నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
వరల్డ్‌స్కిల్స్ ఏషియా పోటీ-2025లో రాణించిన భారత్... తొలిసారే 8వ స్థానం
प्रविष्टि तिथि:
30 NOV 2025 7:45PM by PIB Hyderabad
ప్రపంచ నైపుణ్య ప్రదర్శన వేదికపై భారత్ గొప్ప విజయాన్ని నమోదు చేసింది. వరల్డ్‌స్కిల్స్ ఏషియా పోటీలు-2025 (డబ్ల్యూఎస్ఏసీ-2025)లో 29 దేశాల్లో తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన పని తీరుతో 8వ స్థానాన్ని సంపాదించింది. ఈ రంగంలో అగ్రగామి నైపుణ్య అనుబంధ విస్తారిత వ్యవస్థల్ని కలిగి ఉన్న దేశాలతో పోలిస్తే, భారత్ తన మొదటి యత్నంలో అధిక డిమాండు, కొత్తగా ఉనికిలోకి వస్తున్న వృత్తుల్లో ప్రశంసనీయ క్రమశిక్షణనీ, నవకల్పననీ, ప్రపంచ శ్రేణి శ్రేష్ఠత్వాన్నీ చాటింది.
నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికత్వ శాఖ నాయకత్వంలో, ఎన్ఎస్డీసీతోపాటు ఇతర సాంకేతిక భాగస్వామ్య సంస్థలు కూడా శిక్షణ, సన్నాహకాల బాధ్యతల్ని స్వీకరించాయి. భారతీయ జట్టులో 23 మంది పోటీదారులు 21 కేటగిరీల్లో పోటీ పడ్డారు. 21 మంది నిపుణులు వారి వెంట ఉండి మద్దతిచ్చారు.
ఈ జట్టు సాంప్రదాయిక కేటగిరీ, సాంకేతిక నైపుణ్యం అవసరమైన ఈ రెండు కేటగిరీల్లోనూ అసాధారణ పనితీరును కనబరిచింది. భారత్ ఒక రజత పతకాన్నీ, రెండు కాంస్య పతకాల్నీ, మూడు శ్రేష్ఠత్వ పతకాల్నీ గెలుచుకుంది. ఇది ప్రపంచ నైపుణ్య ప్రధాన శ్రేష్ఠత్వంలో దేశం ఎంత వేగంగా గుర్తింపును తెచ్చుకొంటున్నదీ సూచిస్తోంది.
పతకాల రూపంలో దక్కిన విజయాలు:
• రజత పతకం - చిత్రలేఖనం, అలంకరణ: ముస్కాన్
• కాంస్య పతకం - ఇండస్ట్రియల్ డిజైన్‌కు సంబంధించిన సాంకేతికత: కోమల్ పాండా
• కాంస్య పతకం - రోబో వ్యవస్థ ఏకీకరణ: శివం సింగ్, దినేశ్ ఆర్
• శ్రేష్ఠత్వ పతకం - వాణిజ్యానికి అవసరమైన సాఫ్ట్‌వేర్ ను అభివృద్ధి చేయడం: మొహమద్ మఫజ్ పీ ఆర్
• శ్రేష్ఠత్వ పతకం - వెబ్ సాంకేతికత: ఆదిత్య నందన్
• శ్రేష్ఠత్వ పతకం - ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్: ధనుష్ ఎం జీ
చక్కని పనితీరును ప్రదర్శించినవారుగా మహిళా పోటీదారులు పేరు తెచ్చుకున్నారు.. పతకాల పట్టికలో గొప్ప తోడ్పాటును అందించారు. ఇది భారత నైపుణ్య ప్రధాన అనుబంధ విస్తారిత వ్యవస్థలో యువ మహిళల నాయకత్వం అంతకంతకూ పుంజుకొంటున్న తీరును తెలియజేసింది. వారు సాంప్రదాయేతర నైపుణ్యాల్లో మెరుగైన ప్రదర్శనను కనబరిచి, దేశంలోనే శ్రేష్ఠమైన పతకాన్ని సంపాదించుకున్నారు. వివిధ నైపుణ్యాలలో కూడా భారతీయ పోటీదారులు మిగతా అందరి కన్నా ఎక్కువ మార్కుల్ని తెచ్చుకున్నారు.
భారత్ సాధించిన ఈ విజయాలపై కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికత్వ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), కేంద్ర విద్య శాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి స్పందిస్తూ, ‘‘వరల్డ్‌స్కిల్స్ ఏషియా-2025లో భారత్ ప్రదర్శన మన యువ ప్రతిభావంతుల ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, క్రమశిక్షణలకు అద్దం పడుతోంద’’న్నారు. ‘‘ఇక్కడ చేజిక్కించుకున్న ప్రతి పతకం, ప్రతి గుర్తింపూ మన పోటీదారుల కఠిన శ్రమ, వారికి శిక్షణను అందించిన వ్యక్తుల అంకితభావంతో పాటు భారత నైపుణ్య అనుబంధ విస్తారిత వ్యవస్థ రోజు రోజుకూ బలోపేతం అవుతోంది. మనం సాంకేతికత రంగంలో ముందంజ వేస్తున్న, ప్రపంచ దేశాలతో మునుపటి కంటే మరింత విస్తృత స్థాయిలో సంధానం అవుతున్న ఆర్థిక వ్యవస్థ దిశగా పయనిస్తున్న క్రమంలో, నైపుణ్యాలు ఒక్క ఉద్యోగాన్ని సంపాదించుకొనే మార్గం మాత్రమే కాదు.. దేశ పురోగతికి తోడ్పడే సాధనాలు కూడా అని ఈ పతక విజేతలు మనకు గుర్తు చేస్తున్నార’’ని కూడా మంత్రి అన్నారు. భారత్ సంతోషించేటట్లు చేసినందుకు మన విజేతలతో పాటు పోటీలో పాల్గొన్న అందరినీ శ్రీ జయంత్ చౌదరి అభినందించారు.
ఈ సాఫల్యాలు భారత్‌లో అనేక ప్రతిభావంతుల సత్తాను సూచిస్తున్నాయి. పోటీలో పాలుపంచుకొనే వారిని, ఇండియాస్కిల్స్ జాతీయ పోటీ-2024ని నిర్వహించి మరీ ఎంపిక చేశారు. పరిశ్రమ ఆధ్వర్యంలో కఠిన శిక్షణను నెలల తరబడి వారికి అందించారు. ప్రధాన విద్యాసంస్థలు, సెక్టర్ స్కిల్ కౌన్సిళ్లతో పాటు ప్రపంచ స్థాయి నిపుణులు కూడా ఈ శిక్షణలో తలో చేయి వేశారు. దీంతో డబ్ల్యూఎస్ఏసీ-2025 వేదిక మీదకు వెళ్లడానికి ప్రపంచ స్థాయి సన్నాహకాలు పూర్తి అయ్యాయి.
డబ్ల్యూఎస్ఏసీ-2025లో భారత్ ప్రదర్శన రాబోయే కాలంలో అంతర్జాతీయ పోటీల్ని దృష్టిలో పెట్టుకొని ఒక బలమైన ఉదాహరణను అందించినట్లుగా ఉంది. అంతేకాక, చేయి తిరిగిన ప్రతిభావంతులకు ప్రపంచ కూడలిగా నిలవాలన్న మన దేశ ఆకాంక్షను కూడా ఈ ప్రదర్శన బలపరుస్తోంది. త్వరలో నిర్వహించనున్న ప్రపంచ నైపుణ్య కార్యక్రమాల కోసం ప్రస్తుతం సన్నాహక చర్యలు కొనసాగుతున్నాయి.. దీంతో, యువతకు శిక్షణనిచ్చే వ్యవస్థను పటిష్ఠం చేయడంతో పాటు మరింత మెరుగైన ప్రదర్శనను ఇవ్వాలన్న దేశ నిబద్ధత కూడా భారత్ తన వేగాన్ని పెంపొందించుకోవడానికి దోహదం లభిస్తోంది.
దేశంలో నిరంతరంగా పెరుగుతూ ఉన్న జాతీయ స్థాయి నైపుణ్య ప్రోత్సాహక కార్యక్రమాల ప్రభావాన్నీ, యువ వృత్తినిపుణుల్లో ఆకాశమే హద్దుగా వర్ధిల్లుతున్న ఆకాంక్షల్నీ ప్రపంచ నైపుణ్య పోటీలు ప్రతిబింబిస్తున్నాయి. శిక్షణను అందించే వారు, పరిశ్రమ భాగస్వాములు, సెక్టర్ స్కిల్ కౌన్సిళ్ల నిబద్ధతను కూడా ఈ నైపుణ్య ప్రదర్శన చాటిచెబుతోంది. పోటీలో పాల్గొన్న వారిని ప్రపంచ శ్రేణి ప్రమాణాల్ని అందుకొనేటట్టుగా సన్నద్ధుల్ని చేయడానికి వీరంతా కలిసి ఎంతో శ్రమించారు.
ఖండమంతటి నుంచీ వందల మంద యువ పోటీదారుల్ని వరల్డ్‌స్కిల్స్ ఏషియా-2025 ఒకే చోటుకు తీసుకు వచ్చింది. దీంతో నైపుణ్యాన్నీ, నవకల్పనల్నీ, రాబోయే కాలం అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని అవసరమైన సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదిక అందుబాటులోకి వచ్చినట్లయింది. ఈ ప్రఖ్యాత ఖండాంతర పోటీ మూడో సంచికలో, నైపుణ్యాలకు సంబంధించిన 44 కేటగిరీల్లో 500 కన్నా ఎక్కువ మంది పోటీదారులు పాల్గొన్నారు. వారు సభ్య దేశాలూ, అతిథి దేశాలూ కలిపి సుమారు 29 దేశాలకు ప్రాతినిధ్యాన్ని వహించారు. ఇది స్థానిక విద్య, ఆర్థికవ్యవస్థ, పర్యటనలతో పాటు అంతర్జాతీయ మార్పిడులను ప్రోత్సహించేందుకు విలువైన అవకాశాల్ని కూడా పోటీదారులకు అందించింది.





***
(रिलीज़ आईडी: 2196940)
आगंतुक पटल : 34