బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు తవ్వకాల ప్రభావం

प्रविष्टि तिथि: 03 DEC 2025 4:50PM by PIB Hyderabad

జాతీయ స్థాయిలో 2025-26 సంవత్సరానికి గాను ముడి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 1157 మిలియన్ టన్నులు (ఎంటీ). ఇందులో వివిధ సంస్థలకు నిర్దేశించిన వాటా ప్రకారం- కోల్ ఇండియా (సీఐఎల్‌) 875 ఎంటీ, సింగరేణి కాలరీస్ కంపెనీ (ఎస్‌సీసీఎల్‌) 72 ఎంటీ, సొంత/వాణిజ్య/ ఇతర గనులు 210 మిలియన్‌ టన్నుల వంతున ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. కాగా, 2029-30 నాటికి దేశీయంగా 1.5 బిలియన్‌ టన్నులు (బీటీ) ఉత్పత్తి చేయాలని బొగ్గు మంత్రిత్వ శాఖ లక్ష్యనిర్దేశం చేసుకుంది.

ప్రభుత్వ రంగంలోని సంస్థలు బొగ్గు తవ్వకంలో కఠిన పర్యావరణ నిబంధనలను అనుసరిస్తాయి. ఈ మేరకు ఏదైనా కొత్త బొగ్గు గని ప్రారంభం లేదా పాత గని విస్తరణకు ముందు పర్యావరణ అనుమతులు (ఈసీ) పొందుతాయి. అలాగే పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ), పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ)లను రూపొందించి అన్ని గనులలో అమలు చేస్తాయి. ఆమోదిత గనుల తవ్వకం ప్రణాళిక, ‘ఈఎంపీ’లకు అనుగుణంగా భూ పునరుద్ధరణ చేపడతాయి. బొగ్గు తవ్వకంతో కలిగే  పర్యావరణ ప్రభావాల తగ్గింపులోనూ ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలు సమగ్ర చర్యలు చేపడతాయి. ఈ మేరకు (ఎ) పర్యావరణ (పరిరక్షణ), జల, వాయు చట్టాల అనుసరణ సహా గని మూసివేత మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తాయి. (బి) సుస్థిర, కాలుష్యరహిత తవ్వకపు సాంకేతికతలకు ప్రోత్సాహం, (సి) గాలి నాణ్యత నిబంధనల అనుసరణ-పర్యవేక్షణ (డి) గనిలో ఊరే నీటి పునర్వినియోగం-పరిరక్షణ చర్యలు; (ఇ) భూమి పునరుద్ధరణ, గని మూసివేత మార్గదర్శకాల అనుసరణ (ఎఫ్) పెద్ద ఎత్తున తోటల పెంపకం, హరిత వనాల అభివృద్ధి (జి) ‘పరివేష్‌’ పోర్టల్ ద్వారా పర్యవేక్షణ-నిబంధనల అనుసరణ (హెచ్) సీపీసీబీ, ఎస్‌పీసీబీలు, పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖతో సమన్వయం (i) పర్యావరణ హిత సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం (జె) కాలుష్య నియంత్రణ చర్యల అమలు వంటి అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకుంటాయి.

బొగ్గు నాణ్యతను పెంచడానికి అత్యాధునిక ఖనిజశుద్ధి సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తాయి. అలాగే కొత్త, ప్రణాళిక బద్ధ శుద్ధి ప్లాంట్లలో (వాషరీ) హెవీ మీడియా సైక్లోన్, టీటర్ బెడ్ సెపరేటర్, స్పైరల్ కాన్సంట్రేటర్, ఫ్రోత్ ఫ్లోటేషన్ టెక్నాలజీ వంటి అత్యాధునిక సాంకేతిక సదుపాయాలన్నీ ఏర్పరిచాయి. ముఖ్యంగా కొత్త వాషరీలన్నిటినీ శూన్య వ్యర్థ విడుదలకు తగిన పరిజ్ఞానంతో రూపొందించారు. అంతేగాక కార్యాచరణ సామర్థ్యం పెంపు, బొగ్గు వాషింగ్ కార్యకలాపాల పర్యావరణ ఉద్గారాల తగ్గింపు దిశగా పాత వాషరీల ఆధునికీకరణ, పునరుద్ధరణ చేపట్టారు.

బొగ్గు గ్యాసిఫికేషన్‌కు సంబంధించి- బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు మద్దతుగా 2024 జనవరి 24న ప్రభుత్వం ₹8,500 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ఆర్థిక సహాయ పథకాన్ని ఆమోదించింది. దీనికింద ఎంపిక చేసిన 7 ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశలలో ఉన్నాయి. ఇవన్నీ ప్రారంభమయ్యాక ఏటా సుమారు 11.755 ఎంటీ బొగ్గును వినియోగించుకుంటాయని అంచనా.

బొగ్గు వేలం విధానం అమలులోకి వచ్చాక కేవలం 5 సంవత్సరాలలో బొగ్గు మంత్రిత్వ శాఖ 276.04 మిలియన్‌ టన్నుల అత్యధిక వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో 133 గనులకు 12 దఫాలుగా వేలం నిర్వహించింది. ఇవన్నీ పని చేయడం ప్రారంభిస్తే రూ.41,407 కోట్ల మూలధన వ్యయంతో ఏటా రూ.38,710 కోట్ల ఆదాయం ఆర్జించడం సహా 3,73,199 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.

తవ్వకం నిలిపేసిన, మధ్యలో వదిలివేసిన బొగ్గు గనులకు సంబంధించి రాబడి వాటా విధానం ప్రాతిపదికన కొన్ని వారసత్వ, కార్యకలాప రహిత భూగర్భ గనుల పునరుద్ధరణను ‘సీఐఎల్‌’ చేపడుతోంది. ఈ విధానం కింద సీఐఎల్‌, దాని అనుబంధ సంస్థలు నిలిపివేసిన గనుల పునఃప్రారంభం, పరిరక్షణ, పునరావాస కల్పన, అభివృద్ధి, నిర్వహణ తదితరాల కోసం గనుల తవ్వకందారు, కార్యకలాపాల నిర్వహణ సంస్థలకు అప్పగిస్తుంది. సదరు సంస్థలు బొగ్గును తవ్వి లేదా వెలికితీసి సీఐఎల్‌, దాని అనుబంధ సంస్థకు అందజేస్తాయి. ఇలా తవ్విన బొగ్గు నుంచి వచ్చే ఆదాయంలో కొంత శాతాన్ని బిడ్డింగ్‌లో పేర్కొన్న అత్యధిక ధర ప్రాతిపదికన సీఐఎల్‌, దాని అనుబంధ సంస్థలతో పంచుకుంటాయి.

ఈ విధానం కింద ఇప్పటిదాకా నిలిపివేసిన లేదా వదిలివేసిన 32 గనులను గుర్తించారు. వీటిలో 39.28 మిలియన్ టన్నుల సామర్థ్యంగల 28 గనులపై అంగీకార లేఖ (ఎల్‌ఓఏ) జారీకాగా, మిగిలిన 4 గనులకు తిరిగి టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ‘బీసీసీఎల్‌’ పరిధిలోని ‘పీబీ’ ప్రాజెక్టు, ‘ఈసీఎల్‌’ పరిధిలోని గోపీనాథ్‌పూర్ ప్రాజెక్టు సంబంధిత 2 గనులలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది.

కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.

 

***


(रिलीज़ आईडी: 2198494) आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी