శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్థూలకాయం భారత్‌లో ప్రజారోగ్యానికి ఓ సవాలులా మారింది.. ఇది సౌందర్య సమస్య మాత్రమే కాదని

భారత అంతర్జాతీయ విజ్ఞానశాస్త్ర ఉత్సవంలో స్పష్టం చేసిన డాక్టర్ జితేంద్ర సింగ్

‘‘దీనిని విజ్ఞానశాస్త్ర కచ్చితత్వంతోనూ, విధానపరమైన క్రమశిక్షణతోనూ పరిష్కరించాల్సిన అవసరం ఉంది’’

మనుషులు లావెక్కడంపై తప్పు సమాచారాన్ని అరికట్టే నిబంధన లోపించడాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన ఐఐఎస్ఎఫ్

భారత్‌లో శరవేగంగా విస్తరిస్తున్న జీవక్రియ సంబంధిత సవాళ్లను ఎదుర్కోవడానికి
విధానపరమైన క్రమశిక్షణ అవసరమని పిలుపునిచ్చిన డాక్టర్ జితేంద్ర సింగ్

प्रविष्टि तिथि: 08 DEC 2025 6:03PM by PIB Hyderabad

‘‘భారత్‌లో ఊబకాయం ఒక ప్రజారోగ్య సంబంధిత సవాలులా పరిణమించింది. ఇది ఒక్క సౌందర్య సమస్య మాత్రమే కాదు. ఈ సవాలును విజ్ఞానశాస్త్ర కచ్చితత్వంతో, విధానపరమైన క్రమశిక్షణతో పరిష్కరించాల్సిన అవసరం ఉంది’’ అని కేంద్ర శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన శాఖ సహాయ మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయం సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దిల్లీలో భారత అంతర్జాతీయ విజ్ఞానశాస్త్ర ఉత్సవం (ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్..ఐఐఎస్ఎఫ్)లో  ‘‘స్థూలకాయంపై చికిత్సకులు-శాస్త్రవేత్తలతో చర్చ’’ అంశంపై జరిగిన చర్చలో  మంత్రి ప్రసంగించారు.
క్లినికల్ మెడిసిన్, బయోమెడికల్ రిసెర్చ్‌లతో పాటు పబ్లిక్ పాలసీ రంగాలకు చెందిన ప్రముఖ నిపుణుల సమక్షంలో ఈ ప్యానల్ చర్చను నిర్వహించారు.  భారత్‌లో నానాటికీ విస్తరిస్తున్న జీవక్రియ సంబంధిత సవాళ్లపై అనేక విషయాలపై చర్చించారు. భారీగా హాజరైన శ్రోతలను ఉద్దేశించి మంత్రి ప్రసంగిస్తూ, సామాజిక నడవడిక, మార్కెట్ భాగస్వాములు, తప్పుడు సమాచారాన్ని చెలామణి చేయడం వంటివి దేశంలో ఊబకాయ సమస్యను ఏ విధంగా జటిలం చేసిందీ వివరించారు.
భారత్‌లోని సైన్స్, మెడిసిన్ రంగాలకు చెందిన ప్రముఖ నిపుణులు వేదికపై ఆసీనులయ్యారు. వారిలో ఎన్ఏబీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు డాక్టర్ అశ్వనీ పారీక్, నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వినోద్ కుమార్ పాల్, డాక్టర్ వి.కె. సారస్వత్, సీడీఎఫ్‌డీ డైరెక్టరు ప్రొఫెసర్ ఉల్లాస్ కొల్థుర్, టీహెచ్ఎస్‌టీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు డాక్టర్ గణేశన్ కార్తికేయన్‌లతో పాటు సీనియర్ ఎండోక్రైనాలాజిస్టులు డాక్టర్ సంజయ్ భదాదా, డాక్టర్ సచిన్ మిత్తల్‌లు ఉన్నారు
భారతీయ సమాజంలో ఊబకాయాన్ని ఒక రోగంగా కన్నా, సౌందర్య సంబంధిత సమస్యగానే చూస్తున్నారనీ, దీనిపై శాస్త్రీయ పరమైన చర్చల్లో జాప్యానికి ఇదే కారణమైందనీ డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ‘‘దశాబ్దాలుగా, మన వైద్య సమావేశాల్లో మధుమేహం, జీవక్రియకు సంబంధించిన అనారోగ్యాలపై చర్చించినప్పటికీ ఊబకాయంపై మాత్రం ఎప్పుడూ చర్చలు చోటుచేసుకోలేదు. గత 15 సంవత్సరాలుగానే దీనిని ఒక ముఖ్యమైన చికిత్సాత్మక విషయంగా గుర్తించాం’’ అని ఆయన తెలిపారు.

భారత్‌లో నెలకొన్న కొన్ని శారీరక విశేషాంశాలను గురించి కూడా మంత్రి వివరించారు. ముఖ్యంగా తూర్పు దేశాల జనాభాలో శరీరం లోపలి కొవ్వు పెరిగే విసెరల్ స్థూలకాయం వ్యాప్తి చెందిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ‘భారతీయుల విషయంలో, బరువు కన్నా నడుము చుట్టు కొలత ముఖ్యమైన కథ చెబుతుంది‘ అని ఆయన వ్యాఖ్యానించారు.  మొత్తం బరువు సామాన్యంగానే కనిపించినా, ఒంటి లోపల అంతర్గత అవయవాల్లో పేరుకునే కొవ్వు హానికారకంగా పరిణమిస్తోంది అని ఆయన స్పష్టం చేశారు.
జీఎల్‌పీ ఆధారిత మందులను పెద్ద ఎత్తున, ఒక నాగరికత పోకడ మాదిరిగా ఉపయోగించడాన్ని గురించి మంత్రి చెబుతూ దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాన్ని కలిగించే వాటిని వివేకంతో వాడాలని సూచించారు.  గతంలో ప్రజారోగ్య రంగంలో తప్పు నిర్ణయాలను గురించి చెప్తూ ఉదాహరణకు 1970వ, 1980వ దశాబ్దాల్లో శుద్ధిచేసిన నూనెలను ఎక్కువగా వాడకం వల్ల  అనంతర కాలంలో వ్యతిరేక పరిణామాలు వెలుగులోకి వచ్చాయన్నారు. దశాబ్దాల పర్యంతం చోటుచేసుకున్న పర్యవసానాల్ని పరిశీలించినప్పుడు గాని సరైన రోగనిర్ధారణ అంచనాలను లెక్కకట్టలేమని ఆయన అన్నారు.
వేగంగా ఒంటి బరువును తగ్గించుకోవడంతో ముడిపడ్డ సర్కోపేనియా, ‘‘ఒజెంపిక్ ఫేస్’’ వంటి పరిణామాలను ఇంకా అవగాహన చేసుకోలేదని  డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. 
తప్పు సమాచారాన్ని అనుసరిస్తున్నందువల్ల తలెత్తుతున్న అపాయాలను గురించి మంత్రి తన ప్రసంగంలో వివరించారు. అర్హతలు లేని అభ్యాసకులు, తమను తాము ఆహార నిపుణులుగా చెప్పుకొనే వారు భారత్‌లో జీవక్రియ సంబంధిత సంక్షోభాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నారని ఆయన హెచ్చరించారు. ‘‘భారత్‌లో ఉన్న సమస్య అంతా అవగాహన లేక కాదు... తప్పు దారి పట్టించే సమాచారం వేగంగా వ్యాప్తి చెందడమే. ప్రతి ఒక్క కాలనీలో ఆహార సూచనలు ఇచ్చే వారు ఉన్నా, వారి   అర్హతలను సరిచూసే వ్యవస్థ ఉండడం లేదు. సరిచూడని సలహాలూ, పరీక్షించని సూత్రాలూ.. ఊబకాయానికి మించిన ఆపదల్ని కొని తెస్తాయి’’ అని ఆయన అన్నారు. తప్పుదోవ పట్టించేవారి నుంచి రోగులను కాపాడే  విధానాలను రూపొందించాల్సిందిగా మంత్రి విధాన రూపకర్తలను కోరారు.

భారత్‌లో జీవక్రియకు సంబంధించిన సంక్లిష్ఠతలు నానాటికీ పెచ్చుపెరుగుతున్న సంగతిని కూడా ఆయన ప్రస్తావించారు. ‘‘ఇదివరకు అవుట్ పేషెంట్ల విభాగానికి వస్తున్న వారిలో ప్రతి మూడో రోగికీ తనకు మధుమేహం ఉందన్న విషయం అసలు తెలిసేదే కాదు. ఇవాళ ప్రతి మూడో రోగికీ ఫ్యాటీ లివర్ ఉంది. ఈ కేసులు క్రమంగా విస్తరిస్తున్నాయి.. మరి వీటిని ఎదుర్కోవడానికి మరింత ఎక్కువ శాస్త్రీయ, నియంత్రణలకు సంబంధించిన వ్యవస్థలను మనం రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది’’ అని మంత్రి అన్నారు.

ఆర్థిక శాస్త్రానికి సంబంధించి మార్క్ ట్వేన్ ప్రసిద్ధ వ్యాఖ్యతో ఒక పోలికను చెబుతూ, డాక్టర్ జితేంద్ర సింగ్ తన ప్రసంగాన్ని ముగించారు. ‘‘స్థూలకాయం ఎంతో గంభీరమైన విషయం. దీనిని ఒక్క ఎండోక్రైనాలజిస్టులకే వదలివేయ కూడదు. ఇది ఒక సామాజిక సమస్య. ఇది సంస్కృతి, అలవాట్లు, మార్కెట్లు, తప్పు సమాచారం వంటి వాటితో ఎదురవుతుంది. మరి దీని పరిధి అంతకంతకూ విస్తరిస్తుండటాన్ని ఉపేక్షించలేం’’ అని మంత్రి అన్నారు.
భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న జీవక్రియ సంబంధిత ఆరోగ్య సవాలును ఎదుర్కోవడానికి క్లినీషియన్లు, పరిశోధకులు, విధాన రూపకర్తవలతో పాటు ప్రజలు కూడా వారి వంతుగా ఇప్పటి కన్నా ఎక్కువ సహకారాన్ని అందించాలని కార్యక్రమం ముగింపు సందర్భంలో పిలుపునిచ్చారు.

 

***


(रिलीज़ आईडी: 2201200) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी