వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పురస్కారాల ప్రదాన కార్యక్రమంతో ముగిసిన 44వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్
प्रविष्टि तिथि:
27 NOV 2025 9:12PM by PIB Hyderabad
ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఓ) ఏర్పాటు చేసిన 44వ భారత అంతర్జాతీయ వాణిజ్య మేళా (ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్.. ఐఐటీఎఫ్) ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో గల మ్యూజికల్ ఫౌంటెన్ స్టేజీలో పురస్కారాల ప్రదాన కార్యక్రమంతో ముగిసింది. అత్యుత్తమ ప్రదర్శనకి గాను ఐఐటీఎఫ్ - 2025 అవార్డులను ఐటీపీఓ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నీరజ్ ఖర్వాల్ బహూకరించారు.
భాగస్వామ్య రాష్ట్ర కేటగిరీలో, స్వర్ణ పతకాన్ని రాజస్థాన్ అందుకొంది. రజత పతకాన్ని బీహార్, కాంస్య పతకాన్ని ఉత్తరప్రదేశ్ అందుకున్నాయి. మహారాష్ట్ర ప్రత్యేక ప్రశంసను అందుకుంది. ఫోకస్ స్టేట్ కేటగిరీలో ఝార్ఖండ్‌కు స్వర్ణ పతకాన్ని అందజేశారు.
రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల కేటగిరీలో, స్వర్ణ పతకాన్ని ఒడిశా గెలుచుకొంది. రజత పతకాన్ని మధ్యప్రదేశ్, కాంస్య పతకాన్ని పుదుచ్చేరి అందుకున్నాయి. ఢిల్లీ, గోవా, కర్నాటకలకు ప్రశంస, ధ్రువపత్రాలను ప్రదానం చేశారు.
రాష్ట్రాల కేటగిరీలో ఇతివృత్త ప్రధాన సమర్పణకు గాను మేఘాలయ స్వర్ణ పతకాన్ని అందుకుంది. ఇదే కేటగిరీలో రజత పతకాన్ని కేరళ, కాంస్య పతకాన్ని ఆంధ్రప్రదేశ్ అందుకున్నాయి. ఛత్తీస్‌గఢ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలకు ప్రశంస ధ్రువపత్రాలను ప్రదానం చేశారు.
ఐటీటీఎఫ్ సందర్భంగా చేపట్టిన స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యకలాపాల్లో భాగంగా స్వచ్ఛ్ మండపాలకు ఇచ్చే అవార్డుల్లో స్వర్ణ పతకాన్ని హర్యానాకు, రజత పతకాన్ని పంజాబ్‌కు, కాంస్య పతకాన్ని అస్సాంకు ప్రదానం చేశారు.
విదేశీ మండపాల కేటగిరీలో, స్వర్ణపతకాన్ని థాయ్‌లాండ్ (థాయ్ ఎస్ఎంఈల ఎగుమతిదారు సంఘం) అందుకొంది. రజత పతకాన్ని ఇరాన్ (దోర్నా సయీద్ మక్రాన్), కాంస్య పతకాన్ని దుబాయ్ (అల్ రవ్ధా జనరల్ ట్రేడింగ్ ఎల్ఎల్‌సీ) అందుకున్నాయి. ప్రత్యేక ప్రశంసలను కొరియా గణతంత్రానికి (ఎస్ కొరియా కంపెనీ), టర్కీ (తిల్లో హెదియెలిక్ ఎస్యా సనాయి)తో పాటు టిబెట్‌కు చెందిన వాణిజ్య మండలికి ప్రదానం చేశారు.
మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల కేటగిరీలో స్వర్ణ పతకాన్ని రక్షణ శాఖ అందుకుంది. రజత పతకాన్ని గనుల శాఖ, కాంస్య పతకాన్ని రైల్వే శాఖ అందుకున్నాయి. ‘ప్రత్యేక ప్రశంస’లను ఆయుష్ శాఖకు, విద్యుత్తు శాఖకు, గ్రామీణాభివృద్ధి శాఖ (సరస్ ఆజీవికా మేళా)కు ప్రదానం చేశారు.
మంత్రిత్వ శాఖలు, పీఎస్‌యూలు, పీఎస్‌బీల కేటగిరీలో, స్వర్ణ పతకాన్ని భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) అందుకుంది. రజత పతకాన్ని నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్‌ఈజీడీ), కాంస్య పతకాన్ని భారత ఆహార సంస్థ అందుకున్నాయి. ‘ప్రత్యేక ప్రశంస’లను జౌళి శాఖకూ, భారతీయ స్టేట్ బ్యాంకుకూ, భారతీయ జీవిత బీమా సంస్థకూ ప్రదానం చేశారు.
కమోడిటీ బోర్డుల కేటగిరీలో, స్వర్ణ పతకాన్ని టీ బోర్డ్ ఇండియా అందుకుంది. రజత పతకాన్ని స్పైస్ బోర్డ్ ఇండియా, కాంస్య పతకాన్ని కాయిర్ బోర్డు అందుకున్నాయి. ప్రత్యేక ప్రశంసలను జాతీయ పసుపు బోర్డుకూ, కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డుకూ, నేషనల్ జ్యూట్ బోర్డుకూ ప్రదానం చేశారు.
పబ్లిక్ కమ్యూనికేషన్ అండ్ అవుట్‌రీచ్ కేటగిరీలో, స్వర్ణ పతకాన్ని ట్యాక్స్‌పేయర్ సర్వీసెస్ డైరెక్టరేట్ జనరల్ అందుకుంది. రజత పతకాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, కాంస్య పతకాన్ని ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ మండలి (సీబీడీటీ) అందుకున్నాయి. ప్రత్యేక ప్రశంసలను భారత రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్‌కూ, ఇండియా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ (సెబీ)తో పాటు పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకూ ప్రదానం చేశారు.
ఎంపవరింగ్ ఇండియా (మంత్రిత్వ శాఖలతోపాటు ప్రభుత్వ విభాగాల) కేటగిరీలో స్వర్ణ పతకాన్ని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అందుకుంది. రజత పతకాన్ని ఎంఎస్ఎంఈ శాఖ, కాంస్య పతకాన్ని ఎన్‌బీసీసీ (ఇండియా) అందుకున్నాయి. ప్రత్యేక ప్రశంసలను గణాంకాలు, కార్యక్రమ అమలు శాఖకూ, కోల్ ఇండియాకూ, నాఫెడ్కూ ప్రదానం చేశారు.
ప్రయివేటు రంగం కేటగిరీలో స్వర్ణ పతకాన్ని ఆర్‌డీఎం కేర్ (ఆయుర్) అందుకుంది. రజత పతకాన్ని డెయిరీ ఇండియా (ఆనందా), కాంస్య పతకాన్ని యునైటెడ్ ఏక్తా ఇంజినీరింగ్ ఉద్యోగ్‌తో పాటు మిత్తల్ ఎలక్ట్రానిక్స్ (సుజాత) అందుకున్నాయి. ప్రత్యేక ప్రశంసలను జూహీ ఆర్ట్‌స్ (జ్యోతి వర్మ), కుబేర్ ఎసెన్షియల్స్, పన్సారీ ఇండస్ట్రీస్, రోమానా హెర్బల్‌కేర్ (రోసా)తో పాటు శ్రీ శ్యాం తిల్ పత్తీ (రాజ్ కుమారీ)లకు ప్రదానం చేశారు.
ఆహార స్టాళ్ల కేటగిరీలో, స్వర్ణపతకాన్ని బన్సల్ ఫుడ్ అండ్ బెవరేజెస్ అందుకుంది. రజత పతకాన్ని రోహిల్యా ఫుడ్, కాంస్య పతకాన్ని దానా పానీ అందుకున్నాయి. ప్రత్యేక ప్రశంసలను వినాయక్ ఎంటర్ప్రయిజెస్, సాదా పంజాబ్, మదర్ డెయిరీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్‌కు ప్రదానం చేశారు.
వెండింగ్ పాయింట్స్ కేటగిరీలో స్వర్ణ పతకాన్ని దానా పానీ అందుకుంది. రజత పతకాన్ని గఠ్ బంధన్ ఫారమ్స్, కాంస్య పతకాన్ని బన్సల్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ అందుకున్నాయి.
పద్నాలుగు రోజుల పాటు కొనసాగిన మేళాలో విభిన్న రంగాలు పాలుపంచుకున్నాయనీ, 18 లక్షల మందికి పైగా సందర్శకులు తరలివచ్చారనీ ఐటీపీఓ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నీరజ్ ఖర్వాల్ తెలిపారు. ఆధునిక సాంకేతికతలూ, అత్యాధునిక మండపాలూ మొదలు వ్యవసాయ రంగంలో నవకల్పనలే కాక పర్యావరణానుకూల కార్యక్రమాలకు చెందిన ప్రదర్శనలు ‘‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’’ ఇతివృత్తానికి అద్దంపట్టడంతో పాటు, భారత్ దృఢత్వాన్నీ, సృజనాత్మక ప్రతిభనీ, అపార అవకాశాల్నీ చాటిచెప్పాయని ఆయన అన్నారు. రాబోయే కాలంలో నిర్వహించే ఈ మేళాకు ప్రాధాన్యాన్ని మరింతగా పెంచడానికి సూచనలనూ, సలహాలనూ ఇవ్వాల్సిందిగా కూడా ఆయన కోరారు.
ఈ సంవత్సర మేళాలో వాణిజ్యం తీరుతెన్నులు ప్రోత్సాహకరంగా ఉన్నట్లు దీనిలో పాలుపంచుకున్న సంస్థలు తెలియజేశాయని ఐటీపీఓ ఎస్‌డీ లెఫ్టినెంట్ కల్నల్ హర్ష్ కొండిల్యా తన స్వాగతోపన్యాసంలో తెలిపారు. వివిధ కేటగిరీల్లో పురస్కారాల విజేతలను ఆయన అభినందించారు. ఐఐటీఎఫ్ వేదికపై విశ్వాసాన్ని ఉంచుతున్నందుకుగాను మేళాలో పాలుపంచుకున్న సంస్థలనూ, మేళాను సందర్శించిన వారినీ ఆయన ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) చైర్మన్ శ్రీ వినయ్ కుమార్, ఐటీపీఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ప్రేమ్‌జీత్ లాల్, ఐటీపీఓ ఎస్‌డీ లెఫ్టినెంట్ కల్నల్ హర్ష్ కొండిల్యాతో పాటు ఐటీపీఓ జనరల్ మేనేజర్ శ్రీ ఎస్.ఎన్. భారతీ పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2196721)
आगंतुक पटल : 3