శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచంలో 64,000కు పైగా పేటెంట్లతో ఆరవ అతిపెద్ద పేటెంట్ దరఖాస్తుదారుగా ఆవిర్భవించిన భారత్: డాక్టర్ జితేంద్ర సింగ్


55 శాతానికి పైగా పేటెంట్ల దరఖాస్తులు దేశీయ ఆవిష్కర్తలవే: డాక్టర్ జితేంద్ర సింగ్

ఆవిష్కర్తలు గతంలో పరిశోధన, మార్గదర్శకత్వం, ప్రాజెక్ట్ పూర్తికి విదేశీ సంస్థలపై ఆధారపడే ధోరణి నుంచి ఇది బిన్నమైన కీలక మార్పు: డాక్టర్ జితేంద్ర సింగ్

ప్రపంచ ఆవిష్కరణల సూచీలో 81వ ర్యాంకు నుంచి 38వ ర్యాంకుకు చేరిన భారత్: డాక్టర్ జితేంద్ర సింగ్
ప్రధాని శ్రీ మోదీ నాయకత్వంలో పటిష్టమైన ఆవిష్కరణల రంగం ద్వారా దేశ యువతకు ప్రయోజనం: శ్రీ జితేంద్ర సింగ్

సాంప్రదాయ ఉద్యోగాల కంటే పరిశ్రమల స్థాపనే లాభదాయకం; కొత్త ఆవిష్కర్తలకు ప్రభుత్వ పథకాల ద్వారా చేయూత: డాక్టర్ జితేంద్ర సింగ్

స్టార్టప్‌లు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యమే భారత సాంకేతిక వృద్ధికి కీలకం: డాక్టర్ జితేంద్ర సింగ్

విజ్ఞాన రంగంలో చంద్రయాన్-3 నుంచి డీఎన్ఏ వ్యాక్సిన్ వరకు గత దశాబ్దంలో ఎన్నో కీలక సాధించిన భారత్

Posted On: 14 NOV 2025 5:13PM by PIB Hyderabad

ప్రపంచంలో భారత్ ఆరవ అతిపెద్ద పేటెంట్ దరఖాస్తుదారుగా ఎదిగిందని శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. కీఐఈటీ డీమ్‌డ్ యూనివర్సిటీలో జరిగిన వార్షిక టెక్‌ ఫెస్ట్‌ ‘ఇన్నోటెక్‌–2025’ను ఉద్దేశించి మాట్లాడుతూ, దేశం ఇప్పటివరకు 64 వేలకుపైగా పేటెంట్లు దాఖలు చేసిందని, అందులో 55 శాతం పైగా దేశ ఆవిష్కర్తలవేనని డాక్టర్ జితేంద్ర సింగ్  వెల్లడించారు. గతంలో పరిశోధన, మార్గదర్శకత్వం, ప్రాజెక్టుల పూర్తి కోసం విదేశీ సంస్థలపై ఆధారపడే ధోరణి నుంచి ఇది భిన్నమయిన ప్రధాన మార్పు అని ఆయన అన్నారు.

భారతీయ ఆవిష్కర్తల ద్వారా పేటెంట్ దరఖాస్తుల సంఖ్యలో భారతదేశం సాధించిన ఈ అసాధారణ వృద్ధి దేశంలో వేగంగా పరిణతి చెందుతున్న ఆవిష్కరణ రంగం, అంతర్జాతీయంగా పెరుగుతున్న దాని పోటీతత్వాన్ని ప్రతిబింబిస్తోందని మంత్రి పేర్కొన్నారు.  

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకువచ్చిన నిరంతర విధానపరమైన చర్యలు,  పరిశోధనలకు ప్రోత్సాహకాలు అనుకూలమైన వాతావరణం  కారణంగా దేశంలో అత్యంత సానుకూలమైన వాతావరణం ఏర్పడిందని, ఈ మార్పు దానికి నిదర్శనమని మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఉద్ఘాటించారు.  గతంలో లోపించిన విధానపరమైన మద్దతు, సంస్థాగత సహాయం సమస్యలను గత దశాబ్ద కాలంగా క్రమబద్ధంగా పరిష్కరించినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. దీని ఫలితంగా యువ భారతీయ ఆవిష్కర్తలు అత్యాధునిక పరిశోధనలు చేయడానికి,  దేశంలోనే అధిక విలువ పేటెంట్లను దాఖలు చేయడానికి వీలు కలిగిందని ఆయన పేర్కొన్నారు.

విజ్ఞాన రంగంలో భారత్ అగ్రగామిగా మార్పు చెందుతున్న విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ప్రపంచ ఆవిష్కరణల సూచీ (గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌) లో  దేశం 81వ ర్యాంక్ నుంచి 38వ ర్యాంక్‌కు చేరుకుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. స్థిరత్వం, కీలక విజయాలు, శాస్త్ర, సాంకేతిక రంగాలపై ప్రత్యేక జాతీయ దృక్పథం ద్వారా ఈ అసాధారణమైన పురోగతి సాధ్యమైందని ఆయన తెలిపారు. చంద్రయాన్-3, భారతదేశంలో అభివృద్ధి చేసిన ప్రపంచంలోని మొదటి డీఎన్ఏ వ్యాక్సిన్, దేశీయ యాంటీబయాటిక్స్,  విజయవంతమైన జీన్ థెరపీ పరీక్షలు వంటి విజయాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ విజయాలు పెరుగుతున్న భారత సైన్స్  రంగ సామ్మర్ధ్యాన్ని, ప్రపంచ నాయకత్వ సామర్ధ్యాన్ని సూచిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇన్నోటెక్’25 వంటి కార్యక్రమాలు  ప్రైవేట్ భాగస్వామ్యం, డీప్-టెక్ వ్యవస్థాపకత,  బహుళ రంగ ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తున్న ప్రస్తుత విస్తృత జాతీయ విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. సైన్స్,  టెక్నాలజీ విభాగం (డీఎస్టీ) మద్దతుతో నిర్వహించే ప్రదర్శనలు, సమ్మేళనాలు పరిశ్రమల నాయకులు,పరిశోధకులు, పెట్టుబడిదారులు, యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన చెప్పారు.  ఈ కార్యక్రమంలో 20 మందికి పైగా వెంచర్ క్యాపిటలిస్టులు  పాల్గొనడం భారత తదుపరి సాంకేతిక పురోగతి బలమైన ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారానే సాధ్యమవుతుందని సూచిస్తోందని మంత్రి పునరుద్ఘాటించారు.  

జీవనోపాధి, ఉద్యోగాలకు సంబంధించి సుదీర్ఘకాలంగా నెలకొన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని కూడా మంత్రి స్పష్టం చేశారు. వేగంగా మార్పు చెందుతున్న భారత్ లో సాంప్రదాయ ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడటం కంటే, పరిశ్రమలు, స్టార్టప్‌లు, నైపుణ్యం,  అనువర్తిత శాస్త్రాలు (అప్లైడ్ సైన్సెస్) ఎక్కువ అవకాశాలను అందిస్తున్నాయని ఆయన అన్నారు. ముద్ర, పీఎం-స్వనిధి, పీఎం-విశ్వకర్మ వంటి ప్రభుత్వ పథకాల విజయ గాథలను  ఉదహరిస్తూ, ఉన్నత డిగ్రీలు లేని వారికి కూడా ప్రభుత్వం అందుబాటు ధరలో నిధులు, మార్గదర్శకత్వం  నైపుణ్య అభివృద్ధి మార్గాలను అందించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ 2020) విద్యార్థులు పాఠ్యాంశాలను మార్చుకోవడానికి, బహుళ అంశాలను అభ్యసించడానికి, తమ సహజ సామర్థ్యం మేరకు ఉద్యోగాలను ఎంచుకోవడానికి అవకాశాలు కల్పించిందని మంత్రి తెలిపారు. అంతేకాక, వివిధ డిఎస్టీ పథకాలు -  ఇన్స్పైర్ ఫెలోషిప్‌లు, మనక్ అవార్డులు, మహిళల,  గిరిజనుల విజ్ఞాన కార్యక్రమాలు, విదేశాలలో ఉన్న భారతీయ పరిశోధకులను భారతీయ సంస్థలతో కలిపే వైభవ్ కార్యక్రమం - –ఇవన్నీ ప్రపంచస్థాయి పోటీ సామర్థ్యం గల శాస్త్రీయ మానవ వనరులను తీర్చిదిద్దే మార్గాలను ప్రతిబింబిస్తున్నాయని ఆయన వివరించారు. 

తన పర్యటన సందర్భంగా, డాక్టర్ జితేంద్ర సింగ్ విద్యార్థులతో ముచ్చటించి, వారి నమూనాలను పరిశీలించారు. విశ్వాసం, వ్యవస్థాపక స్ఫూర్తితో  ఆవిష్కరణలను కొనసాగించాలని వారికి సూచించారు. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, ఐఓటీ, ఆటోమేషన్, బయోటెక్నాలజీ, విపత్తు నిర్వహణ వంటి అనేక రంగాలలో ప్రదర్శించిన సృజనాత్మకతను మంత్రి అభినందించారు. ఈ ప్రాజెక్టులు దేశ శాస్త్రీయ ఆకాంక్షలను, భారతీయ యువత నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యుడు శ్రీ అతుల్ గార్గ్ జైన్ ఆవిష్కరణ ఆధారిత కార్యక్రమాలను ప్రోత్సహించడంలో పోషించిన పాత్రను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు.  ఇన్నోటెక్’25 లో భాగం కావాల్సిందిగా తనను ఆహ్వానించినందుకు శ్రీ గార్గ్ కు  ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

 

***


(Release ID: 2190444) Visitor Counter : 5