పర్యటక మంత్రిత్వ శాఖ
భారత సుస్థిర పర్యాటక ప్రమాణాలు
प्रविष्टि तिथि:
08 DEC 2025 2:45PM by PIB Hyderabad
కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ భారత సమగ్ర సుస్థిర పర్యాటక ప్రమాణాలను ప్రవేశపెట్టింది. ఇవి పర్యాటక రంగంలోని మూడు ప్రధాన విభాగాలైన టూర్ ఆపరేటర్లు, వసతి సదుపాయాలు, బ్యాక్ వాటర్స్, సరస్సులు, నదులకు వర్తిస్తాయి. ఈ ప్రమాణాలను పర్యాటక రంగంలోని భాగస్వాములు ఆమోదించారు. మంత్రిత్వ శాఖ ఆమోదించిన టూర్ ఆపరేటర్లు “సురక్షితమైన, గౌరవమైన పర్యాటకం, సుస్థిర పర్యాటకం” పై నిబద్ధత కలిగి ఉంటామనే ఓ ప్రతిజ్ఞపై సంతకం చేయాలి. దీని ద్వారా వారు పర్యావరణం, వారసత్వ పరిరక్షణకు అనుగుణంగా సుస్థిర పర్యాటక విధానాలను అమలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పర్యాటక వనరుల వినియోగం స్థానిక సమాజానికి లాభం చేకూర్చేలా, భవిష్యత్తులో కూడా సుస్థిరంగా ఉపయోగపడేలా చూడటం దీని ఉద్ధేశం. ఇప్పటివరకు 2787 వసతి యూనిట్లు, 1633 పర్యాటక సేవా ప్రదాతలు పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా గుర్తింపు పొందారు.
సుస్థిర పర్యాటకం కోసం మంత్రిత్వ శాఖ రూపొందించిన జాతీయ వ్యూహాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనలకు అందజేసింది. ఈ వ్యూహానికి అనుగుణంగా పర్యాటకులు, పర్యాటక వ్యాపారాలు సుస్థిర పర్యాటక పద్ధతులను అవలంబించేలా ప్రోత్సహించడానికి ట్రావెల్ ఫర్ లైఫ్ (టీఎఫ్ఎల్) కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుస్థిర పర్యాటకం కోసం జాతీయ వ్యూహం ద్వారా ఎలాంటి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించలేదు.
పర్యాటక మంత్రిత్వ శాఖ– పర్యావరణం, అటవీ,& వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా 2023-24లో 210 మందికి ప్రత్యామ్నాయ జీవనోపాధి కార్యాక్రమం, పర్యావరణ్ నావిక్ సర్టిఫికేట్ పై 15 రోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించాయి. సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ (హర్యానా), యశ్వంత్ సాగర్ డ్యామ్, సిర్పూర్ సరస్సు ఇండోర్ (మధ్యప్రదేశ్), భితార్కనికా మడ అడవులు,చిలికా సరస్సు (ఒడిశా)వంటి అయిదు రామ్‌సర్ ప్రదేశాల్లో ఈ కార్యాక్రమాలను నిర్వహించింది.స్థానిక సాంస్కృతిక, సహజ వనరులను పరిరక్షించి, మెరుగుపరచడం, రామ్‌సర్ ప్రదేశాల్లో ప్రకృతి పర్యాటకాన్ని అభివృద్ధికి మద్దతివ్వడం ఈ రెండు మంత్రిత్వ శాఖల లక్ష్యం.
పర్యాటక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్ట్ దశలోనే హోటళ్ళు వివిధ పర్యావరణ అనుకూల చర్యలను తప్పనిసరిగా అనుసరించాలి. వాటిలో మురుగునీటి శుద్ధి కర్మాగారం (ఎస్ టీపీ), వర్షపు నీటి సేకరణ వ్యవస్థ, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ, కాలుష్య నియంత్రణ, శీతలీకరణ, ఎయిర్ కండిషనింగ్ కోసం నాన్-క్లోరోఫ్లోరోకార్బన్ (సీఎఫ్ సీ) పరికరాలను ప్రవేశపెట్టడం, శక్తి, నీటి సంరక్షణ కోసం చర్యలు మొదలైనవి ఉన్నాయి. దేశంలో స్థిరమైన, బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు, స్థానిక ప్రభుత్వాల భాగస్వామ్యంతో పర్యాటక గమ్యస్థానాల సమగ్ర అభివృద్ధి కోసం స్వదేశ్ దర్శన్ పథకాన్ని స్వదేశ్ దర్శన్ 2.0గా పునరుద్ధరించారు. ‘‘ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్‘‘ అనేది స్వదేశ్ దర్శన్ 2.0 కింద ఉన్న ఉప పథకం. పర్యాటక వ్యవస్థలో సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరచడం, పర్యాటక గమ్యస్థానాలను స్థిరమైన, బాధ్యతాయుతమైనవిగా మార్చడమే ఈ పథకం లక్ష్యం.
ఈ సమాచారాన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ నేడు లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
(रिलीज़ आईडी: 2200665)
आगंतुक पटल : 3