గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

175 సంవత్సరాల భూవిజ్ఞాన శాస్త్ర నైపుణ్యాన్ని ఆవిష్కరిస్తూ జైపూర్‌లో జీఎస్ఐ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి


ప్రపంచస్థాయి నైపుణ్యాలు, పరివర్తనాత్మక ఆలోచనలు, అవగాహనతో కూడిన చర్చలను సమ్మిళితం చేస్తూ భూవిజ్ఞాన శాస్త్ర భావి విజయాలు లక్ష్యంగా నిర్వహిస్తున్న సదస్సు

Posted On: 20 NOV 2025 5:20PM by PIB Hyderabad

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ రోజు జైపూర్‌లో ప్రపంచ భూవిజ్ఞాన శాస్త్ర చర్చా సమావేశాన్ని ప్రారంభించారు. జైపూర్‌లోని రాజస్థాన్ అంతర్జాతీయ కేంద్రంలో "గతాన్ని ఆవిష్కరించడం, భవిష్యత్తును రూపొందించడం: 175 సంవత్సరాల జీఎస్ఐ" అనే అంశంపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 175వ వార్షికోత్సవం సందర్భంగా రెండు రోజుల అంతర్జాతీయ స్థాయి సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సులో గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పీయూష్ గోయల్, రాజస్థాన్ ప్రభుత్వ గనులు, పెట్రోలియం శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ టి. రవికాంత్, జీఎస్ఐ డైరెక్టర్ జనరల్ శ్రీ అసిత్ సాహా, జీఎస్ఐ, డబ్ల్యూఆర్ ఏడీజీ-హెచ్‌వోడీ శ్రీ విజయ్ వి. ముగల్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

ఈ సదస్సు బ్రిటిష్ జియోలాజికల్ సర్వే, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే, జియోసైన్స్ ఆస్ట్రేలియా వంటి ప్రపంచ భౌగోళిక సర్వే సంస్థలు, దేశవిదేశాలకు చెందిన ప్రముఖ భూవిజ్ఞాన శాస్త్ర సంస్థల నుంచి నిపుణులు, ప్రతినిధులను ఒకచోట చేర్చింది. విభిన్న సాంకేతిక సమావేశాలకు, అత్యాధునిక అవగాహన పద్ధతుల ప్రదర్శనకు, శాస్త్రీయ విజ్ఞానాన్ని పరస్పరం ఇచ్చుపుచ్చుకునే ప్రక్రియను మెరుగుపరచడానికి, ప్రభావవంతమైన, భవిష్యత్తు ఆధారితమైన భూవిజ్ఞాన శాస్త్ర చర్చలకు పునాది వేయడానికి ఈ సదస్సు దోహదపడింది.

 

కేంద్ర బొగ్గు, గనుల మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ... భారత శాస్త్రీయ పురోగతి, పారిశ్రామిక వృద్ధి, జాతీయ సామర్థ్యాల మెరుగుదలలో జీఎస్ఐ అందించిన 175 సంవత్సరాల సహకారాన్ని ప్రశంసించారు. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు మద్దతుగా కీలక ఖనిజాల అన్వేషణను విస్తరించడం, అధునాతన ఏఐ/ఎమ్ఎల్-ఆధారిత భూవిజ్ఞాన శాస్త్ర సాంకేతికతలను స్వీకరించడం, దేశంలో విపత్తు-సన్నద్ధత విధాన ప్రణాళికను బలోపేతం చేయడం వంటి అవసరాలను కేంద్ర మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. ‘వికసిత్ భారత్@2047’ దార్శనికతకు అనుగుణంగా ప్రపంచ సుస్థిరత, ఉమ్మడి శాస్త్రీయ పురోగతికి దోహదపడుతూ జాతీయ ప్రాధాన్యాలను కొనసాగించాలని ఆయన సంబంధిత వ్యక్తులను కోరారు.

గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ... భారత్ తన ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తున్నందున... సుస్థిరమైన, స్వయం-సమృద్ధి సాధించిన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన, ప్రపంచస్థాయి సామర్థ్యాలు కలిగిన ఖనిజ వ్యవస్థను నిర్మించడం అత్యవసరమని పేర్కొన్నారు. జాతీయ ప్రాధాన్యాలతో సామర్థ్య నిర్మాణం, వ్యూహాత్మక అమరిక ద్వారా జీఎస్ఐని, ఇతర సంబంధిత సంస్థలను గనుల మంత్రిత్వ శాఖ బలోపేతం చేస్తూనే ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

జీఎస్ఐ డైరెక్టర్ జనరల్, సదస్సు నిర్వాహకులు శ్రీ అసిత్ సాహా మాట్లాడుతూ... 175 సంవత్సరాల జీఎస్ఐ భూవిజ్ఞాన శాస్త్ర వారసత్వాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ప్రపంచ భూవిజ్ఞాన శాస్త్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో భవిష్యత్తు కోసం మెరుగైన అన్వేషణ ప్రయత్నాలు, తెలివైన సాంకేతికతలు, అద్భుతమైన శాస్త్రీయ అవగాహన అవసరమని స్పష్టం చేశారు. కీలక ఖనిజాల ప్రాముఖ్యాన్ని ప్రస్తావిస్తూ... భావన-ఆధారిత పరిశోధనలు, అధునాతన సబ్‌సర్ఫేస్ ఇమేజింగ్, ప్రజలకు మేలు కలిగేలా భూవిజ్ఞాన శాస్త్రాన్ని బలోపేతం చేయడం గురించి ఆయన వివరించారు. అన్వేషణను వేగవంతం చేయడం, సమగ్ర పరిశోధనలను కొనసాగించడం, ఖనిజ వనరుల స్థావరాలను పెంచడం, భారత దీర్ఘకాలిక వనరుల భద్రత, సుస్థిరత లక్ష్యాలను బలోపేతం చేయడం పట్ల జీఎస్ఐ నిబద్ధతను శ్రీ సాహా పునరుద్ఘాటించారు.

జీఎస్ఐ వెస్ట్రన్ రీజియన్ ఏడీజీ-హెచ్‌వోడీ, సెమినార్ చైర్మన్ శ్రీ విజయ్ వి. ముగల్ తన స్వాగత ప్రసంగంలో... ఈ కీలక సమావేశానికి హాజరైన ప్రముఖులు, దేశవిదేశాలకు చెందిన భూగర్భ శాస్త్ర నిపుణులు, పరిశోధకులు, ప్రతినిధులకు హృదయపూర్వక స్వాగతం పలికారు. 175 సంవత్సరాల్లో జీఎస్ఐ భూవిజ్ఞాన శాస్త్రంలో సాధించిన పురోగతిని ఆవిష్కరిస్తూ... అన్ని దేశాల మధ్య విజ్ఞానాన్ని పరస్పరం మార్చుకునే ప్రక్రియను మెరుగుపరచడం, సరికొత్త ఆలోచనలను ప్రోత్సహించడం, రాబోయే దశాబ్దాల్లో భూవిజ్ఞాన శాస్త్ర ప్రాధాన్యాల సుస్థిర ప్రణాళికను రూపొందించడం లక్ష్యంగా ఈ సదస్సుని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

రాజస్థాన్ ప్రభుత్వ గనులు, పెట్రోలియం శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ టి. రవికాంత్ మాట్లాడుతూ... సుస్థిర ఖనిజాభివృద్ధి పట్ల రాజస్థాన్ నిబద్ధతను, జాతీయ ఖనిజ భద్రతకు మద్దతునివ్వడానికి నిరంతర ఆవిష్కరణలు, పరిశోధనలు, సహకారాల అవసరాన్నీ ప్రధానంగా ప్రస్తావించారు.

ఈ సదస్సులో భాగంగా భూవిజ్ఞాన శాస్త్ర సంస్థలు, పరిశ్రమ భాగస్వాములు, సాంకేతిక ఆవిష్కర్తల నేపథ్యాల ప్రదర్శనను కేంద్ర మంత్రి ప్రారంభించారు. సదస్సులో ఆయా సంస్థల ప్రదర్శనలు, ఆవిష్కరణలను ప్రశంసించిన కేంద్ర మంత్రి... అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లనూ సందర్శించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జీఎస్ఐ, దేశంలోని రెండు ప్రముఖ సంస్థలైన ఐఐటీ బాంబే, ఐఐటీ ఖరగ్‌పూర్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఆయా సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సహకారాత్మక పరిశోధనలను బలోపేతం చేయడం, సరిహద్దు భూవిజ్ఞాన సాంకేతికతలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ప్రముఖులు అబ్‌స్ట్రాక్ట్ వాల్యూమ్, థీమాటిక్ మ్యాప్‌లు, కీలక జీఎస్ఐ ప్రచురణలనూ విడుదల చేశారు.

అంతర్జాతీయ సెమినార్ మొదటి రోజు... 175 సంవత్సరాల జీఎస్ఐ వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రధాన వేదికగా నిలిచింది. అదే సమయంలో కీలక ఖనిజాలు, తదుపరి తరం అన్వేషణ సాంకేతికతలు, జియోడైనమిక్స్, వాతావరణ సామర్థ్యం, డిజిటల్ - గణనాత్మక ఆవిష్కరణలు, భూవిజ్ఞాన శాస్త్ర నేతృత్వంలో సుస్థిర అభివృద్ధి వంటి విభిన్న నేపథ్య రంగాల్లో భవిష్యత్తు ఆధారిత చర్చలకూ ఈ సదస్సు వేదికైంది. ఆత్మనిర్భర్ భారత్ సాధన, వికసిత్ భారత్ దీర్ఘకాలిక దృక్పథంతో ముడిపడిన ఈ చర్చలు... జాతీయ వనరుల భద్రతను బలోపేతం చేయడంలో, పరిశుద్ధ ఇంధన పరివర్తనను ప్రారంభించడంలో, పర్యావరణ సామర్థ్యానికి మద్దతునివ్వడంలో భూవిజ్ఞాన శాస్త్ర కీలక పాత్రను స్పష్టం చేశాయి.

 

***


(Release ID: 2192339) Visitor Counter : 3