ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
18 SEP 2023 4:17PM by PIB Hyderabad
గౌరవ సభాపతి గారూ,
నూతన పార్లమెంటు భవంలోకి అడుగుపెట్టే ముందు ఈ చారిత్రక భవనానికి వీడ్కోలు చెబుతూ, 75 ఏళ్ల మన దేశ పార్లమెంటరీ ప్రయాణాన్ని, ఆ స్ఫూర్తిదాయక క్షణాలను గుర్తుచేసుకోవాల్సిన సందర్భమిది. స్వాతంత్ర్యం రాకముందు ఈ సభను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని పిలిచేవారు. స్వాతంత్యం వచ్చాక పార్లమెంటు హౌస్‌గా మార్చారు. ఈ భవన నిర్మాణ నిర్ణయం విదేశీ పార్లమెంటేరియన్లు తీసుకున్నప్పటికీ, దీని నిర్మాణానికి నా దేశవాసులు చెమటను చిందించారు. ఇందులో నా దేశపౌరుల శ్రమ ఉంది. నిర్మాణానికి డబ్బును కూడా నా దేశ ప్రజలు సమకూర్చారన్న వాస్తవాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని గర్వంగా చెప్పుకోగలం.
ఎన్నో ప్రజాస్వామ్య సంప్రదాయాలను, ప్రక్రియలను మన 75 ఏళ్ల ప్రయాణం రూపొందించింది. ఈ సభలో భాగమైన ప్రతి ఒక్కరూ భక్తి భావనతో క్రియాశీలకంగా సహకరించారు. మనం నూతన భవనానికి మారినప్పటికీ పాత భవనం కూడా భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది. భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో ఈ భవనం ఒక స్వర్ణ అధ్యాయం. అంతేకాదు, భారతదేశ నరనరాల్లోనూ ప్రవహించే ప్రజాస్వామ్య బలాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూనే ఉంటుంది.
గౌరవ సభాపతి,
అమృత కాలం (స్వర్ణ యుగం) తొలి కిరణాలు దేశాన్ని కొత్త నమ్మకంతో, సరికొత్త ఆత్మవిశ్వాసంతో, నూతనోత్సాహంతో, కొత్త కలలు, సంకల్పాలతో, పునరుద్ధరించిన శక్తితో భారత్‌ను వెలిగిస్తున్నాయి. భారతీయుల విజయాలపై ప్రతిచోటా గర్వంగా చర్చించుకుంటున్నారు. ఇది మన 75 ఏళ్ల పార్లమెంటరీ చరిత్రలో జరిగిన సమష్టి కృషి ఫలితం. ఇవాళ మన విజయాల ప్రతిధ్వని ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది.
గౌరవ సభాపతి,
చంద్రయాన్-3 విజయం భారతదేశాన్ని మాత్రమే కాదు, యావత్ ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యపరిచింది. దేశ సామర్థ్యాల్లో ఇదొక కొత్త కోణాన్ని సూచిస్తోంది. ఆధునికత, సైన్స్, సాంకేతికత, మన శాస్త్రవేత్తల శక్తి, 140 కోట్ల మంది పౌరుల సంకల్ప బలంతో ముడిపడిన అంశమిది. దేశంపై, ప్రపంచంపై ఇది కొత్త ప్రభావాన్ని చూపేందుకు సిద్ధంగా ఉంది. ఈ సభ ద్వారా నేను మరోసారి దేశ శాస్త్రవేత్తలకు, వారి సహోద్యోగులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
గౌరవ సభాపతి,
గతంలో నామ్ సదస్సు జరిగినప్పుడు, ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. అప్పుడు కూడా దేశం ఈ ప్రయత్నాన్ని అభినందించింది. ఇవాళ మీరూ జీ20 విజయాన్ని ఏకగ్రీవంగా అభినందించారు. ఈ విధంగా మీరు దేశ గౌరవాన్ని మరింత పెంచుతారని భావిస్తున్నాను. అందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జీ20 విజయం భారతదేశంలోని 140 కోట్ల మంది పౌరుల విజయం. ఇది భారత్ విజయం, ఏ ఒక్క వ్యక్తిదో లేదా పార్టీదో కాదు. భారతదేశపు సమాఖ్య స్ఫూర్తి, వైవిధ్యం, 60కి పైగా ప్రాంతాల్లో 200కు పైగా సమావేశాల నిర్వహణ, ఒక్కొక్క సమావేశం ఒక్కో ప్రత్యేకతతో దేశంలోని వివిధ ప్రభుత్వాలు అద్భుతంగా నిర్వహించాయి. ఈ ప్రభావం ప్రపంచ వేదికపై స్పష్టంగా కనిపించింది. మనందరం వేడుక చేసుకోవాల్సిన అంశమిది. ఇది దేశ కీర్తిని పెంచుతుంది. మీరు చెప్పినట్లుగా, ఆఫ్రికన్ యూనియన్ సభ్యత్వం పొందినప్పుడు జీ20కి అధ్యక్షత వహించటం భారతదేశానికి గర్వకారణం. ఆఫ్రికన్ యూనియన్ సభ్యత్వ ప్రకటన సమయంలో, ఆ దేశ అధ్యక్షుడి జీవితంలో చాలా ముఖ్యమైన క్షణాలని మాట్లాడుతూ ఎక్కడ ఏడ్చేస్తానోనని భావించినట్లు చెప్పిన ఆ భావోద్వేగ క్షణాన్ని నేను మర్చిపోలేను. అలాంటి గొప్ప ఆశలను, అంచనాలను నెరవేర్చే అదృష్టం భారతదేశానికి దక్కింది.
గౌరవ సభాపతి,
భారత్‌పై అనుమానం పెంచుకునే లక్షణం కొంతమందిలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. ఈసారి కూడా అదే జరిగింది. వారి నుంచి ప్రకటన ఉండకపోవచ్చు. అది అసంభవం అనిపించింది. అయినప్పటికీ ఇదే భారతదేశ బలం. ప్రపంచమంతా ఉమ్మడి ప్రకటనకు అంగీకరించి, కార్యాచరణను ముందుకు తీసుకెళ్లటంతో ఇది సాధ్యమైంది.
గౌరవ సభాపతి,
జీ20కి భారత అధ్యక్షత నవంబర్ నెలాఖరు వరకు కొనసాగుతుంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేం నిర్ణయించుకున్నాం. మీ అధ్యక్షతన ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పీకర్లతో పీ-20 (పార్లమెంటరీ-20) తరహా సదస్సును నిర్వహించాలనే ప్రకటనకు ప్రభుత్వం పూర్తి మద్దతును, సహకారాన్ని అందిస్తుంది.
గౌరవ సభాపతి,
ఇవాళ భారత్ 'విశ్వమిత్రుడు' (ప్రపంచ మిత్రుడు)గా స్థానాన్ని సంపాదించుకోవటం మనందరికీ గర్వకారణం. యావత్ ప్రపంచం భారత్‌తో స్నేహాన్ని కోరుకుంటోంది. ప్రపంచం, భారతదేశ మైత్రిని పొందుతోంది. దీనికి మూలకారణం మన సంస్కృతి, వేదాల నుంచి స్వామి వివేకానంద వరకు మనం పొందిన జ్ఞానం. ముఖ్యంగా "సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్" మంత్రం మనల్ని ప్రపంచంతో మమేకం చేస్తోంది.
గౌరవ సభాపతి,
ఈ సభకు వీడ్కోలు పలకటం నిజంగా భావోద్వేగంతో కూడినది. పాత ఇంటిని విడిచిపెట్టి కొత్త ఇంటికి మారినప్పుడు, ఆ కుటుంబం అనేక జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. అదే విధంగా ఈ సభకు వీడ్కోలు చెబుతూ మన మనసులు కూడా ఎన్నో జ్ఞాపకాలతో నిండిపోయాయి. ఈ భవనం గోడల మధ్య మధురమైన, చేదు అనుభవాలు, అల్లర్లు, సంఘర్షణలు, వేడుకలు జరిగాయి. ఈ జ్ఞాపకాలన్నీ మనందరి ఉమ్మడి వారసత్వం.. వాటిపై మనకున్న గర్వం కూడా ఉమ్మడిదే. గత 75 ఏళ్లలో స్వతంత్ర భారతదేశ పునర్నిర్మాణానికి సంబంధించిన అనేక సంఘటనలు ఈ సభలోనే జరగటం చూశాం. ఈ సభ నుంచి ఇవాళ కొత్త సభలోకి మారుతున్న తరుణంలో భారత సాధారణ పౌరుల భావ వ్యక్తీకరణకు లభించిన గౌరవాన్ని కూడా మనం తప్పక గుర్తించాలి.
గౌరవ సభాపతి,
నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై తొలిసారిగా ఈ భవనంలోకి అడుగుపెట్టిన క్షణం.. ఈ ప్రజాస్వామ్య దేవాలయ ద్వారాల వద్ద శిరస్సు వంచి, ప్రజాస్వామ్యంపై గౌరవంతో లోపలికి అడుగుపెట్టాను. ఆ క్షణం నా మనసు భావోద్వేగంతో నిండిపోయింది. నేను అస్సలు ఊహించని విషయమది. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై పెరిగిన ఒక సామాన్య కుటుంబంలోని బిడ్డ, పార్లమెంట్‌కు చేరుకోవటమనేది భారత ప్రజాస్వామ్య బలానికి, ప్రజాస్వామ్యం పట్ల దేశంలోని సాధారణ పౌరుడికి ఉన్న గౌరవానికి నిదర్శనం. దేశం నన్ను ఇంతగా గౌరవిస్తుందని, ఇంతగా ఆశీర్వదిస్తుందని, ఇంతలా ప్రేమిస్తుందని నేను ఎన్నడూ ఊహించలేదు. సభాపతి గారు.
గౌరవ సభాపతి,
మనలో చాలామంది పార్లమెంట్ భవనం లోపల రాసి ఉన్న విషయాలను చదువుతారు. కొన్నిసార్లు ప్రస్తావిస్తారు కూడా. పార్లమెంట్ భవనం ప్రవేశ ద్వారం వద్ద చాంగ్‌దేవ్ బోధనల్లోని మాట ఉంది. అది "లోకద్వారమ్", అంటే "ప్రజల కోసం తలుపు తెరవండి" అని అర్థం. ప్రజల కోసం తలుపులు తెరిచి, వారు హక్కులు పొందటాన్ని చూడాలని సూచిస్తుంది. ఋషులు లిఖించిన ఈ సందేశాన్ని మన పార్లమెంట్ ప్రవేశ ద్వారాలపై పొందుపరిచారు. మనమందరం, మనకంటే ముందు ఇక్కడున్నవారు ఈ సత్యానికి సాక్ష్యులు.
గౌరవ సభాపతి,
కాలం మారిన కొద్దీ, మన పార్లమెంట్ నిర్మాణం కూడా నిరంతరం వృద్ధి చెందుతూ సమ్మిళితంగా మారింది. సమాజంలోని ప్రతి వర్గం, వైవిధ్యంతో కూడిన ప్రతినిధులు ఈ పార్లమెంటులో కనిపిస్తారు. ఎన్నో భాషలు, మాండలీకాలు, వంటకాల సంప్రదాయాలున్నాయి. పార్లమెంటు లోపల ప్రతి అంశమూ ఉంది. సామాజిక, ఆర్థిక.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అత్యంత సమ్మిళిత వాతావరణంలో ప్రజల కోరికలను, ఆశయాలను వ్యక్తపరుస్తారు. దళితులు, అణగారిన వర్గాలు, గిరిజనులు, అట్టడుగున ఉన్నవారు, మహిళలు, అందరి సహకారం కాలక్రమేణా పెరిగింది.
గౌరవ సభాపతి,
ప్రారంభంలో మహిళల సంఖ్య తక్కువగా ఉండేది. కానీ, తల్లులు, అక్కాచెల్లెళ్లు కూడా సభ గౌరవాన్ని పెంపొందించటంలో తమ వంతు కృషి చేశారు. ఈ సభ ప్రతిష్ఠలో గణనీయమైన మార్పునకు వారి సహకారం కీలకమైనది.
గౌరవ సభాపతి,
ఓ అంచనా ప్రకారం మొదట్నుంచి ఇప్పటివరకు ఉభయసభల్లో సుమారు 7,500 మంది ప్రతినిధులు తమ వంతు కృషి చేశారు. ఈ సమయంలో పార్లమెంటు ఉభయసభల గౌరవాన్ని పెంచటంలో సుమారు 600 మంది మహిళా ఎంపీలు తోడ్పాటునందించారు.
గౌరవ సభాపతి,
గౌరవనీయులైన ఇంద్రజిత్ గుప్తా గారు, నా అంచనా తప్పయితే క్షమించాలి. సుమారు 43 ఏళ్ల పాటు ఈ సభలో పనిచేశారు. సుదీర్ఘ కాలం పాటు ఈ సభకు సాక్షిగా ఉండే విశేష గౌరవం ఆయనకు దక్కింది. ఇదే సభలో షఫీకుర్ రెహమాన్ గారు 93 ఏళ్ల వయసులోనూ సభా కార్యకలాపాలకు నిరంతరం సహకారం అందించారు. గౌరవనీయులైన స్పీకర్ గారూ, ఇదే భారత ప్రజాస్వామ్య బలం. చాందిరాణి ముర్ము కేవలం 25 ఏళ్ల వయసులోనే ఈ సభా సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆ సమయానికి అతిపిన్న వయస్కురాలైన సభ్యురాలు ఆమెనే.
గౌరవ సభాపతి,
మనమందరం విభేదాలు, వివాదాలు, పదునైన మాటలను అనుభవించాం. మనం వాటిని ప్రారంభించాం. ఎవరినీ ప్రత్యేకంగా నిందించటానికి లేదు. బహుశా వాటన్నింటికీ అతీతంగా, మనలో ఉన్న కుటుంబ భావన, పాత తరంలోనూ కొనసాగింది. మీడియా ద్వారా మన బహిరంగ రూపాన్ని చూసేవారికి, బయట మనల్ని చూసేవారికి నిజమేంటో తెలుసు. ఆ అనుబంధం, ఆ కుటుంబ భావన మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తుంది. ఇదే ఈ సభకు బలం. కుటుంబ భావన ఉంటే విభేదాలున్నప్పటికీ, మనం ఎప్పుడూ ద్వేషాన్ని పెంచుకోం. ఎన్నో ఏళ్ల తర్వాత కలిసినా, అదే ఆప్యాయతతో కలుస్తాం. ఆ ఆత్మీయ సమయాన్ని మర్చిపోం. నేను ఆ అనుభూతిని పొందగలను.
గౌరవ సభాపతి,
గతంలో, ప్రసుతంలోనూ ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదురైనప్పటికీ పార్లమెంటు సభ్యులు విధులను నెరవేర్చటానికి సమస్యలను, అనారోగ్యాన్ని లెక్కచేయకుండా ప్రతినిధులుగా సభకు వచ్చి పనిచేశారు. ఇటువంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యం ఉన్నప్పటికీ కొందరు వీల్‌ఛైర్‌లో వచ్చారు. వైద్యులు బయట వేచి ఉండగా మరికొందరు సభకు వచ్చారు. కానీ, ఏదో ఒక విధంగా పార్లమెంట్ సభ్యుడు తమ విధిని నిర్వర్తించారు.
కరోనా కాలం ఇందుకు ఉదాహరణ. కరోనా సంక్షోభ సమయంలో ప్రతి ఇంట్లోనూ మరణ భయం వెంటాడుతున్నప్పటికీ, గౌరవ సభ్యులు పార్లమెంటుకు వచ్చి ఉభయ సభల్లోనూ విధులు నిర్వహించారు. దేశ పనులను మనం ఆపలేదు. సామాజిక దూరాన్ని పాటిస్తూ, తరచుగా పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది. అయినా మాస్కులు ధరించి, మేం సభకు వచ్చాం. సీటింగ్ ఏర్పాట్లు భిన్నంగా ఉండేవి. సమయాలు కూడా మారాయి. విధి నిర్వహణ పట్ల అంకితభావంతో, ఈ సభలోని సభ్యులందరూ బాధ్యతతో వ్యవహరించారు. దేశానికి సంబంధించిన పని ఆగకుండా పార్లమెంట్ కొనసాగింది. ఈ సభతో సభ్యులకు ప్రత్యేక అనుబంధం ఉండటాన్ని నేను గమనించాను. ముప్పై, ముప్పై ఐదేళ్ల కిందట ఎంపీలుగా ఉన్నవారు కూడా ఇప్పటికీ సెంట్రల్ హాల్‌ని సందర్శిస్తారు. గుడికి వెళ్లడం ఒక అలవాటుగా మారినట్లే, ఈ సభకు రావడం కూడా వారికి అలవాటుగా మారింది. ఇదొక భావోద్వేగ అనుబంధం. చాలామంది గతంలో పనిచేసిన వారు, పార్లమెంట్ సభ్యులు కాకపోయినా ఇప్పటికీ ఈ సభతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు.
గౌరవ సభాపతి,
స్వాతంత్ర్యం వచ్చాక ఎంతోమంది ప్రముఖ పండితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తు ఎలా ఉంటుందో, అది విజయవంతం అవుతుందో లేదో, ఐక్యంగా ఉంటుందో లేదో, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందో, పతనమవుతుందో తెలియక చింతించారు. భారత పార్లమెంటు శక్తి ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసి, ప్రపంచ అంచనాలను తప్పు అని బుుజువు చేసింది. పూర్తి సామర్థ్యంతో ఈ దేశం పురోగమిస్తూనే ఉంది. ఆందోళనలు, సవాళ్లు ఉన్నప్పటికీ విజయాన్ని సాధిస్తామనే విశ్వాసంతో, ముందున్న సభ్యులతో కలిసి మన ప్రాధాన్యతను తెలియజేశాం. ఈ విజయాన్ని ఉత్సవంగా జరుపుకోవడానికి ఇదొక సందర్భం.
గౌరవ సభాపతి,
రెండు సంవత్సరాల పదకొండు నెలల పాటు ఈ భవనంలోనే, రాజ్యాంగ పరిషత్ సమావేశమై, మనకు రాజ్యాంగాన్ని అందించింది. ఇప్పటికీ అది మనకు మార్గదర్శకంగా ఉంది. 1949 నవంబర్ 26న రూపుదిద్దుకున్న రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. దేశంలోని సామాన్య ప్రజలకు పార్లమెంట్‌పై పెరిగిన విశ్వాసమే ఈ 75 ఏళ్లలో సాధించిన గొప్ప విజయం. ప్రజాస్వామ్యానికి అతి పెద్ద బలం.. ఈ గొప్ప సంస్థపై, ఈ ఉన్నతమైన సంస్థపై, ఈ వ్యవస్థపై ప్రజలకు ఉన్న చెక్కుచెదరని నమ్మకం. ఈ 75 ఏళ్లలో ప్రజల భావనలను వ్యక్తం చేసే చిహ్నంగా పార్లమెంట్ మారింది. ఇక్కడ ప్రజాభావాలు బలమైన వ్యక్తీకరణ కనిపిస్తుంది. రాజేంద్ర బాబు, డాక్టర్ కలాం, రామ్‌నాథ్ కోవింద్ జీ వంటి నాయకుల ప్రసంగాల నుంచి ఇటీవల ద్రౌపది ముర్ము జీ ప్రసంగం వరకు, వారి మాటల ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందాం. వారి మార్గదర్శకత్వం మన పార్లమెంటు ఉభయ సభలకూ అమూల్యమైనది.
గౌరవ సభాపతి,
పండిట్ నెహ్రూ జీ, శాస్త్రీ జీ నుంచి, అటల్ జీ, మన్మోహన్ జీ వరకు ఈ పవిత్రమైన సభకు నాయకత్వం వహించారు. ఈ సభ ద్వారా దేశానికి మార్గనిర్దేశం చేసిన నాయకుల పరంపర చాలా ఉంది. వాళ్లంతా అత్యంత శ్రద్ధతో పనిచేసి, దేశాన్ని నూతన పథంలో నడిపేందుకు విశేష కృషి చేశారు. వారందరికీ నివాళులు అర్పించేందుకు కూడా ఇదొక సందర్భం.
గౌరవ సభాపతి,
సర్దార్ వల్లభభాయ్ పటేల్, లోహియా జీ, చంద్రశేఖర్ జీ, అద్వానీ జీ, ఇంకా ఎంతోమంది ఈ సభను సుసంపన్నం చేశారు. సామాన్య ప్రజల గొంతుకను బలపరచటానికి, చర్చలను ఫలవంతం చేసేందుకు, దేశంలోని సాధారణ పౌరులకు బలాన్ని ఇవ్వటానికి వాళ్లంతా ఈ సభలో కృషి చేశారు. ఎంతోమంది ప్రపంచ నాయకులు మన సభలను ఉద్దేశించి ప్రసంగించారు. వారి మాటలు దేశ ప్రజాస్వామ్యం పట్ల గౌరవాన్ని చూపాయి.
గౌరవ సభాపతి,
ఉత్సాహం, ఉద్వేగభరితమైన క్షణాల మధ్య ఈ సభ కన్నీళ్లను కూడా కార్చింది. ముగ్గురు ప్రధాన మంత్రులను వారి పదవీ కాలంలోనే కోల్పోయినప్పుడు ఈ సభ శోకసంద్రంలో మునిగిపోయింది. నెహ్రూ జీ, శాస్త్రీ జీ, ఇందిరా జీకి కన్నీటి పర్యంతమైన కళ్లతో ఈ సభ వీడ్కోలు పలికింది.
గౌరవ సభాపతి,
ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రతీ స్పీకర్, ప్రతీ ఛైర్మన్ ఉభయ సభలకు సమర్థవంతంగా నాయకత్వం వహించి, ఆదర్శప్రాయమైన నిర్ణయాలు తీసుకున్నారు. మావళంకర్ జీతో మొదలుపెట్టి, సుమిత్రా జీ, బిర్లా జీ పదవీకాలంలో తీసుకున్న నిర్ణయాలను ఇప్పటికీ ఆధారాలుగా పరిగణిస్తున్నాం. మావళంకర్ జీ నుంచి సుమిత్రా తాయి, బిర్లా జీ వరకు, ఇద్దరు మహిళా స్పీకర్లతో సహా దాదాపు 17 మంది స్పీకర్లు ఈ బాధ్యతను నిర్వహించారు. వారందరికీ తమదైన ప్రత్యేక శైలి ఉన్నప్పటికీ, నియమ నిబంధనలకు లోబడి ఈ సభను ఉత్తేజపరచటానికి పనిచేశారు. ఆ గౌరవ స్పీకర్లందరికీ ఇవాళ నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
గౌరవ సభాపతి,
ప్రజా ప్రతినిధులుగా మా బాధ్యతలను నిర్వహిస్తున్నాం. మాకు మద్దతుగా తెర వెనుక పనిచేసే బృందాలు కూడా ఏళ్లుగా అభివృద్ధి చెందాయి. సభా కార్యకలాపాల్లో, నిర్ణయాల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా పత్రాలతో పరిగెత్తుతూ అందించిన విలువైన సహకారం మరువలేనిది. ఈ సభలో పాలన నాణ్యతకు వారి కృషి ఎంతగానో దోహదపడింది. అంతకుముందు పనిచేసిన వారితో సహా నా సహచరులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవనాలకు మాత్రమే పార్లమెంటు పరిమితం కాదు. చుట్టూ ఉన్న ప్రాంతాన్నీ ఇది కలుపుకుంటుంది. చాలా మంది ఇక్కడ వివిధ రకాలుగా సహకరించారు. కొందరు టీ, నీరు అందించారు. ఎవరూ ఆకలితో ఉండకుండా చూసుకున్నారు. అర్ధరాత్రి సభలు జరిగినప్పుడు వివిధ సేవలను అందించారు. కొందరు బయట పరిసరాలను జాగ్రత్తగా చూసుకుంటే, మరికొందరు పరిశుభ్రంగా ఉండేలా చూశారు. మనందరం సమర్థవంతంగా పనిచేయడానికి లెక్కలేనంత మంది వ్యక్తులు ఇక్కడ శ్రద్ధగా పనిచేశారు. వారి కృషికి, వ్యక్తిగతంగానూ ఈ సభ తరపున కూడా ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నాను.
గౌరవ సభాపతి,
ఈ ప్రజాస్వామ్య దేవాలయం ఉగ్రదాడిని ఎదుర్కొంది. ప్రపంచవ్యాప్తంగా భవనాలపై జరిగే దాడుల మాదిరిగా కాకుండా 'ప్రజాస్వామ్య మాతృమూర్తి'పై జరిగిన దాడి, ఒక రకంగా ఇది మన ఆత్మపై జరిగిన దాడి. మన దేశం ఆ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేదు. ఉగ్రవాదులతో పోరాడి, పార్లమెంటును రక్షించటానికి ప్రతి సభ్యుడి భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన వారికి నేను గౌరవ వందనం అర్పిస్తున్నాను. ఇవాళ వారు మన మధ్యన లేకపోయినా, మనల్ని రక్షించటం ద్వారా గొప్ప సేవ చేశారు.
గౌరవ సభాపతి,
ఈ సభ నుంచి వీడ్కోలు తీసుకుంటున్న సందర్భంలో మొత్తం వృత్తి జీవితాన్ని పార్లమెంటు వార్తలను రిపోర్ట్ చేయడానికే అంకితం చేసిన పాత్రికేయ మిత్రులను కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఒక రకంగా వాళ్లు సజీవ సాక్షులు. ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం మనకు అప్పట్లో లేదు. ఇక్కడి నుంచే దేశానికి చిన్న వివరాలను కూడా అందించేవారు. వార్తల వెనుకున్న సమాచారాన్ని అందించగలిగే సామర్థ్యం వారికుంది. ఇప్పుడు వాళ్లు అంతగా ప్రాచుర్యం పొందకపోవచ్చు కానీ, వారి కృషిని ఎవరూ మరచిపోలేరు. ఈ పార్లమెంట్ భవనం నుంచి భారతదేశ అభివృద్ధి ప్రయాణాన్ని అర్థం చేసుకోవటానికి దేశానికి సహాయపడిన ఆ జర్నలిజాన్ని నేను చూశాను. ఇందుకోసం తమ పూర్తి శక్తిని ధారపోశారు. గతంలో పార్లమెంటును కవర్ చేసిన పాత పాత్రికేయ మిత్రులను ఇవాళ నేను కలుస్తాను. వారు అద్భుతమైన, నిజమైన కథనాలను పంచుకుంటారు. ఈ సభ గోడలకు ఎంత శక్తి ఉందో, అలాంటి ప్రతిబింబ ప్రభావం వారి కలాల్లో కనిపిస్తుంది. ఇది పార్లమెంటు ప్రాముఖ్యత, సభ్యులు, పార్లమెంటేరియన్ల పట్ల సహానుభూతి భావనను కలిగిస్తుంది. చాలా మంది జర్నలిస్టులకు కూడా ఇది భావోద్వేగ క్షణమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ సభను విడిచి వెళ్లడం నాకు ఎంత భావోద్వేగ క్షణమో, ఈ పాత్రికేయ మిత్రులకు అంతకన్నా ఎక్కువ భావోద్వేగంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. పార్లమెంటుపై వారికున్న అనురాగం మనకంటే ఎక్కువ. ఈ జర్నలిస్టుల్లో కొందరు మనకంటే చిన్న వయసు వారు ఉండొచ్చు. కానీ వారు ఈ ప్రజాస్వామ్యానికి దోహదపడ్డారు. కాబట్టి వారి సహకారాన్ని ఇవాళ గుర్తుచేసుకోవటానికి కూడా ఇది ఒక సందర్భం.
గౌరవ సభాపతి,
మనం ఈ సభలో అడుగుపెట్టినప్పుడు, మన సంప్రదాయం దైవిక శక్తిని ఆవాహన చేస్తుంది. ఒకే మంత్రాన్ని ఒక చోట పదేపదే జపిస్తే, అది పవిత్ర స్థలంగా మారుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అదొక సానుకూల శక్తిని వెలువరిస్తుంది. ఆ స్థలాన్ని ఆధ్యాత్మిక భూమిగా మార్చగలిగే ఒక ప్రతిధ్వనించే శక్తి ఉంటుంది. దాదాపు ఏడున్నర వేల మంది ప్రతినిధుల మాటలు, చర్చల ద్వారా, భవిష్యత్తులో మనం మెరుగైన చర్చల జరుపుతామా లేదా అనే సంబంధం లేకుండా ఈ సభ ఒక ప్రతిధ్వనిని సృష్టించిందని నేను నమ్ముతున్నాను. ఇది ఈ స్థలాన్ని ఒక తీర్థయాత్రగా, జ్ఞానోదయ స్థలంగా మారుస్తుంది. ఇవాళ్టి నుంచి 50 ఏళ్ల తర్వాత కూడా, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్న ఎవరైనా ఈ స్థలాన్ని సందర్శించినప్పుడు, ఒకప్పుడు భారతదేశ ఆత్మ స్వరం ఇక్కడ ప్రతిధ్వనించింది అనే భావనను అనుభూతి చెందగలరు.
గౌరవ సభాపతి,
బ్రిటిష్ వలస పాలనను వ్యతిరేకించటానికి భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ ఒక బాంబు పేల్చి.. ధైర్యాన్ని, బలాన్ని ప్రదర్శించిన సభ ఇది. దేశ బాగును కోరుకునే వారిని ఆ బాంబు ప్రతిధ్వనులు నిశ్చలంగా ఉండనీయలేదు.
గౌరవ సభాపతి,
ఎన్నో కారణాలతో పండిట్ నెహ్రును స్మరించుకుంటారు. మేమంతా ఆయన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాం. ఈ సభలో పండిట్ నెహ్రూ ఇచ్చిన ప్రసంగం 'ఎట్ ద స్ట్రోక్ ఆఫ్ మిడ్ నైట్' మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఈ సభలోనే అటల్ జీ ఒకసారి 'ప్రభుత్వాలు వస్తాయి.. పోతాయి. పార్టీలు ఏర్పడతాయి.. మాయమవుతాయి. కానీ ఈ దేశం మాత్రం ఎప్పటికీ ఉంటుంది' అని అన్నారు. ఆయన మాటలు ఇక్కడ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.
గౌరవ సభాపతి,
పండిట్ నెహ్రూ తొలి మంత్రివర్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మంత్రిగా పనిచేశారు. ఆయన భారతీయ కార్మిక చట్టాల్లో అంతర్జాతీయ ప్రమాణాలపై దృష్టి సారించారు. ఇది దేశంపై ఎంతో ప్రభావాన్ని చూపింది. నెహ్రూజీ హయాంలో జల విధానాన్ని రూపొందించడంలో బాబాసాహెబ్ కీలక పాత్ర పోషించారు. ఆ విధాన రూపకల్పనకు బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి దేశానికి కీలకమైనది.
గౌరవ సభాపతి,
భారతదేశంలో సామాజిక న్యాయం కోసం పారిశ్రామికీకరణ ప్రాముఖ్యతను బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియజేశారు. అనేక అట్టడుగు వర్గాలకు, ముఖ్యంగా దళితులకు, భూమిపై హక్కు లేనందున వారిని అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు పారిశ్రామికీకరణ అవసరమని ఆయన నమ్మేవారు. పండిట్ నెహ్రూ ప్రభుత్వంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిగా పనిచేసిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ హయాంలో బాబాసాహెబ్ దార్శనికత, భారతదేశ పరిశ్రమల విధానాన్ని ప్రభావితం చేసింది. ఈ రోజు ఎన్ని పరిశ్రమల విధానాలు రూపొందించినా, దేశ పారిశ్రామిక అభివృద్ధిపై శాశ్వత ప్రభావాన్ని చూపిన తొలి ప్రభుత్వం ఇచ్చిన స్ఫూర్తి దాని అంతరాత్మగానే ఉంది.
గౌరవ సభాపతి,
1965 యుద్ధ సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి మన దేశ సైనికుల మనోబలాన్ని పెంచి, వారి సామర్థ్యాలపై పూర్తి విశ్వాసాన్ని కలిగించారు. దేశ గౌరవానికిది మూలమైంది. ఆ స్ఫూర్తిని కూడా ఈ సభ నుంచే అందించారు. ఈ పవిత్ర సభలోనే హరిత విప్లవానికి లాల్ బహదూర్ శాస్త్రి బలమైన పునాది వేశారు.
గౌరవ సభాపతి,
బంగ్లాదేశ్ విమోచన యుద్ధానికి మద్దతిస్తూ ఇందిరా గాంధీ నాయకత్వంలో బలమైన అండగా నిలవడంలోనూ ఈ సభ కీలక పాత్ర పోషించింది. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిని కూడా ఈ సభ చూసింది. దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలోనూ దృఢమైన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించటానికి భారత ప్రజల శక్తిని కూడా ఈ సభ చూసింది. ఆ కాలంలోని జాతీయ సంక్షోభాన్ని, జాతి స్థిరత్వాన్ని కూడా ఇది చూసింది.
గౌరవ సభాపతి,
ఈ భవనంలోనే మన మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. అందుకు ఈ సభ ఎప్పుడూ రుణపడి ఉంటుంది. ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గిస్తూ ఈ సభలోనే నిర్ణయం తీసుకున్నారు. ఇది దేశ నిర్మాణంలో యువత భాగస్వాములయ్యేందుకు స్ఫూర్తినిచ్చి, ప్రోత్సహించింది. వీపీ సింగ్, చంద్రశేఖర్ వంటి వారి నాయకత్వంలో దేశం సంకీర్ణ ప్రభుత్వాలను చూసింది. ఆ తరువాత కూడా వరుసగా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. చాలా కాలం పాటు ఆర్థిక విధానాల భారంతో దేశం ఒకే దిశలో పయనిస్తూ ఉండేది. నరసింహారావు గారి ప్రభుత్వం ధైర్యం చేసి, పాత ఆర్థిక విధానాలను విడిచిపెట్టి, కొత్త మార్గంలో పయనించాలని నిర్ణయించుకుంది. ఇవాళ దేశం నూతన ఆర్థిక విధానాల ప్రయోజనం పొందుతోంది.
ఈ సభలోనే మేం అటల్ బిహారీ వాజ్‌పేయి గారి ప్రభుత్వాన్ని కూడా చూశాం. సర్వ శిక్షా అభియాన్ ఇవాళ దేశానికి కీలకంగా మారింది. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను, ఈశాన్య ప్రాంత మంత్రిత్వ శాఖను అటల్ జీ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో జరిగిన అణు పరీక్షలు ప్రపంచానికి భారతదేశ సామర్థ్యాన్ని పరిచయం చేశాయి. ఈ సభలోనే మేం మన్మోహన్ జీ ప్రభుత్వాన్ని, నోట్ల కోసం ఓట్ల కుంభకోణాన్ని కూడా చూశాం.
గౌరవ సభాపతి,
'సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్' మంత్రం, ఎన్నో చారిత్రక నిర్ణయాలు, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటికీ ఈ సభలోనే శాశ్వత పరిష్కారాలు లభించాయి. ఈ భవంలోనే ఆర్టికల్ 370 రద్దయిందని సభ గర్వపడుతుంది. ఒకే దేశం, ఒకే పన్ను - జీఎస్టీపై నిర్ణయం కూడా ఈ సభలోనే జరిగింది. ఒక ర్యాంక్, ఒక పెన్షన్ (ఓఆర్ఓపీ)కు ఈ సభ సాక్ష్యంగా నిలిచింది. ఈ దేశంలో ఎలాంటి వివాదం లేకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్ ప్రవేశపెట్టాం.
గౌరవ సభాపతి,
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాం. ఈ సభ ప్రజాస్వామ్యానికి బలంగా, ప్రజాస్వామ్య శక్తికి సాక్షిగా, ప్రజా విశ్వాసానికి కేంద్ర బిందువుగా ఉంది. ఈ సభ ప్రత్యేకతను చూడండి. ఇవాళ్టికీ ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ఈ సభలో కేవలం నలుగురు సభ్యులున్న పార్టీ అధికారంలో ఉన్న సందర్భాలున్నాయి. 100 మంది సభ్యులున్న మరో పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఇది కూడా ఒక రకమైన సామర్థ్యం. ఈ సభ ప్రజాస్వామ్య బలాన్ని పరిచయం చేస్తుంది. ఒకే ఒక్క ఓటు తేడాతో అటల్ జీ ప్రభుత్వం ఓడిపోయి, ప్రజాస్వామ్య గౌరవాన్ని పెంచిన సభ ఇది. అది కూడా ఈ సభలోనే జరిగింది. ఇవాళ మన దేశ ప్రజాస్వామ్యంలో అనేక చిన్న ప్రాంతీయ పార్టీల ప్రాతినిధ్యం, దేశ వైవిధ్యానికి, ఆకాంక్షలకు ఆకర్షణీయ కేంద్రంగా మారింది.
గౌరవ సభాపతి,
దేశంలో ఇద్దరు ప్రధానమంత్రులు మొరార్జీ దేశాయ్, వీపీ సింగ్.. జీవితమంతా కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వాలకు నాయకత్వం వహించారు. ఇది కూడా దేశ ప్రత్యేకతే. మన నరసింహారావు గారు ఇంటికే పరిమితమయ్యేందుకు సిద్ధమై, పదవీ విరమణ ప్రకటించారు. కానీ ప్రజాస్వామ్య శక్తి ఆయన్ని ఐదేళ్లు ప్రధానమంత్రిగా సేవలందించేలా చేసింది.
గౌరవ సభాపతి,
అత్యంత సవాలుతో కూడిన పనులను కూడా అందరి ఏకాభిప్రాయంతో పూర్తవటం చూశాం. 2000వ సంవత్సరంలో అటల్ జీ ప్రభుత్వ హయాంలో ఉత్సాహంతో, సంతోషంతో ఈ సభ మూడు నూతన రాష్ట్రాల ఏర్పాటును ఆమోదించింది. ఛత్తీస్‌గఢ్ ఏర్పాటుతో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రెండూ వేడుక చేసుకున్నాయి. ఉత్తరాఖండ్ ఏర్పాటుతో ఆ రాష్ట్రంతో పాటు ఉత్తరప్రదేశ్ వేడుక చేసుకుంది. జార్ఖండ్ ఏర్పడినప్పుడు, బీహార్, జార్ఖండ్ సంతోషించాయి. ఏకాభిప్రాయాన్ని, వేడుక వాతావరణాన్ని సృష్టించగలిగే సామర్థ్యం మన సభకు ఉంది. కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. తెలంగాణ హక్కుల అణచివేత ప్రయత్నాలు జరిగాయి. రక్తం చిందింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ వేడుక చేసుకోలేకపోయాయి. విభేదాలకు పునాది పడింది. ఉత్సాహంతో, సంతోషంతో తెలంగాణను ఏర్పాటు చేసి ఉంటే, ఇవాళ ఆ రాష్ట్రం కొత్త శిఖరాలను చేరుకునేది.
గౌరవ సభాపతి,
ఈ సభకు ఒక సంప్రదాయం ఉంది. ఆ రోజుల్లో రాజ్యాంగ పరిషత్ సభ్యులు తమ రోజువారీ భత్యాన్ని రూ.45 నుంచి రూ.40కి తగ్గించుకున్నారు. ఎందుకంటే, తగ్గించాల్సిన అవసరం ఉందని వారు భావించారు.
గౌరవ సభాపతి,
క్యాంటీన్‌లో అతి తక్కువ ధరకు భోజనం అందించేందుకు ఇస్తున్న సబ్సిడీని సభ్యులే రద్దు చేసుకున్నారు. ఇప్పుడు వారంతా పూర్తి డబ్బులు చెల్లించి భోజనం చేస్తున్నారు.
గౌరవ సభాపతి,
కరోనా మహమ్మారి సమయంలో దేశానికి అవసరమైనప్పుడు, పార్లమెంటు సభ్యులు ఎంపీఎల్‌ఏడీఎస్ (సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం) నిధులను వదులుకున్నారు. సంక్షోభ సమయంలో దేశానికి సహాయం చేసేందుకు వారు ముందుకు వచ్చారు. అంతేకాదు, సభలోని ఎంపీల జీతంలోనూ 30% కోతను స్వచ్ఛందంగా అంగీకరించి, దేశం సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో కీలక బాధ్యతలను నిర్వర్తించారు.
గౌరవ సభాపతి,
మేం గర్వంగా చెప్పగలం. ఈ సభలోని వారైనా, గత సమావేశాల్లో భాగమైన వారైనా చెప్పగలిగే విషయం ఏంటంటే.. క్రమశిక్షణను, ప్రాతినిధ్య చట్టాల్లో కఠినత్వాన్ని అమలు చేసింది, నిబంధనలను రూపొందించింది, ఒక ప్రజాప్రతినిధి జీవితంలో కొన్ని పనులు జరగకూడదని నిర్ణయించింది మాత్రం మేమే. ఈ సభ ఇచ్చిన శక్తిమంతమైన ప్రజాస్వామ్యానికి ఇది గొప్ప ఉదాహరణ అని నేను విశ్వసిస్తున్నాను. గౌరవ పార్లమెంటు సభ్యులు, గత ఎంపీలే ఈ ఉదాహరణకు కారణమయ్యారు. కొన్నిసార్లు ఆ విషయాలను కూడా గుర్తు చేసుకోవాలని నేను భావిస్తున్నాను.
గౌరవ సభాపతి,
ప్రస్తుత పార్లమెంటు సభ్యులందరికీ నిజంగా ఇదొక ప్రత్యేక అవకాశం. చరిత్రలోనూ, భవిష్యత్తులోనూ భాగమయ్యే అవకాశం మనకు లభించింది. గతాన్ని, వర్తమానాన్ని అనుసంధానం చేసే అవకాశముంది. కొత్త విశ్వాసంతో, ఉత్సాహంతో, నూతన శక్తితో మనం ఇక్కడ వీడ్కోలు పలుకుతూ, భవిష్యత్ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాం.
గౌరవ సభాపతి,
సభలోని ఏడున్నర వేల మంది సభ్యులకు మాత్రమే ఇది ప్రత్యేకం. వారి ప్రయాణంలో ఇదొక పేజీ. ఈ భవనం నుంచి స్ఫూర్తిని పొంది, భవిష్యత్ స్వీకరణకు సిద్ధంగా ఉన్నాం. ఈ సభలోని అనేక విషయాలు ప్రతి సభ్యుని ప్రశంసను అందుకోవాలి. కానీ అక్కడ కూడా రాజకీయాలున్నట్లు అనిపిస్తుంది. నెహ్రూ సేవల గొప్పతనాన్ని గుర్తించి, అంగీకరిస్తే ఈ సభలో ఎవరైనా చప్పట్లు కొట్టకుండా ఉంటారా? వీటన్నింటి మధ్య దేశ ప్రజాస్వామ్యం కోసం, గౌరవ స్పీకర్ మార్గదర్శకత్వంలో, అనుభవజ్ఞులైన ఎంపీల సామర్థ్యాలతో, నూతన విశ్వాసంతో కొత్త పార్లమెంటులోకి అడుగుపెట్టటం అవసరం.
పాత జ్ఞాపకాలను నెమరేసుకునేందుకు, ఇంత గొప్ప వాతావరణంలో అందరినీ గుర్తుచేసుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా కృతజ్ఞతలు. సభ్యులంతా ఇక్కడి మధురస్మృతులను పంచుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ స్మృతులు దేశ ప్రజలకు చేరి, ఇది మన సభ అని, మన ప్రతినిధులు అంకితభావంతో దేశానికి సేవలందిస్తున్నారని చాటి చెబుతాయి. ఈ భావనతో నేను మరోసారి సభకు నమస్కరిస్తున్నాను. భారతదేశ శ్రామికులు చెమటను చిందించి, నిర్మించిన నూతన భవనంలోని ప్రతి ఇటుకకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 75 ఏళ్లుగా దేశ ప్రజాస్వామ్యానికి నూతన శక్తిని, సామర్థాన్ని ఇచ్చిన ప్రతి గురువుకి, ఆ బ్రహ్మాండమైన శక్తికి నేను వందనం చేస్తున్నాను. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
ధన్యవాదాలు.
***
(रिलीज़ आईडी: 2201225)
आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam