|
నీతి ఆయోగ్
“ప్రపంచ ప్రధాన క్వాంటం సామర్థ్య సహిత ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపాంతరీకరణ”కు నీతి ఆయోగ్ భవిష్యత్ ప్రణాళిక ఆవిష్కరణ
प्रविष्टि तिथि:
04 DEC 2025 6:29PM by PIB Hyderabad
భారతదేశాన్ని ప్రధాన క్వాంటం సామర్థ్య సహిత ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దడంపై నీతి ఆయోగ్ పరిధిలోని ‘ఫ్రాంటియర్ టెక్ హబ్’ ఈ రోజు ఒక భవిష్యత్ ప్రణాళికను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీ డి.శ్రీధర్ బాబు, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె.సారస్వత, నీతి ఆయోగ్ సీఈవో శ్రీ బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం, నీతి ఆయోగ్ విశిష్ట సభ్యురాలు శ్రీమతి దేవయాన ఘోష్ సహా పలువురు ప్రత్యేక అతిథులు, ప్రముఖులు పాల్గొన్నారు.
క్వాంటం సాంకేతికతలు త్వరలోనే ప్రస్తుత సమకాలీన ప్రపంచంలో అత్యంత ప్రగతిశీల శక్తిగా రూపొందనున్నాయి. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక, రవాణా, ముడి పదార్థాలు, ఇంధనం, జాతీయ భద్రత తదితర రంగాలను ఈ సాంకేతికతల ప్రభావం కొత్త పుంతలు తొక్కించగలదు. ఈ పరిజ్ఞానంతో నేడు నిర్ణయాత్మకంగా వ్యవహరించే దేశాలు భావితరం కంప్యూటింగ్, కమ్యూనికేషన్-సెన్సింగ్ సామర్థ్యాల నియంత్రణతోపాటు ప్రపంచ ఆవిష్కరణ, విశ్వసనీయతల స్వరూపస్వభావాలను మార్చగలవు.
భారత్ విషయంలో క్వాంటం రంగ భవిష్యత్తు సాంకేతికతకు అతీతంగా, ప్రపంచంలో మన దేశం స్థానాన్ని సరికొత్తగా నిర్వచించే అవకాశాన్ని సూచిస్తుంది. ఆ మేరకు ఇతరులు సాధించే ప్రమాణాలను అందుకోవడానికి బదులుగా ఆదినుంచీ అగ్రస్థానంలో నిలిచేందుకు యత్నిస్తుంది. క్వాంటం అనేది ఆవిష్కరణ సంబంధిత మరొక రంగం మాత్రమేగాక కృత్రిమ మేధ, బయోటెక్నాలజీ, అధునాతన ముడి పదార్థాలు సహా సురక్షిత డిజిటల్ మౌలిక సదుపాయాల నవశకాన్ని రూపుదిద్దడంలో పునాది కాగలదు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత నేషనల్ క్వాంటం మిషన్ సద్వినియోగం ద్వారా ఈ లక్ష్య సాకారానికి విస్పష్ట అవసరాలు, కార్యాచరణ మార్గాలను నీతి ఆయోగ్ ఆవిష్కరించిన భవిష్యత్ ప్రణాళిక నిర్దేశిస్తుంది. దీనికి సంబంధించి ప్రపంచంలో భారత్ ప్రస్తుత స్థానం, వ్యూహాత్మక సామర్థ్యాలు, కీలక అంతరాలపై సమగ్ర విశ్లేషణను సమకూరుస్తుంది. అలాగే పరిశోధన-అభివృద్ధి, వాణిజ్యీకరణ, పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిని వేగిరపరచే దిశగా కీలక చర్యలను సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయ, పోటీతత్వ క్వాంటం ఆర్థిక వ్యవస్థను రూపొందించడంలో విధాన రూపకర్తలు, శాస్త్రవేత్తలు, వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, రాష్ట్రాలతో కూడిన సమష్టి యాజమాన్యం అవసరాన్ని స్పష్టం చేస్తుంది.
ఈ సందర్భంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు-వాణిజ్య శాఖల మంత్రి శ్రీ డి.శ్రీధర్ బాబు మాట్లాడుతూ- “క్వాంటమ్ కంప్యూటింగ్ ఓ సరికొత్త మలుపు... ఇందులో సాంకేతికత వేగం, స్థాయి అవధులు దాటగలవు. ఔషధ ఆవిష్కరణ, వాతావరణ నమూనా తయారీ నుంచి జాతీయ భద్రత, ఆధునిక ముడి పదార్థాల రంగందాకా ఒకనాడు అసాధ్యమని భావించిన అనేక అంశాలకు పరిష్కారం చూపగలదు. కేవలం కొన్నేళ్ల వ్యవధిలోనే క్వాంటం రంగంపై ప్రపంచ దృక్కోణం పది రెట్లు విస్తరించింది. ఈ రంగం ఇకపై ఎంతమాత్రం ప్రయోగాత్మకమైనది కాదని, అనివార్య స్థాయిని చేరిందని ఈ పరిణామం రుజువు చేస్తోంది. అందుకే తెలంగాణ రాష్ట్రం పూర్తి సంసిద్ధత, ఆసక్తితో ఈ రంగంలో ప్రవేశిస్తోంది. తదనుగుణంగా మేం ముమ్మర పరిశోధన సామర్థ్యాలను రూపొందిస్తున్నాం. ప్రతిభ నైపుణ్యాలను పెంచడం ద్వారా పరిశ్రమ-ఆవిష్కరణలతోపాటు విస్తరణ మార్గాలను సృష్టిస్తున్నాం. కొత్త సాంకేతికతల అనుసరణ కాకుండా క్వాంటం భవిష్యత్తును రూపొందించడంలో భాగస్వామ్యం, అగ్రస్థానం సాధించడమే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు.
అనంతరం నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె.సారస్వత్ ప్రసంగిస్తూ- “ఆర్థిక వృద్ధి, జాతీయ భద్రత, శాస్త్రీయ ఆవిష్కరణలకు వ్యూహాత్మక చోదకాలుగా క్వాంటం సాంకేతికతలు వేగంగా పురోగమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే క్వాంటం కంప్యూటింగ్, సురక్షిత కమ్యూనికేషన్, ప్రెసిషన్ సెన్సింగ్, ఆధునిక ముడి పదార్థాలను కీలక పారిశ్రామిక రంగాలతోపాటు జాతీయ కార్యక్రమాలతో అనుసంధానించాలి. ఈ దిశగా నేషనల్ క్వాంటం మిషన్ కీలక ఆరంభ వేగాన్నిచ్చింది. ఇక సామర్థ్య విస్తరణ, ప్రత్యేక ప్రతిభకు ఉత్తేజం, ప్రపంచవ్యాప్త పోటీ వేదికల రూపకల్పనకు అవసరమైన కీలకాంశాలను ప్రస్తుత భవిష్యత్ ప్రణాళిక స్పష్టంగా వివరిస్తుంది. సముచిత పెట్టుబడులు, సమన్వయం ద్వారా భారత్ సుస్థిర డిజిటల్ భవిష్యత్తును రూపొందించుకుని, ప్రపంచ క్వాంటం రంగంలో తనదైన విశిష్ట స్థానాన్ని సముపార్జించగలదు” అని వివరించారు.
నీతి ఆయోగ్ సీఈవో శ్రీ బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం మాట్లడుతూ- “భారత్ క్వాంటం సాంకేతికతల ప్రపంచ సరఫరాదారు కాగలదా లేక పరాధీన వినియోగదారుగా మిగులుతుందా అన్నది మరో ఐదేళ్ల కాలం నిర్ణయిస్తుంది. ఈ దశలో మనం వేగంగా ముందడుగు వేయాలంటే ప్రపంచవ్యాప్త విశ్వసనీయ, ఆర్థికంగా పోటీనివ్వగల, వ్యూహాత్మకంగా సురక్షితమైన క్వాంటం సామర్థ్య సహిత భారత్‌ను మనం రూపొందించాలి. ఇందుకోసం మన అసమాన ప్రతిభానిధిని, అపార ఇంజనీరింగ్ అనుభవాన్ని, సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాలను ఏకీకృతం చేయాలి. భాగస్వామ్య విధానంలో కృషి, తక్షణ ప్రతిస్పందన ద్వారా సాంకేతికత పరాధీనతను మనం అధిగమించగలం. అంతేగాక భారత్ ఆవిష్కరణ సామర్థ్యాన్ని ప్రతిబింబించే ప్రపంచవ్యాప్త విశ్వసనీయ వేదికలను రూపొందించగలం” అని వివరించారు.
నీతి ఆయోగ్ విశిష్ట సభ్యురాలు శ్రీమతి దేవయాని ఘోష్ మాట్లాడుతూ- “క్వాంటమ్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పోటీ వేగంగా విస్తరిస్తోంది. అందువల్ల అగ్రస్థానానికి చేరడమన్నది ఎగుమతికి వీలైన పరిష్కారాల రూపకల్పన సామర్థ్యం, సాంకేతిక ప్రమాణాల నిర్దేశం, సురక్షిత విలువ వ్యవస్థకు రూపమివ్వడం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఈ దిశగా మన పరిశోధన మౌలిక సదుపాయాల విస్తరణ, ఆవిష్కరణ నుంచి మార్కెట్ మార్గాల క్రమబద్ధీకరణ, మరింత ఉన్నతంగా ప్రతిభకు పదును పెట్టడం తదితరాల అవసరాన్ని నేడు ఆవిష్కరించిన భవిష్యత్ ప్రణాళిక స్పష్టం చేస్తోంది. తగిన సమయంలో పెట్టుబడులు పెట్టడం, అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడం ద్వారా వర్ధమాన దేశాలే కాకుండా యావత్ ప్రపంచ స్థాయిలో భారత్‌ను విశ్వసనీయ క్వాంటం భాగస్వామిగా రూపొందించగలం” అని విశదీకరించారు.
భారతదేశాన్ని ప్రధాన క్వాంటం సామర్థ్య సహిత ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దడంపై ‘ఐబీఎం’ సహకారంతో నీతి ఆయోగ్ పరిధిలోని ‘ఫ్రాంటియర్ టెక్ హబ్’ ఈ భవిష్యత్ ప్రణాళికను రూపొందించింది. ఇందుకోసం అగ్రశ్రేణి పారిశ్రామిక, విద్యాసంస్థలతోపాటు నిపుణుల మండలి మార్గదర్శకత్వంతో కృషిచేసింది. ప్రణాళిక ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వాధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, ప్రగతి భాగస్వాములు ఎంతో ఆసక్తితో పాలుపంచుకున్నారు. ఈ మేరకు క్వాంటం సామర్థ్య సహిత ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ పురోగమనంపై సమష్టి సంకల్పాన్ని ప్రస్ఫుటం చేశారు. కింది లింకుపై క్లిక్ చేయడం ద్వారా ఈ ప్రణాళిక పూర్తి రూపాన్ని పరిశీలించవచ్చు.
Roadmap_for_Transforming_India_into_a_Leading_Quantum_Powered_Economy.pdf
నీతి ఫ్రాంటియర్ టెక్ హబ్ నేపథ్యం
వికసిత భారత్ దిశగా కార్యాచరణ వనరు రూపంలో ‘నీతి ఫ్రాంటియర్ టెక్ హబ్’ కృషి చేస్తుంది. ఈ మేరకు ప్రగతిశీల వృద్ధి, సామాజికాభివృద్ధి కోసం నవ్య సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం లక్ష్యంగా 20కిపైగా కీలక రంగాల సంబంధిత 10 ఏళ్ల భవిష్యత్ ప్రణాళికను రూపొందించింది. ఇందుకోసం ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థల నుంచి ఎంపిక చేసిన 100 మందికిపైగా నిపుణుల సహకారం తీసుకుంది. దేశవ్యాప్త భాగస్వాములకు సాధికారత కల్పన, సమష్టి కార్యాచరణకు సారథ్యం ద్వారా తక్షణ చర్యల ఆవశ్యకతను ఈ హబ్ ప్రోత్సహిస్తుంది. ఆ విధంగా 2047 నాటికి సంపన్నమైన, పునరుత్థాన, సాంకేతిక స్వయంసమృద్ధ భారత్‌కు పునాది వేస్తోంది.
***
(रिलीज़ आईडी: 2199701)
|