పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ వన్యప్రాణి నేరస్థురాలి అరెస్టు
వన్యప్రాణి అపరాధ నియంత్రణ బ్యూరో, ఎంపీ స్టేట్ టైగర్ స్ట్రయిక్ ఫోర్స్ సంయుక్త కృషి
प्रविष्टि तिथि:
05 DEC 2025 3:28PM by PIB Hyderabad
వన్యప్రాణి నేర నియంత్రణ బ్యూరో (డబ్ల్యూసీసీబీ), మధ్యప్రదేశ్ స్టేట్ టైగర్ స్ట్రయిక్ ఫోర్స్ (ఎంపీ ఎస్టీఎస్ఎఫ్) సమన్వయంతో కృషి చేసి యాంగ్‌చన్ లచింగ్పాను అరెస్టు చేశాయి. ఇంటర్‌పోల్ రెడ్ నోటీసులో పేర్కొన్న ప్రకారం, ఈ అంతర్జాతీయ వన్యప్రాణి నేరస్థురాలి కోసం అన్ని దేశాల్లో పోలీసులు వెదుకుతున్నారు. నిరంతరంగా సాగిన గోప్య యత్నాలతో పాటు క్షేత్ర కార్యాచరణను కూడా చేపట్టి, ఈమెను ఈ నెల 2న ఉత్తర సిక్కింలోని లాచుంగ్‌లో అరెస్టు చేశారు.
ఇది దేశంలో అన్నింటి కన్నా ముఖ్యమైన అరెస్టుల్లో ఒకటి. దీనిలో.. ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు ఆధారంగా వన్యప్రాణి నేరస్థురాలిని అరెస్టు చేశారు. నిందితురాలికి సంబంధించిన నోటీసును గత అక్టోబరు 2న ఇంటర్‌పోల్ లైజాన్ ఆఫీసు హోదాలో డబ్ల్యూసీసీబీ అందుకుంది. ఈ ఆపరేషన్లో సిక్కిం పోలీసులు, అటవీ విభాగం, న్యాయ వ్యవస్థ, జిల్లా పాలనయంత్రాంగం పూర్తి సహకారాన్ని అందించాయి. ప్రజల్లో చెలరేగిన ఉద్వేగ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని, సురక్షిత తరలింపు ఏర్పాట్లు చేయడం కోసం ఎస్ఎస్‌బీ సిక్కింతో పాటు సిలిగురి నుంచి కూడా సహాయాన్ని తీసుకున్నారు.
అరెస్టు అనంతరం నిందితురాలికి తప్పనిసరి వైద్య పరీక్ష చేసి సంబంధిత న్యాయస్థానంలో హాజరు పరచడానికి గాను గ్యాంగ్‌టక్‌కు తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలను పూర్తి చేసిన తరువాత, ఆమెను గత డిసెంబరు 3న న్యాయస్థానంలో హాజరుపరిచారు. అక్కడ ఆమె జామీను కోరుతూ పెట్టుకున్న వినతిని కొట్టివేశారు. తాత్కాలిక నిర్బంధానికి గాను మధ్యప్రదేశ్‌కు తరలించాలని ఆదేశాలిచ్చారు. తదుపరి న్యాయ విచారణ సంబంధిత కార్యకలాపాలను మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంలో చేపడతారు.
కేసు నేపథ్యం
మధ్యప్రదేశ్ అటవీ విభాగం 2015 జులై 13న హోషంగాబాద్ (నర్మదాపురం)లోని సాత్పురా పులుల అభయారణ్యానికి చెందిన కామ్తీ రేంజ్‌లో వన్యప్రాణి నేరానికి సంబంధించిన కేసు నమోదు అయింది. పులి శరీర భాగాలనూ, అలుగు పొలుసులనూ చట్టవిరుద్ధంగా వేటాడి, వాటిని విక్రయించడానికి సంబంధించిన కేసు ఇది. ఈ కేసులో జప్తు చేసిన వస్తువుల్లో పులి ఎముకలు నాలుగు, ఒకటిన్నర కిలోల అలుగు పొలుసులు, పులి చర్మం, పులి ఎముక మజ్జ నుంచి తీసిన నూనె వంటివి ఉన్నాయి. ఈ కేసులో మరో ముఖ్య నిందితుడు శ్రీ జై తమాంగ్‌ను 2015 అక్టోబరులో అరెస్టు చేశారు. నిషిద్ధ వన్యప్రాణి దేహ భాగాలను తాను లచింగ్పాకు సరఫరా చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. ఆమే తనకు ఆశ్రయాన్ని కూడా కల్పించిందని తెలిపాడు. అతడి అపరాధ అంగీకారంతో చట్టవిరుద్ధ వాణిజ్య వ్యవస్థలో లచింగ్పా పాత్ర ఉందని రూఢి అయింది.
ఈ కేసులో మొత్తం 36 మందిని గురించి పేర్కొన్నారు. వారిలో 27 మందిని నర్మదాపురం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేటు 2022 డిసెంబరు 20న దోషులుగా తేల్చారు. ఏమైనా, లచింగ్పా పరారైనందువల్ల ఆమెకు వ్యతిరేకంగా కార్యాచరణను చేపట్టడానికి వీలుపడలేదు. సిక్కింలోని లచింగ్/గ్యాంగ్‌టక్ ప్రాంత నివాసి అయిన లచింగ్పా వ్యవస్థీకృత చట్టవిరుద్ధ వాణిజ్య ముఠాలో ప్రముఖ సభ్యురాలు అని గుర్తించారు. ఈ ముఠాలో వేటగాళ్లతో పాటు మధ్యవర్తులు కూడా ఉన్నారు. ఈ ముఠా నేపాల్, టిబెట్, భూటాన్లలో చట్టవిరుద్ధ వన్యప్రాణి సీమాంతర వాణిజ్య మార్గాల్లో రాకపోకలు జరిపేది. ఢిల్లీ, సిలిగురి, గ్యాంగ్‌టక్, కోల్కతా, కాన్పూర్, ఇటార్సీ, హోషంగాబాద్లు సహా భారత్‌లో అనేక నగరాల్లో ఈ ముఠా కార్యకలాపాల్ని కొనసాగించింది.
లచింగ్పాను 2017 నవంబరులో మధ్యప్రదేశ్ స్టేట్ టైగర్ స్ట్రయిక్ ఫోర్స్ (ఎంపీ ఎస్టీఎస్ఎఫ్) కొంత కాలం పాటు అరెస్టు చేసింది. అయితే, ఆమె జామీను షరతుల్ని అతిక్రమించి, పరారైంది. ఫలితంగా ఆమె అరెస్టు నిమిత్తం 2019 జులై 29న వారంటును జారీ చేశారు. ఆమె పలాయనాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇంటర్‌పోల్ రెడ్ నోటీసును తీసుకోవాల్సిందిగా సీబీఐ (ఇదే భారత జాతీయ కేంద్ర బ్యూరో (ఎన్‌సీబీ)తో పాటు వన్యప్రాణి అపరాధాలు సహా అన్ని నేరాలకు గాను రెడ్ నోటీసుల్ని జారీ చేస్తుంది)ని డబ్ల్యూసీసీబీ కోరింది. లచింగ్పా కోసం 2025 అక్టోబరు 2న ‘‘పరారీలో ఉన్న, విచారణ జరపడానికి అపేక్షిస్తున్నట్లుగా’’ ఒక నోటీసును జారీ చేశారు. ఆమెను ఈ నెల 2న అరెస్టు చేశారు. నిందితురాలు విదేశీ వన్యప్రాణుల, ప్రత్యేకించి పులి శరీరభాగాల అంతర్జాతీయ దొంగతనాల వాణిజ్యంలో ఒక ప్రముఖ రిలే పాయింటుగా అనుమానిస్తున్నారు. ముందుముందు జరపబోయే దర్యాప్తు, ఈ అక్రమ వాణిజ్య ముఠాకు సంబంధించిన లోగుట్టులపై కీలకమైన లోతైన అవగాహనల్ని అందించ గలదని భావిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2199667)
आगंतुक पटल : 8