అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

ప్రపంచంలో అగ్ర శ్రేణి దేశంగా భారత్‌ను మార్చనున్న అంతరిక్ష రంగం: డా. జితేంద్ర సింగ్


అంతరిక్ష రంగంలో పెట్టుబడికి ప్రాధాన్యత కలిగిన ప్రపంచ గమ్యస్థానంగా భారత్‌ ఎదగటాన్ని తెలియజేస్తున్న ప్రైవేటు పెట్టుబడుల వృద్ధి: డా. జితేంద్ర సింగ్

భారతదేశ ఆవిష్కరణ-ఆధారిత అంతరిక్ష ప్రయాణాన్ని ప్రముఖంగా తెలియజేస్తున్న ఐఐఎస్‌సీ-2025 ఇతివృత్తం: డా. జితేంద్ర సింగ్

గతి శక్తి నుండి టెలిమెడిసిన్ వరకు పరిపాలనలో ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తున్న అంతరిక్ష సాంకేతికత: కేంద్ర మంత్రి

Posted On: 18 NOV 2025 6:11PM by PIB Hyderabad

ప్రపంచంలోనే అగ్రశ్రేణి దేశంగా భారత్‌ను అంతరిక్ష రంగం నిలబెడుతుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డా. జితేంద్ర సింగ్ అన్నారు. ప్రపంచ అంతరిక్ష వేదికపై భారత్‌ పాత్ర పెరుగుతుందన్న కేంద్ర మంత్రి.. అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు, పెట్టుబడికి ప్రాధాన్యత కలిగిన ప్రపంచ గమ్యస్థానంగా దేశం ఎదుగుతోందని అన్నారు. ఇటీవల నెలల్లో దేశాన్ని సందర్శిస్తున్న అనేక అంతర్జాతీయ ప్రతినిధి బృందాలు నుంచి పెరుగుతోన్న ఆసక్తే దీనికి నిదర్శనమని ఆయన తెలిపారు. 

భారతదేశ అంతరిక్ష రంగం ఒక నిర్ణయాత్మక పరివర్తనకు లోనవుతోందని డా. జితేంద్ర సింగ్ అన్నారు. ఈ సంవత్సరం ఇండియా ఇంటర్నేషనల్ స్పేస్ కాంక్లేవ్ (ఐఐఎస్‌సీ- 2025) ఇతివృత్తం అయిన "విస్తరిస్తున్న పరిధి: నూతన అంతరిక్ష యుగంలో ఆవిష్కరణ, సమ్మిళితత్వం, ధృడత్వం” నేరుగా దీనిని తెలియజేస్తోందని ఆయన పేర్కొన్నారు. భారత అంతరిక్ష సంఘం (ఐఎస్‌పీఏ- ఇండియన్ స్పేస్ అసోసియేషన్) నిర్వహించిన కార్యక్రమంలో పరిశ్రమల నాయకులు, అంతర్జాతీయ సంస్థలు, దౌత్యవేత్తలు, అంకురాలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతిభావంతులు, సాంకేతికత, పెట్టుబడి కలిసి భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుకు రూపకల్పన చేసే ఒక అనుకూల వ్యవస్థను ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సృష్టించాయని అన్నారు.

ఐఐఎస్‌సీ-2025 ఇతివృత్తాన్ని ‘చాలా ఆలోచనాత్మకంగా రూపొందించారన్న’ కేంద్ర మంత్రి… ఇది భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష వ్యవస్థకు ఉన్న కొత్త శక్తిని తెలియజేస్తోందని అన్నారు. దేశానికి  శాస్త్రీయ సామర్థ్యం ఎల్లప్పుడూ ఉన్నప్పటికీ ఆవిష్కరణ, విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే వాతావరణాన్ని విధాన నిర్ణేతలు సృష్టించినప్పుడే పురోగతి దిశ మారిందని మంత్రి అన్నారు. 2019 నుంచి తీసుకువచ్చిన సంస్కరణలో భాగంగా అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతినివ్వటం, ‘ఇన్-స్పేస్‌’ను ఏక-గవాక్ష నియంత్రణ సంస్థగా స్థాపించడం, 2023లో అంతరిక్ష విధానాన్ని విడుదల చేయడం లాంటివి.. ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ పాత్ర విస్తరించేందుకు సహాయపడ్డాయని తెలియజేశారు. 

ఇతివృత్తంలో ఉన్న ‘సమ్మిళితత్వం’ అంశాన్ని ఫ్రధానంగా ప్రస్తావించిన కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి.. అంతరిక్ష రంగ ద్వారాలు తెరవడం వల్ల అంకురాలు, విద్యార్థులు, పరిశ్రమలు, ప్రజలు వచ్చారని అన్నారు. ఇప్పుడు వేలాది మంది ప్రజలు రాకెట్ ప్రయోగాలను ప్రత్యక్షంగా చూస్తున్నారు.. కేవలం కొన్ని సంవత్సరాలలోనే 300 కంటే ఎక్కువ అంతరిక్ష అంకురాలు వచ్చాయి. వీటిలో చాలా అంకురాలు విదేశీ పెట్టుబడులను కూడా పొంది వేగవంతమైన వృద్ధి సాధించాయి. చాలా కాలంగా ఉపయోగించుకోకుండా ఉన్న ఔత్సాహిక ప్రతిభావంతుల సామర్థ్యాన్ని ఇది తెలియజేస్తోంది.

ఆవిష్కరణల గురించి మాట్లాడిన డా. జితేంద్ర సింగ్.. చంద్రుడి దక్షిణ ధ్రువం లో చంద్రయాన్ దిగటం, చంద్రుడిపై నీటిని కనుగొనటం నుంచి మొదలుకొని మంగళయాన్ మిషన్ విజయం సాధించటం, ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించడం వరకు భారతదేశ విజయాలను ప్రస్తావించారు. అంతరిక్ష సాంకేతికతను పాలన, ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించడమే ఈ రంగానికి భారత్ అందించి గొప్ప తోడ్పాటని అన్నారు. దేశ అంతరిక్ష అనువర్తనాలలో దాదాపు 70 శాతం ఇప్పుడు జీవన సౌలభ్యానికి సహాయపడుతున్నాయని తెలిపారు. మౌలిక సదుపాయాల ప్రణాళిక కోసం గతి శక్తి, భూ భాగాల మ్యాపింగ్ కోసం స్వామిత్వ, ఉపగ్రహ ఆధారిత విపత్తు నిర్వహణ, మారుమూల ప్రాంతాలలో టెలిమెడిసిన్, అడ్డంకులను ముందుగానే గుర్తించగల రైల్వే భద్రతా వ్యవస్థలు వంటి వాటిని ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. 

ఈ విధానం ధృడత్వాన్ని కూడా పెంచిందని డా. జితేంద్ర సింగ్ అన్నారు.  ఇది ఐఐఎస్‌సీ ఇతివృత్తానికి సంబంధించిన మరో ముఖ్యమైన అంశమని తెలిపారు. ఉపగ్రహ ఆధారిత సేవలిప్పుడు దేశవ్యాప్తంగా విపత్తు ప్రతిస్పందన, వ్యవసాయం, వాతావరణ అంచనా, అనుసంధానతకు సహాయపడుతున్నాయని తెలిపారు. ఈ సామర్థ్యాలను భారత్ పొరుగు దేశాలకు కూడా విస్తరిస్తోందన్న ఆయన.. భూటాన్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్, మయన్మార్‌ దేశాలకు మన ఉపగ్రహాలు మద్దతు ఇసున్నాయన్నారు. 

జపాన్, ఇటలీ, ఇతర అనేక దేశాల ప్రతినిధి బృందాలు భారత అంతరిక్ష రంగంపై విశ్వాసం చూపించాయని.. ఇది అంతరిక్ష భాగస్వామ్యాల విషయంలో ప్రాధాన్య ప్రపంచ గమ్యస్థానంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. అంతరిక్షం, అణు శక్తి వంటి వ్యూహాత్మక రంగాలలో చాలా కాలంగా ఉన్న అడ్డంకులను తొలగించి భారత్‍ అంతర్జాతీయంగా విస్తరించేలా అవసరమైన విధాన వాతావరణాన్ని సృష్టించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. 

మంత్రిత్వ శాఖలు, పరిశ్రమలు, అంతరిక్ష సంస్థలు, పెట్టుబడిదారులు, అంకురాలు, విద్యావేత్తలను ఐఐఎస్‌‍సీ ఒకచోట చేర్చినందున…, సమ్మిళిత, ధృడమైన అంతరిక్ష వ్యవస్థను నిర్మించే దిశగా భారత్ చేస్తోన్న ప్రయత్నాలను ఈ చర్చలు వినూత్న మరింత బలోపేతం చేస్తాయని డా. జితేంద్ర సింగ్ అన్నారు. రాబోయే సంవత్సరాల్లో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ఐదు రెట్లు పెరిగే అవకాశం ఉందన్న ఆయన.. ఈ సంవత్సరం ఇతివృత్తంలో ఉన్న దార్శనికతకు అనుగుణంగా ప్రపంచ అంతరిక్ష రంగంలో మరింత బలమైన స్థానాన్ని పొందేందుకు భారత్ సిద్ధంగా ఉందంటూ ప్రసంగాన్ని ముగించారు. 

 

***


(Release ID: 2191483) Visitor Counter : 21