గనుల మంత్రిత్వ శాఖ
జమ్మూకాశ్మీర్ వృద్ధికి ఖనిజ సంపద కొత్త చోదకశక్తిగా మారాలి: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
కేంద్రపాలిత ప్రాంతంలో తొలిసారిగా సున్నపురాయి బ్లాకుల వేలం ప్రారంభించిన గనుల మంత్రిత్వ శాఖ
Posted On:
24 NOV 2025 7:12PM by PIB Hyderabad
జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో సున్నపురాయి ఖనిజ బ్లాకుల కోసం తొలివేలం ప్రక్రియను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా, ఉప ముఖ్యమంత్రి శ్రీ సురీందర్ కుమార్ చౌదరితో కలిసి కేంద్ర బొగ్గు, గనుల మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జమ్మూలో ప్రత్యేక ప్రారంభ కార్యక్రమం, రోడ్‌షో నిర్వహించారు.
ఈ కీలక కార్యక్రమం 2015 గనులు, ఖనిజాల (అభివృద్ధి-నియంత్రణ) చట్టం (ఎమ్ఎమ్‌డీఆర్ చట్టం) కింద ప్రవేశపెట్టిన మైనింగ్ సంస్కరణల అమలులో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. ఖనిజ వనరుల కేటాయింపు కోసం పారదర్శక, డిజిటల్, వేలం ఆధారిత వ్యవస్థను అనుసరించే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సరసన జమ్మూ కాశ్మీర్‌కు ఇది స్థానం కల్పిస్తుంది.
అనంత్‌నాగ్, రాజౌరి, పూంచ్ జిల్లాల్లో విస్తరించిన ఏడు సున్నపురాయి బ్లాకులను వేలానికి ఉంచారు. ఐక్యరాజ్యసమితి విధాన ప్రణాళిక వర్గీకరణ జీ3, జీ4 దశల కింద వర్గీకరించిన ఈ బ్లాకులు సుమారు 314 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా సిమెంట్, నిర్మాణ రంగాల్లో గణనీయమైన పారిశ్రామిక ఆసక్తిని ఇవి పెంపొందిస్తాయని అంచనా.
వేలం వేసిన బ్లాకుల వివరాలు :
|
వ.సం.
|
జిల్లా
|
మండలం పేరు
|
విస్తీర్ణం (హెక్టార్లలో)
|
వనరు (మెట్రిక్ టన్నుల్లో)
|
|
1
|
అనంతనాగ్
|
దూరు షహాబాద్ సున్నపురాయి బ్లాక్
|
28.96
|
2.27
|
|
2
|
అనంతనాగ్
|
కూట్-కాప్రాన్ సున్నపురాయి బ్లాక్
|
22.43
|
4.75
|
|
3
|
అనంతనాగ్
|
వాంట్రాగ్ లైమ్‌స్టోన్ బ్లాక్
|
5.36
|
10.85
|
|
4
|
పూంచ్
|
రాజ్‌పురా సున్నపురాయి బ్లాక్
|
9.26
|
5.20
|
|
5
|
రాజౌరి
|
దర్హాల్-చిట్టిబత్తి సున్నపురాయి బ్లాక్
|
216.00
|
18.53
|
|
6
|
రాజౌరి
|
ఖబ్లియన్-భరోత్-దన్నా సున్నపురాయి బ్లాక్
|
23.28
|
11.64
|
|
7
|
రాజౌరి
|
లేహ్ సున్నపురాయి బ్లాక్
|
9.65
|
4.56
|
ఎమ్ఎమ్‌డీఆర్ చట్టం సెక్షన్ 11లోని ఉపవిభాగాలు (4), (5) కింద నిర్వహిస్తున్న ఈ వేలం... జమ్మూ కాశ్మీర్ ఖనిజ సంపదను అందుబాటులోకి తేవాలని ఒక ప్రధాన ముందడుగును సూచిస్తుంది. ఇది ఇప్పుడు మొదటిసారిగా జాతీయ పోటీ బిడ్డింగ్ రంగంలోకి ప్రవేశిస్తోంది.
జమ్మూ కాశ్మీర్‌లో సున్నపురాయి వేలం కేంద్రపాలిత ప్రాంతాల విస్తృత అభివృద్ధిని ప్రోత్సాహించడం పట్ల కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఉంది. ప్రధానమంత్రి పారిశ్రామిక అభివృద్ధి పథకం కింద ఉపాధి కల్పన, పారదర్శక పారిశ్రామిక ప్రక్రియలపై స్పష్టమైన దృష్టితో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చెందుతున్న పెట్టుబడి కేంద్రాల సరసన స్థానం పొందుతోంది. జమ్మూ కాశ్మీర్ కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల్లో మెరుగుదలను చూస్తోంది. ఇవి మైనింగ్, అనుబంధ రంగాలకు మద్దతునిస్తాయి. విజయవంతమైన వేలం స్థానిక పరిశ్రమలకు ఊతమిస్తుందనీ, ఉపాధిని సృష్టిస్తుందని, జమ్మూ కాశ్మీర్‌లో వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధించాలనే ప్రభుత్వ లక్ష్యానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఈ ప్రాంతానికి ఒక పరివర్తనాత్మక ముందడుగుగా ఈ వేలం ప్రక్రియను అభివర్ణించారు. ఉపాధి కల్పన, పారిశ్రామిక వృద్ధి, స్థానిక సమాజాలకు దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక ప్రయోజనాలకు ఈ ఖనిజ అభివృద్ధి దారితీస్తుందని నిర్ధారించడంలో ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని బలోపేతం చేస్తుందని, ఈ ప్రాంతంలో వివిధ రకాల పరిశ్రమల ఏర్పాటుకు ఊతమిస్తుందనీ, యువత ఉపాధికి... ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మద్దతునిస్తుందని ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ సురిందర్ కుమార్ చౌదరి ఈ రంగానికి సంబంధించిన వ్యక్తులు, సంస్థలను అభినందించారు. ఈ సంస్కరణను ముందుకు తీసుకెళ్లడంలో కేంద్రం, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వ సహకారం పాత్రను ప్రధానంగా ప్రస్తావించారు.
రోడ్‌షోలో భాగంగా ఎమ్ఈసీఎల్ గుర్తించిన బ్లాకుల సాంకేతిక, భౌగోళిక అంచనాలను సవివరంగా ప్రదర్శించారు. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లావాదేవీల విధాన ప్రణాళికను రోడ్ షో వివరించింది. ఎమ్ఎస్‌టీసీ ఇ-వేలం ప్రక్రియను ప్రదర్శించింది, సంభావ్య బిడ్డర్లకు తగినంత సమాచారం, మద్దతు లభించేలా చూసుకుంది.
టెండర్ డాక్యుమెంట్ల అమ్మకం ఈ నెల 28న ప్రారంభమవుతుంది. వచ్చే నెల 12న ప్రీ-బిడ్ సమావేశం జరుగుతుంది. టెండర్ డాక్యుమెంట్ల కొనుగోలుకు చివరి తేదీ 2026, జనవరి 19. ఎమ్ఎస్‌టీసీ ఆన్‌లైన్ వేలం ప్లాట్‌ఫామ్ ద్వారా బిడ్‌లు సమర్పించడానికి చివరి తేదీ 2026, జనవరి 20.
ఈ కార్యక్రమం భారత ప్రభుత్వ పారదర్శకత, సాంకేతికత ఆధారిత నియంత్రణ, స్థిరమైన వనరుల వినియోగం పట్ల నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. స్వయం-సమృద్ధ ఖనిజ రంగం దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో, వికసిత్ భారత్-2047 విస్తృత జాతీయ లక్ష్యానికి, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఇది దోహదపడుతుంది.
వేలం నిబంధనలు, కాలక్రమం, పాల్గొనడం గురించిన మరిన్ని వివరాల కోసం, https://www.mstcecommerce.com/auctionhome/mlcln/ వద్ద ఎమ్ఎస్‌టీసీ వేలం ప్లాట్‌ఫామ్‌ను సందర్శించండి.
****
(Release ID: 2193885)
Visitor Counter : 2