రైల్వే మంత్రిత్వ శాఖ
దేశంలో హైడ్రోజన్ శక్తితో నడిచే తొలి రైలు తయారీ పూర్తి;
జింద్‌లో విద్యుద్విశ్లేషణ ప్రక్రియ ఆధారంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు
స్వావలంబన భారత్‌ను ప్రతిబింబించనున్న దేశీయంగా అభివృద్ధి చేసిన హైడ్రోజన్ రైలు..
ప్రస్తుతానికి బ్రాడ్ గేజ్‌పై ప్రపంచంలోనే అత్యంత పొడవైన, అత్యంత శక్తిమంతమైన (2400 కేవీ) రైలు
प्रविष्टि तिथि:
10 DEC 2025 4:46PM by PIB Hyderabad
తొలి హైడ్రోజన్ రైలును పట్టాలపై పరుగులెత్తించడానికి భారతీయ రైల్వే ఓ అత్యాధునిక ప్రాజెక్టును చేపట్టింది. పరిశోధన, రూపకల్పన, ప్రమాణాల సంస్థ (ఆర్ డీఎస్ ఓ) రూపొందించిన ప్రత్యేకతల ప్రకారం రైల్వేలో హైడ్రోజన్ ఆధారిత రైలు సాంకేతికత వినియోగాన్ని ప్రదర్శించడానికి పైలట్ ప్రాతిపదికన దీనిని అభివృద్ధి చేశారు.
హైడ్రోజన్ రైలు తయారీ పూర్తయింది. ఈ రైలులో హైడ్రోజన్‌ను ఉపయోగించేందుకు జింద్‌లో ఒక హైడ్రోజన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో కీలకమైన విద్యుద్విశ్లేషణ ప్రక్రియ ఆధారంగా ఇక్కడ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.
హైడ్రోజన్ రైలు ముఖ్య లక్షణాలు :
· దేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేశారు. ఇది స్వావలంబన భారత్ పట్ల రైల్వే వ్యవస్థకున్న నిబద్దతను తెలుపుతుంది.
· ప్రస్తుతం బ్రాడ్ గేజ్ ప్లాట్‌ఫామ్‌పై ప్రపంచంలోనే అతి పొడవైన (10 కోచ్‌లు), అత్యంత శక్తిమంతమైన (2400 కిలో వాట్ల) హైడ్రోజన్ రైలు
· ఈ రైలులో 1200 కిలో వాట్ల సామర్థ్యం గల రెండు ఇంజిన్లు ఉన్నాయి. మొత్తం 2400 కిలో వాట్ల సామర్థ్యం గల ఎనిమిది ప్యాసింజర్ కోచులు ఉన్నాయి.
· సున్నా కర్బన ఉద్గారాలు; నీటి ఆవిరి మాత్రమే ఉద్గారం.
· రైల్వే వ్యవస్థలో తదుపరి తరం ఇంధన సాంకేతికత అభివృద్ధిలో కీలక అడుగు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా మొదటి దశల నుంచే రూపకల్పన, నమూనా తయారీ, హైడ్రోజన్ ట్రాక్షన్ సాంకేతికతను భారతీయ రైల్వేలో తొలిసారిగా అభివృద్ధి చేశారు. హైడ్రోజన్ రైలు, అనుబంధ మౌలిక వసతులు పైలట్ ప్రాతిపదికన అభివృద్ధి చేసినందున ప్రస్తుత దశలో హైడ్రోజన్ ఇంధన రైళ్ల ఖర్చును ఇప్పటికే ఉన్న ట్రాక్షన్ వ్యవస్థలతో నేరుగా పోల్చడం సముచితం కాదు.
ఈ ప్రాజెక్ట్, ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే రైలు ప్రయాణంలో పురోగతి కోసం భారతీయ రైల్వే నిబద్ధతను ఈ ప్రాజెక్టు తెలియజేస్తుంది. తద్వారా దేశ రవాణా రంగానికి పరిశుభ్రమైన, పచ్చని భవిష్యత్తును అందిస్తుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్ , సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
***
(रिलीज़ आईडी: 2201866)
आगंतुक पटल : 18