కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
తపాలా కార్యాలయాల ఆధునికీకరణ
దేశవ్యాప్తంగా తపాలా కార్యాలయాల్లో ఐపీపీబీ సేవలు… ఐపీపీబీ కోర్ బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం
ఇంటింటికీ బ్యాంకింగ్ సేవలందించడానికి పోస్ట్‌మన్లతో పాటు గ్రామీణ్ డాక్ సేవకులకు స్మార్ట్‌ఫోన్లు, బయోమెట్రిక్ పరికరాలు
प्रविष्टि तिथि:
04 DEC 2025 3:54PM by PIB Hyderabad
ఐటీ ఆధునికీకరణ ప్రాజెక్టు 2.0లో భాగంగా, ఆధునిక తపాలా సాంకేతికత (ఏపీటీ) వేదికను తపాలా విభాగం (డీఓపీ) విజయవంతంగా ప్రారంభించింది. ఈ వేదిక దేశీయంగా రూపొందించిన, క్లౌడ్ ఆధారిత డిజిటల్ వేదిక. దీనిని పోస్టల్ టెక్నాలజీ ఎక్స్‌లెన్స్ సెంటర్ (సీఈపీటీ)లో తయారు చేసి, మేఘ్రాజ్ 2.0 క్లౌడ్‌లో అందుబాటులో ఉంచారు. ఏపీటీని ఎప్పటికప్పుడు పెరుగుతున్న వినియోగదారు ఆకాంక్షలకు తగ్గట్టు మార్పులూ చేర్పులూ చేయడానికి అనుకూలంగా ఉండేదిగానూ, లోడ్ ఎక్కువైనా తీసుకొని పరిష్కరించేదిగానూ తీర్చిదిద్దారు. దీనికి దేశంలో 23 పోస్టల్ సర్కిళ్ల పరిధిలోని దాదాపు ఒక లక్షా డెబ్భయ్ వేల కార్యాలయాలను అనుసంధానం చేశారు. గత ఆగస్టు 4న సేవలు ప్రారంభమైయ్యాయి. బ్రాంచి పోస్టాఫీసులకు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను అందించారు. సేవల అందజేత, మెరుగైన సంధానంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారుల అవగాహనను దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్‌ఫోన్లలో మొబైల్ డిజిటల్ రూరల్ ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ (డీఆర్ఈఏఎమ్) ను అనుసంధానించారు. కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్‌లో భాగంగా, 25022 డిపార్ట్‌మెంటల్ పోస్టాఫీసులను నెట్‌వర్క్‌తో కలిపారు.
ఇంటింటికీ బ్యాంకింగ్ సేవలందించడానికి పోస్ట్‌మన్లతో పాటు గ్రామీణ్ డాక్ సేవకులకు స్మార్ట్ఫోన్లనూ, బయోమెట్రిక్ పరికరాలనూ అందజేశారు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) సాయంతో ఆర్థిక సేవల పరిధిని డీఓపీ విస్తరించింది. ఈ ఆర్థిక సేవల్లో.. ఖాతాను మొదలుపెట్టడం, ఆధార్ సాయంతో పనిచేసే చెల్లింపు వ్యవస్థ (ఏఈపీఎస్), డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (డీఎల్‌సీ), మూడో పక్షం ద్వారా బీమా సేవలు, పోస్టాఫీస్ పొదుపు ఖాతా లింకేజీ, క్రెడిట్ రెఫరల్ సదుపాయం, ఆధార్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్ వంటి వాటితో పాటు, 5 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న బాలలకు ఆధార్ నమోదు సేవ వంటివి ఉన్నాయి. దేశం నలుమూలలా తపాలా కార్యాలయాలన్నీ ఐపీపీబీ సేవల్ని అందిస్తున్నాయి. ఇవి ఐపీపీబీ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (సీబీఎస్)తో కూడా ముడిపడి ఉంటాయి.
ఈ సమాచారాన్ని రాజ్యసభలో ఈ రోజు ఒక ప్రశ్నకు కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాతపూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2199152)
आगंतुक पटल : 7