ఆర్థిక మంత్రిత్వ శాఖ
మహారాష్ట్రలోని వార్ధాలో “ఆపరేషన్ హింటర్‌ల్యాండ్ బ్రూ” కింద మాదకద్రవ్యాల అక్రమ ఫ్యాక్టరీని ధ్వంసం చేసిన డీఆర్‌ఐ
రూ.192 కోట్ల విలువైన 128 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనం… ముగ్గురి అరెస్ట్
प्रविष्टि तिथि:
09 DEC 2025 6:33PM by PIB Hyderabad
మహారాష్ట్రలోని వార్ధాలో ఒక రహస్య మాదకద్రవ్య తయారీ కేంద్రాన్ని “ఆపరేషన్ హింటర్‌ల్యాండ్ బ్రూ” కింద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా దాదాపు రూ.192 కోట్ల విలువైన 128 కిలోల మెఫెడ్రోన్ సహా 245 కిలోల ప్రాథమిక రసాయనాలు, ముడి పదార్థంతోపాటు పూర్తి ప్రాసెసింగ్ సరంజామాను స్వాధీనం చేసుకున్నారు.
నిర్దిష్ట నిఘా సమాచారం మేరకు డీఆర్‌ఐ అధికారులు పకడ్బందీ రహస్య ప్రణాళికను రూపొందించారు. తదనుగుణంగా వార్ధా నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలోగల కరంజా (ఘాడ్జ్)లో మారుమూల, పొదలతో కప్పబడిన ప్రాంతంలో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో పనిచేస్తున్న సింథటిక్ డ్రగ్ ప్రాసెసింగ్ సరంజామాను కనుగొన్నారు. ఇందులో తాత్కాలిక రియాక్టర్లు, పాత్రలు, మెఫెడ్రోన్ అక్రమ తయారీకి వాడే ఇతర పరికరాలు కూడా ఉన్నాయి. ఇక్కడ స్వాధీనం చేసుకున్న వాటిలో తుది ఉత్పత్తితోపాటు దాని సంశ్లేషణకు వినియోగించే ప్రాథమిక రసాయనాలున్నాయి.
కొందరు వ్యక్తులు ఈ అక్రమ కర్మాగారాన్ని గ్రామీణ నేపథ్యంలో కలిసిపోయేలా, ఆనవాళ్లు కనిపించకుండా రహస్యంగా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. బాగా దట్టమైన పొదల్లో తాత్కాలిక, మాడ్యులర్ తరహాలో ఎవరికీ అంతుచిక్కని రీతిలో మత్తుమందు తయారీ యూనిట్‌ను నిర్మించారు.
ఈ ఫ్యాక్టరీకి ఫైనాన్షియర్, రసాయన శాస్త్రవేత్తగా వ్యవహరించిన సూత్రధారి సహా అతని ఇద్దరు అనుచరులను అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ మెఫెడ్రోన్ తయారీ, పంపిణీ నెట్‌వర్క్‌లో చురుకైన పాత్ర పోషించినట్లు తేలింది. వీరిని ‘ఎన్‌డీపీఎస్’ చట్టం-1985లోని నిబంధనల కింద అరెస్టు చేశారు.
ప్రస్తుత ఆపరేషన్‌తో ఈ ఏడాది ఇప్పటిదాకా నిఘా-ఆధారిత చర్యల ద్వారా 5 రహస్య మాదకద్రవ్య తయారీ యూనిట్లను ‘డీఆర్‌ఐ’ ధ్వంసం చేసింది. నిరంతర నిఘా, కార్యాచరణ నైపుణ్యం, మాదకద్రవ్య విముక్త భారత్ అభియాన్‌పై ప్రభుత్వ నిబద్ధతను చాటే కార్యకలాపాల ద్వారా మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల ముప్పు నుంచి ‘డీఆర్‌ఐ’ ఈ విధంగా పౌరులను రక్షిస్తోంది.
****
(रिलीज़ आईडी: 2201185)
आगंतुक पटल : 9