బొగ్గు మంత్రిత్వ శాఖ
ఐఐటీఎఫ్‌లో కోల్ ఇండియా పెవిలియన్‌ను ప్రారంభించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి
प्रविष्टि तिथि:
18 NOV 2025 1:16PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటీఎఫ్) 2025లో కోల్ ఇండియా (సీఐఎల్) పెవిలియన్‌ను కేంద్ర బొగ్గు, గనుల మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, సీఐఎల్ ఛైర్మన్ శ్రీ సనోజ్ కుమార్ ఝా, బొగ్గు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్ కాస్సీ, బొగ్గు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ లఖ్పత్ సింగ్ చౌధరితో పాటు బొగ్గు మంత్రిత్వ శాఖకు, సీఐఎల్‌కు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇంధన భద్రత, ప్రాజెక్టుల వైవిధ్యీకరణ, సుస్థిర విధానాల్లో భారత్ సాధించిన ప్రగతిని సీఐఎల్ పెవిలియన్ సందర్శకులకు వివరిస్తుంది. ఓపెన్ కాస్ట్ మైనింగ్ విధానం, బొగ్గు తవ్వకంలో కృత్రిమ మేధ వినియోగం, సీఐఎల్ అనుబంధ సంస్థల ప్రధాన కార్యాయలం వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) పనితీరును ఈ పెవిలియన్ ప్రదర్శిస్తుంది. కార్యాచరణ సామర్థ్యం, భద్రతా ప్రమాణాల అమలును కృత్రిమ మేధ వినియోగం మెరుగుపరిచింది. పెవిలియన్‌లో ప్రధానంగా భద్రత, కార్యాచరణ శిక్షణను వర్చువల్ రియాలిటీ (వీఆర్) ద్వారా వీక్షించే ఏర్పాటు చేశారు. ప్రమాదకరమైన వాతావరణంలో సంప్రదాయ శిక్షణ పద్ధతులకు ప్రత్యామ్నాయంగా.. సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన, ఎక్కువ మందిని భాగం చేసే విధానాన్ని వీఆర్ అందిస్తుంది.
సీఎస్ఆర్ కార్యక్రమాలతో పాటు పర్యావరణ హిత బొగ్గు దిశగా భారత్‌ను నడిపించడంలో బొగ్గు మంత్రిత్వ శాఖ చేపట్టిన కీలకమైన గ్యాసిఫికేషన్ చర్య గురించి ఈ పెవిలియన్ ప్రత్యేకంగా వివరిస్తుంది. పర్యావరణ పునరుద్ధరణ నియమాలను నిలబెట్టే ఎకో-టూరిజం కార్యక్రమాలను సైతం ఇక్కడ ప్రదర్శిస్తారు. లిథియం, కోబాల్ట్ లాంటి కీలకమైన ఖనిజాలను దేశీయంగా, అంతర్జాతీయంగా వెలికితీసేందుకు సీఐఎల్ అమలు చేస్తున్న వ్యూహాత్మక కార్యక్రమాలను సైతం వివరిస్తారు. ఈ కీలకమైన వనరుల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, అలాంటి ఖనిజాలపై ఆధారపడిన పరిశ్రమల వృద్ధికి తోడ్పాటు అందించడమే లక్ష్యంగా ఈ విధానం నిర్దేశించుకుంది.
వాటాదారులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలతో అనుసంధానమయ్యేందుకు, పారదర్శకతను పెంపొందించేందుకు, దేశ నిర్మాణంలో తన పాత్రను వివరించేందుకు సీఐఎల్‌కు మంచి వేదికగా ఐఐటీఎఫ్ పనిచేస్తుంది. ఇంధన భద్రతకు భరోసా ఇవ్వడానికి, సుస్థిరమైన, స్వావలంబన సాధించిన వృద్ధి దిశగా భారత్ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ, సీఐఎల్ కట్టుబడి ఉన్నాయి.
***
(रिलीज़ आईडी: 2191205)
आगंतुक पटल : 39