జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్ ను కలుపుతూ నదుల అనుసంధాన ప్రాజెక్టులు

प्रविष्टि तिथि: 04 DEC 2025 6:09PM by PIB Hyderabad

నీటి కొరతను అధిగమించేందుకు, దేశవ్యాప్తంగా సాగు నీటి సౌకర్యాలను విస్తరించేందుకు భారత ప్రభుత్వం రూపొందించిన జాతీయ దృక్పథ ప్రణాళిక (ఎన్పీపీ) క్రింద మొత్తం 30 నదుల అనుసంధాన (ఐఎల్ఆర్) ప్రాజెక్టులను గుర్తించారు. ఈ ఎన్పీపీ పరిధిలో  ఐఎల్ఆర్ ప్రాజెక్టులను అమలు చేసే బాధ్యతను నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) కు అప్పగించారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలుపుతూ ఏడు ఐఎల్ఆర్ ప్రాజెక్టులు ఉన్నాయి.  (వాటి వివరాలు పట్టికలో ఉన్నాయి.)

వీటిలో గోదావరి (పోలవరం) - కృష్ణ (విజయవాడ) లింక్ ప్రాజెక్టు  1980లో రూపొందించిన జాతీయ దృక్కోణ ప్రణాళికలోని ద్వీపకల్ప భాగం కింద ఉన్న లింక్ ప్రాజెక్టులలో ఒకటి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాధ్యాసాధ్యాల నివేదికను  ఎన్ డబ్ల్యూ డీఏ సెప్టెంబర్ 1999లో తయారు చేసింది. అనంతరం, ఈ లింక్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టు కింద చేపట్టింది. దీని సమగ్ర ప్రాజెక్టు  నివేదిక (డీపీఆర్)ను 2005లో సెంట్రల్ వాటర్ కమిషన్‌ (సీడబ్ల్యూసీ) కి సమర్పించింది. కుడి ప్రధాన కాల్వ ద్వారా 4666 ఎంసిఎమ్ నీటిని మళ్లించేందుకు సంబంధించిన డీపీఆర్ ను 2009లో ఆమోదించారు.

ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ప్రకటించిన పోలవరం నీటిపారుదల జాతీయ ప్రాజెక్టులో భాగంగా ఈ లింక్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ పరిధిలోకి వచ్చింది. లింక్ కెనాల్ లో నీటి కనెక్టివిటీని ఏర్పాటు చేశారు. లిఫ్ట్ ఏర్పాట్ల ద్వారా కాలువను తాత్కాలికంగా ప్రారంభించారు.

ఈ ప్రాజెక్టు మినహా, జాతీయ దృక్పథ ప్రణాళిక కింద  ఆంధ్రప్రదేశ్ కు సంబంధం  ఉన్న  మరే ఇతర ఐఎల్ఆర్ ప్రాజెక్టు  ఇంకా అమలు దశకు చేరుకోలేదు.

గోదావరి (పోలవరం) - కృష్ణా (విజయవాడ) లింక్ ప్రాజెక్టును కూడా కలిగి ఉన్న పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు (పీఐపీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరుగుతోంది. ఇది భారత ప్రభుత్వం నుంచి నిరంతర ఆర్థిక సహాయాన్ని పొందుతోంది. 2014 -  2024 మధ్య రాష్ట్ర ప్రభుత్వానికి రూ.15,146 కోట్లను రీ ఎంబరమెంట్ నిధులుగా చెల్లించారు. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి వీలుగా రూ.12,157 కోట్ల అదనపు కేంద్ర సహాయంతో సహా రూ.30,436 కోట్ల సవరించిన వ్యయ అంచనాను భారత ప్రభుత్వం ఆమోదించింది. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటి వరకు అందించిన మొత్తం కేంద్ర సహాయం / ఆర్థిక సహాయం రూ.20,658 కోట్లు.

ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఆమోదించిన గడువులు, వాటిలో చేసిన సవరణలు, పరిపాలనా, ఆర్థిక, భూ సేకరణ, పర్యావరణ, అంతర-రాష్ట్ర సమస్యల కారణంగా జరిగిన ఆలస్యాలకు కారణాలు, అలాగే అదనపు సాగు సామర్థ్యం సృష్టి, ప్రణాళికాబద్ధమైన తాగునీటి సరఫరా, వరద నియంత్రణ, లాభపడే జిల్లాల సంఖ్య తో సహా ఆంధ్రప్రదేశ్ కు చేకూరే అవకాశం ఉన్న ప్రయోజనాల – సమాచారాన్ని అనుబంధంలో పొందుపరిచారు.

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ముందస్తు సాధ్యాసాధ్యాల (ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ - పీఎఫ్ఆర్)ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించింది, ఇది పోలవరం డ్యామ్ నుంచి బనకచర్ల రెగ్యులేటర్ కు వరద నీటిని తరలించే ఉద్దేశ్యాన్ని కలిగి ఉంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.81,900 కోట్లు. సాంకేతిక, ఆర్థిక అంశాల మదింపు కోసం 22 మే 2022న కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) ఈ పీఎఫ్ఆర్ ను సమర్పించారు. దీనిని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు  (జీఆర్ఎంబీ), పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) హైదరాబాద్ తో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ వంటి సహ పరీవాహక ప్రాంత రాష్ట్రాలకు వారి అభిప్రాయాలు/అభ్యంతరాల  కోసం పంపారు.

జలశక్తి శాఖ మంత్రి శ్రీ సి.ఆర్. పాటిల్ ఈ రోజు లోక్ సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(रिलीज़ आईडी: 2199138) आगंतुक पटल : 31
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी