణ్యమైన మందుల లభ్యత గురించి ప్రజల్లో అవగాహనతో పాటు... ఈ ఉత్పత్తుల పట్ల నమ్మకమూ పెరుగుతోంది. పెరుగుతున్న అమ్మకాల పరిమాణం, విక్రయానికి అందుబాటులో ఉన్న జన ఔషధి ఉత్పత్తుల నిరంతర పెరుగుదల దీనికి నిదర్శనం. ఇది జేఏకేల లాభదాయకతను పెంచింది. జేఏకేలను ప్రారంభించడం పట్ల వ్యవస్థాపకుల్లో ఆసక్తినీ పెంచింది. ఫలితంగా, జేఏకేలను ప్రారంభించే వేగం ఇటీవలి సంవత్సరాల్లో ఊపందుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో జేఏకేల సంఖ్యలో 37 శాతం వృద్ధి... ఈ పథకం కింద గరిష్ట రిటైల్ ధర అమ్మకాల విలువలో 38 శాతం వృద్ధి దీనిని ప్రతిబింబిస్తుంది.
వ్యక్తిగత వ్యవస్థాపకులు, ప్రభుత్వేతర సంస్థలు, సొసైటీలు, ట్రస్టులు, సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు మొదలైన వారి నుంచి జేఏకేల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వీటి కోసం ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఈ పథకం వెబ్‌సైట్ (www.janaushadhi.gov.in) ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఈ సమాచారాన్ని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు
(रिलीज़ आईडी: 2204924)
आगंतुक पटल : 9